afghanistan houston weapons facebook social media అఫ్గనిస్తాన్ హూస్టన్ ఆయుధాలు ఫేస్బుక్ సోషల్ మీడియా
డల్లాస్ షూటింగ్: ఐదుగుర్ని చంపింది ఒక్కడే
డల్లాస్: అమెరికాలోని డాలస్లో కాల్పులు జరిపి ఐదుగురిని చంపింది ఒక్కడేనని అధికారులు వెల్లడించారు. డల్లాస్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే. అతను 12 మందిపై కాల్పులు జరపగా ఐదుగురు మరణించారు. అతడు అమెరికా మిలిటరీలో మాజీ సైనికుడు. ఆఫ్గాన్ యుద్ధసమయంలోసైన్యంలో పనిచేశాడు.
నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపడానికి నిరసనగా డాలస్లో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నిరసన ర్యాలీలో మాటువేసిన దుండగులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఐదుగురు పోలీసులు మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఐదుగురు కూడా ఒక్కరి చేతిలోనే మరణించినట్లు సమాచారం. ఈ ఐదుగురిని చంపిన దుండగుడిని పోలీసులు చుట్టుముట్టి చర్చలు జరిపినప్పటికీ ఫలితం లభించలేదు. దీంతో బాంబు రోబో ద్వారా అతడిని చంపేశారు. కాల్పులు జరిపిన దుండగుడిని మైకా గ్జేవియర్ జొహాన్సన్గా గుర్తించారు.
కాల్పుల తర్వాత చర్చల సమయంలో అతడు తెల్లజాతీయులను చంపాలని అనుకుంటున్నాని, ముఖ్యంగా తెల్లజాతి అధికారులను చంపుతానని అన్నాడని పోలీసులు వెల్లడించారు. దుండగుడి ఇంట్లో సోదాలు జరిపారు. సోదాల్లో బాంబు తయారీ పదార్థాలు, తుపాకులు, ఆయుధాలు లభించినట్లు అధికారులు తెలిపారు.
డల్లాస్ ఘటనతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దాడిని తీవ్రంగా ఖండించారు. డల్లాస్ ఘటనకు సంతాపంగా అమెరికాలో మంగళవారం వరకు జాతీయ పతాకాలను సగం అవనతం చేయాలని ఒబామా సూచించారు.