• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిజిటల్ సెక్స్ క్రైమ్: మా జీవితం మీ పోర్న్ సినిమా కాదంటున్న దక్షిణ కొరియా స్పై కెమెరా బాధితులు... అసలేం జరిగింది?

By BBC News తెలుగు
|
దక్షిణ కొరియాలో స్పై కెమెరాల ద్వారా రహస్యంగా చిత్రించినట్లు దాదాపు 30 వేల ఫిర్యాదులు పోలీసులకు అందాయి.

కుంగ్-మి (అసలు పేరు కాదు) ఆన్‌లైన్‌లో విపరీతంగా వేధింపులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో అనేకమంది ఆమెను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టారు.

తన పాప్‌స్టార్ ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొంటున్న వీడియో గురించి పోలీసులు ఆమెను గంటల తరబడి విచారించారు. ఒకరకంగా ఆమె డిజిటల్ సెక్స్ క్రైమ్ బాధితురాలిగా మారారు. ''నా మాటలు ఆలకించే వారే లేరు'' అని ఆమె బీబీసీతో అన్నారు.

''నేను అప్పుడు స్కూల్‌లో ఉన్నాను. ఒంటరి దానిని. నా వైపు నిలబడే వారెవరూ కనిపించ లేదు. నాకు చావాలని అనిపించింది. కానీ నేను చచ్చిపోతే జంగ్ జూన్ యూంగ్ గురించిన అసలు నిజాలు అందరికీ తెలియవు'' అన్నారామె.

జంగ్ జూన్ యూంగ్ టీవీ టాలెంట్ షో ద్వారా సుప్రసిద్ధుడయ్యారు. తూర్పు ఆసియా ప్రాంతంలో ఈ కె-పాప్(కొరియన్ పాప్) కళాకారుడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ వీడియో బయటకు వచ్చే ముందు వరకు అతను చాలా మంచి వ్యక్తి అని, బాధ్యతగల వాడని కుంగ్-మి చెబుతుండేవారు. కానీ, జంగ్ జూన్ యూంగ్ తన గర్ల్ ఫ్రెండ్ కుంగ్-మి తో సెక్స్‌లో పాల్గొంటుండగా, ఆమె అనుమతి లేకుండానే దాన్ని వీడియో తీశారు.

తన గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొంటూ ఆమె అనుమతి లేకుండా వీడియో చిత్రించినందుకు 2019లో జంగ్ జూన్ యూంగ్‌కు అయిదు సంవత్సరాల జైలు శిక్ష పడింది.

కుంగ్-మి ఏం చేశారు?

ఆగస్టు 2016లో తొలిసారి ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కానీ, అతను వీడియో తీసిన ఫోన్ ఎక్కడుందో పోలీసులు కనుక్కోలేక పోయారు. దీంతో ఆమె కేసును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

దక్షిణ కొరియాలో ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద కేసు పెట్టి విచారణ వరకు తీసుకురావడం చాలా కష్టమని ఆమెకు తెలుసు.

''కేసు పెట్ట వద్దంటూ పోలీసు అధికారిణే స్వయంగా నాకు సూచించారు. పెధ్దవాళ్ల మీద కేసులు పెట్టి వాటిని నిరూపించడం కష్టమని ఆమె అన్నారు'' అని కుంగ్-మి వెల్లడించారు.

''విచారణాధికారి నిందితుడిని కాకుండా నన్ను పిలిచి ప్రశ్నలు వేశారు. నీకు ఇష్టం లేకుండానే అతను వీడియో తీశాడా అంటూ పదే పదే నన్ను ప్రశ్నించారు'' అన్నారు కుంగ్-మి.

''నన్ను మానసికంగా వేధించారు. నేను ఒక అమాయకుడి మీద కేసు పెట్టానా అని నాకే అనిపించేలా ప్రవర్తించారు'' అన్నారామె.

జంగ్ జూన్ యూంగ్‌ను కోర్టు వరకు తీసుకు రావడానికి మరో మూడేళ్లు పట్టింది. 2019 నాటికి పోలీసులు అతని ఫోన్ నుంచి కొన్ని వీడియోలను సంపాదించగలిగారు. ఆ ఫోన్‌ను సీజ్ చేశారు.

కుంగ్-మి తోపాటు మరో 12మంది మహిళల రహస్య వీడియోలు అతని దగ్గర ఉన్నట్లు, వాటిని అతను తన సెలబ్రిటీ మిత్రులకు షేర్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం జంగ్ జూన్ యూంగ్ అయిదేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

దక్షిణ కొరియాలో పబ్లిక్ టాయిలెట్లు, చేంజింగ్ రూమ్‌లలో రహస్యంగా కెమెరాలు అమరుస్తున్నారు. మహిళలను రహస్యంగా చిత్రీకరిస్తున్నారు.

విచారణ ఎలా సాగింది?

కుంగ్-మి కేసు ఇన్వెస్టిగేషన్‌లో పాల్గొన్న కొందరు అధికారులను కూడా విచారణకు పిలిచినట్లు పోలీసు అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

''వారిలో కొందరు మాట్లాడిన మాటలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి'' అన్నారాయన.

ఇప్పుడు కుంగ్-మి కి మద్ధతు లభిస్తోంది. అతని ప్రవర్తన గురించి 2016లోనే ఆమె హెచ్చరించారు. కొందరు ఆమె మాటలను నమ్మగా, చాలామంది ఆన్‌లైన్‌లో ఆమెపై విమర్శలు చేశారు.

''నువ్వు జంగ్‌ను వెంటాడి అతని జీవితాన్ని నాశనం చేస్తున్నావని నా ఫ్రెండ్స్ కూడా విమర్శించారు. నేను ఎంత వేదన అనుభవిస్తున్నాను అన్నది పట్టించుకోకుండా మీడియా రోజంతా నా గురించి వార్తలు ప్రసారం చేసింది. దేశం మొత్తం నా గురించే మాట్లాడుతోంది. నన్ను ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. కొందరు మాట్లాడే మాటలు ఒక మహిళను మానసికంగా చంపుతాయి'' అన్నారు కుంగ్-మి.

అయితే, డిజిటల్ క్రైమ్‌కు సంబంధించి ఆమె చేసిన ఫిర్యాదు దేశంలో అదే మొదటిది కాదు. ఇలాంటి కొందరు బాధితుల మీద 'హ్యూమన్ రైట్స్‌ వాచ్' సంస్థ ఒక సర్వే నిర్వహించింది.

అనేకమంది మహిళలు ఇలాంటి నేరాల నుంచి న్యాయం పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆ సర్వేలో తేలింది.

ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ సెక్స్ క్రైమ్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మగవాళ్లు మహిళలను రహస్యంగా చిత్రీకరించి వాటిని షేర్ చేసుకోవడం ఈ తరహా నేరంలో ప్రధానంగా కనిపించే వ్యవహారం.

టెక్నాలజీ పెరిగిపోవడం, కెమెరాలు షర్ట్ బటన్ సైజులో కూడా దొరుకుతుండటంతో మహిళలను రహస్యం చిత్రించడం డిజిటల్ సెక్స్ క్రైమ్ నేరగాళ్లకు సులభమైంది.

పబ్లిక్ బాత్‌రూమ్‌లు, హోటళ్లు, చేంజింగ్ రూమ్‌లలో చాలా సులభంగా కెమెరాలను అమర్చగలుగుతున్నారు. దక్షిణ కొరియాలో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో ఈ వీడియోలు, ఫొటోలు వేగంగా ఆన్‌లైన్‌లో షేర్ అవుతున్నాయి. కొందరు వాటిని ఆన్‌లైన్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు.

2013 నుంచి 2018 మధ్య దక్షిణ కొరియాలో రహస్య కెమెరాలతో మహిళలను చిత్రించిన నేరానికి సంబంధించి సుమారు 30వేల ఫిర్యాదులు వచ్చాయి.

''కేసులు పెట్టడానికి వెళ్లిన బాధితులు తాము పోలీసులు నుంచి భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నామని చెప్పారు'' అని ఈ సర్వే నివేదికను రూపొందించిన హీదర్ బార్ వెల్లడించారు.

''ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులను అధికారులు బహిరంగ ప్రదేశంలో నిలబెట్టి అనేక ప్రశ్నలు అడిగారు. అదేంటని ప్రశ్నిస్తే విచారణలో మేం అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందని అంటారు. విచారణ పేరుతో ఒక అధికారి నుంచి ఇంకో అధికారి దగ్గరికి బాధితులను తిప్పేవారు. కెమెరాలో మిమ్మల్ని రహస్యంగా చిత్రించినట్లు తేలకపోతే పరువు నష్టం కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించేవారు. కేసులు పెట్టకుండా తమను తిప్పి పంపినట్లు చాలామంది చెప్పారు'' అని హీదర్ తెలిపారు.

కొంతమంది పోలీసులు ఏ ఫొటోను షేర్ చేశారో అడిగి తెలుసుకుని, ఆ ఫొటోను మిత్రులకు చూపించి నవ్వుకునే వారని కొందరు బాధితులు తెలిపినట్లు హీదర్ వెల్లడించారు.

''జీవితంలో అంత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఇలాంటి మాటలు, ప్రవర్తన ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీనికి 'రీ ట్రామటైజేషన్' (re-traumatisation) అన్న పదం సరిగ్గా సరిపోతుంది'' అన్నారు హీదర్.

ఇలాంటి కేసుల విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారని దక్షిణ కొరియా పోలీసులను బీబీసీ అడగ్గా, ''ప్రతి నగరంలో సైబర్ సెక్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. నిందితులను గుర్తించడానికి, బాధితులకు రక్షణ కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం'' అని రాత పూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో పోలీసులు పేర్కొన్నారు.

చాలామంది మహిళలు తమను రహస్యంగా చిత్రికరిస్తున్నారని ఆరోపించగా, తమకు తెలియకుండానే డిజిటల్ సెక్స్ క్రైమ్‌కు బాధితులైన వాళ్లు ఇంకా ఎక్కువమందే ఉంటారని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.

'ఆయుధాలు లేకుండా చంపవచ్చు'

బాధితులకు అండగా నిలిచేలా పోలీసులకు కూడా శిక్షణ ఇస్తున్నామని, ఈ మేరకు ఒక సపోర్ట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్లు దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.

సుమారు 500మందిని సర్వే చేసిన 'ది హ్యూమన్ రైట్స్ వాచ్' సంస్థ, ఇలాంటి కేసుల్లో బాధితులలో పెరుగుతున్న ఆవేదన ఆత్మహత్యకు పురికొల్పే అవకాశం ఉంటుందని పేర్కొంది.

డిజిటల్ సెక్స్ నేరాలలో బాధితులైన వారి విషయంలో సమాజం అనుసరించాల్సిన వైఖరిలో కూడా మార్పు రావాలని కుంగ్-మి అంటున్నారు. ''బాధితులను అవహేళనగా చూస్తారు. తెలివిలేనివారు కాబట్టే ఇలాంటి సమస్యలో చిక్కుకున్నావంటూ తక్కువ చేసి మాట్లాడతారు'' అన్నారు కుంగ్-మి.

''మానసికంగా నేను ఎదుర్కొన్న సమస్యకు చికిత్స కోసం నేను స్కూల్ మానేశాను. నేనంటే ఎవరికీ తెలియని గ్రామీణ ప్రాంతానికి వెళ్లాను. చాలా పుస్తకాలు చదివాను. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నించాను. లైంగిక హింస బాధితులతో మాట్లాడటం ద్వారా ఊరట పొందాను. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందన్న నమ్మకం నాకు కలిగింది'' అన్నారు కుంగ్-మి.

పెరుగుతున్న అవగాహన

దక్షిణ కొరియా రాజధాని సోల్ నగరం ఆధునికంగా కనిపించినా, దేశంలోని మిగిలిన ప్రాంతాలను సంప్రదాయబద్ధంగా కనిపిస్తాయి. మహిళలపై జరిగే హింసను చాలాచోట్ల సీరియస్‌గా తీసుకోరు. ఆడవాళ్లు కొన్ని పద్దతులు పాటించాలని చాలామంది భావిస్తుంటారు.

డిజిటల్ సెక్స్ క్రైమ్‌కు బాధితులైన మహిళలను చెడిపోయిన వారిగా చూసే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అయితే, అలాంటి ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి.

బాధితులైన యువతులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. స్పై కెమెరా సంస్కృతికి వ్యతిరేకంగా 2018లో భారీ ర్యాలీ జరిగింది. 'మై లైఫ్ ఈజ్ నాట్ యువర్ పోర్న్' అంటూ యువతులు నినదించారు.

ఈ ఉద్యమం తర్వాత అధికారుల్లో కొంత కదలిక వచ్చింది. చట్టాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కాకపోతే నిందితులకు శిక్షలు మాత్రం చాలా స్వల్పంగానే ఉంటున్నాయి.

''ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు తమకు పడిన శిక్షలను చూసి తాము చేసింది పెద్ద నేరం కాదన్నట్లుగా భావిస్తున్నారని బాధితులు చెప్పారు'' అని హీదర్ బార్ వెల్లడించారు.

''అనుమతి లేకుండా కెమెరాలతో ఇతరులను షూట్ చేసిన నేరానికి సెక్స్‌ క్రైమ్స్ చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. అయితే ఇది గరిష్ట శిక్ష. చాలాసార్లు కనిష్ట శిక్షలే విధిస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో 79శాతం మందికి 2020లో చాలా స్వల్ప శిక్షలు, జరిమానాలు లేదంటే రెండూ విధించారు'' అని హీదర్ వెల్లడించారు.

డిజిటల్ సెక్స్‌ క్రైమ్స్‌ బాధితులకు ఆన్‌లైన్ ద్వారా ఎదురవుతున్న వేధింపులకు కూడా అడ్డుకట్ట వేయాలని కుంగ్-మి డిమాండ్ చేస్తున్నారు. ''ఈ విషయంలో అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది'' అన్నారు బార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Digital sex crime: South Korean spy camera victims who say our life is not your porn movie
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X