• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?

By BBC News తెలుగు
|

వైరస్

అది 1002 సంవత్సరం. ఇంగ్లండ్ చక్రవర్తి రెండో ఎథెల్రెడ్ యుద్ధం చేస్తున్నాడు. వైకింగ్ సైన్యాలు ఓ శతాబ్ద కాలంగా ఇంగ్లండ్‌ను ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. స్వీన్ ఫోర్క్‌బియర్డ్ వంటి వారు వాటికి నాయకత్వం వహిస్తున్నారు.

ఇంగ్లిష్ వారి ప్రతిఘటన చాలా బలహీనంగా ఉందని వైకింగులు భావిస్తూ వచ్చారు. కానీ ఎథెల్రెడ్ ఈసారి ఓ ఎత్తుగడ వేశాడు. దేశంలో ఉన్న ప్రతి డానిష్ పురుషుడినీ పట్టుకుని చంపాలని అతడు నవంబర్ 13న ఆదేశాలు జారీచేశాడు. ఈ కిరాతక చర్య ఫలించలేదు. పర్యవసానం.. ఇంగ్లండ్‌లో చాలా భాగం ఫోర్క్‌బియర్డ్ కొడుకు పాలనలోకి వెళ్లింది.

ఓ వెయ్యేళ్ల తర్వాత.. ఆక్స్‌ఫర్డ్ లోని సెయింట్ జాన్స్ కాలేజ్ ఆవరణలోని భూ పొరల్లో 37 అస్తిపంజరాలు లభించాయి. అవి ఎథెల్రెడ్ నాడు చంపించిన బాధితుల శవాలని భావిస్తున్నారు. వాటితో పాటు ఒక రహస్యం కూడా వెలుగుచూసింది.

ఆ అస్థికల డీఎన్‌ఏను శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆరంభంలో విశ్లేషించారు. ఎథెల్రాడ్ కరకు కత్తులకు బలైన ఆ మృతుల్లో ఒకరు చనిపోయేటప్పటికి స్మాల్‌పాక్స్‌ సోకినట్లు వెల్లడైంది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ వైరస్ 1970లలో మనం వ్యాక్సీన్ల ద్వారా అంతంచేసిన స్మాల్‌పాక్స్ రకం కాదు. అది చాలా భిన్నమైన రకం. మనకు మునుపెన్నడూ తెలియని రకం. అది శతాబ్దాల కిందటే మౌనంగా అంతర్థానమైపోయింది. అంటే.. స్మాల్‌పాక్స్ వైరస్ రెండు సార్లు అంతరించిందన్నమాట.

కొత్త వైరస్‌లు ఎలా మనుషులకు ఎలా సోకుతాయి, ఎలా విస్తరాయనేది మనకు ఇప్పటికి బాగానే తెలుసు. కానీ ఈ వైరస్‌లు ఎలా అంతరించిపోతాయనే అంశం మీద ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. కొన్ని వైరస్‌లు ఎందుకు అంతరించిపోతాయి? అసలు వాటికి ఏమవుతుంది?

ఇటీవలి కాలంలో అంతర్థానమైన వైరస్ సార్స్. ఈ వైరస్ గురించి ప్రపంచానికి మొట్టమొదటిసారి 2003 ఫిబ్రవరి 10న తెలిసింది. ''ఓ కొత్త అంటువ్యాధి'' వారం రోజుల వ్యవధిలో వంద మందిని చంపిందంటూ ఆ రోజు బీజింగ్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయానికి ఈ-మెయిల్ వచ్చింది.

చైనాలో అరుదైన అడవి జంతువుల మాంసాహారాలు విక్రయించే రెస్టారెంట్లకు పేరుగాంచిన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో తొలి కేసులు కనిపించాయి. రెండేళ్లలో ఈ వైరస్ దాదాపు 8000 మందికి సోకింది. 774 మంది చనిపోయారు. పరిస్థితి మరింత దారుణంగా మారి ఉండొచ్చు.

సార్స్‌కు కూడా.. దాని సన్నిహిత బంధువైన కోవిడ్-19 లాగానే ప్రపంచాన్ని ఆక్రమించుకోవటానికి అవసరమైన చాలా లక్షణాలు ఉన్నాయి. హెచ్‌ఐవీ తరహాలో కానీ, 1918 నాటి ఫ్లూ మహమ్మారి తరహాలో కానీ సార్స్ సైతం విస్తారమైన విధ్వంసం సృష్టిస్తుందని చాలా మంది నిపుణులు ఆందోళన చెందారు.

కానీ, సార్స్ ఎంత అకస్మాత్తుగా వచ్చిందో అంతే అర్థంతరంగా అంతర్థానమైంది. 2004 జనవరి నాటికి కేవలం ఓ పిడికెడు కేసులు మాత్రమే మిగిలాయి. గ్వాంగ్ఝో నగరంలో నివసించే లియూ అనే ఓ 40 ఏళ్ల వ్యక్తి చివరి పేషెంట్‌గా భావించవచ్చు. (కానీ ఓ రెండు నెలల తర్వాత బీజింగ్‌లోని ఒక పరిశోధన శాల నుంచి ఈ వైరస్ రెండు సార్లు తప్పించుకున్నపుడు మళ్లీ కొన్ని కేసులు నమోదయ్యాయి.)

మరి ఏం జరిగింది? ఒక్క ముక్కలో చెప్పాలంటే అదృష్టం మనవైపుంది. అధునాతనమైన కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతులతో పాటు.. సార్స్ వైరస్‌లోనే అంతర్లీనంగా ఉన్న లోపాల కారణంగా అది అంతర్ధానమైందని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎపిడమియాలజిస్ట్‌గా పనిచేస్తున్న సారా కోబీ అంటారు.

వైరస్

సార్స్ వైరస్ మరణాల రేటు చాలా అధికంగా ఉంది. ఐదుగురు రోగులకు ఒకరు చొప్పున చనిపోయారు. అయితే.. ఇది సోకిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయటం సులభం కూడా. లక్షణాలు లేని వారి నుంచి సోకటం లేదు. పైగా సార్స్ వైరస్ అంటువ్యాధిగా మారటానికి పొదిగే కాలం మరింత ఎక్కువగా ఉండేది. దానివల్ల ఇది సోకే అవకాశం ఉన్న కాంటాక్టులను వెదికి పట్టుకోవటానికి తగినంత సమయం లభించింది.

ప్రభుత్వాలు, సంస్థలు కూడా చాలా వేగంగా ప్రతిస్పందించాయని కోబీ చెప్తారు.

సార్స్ కాకుండా మరో రెండు వైరస్‌లను మాత్రమే మానవాళి తన ప్రయత్నాలతో అంతం చేయగలిగింది - ఒకటి స్మాల్‌పాక్స్, రెండోది పశువులకు సోకే రిండర్‌పెస్ట్.

వ్యాక్సీన్లను ఉపయోగించటం ద్వారా ఈ వైరస్‌ల మీద యుద్ధంలో విజయం సాధించారు. పోలియో మీద కూడా ఇలాగే వ్యాక్సీన్‌తో యుద్ధం సాగించగా.. 1980ల నాటికి ఆ కేసుల సంఖ్య 99 శాతం తగ్గిపోయింది. మీజిల్స్ మీద కూడా ఇదే తరహా పోరాటం చేస్తున్నప్పటికీ.. యుద్ధం వల్ల, యాంటీ-వాక్సర్ ఉద్యమం వల్ల, తాజాగా కోవిడ్-19 వల్ల ఆ పోరాటం వెనుకబడింది.

మరి ఇటీవలి కాలంలో మానవాళిని పీడిస్తున్న వైరస్‌ల సంగతేమిటి? ఎబోలా వెళ్లిపోతుందా? స్వైన్‌ఫ్లూ చచ్చిపోతుందా?

దురదృష్టవశాత్తూ కొన్ని వైరస్‌లు ఎన్నడూ అంతరించిపోయే అవకాశం లేదు. ఎందుకంటే అవి కేవలం మనుషులకు మాత్రమే సోకవు.

మనుషులకు ఎబోలా సోకిన ప్రతిసారీ అది పరిమితంగానే ఉంటోంది. 1976లో ఈ వైరస్‌ను గుర్తించినప్పటి నుంచీ ఆఫ్రికాలో 26 సార్లు ఈ వైరస్ విజృంభించింది. ఏదైనా ఒక జంతువు నుంచి - సాధారణంగా గబ్బిలం నుంచి - మనుషులకు సోకినపుడల్లా ఇలా జరుగుతోంది. అంటే.. గబ్బిలాలు ఉన్నంత వరకూ ఈ వైరస్ అలాగే ఉంటుంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్డ్ పరిశోధకురాలు ఎమ్మా గ్లెనాన్ సారథ్యంలో పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో ఒక అధ్యయనం చేపట్టారు. ఒక జంతువు నుంచి సుమారు 118 సార్లు విభిన్న రకాల ఎబోలా వైరస్‌లు మనుషులకు సోకి ఉంటాయని.. కానీ అలా సోకిన విషయం ఎవరికీ ఏమాత్రం తెలియదని గుర్తించారు. అంటే.. ఇలా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకటం ఆందోళనకలిగించేంత ఎక్కువగా జరుగుతోంది.

ఎబోలా పదోసారి విజృంభించినపుడు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను చాలా కాలం పట్టిపీడించింది. అది ఎట్టకేలకు అతమైనట్లు ఈ ఏడాది జూన్ 25న అధికారికంగా ప్రకటించారు. అది అంతమైనా మరో రకం ఎబోలా వైరస్‌లు మొదలయ్యాయి. పదకొండోసారి పుట్టుకొచ్చిన ఎబోలా ప్రస్తుతం దేశ వాయువ్య ప్రాంతానికి పరిమితమై ఉంది.

ఎబోలా మీద పోరాటంలో ఇంకా వేరే సవాళ్లు కూడా ఉన్నాయి. నిధుల లేమి వల్ల ఎబోలా కేసుల మీద నిఘా కష్టమవుతోంది. ఇది సోకిన ప్రాంతంలో సాయుధ బృందాలు సంచరిస్తుండటం ఆరోగ్య సిబ్బందికి ప్రమాదకరంగా మారింది. కొంతమంది ఎబోలాకు చికిత్స పొందటానికి విముఖంగా కూడా ఉంటారు. ఆరు రకాల ఎబోలా వైరస్‌లలో 2013-16 మధ్య పశ్చిమాఫ్రికాలో 11,000 మందిని బలితీసుకున్న ఒక రకం వైరస్‌కు మాత్రమే వ్యాక్సీన్ ఉంది.

ఈ వైరస్‌ను మహత్తర ప్రయత్నం చేసి మనుషుల నుంచి నిర్మూలించినా కూడా.. దీని వాస్తవ హోస్ట్‌లైన గబ్బిలాల్లో అది సంచరిస్తూనే ఉంటాయి. అంటే.. దీనిని భూమి మీద అంతం చేయటం దాదాపుగా అసాధ్యం.

ఇదే తరహాలో 2012లో ఒంటెల నుంచి మనుషులకు సోకిన మెర్స్ కూడా.. వందలాది సార్లు ఆ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు భావిస్తున్నారు.

అయితే.. కోవిడ్-19 విషయంలో ఇదే జరుగుతుందని చెప్పలేం. ఈ వైరస్ వాస్తవంగా గబ్బిలాల్లో ఉంటుందని.. అది మరో జంతువుకు బహుశా పాంగోలిన్లకు సోకి.. వాటి నుంచి మనుషులకు సోకి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు కోవిడ్-19 రిజర్వాయర్‌గా మనుషులమే ఉన్నాం. అది మనుషుల్లో ఎంతగా వ్యాపించిందంటే.. ఈ వైరస్ మనుషుల నుంచి తిరిగి జంతువులకు సోకుతుందా అనేంత తీవ్రంగా ప్రబలింది. అదే జరిగితే దీనిని అంతం చేయటం మరింత కష్టమవుతుంది.

ఈ పరిస్థితి మరో అవకాశానికి కూడా దారితీయవచ్చు. మనుషుల్లో నిరంతరం కొనసాగుతున్న వైరస్‌లు. ఈ వైరస్‌లు మానవ జాతితో శాశ్వతంగా ఉంటున్నా.. వాటిలో విభిన్నరకాల వంశాలు చాలా తరచుగా అంతరిస్తున్నాయి.

ఫ్లూ వైరస్‌లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. మొదటిది ఇన్‌ఫ్లుయెంజా-ఎ. ఇది మనుషులతో పాటు చాలా ఇతర జంతువులకూ సోకుతుంది. ప్రధానంగా నీటి పక్షులకు. బాతుల నుంచి జెయింట్ పెట్రెల్ వంటి అరుదైన అంటార్కిటిక్ జీవుల వరకూ ఇది సోకుతుంది. కానీ ఇది ఏదో ఒక రూపంలో మనతో ఎల్లప్పుడూ ఉంది. సీజనల్ ఫ్లూ కేసుల్లో అత్యధిక భాగానికి ఈ రకం వైరసే కారణం. ఇది మహమ్మారిగా కూడా ప్రబలుతుంది.

రెండో రకం ఇన్‌ఫ్లుయెంజా-బి. ఇది కేవలం మనుషులకు - చిత్రంగా సీల్స్‌కు మాత్రమే సోకుతుంది. కానీ ఎప్పుడూ మహమ్మారిగా మారదు.

ఇన్‌ఫ్లుయెంజా-ఎ వైరస్ రకాలు మరింత సమర్థవంతంగా సోకేలా రూపాంతరం చెందుతున్నాయని చాలా ఏళ్లు భావించారు. కానీ అలా జరగటం లేదని తాజా పరిశోధన చెప్తోంది.

ఎబోలా

1893కు ముందు చనిపోయిన వారెవరికీ ఇప్పుడున్న ఇన్‌ఫ్లుయెంజా-ఎ వైరస్ రకాలేవీ సోకే అవకాశం లేదని వెల్లడైంది. దానికి కారణం.. సుమారు 120 సంవత్సరాల కిందట మనుషుల్లో ఉండిన ఫ్లూ వైరస్ అంతరించిపోయింది. 1918 మహమ్మారిని సృష్టించిన ఫ్లూ రకం కూడా అంతమైపోయింది. అమెరికాలో 1,16,000 మందిని బలితీసుకున్న 1957 నాటి ఏవియన్ ఫ్లూ విజృంభణకు కారణమైన ఫ్లూ వైరస్‌ కూడా మాయమైపోయింది. 2009లో స్వైన్ ఫ్లూ పుట్టుకువచ్చింది.

ప్రధానంగా ఉన్న ఫ్లూ రకాలు చాలా మార్గాల్లో రూపాంతరం చెందుతుంటాయి. వాటిలో చాలా వరకూ అర్థంతరంగా అంతరించిపోతుంటాయి. కొన్ని దశాబ్దాలకోసారి ఓ కొత్త ఫ్లూ వైరస్ అభివృద్ధి చెంది పాతవాటి స్థానాన్ని భర్తీచేస్తుంటాయి. సాధారణంగా పాత ఫ్లూ వైరస్‌లకు.. జంతువుల నుంచి కొత్తగా వచ్చే ఫ్లూ వైరస్‌లు జత అయినపుడు ఇలా జరుగుతుంటుంది.

''ఇప్పుడు కొత్త రకం వైరస్‌లు ప్రతి రెండేళ్లకోసారి అంతరించిపోతున్నాయి. ఇది సంక్లిష్టమైన విషయం. కానీ చాలా పెద్ద మొత్తంలో ఇది జరుగుతోంది'' అని కోబీ పేర్కొన్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 1918 ఫ్లూ మహమ్మారికి, స్వైన్ ఫ్లూ విజృంభణకు కారణమైన హెచ్1ఎన్1 రకం వైరస్ కాలం గడిచేకొద్దీ మనుషుల్లో కొనసాగటానికి అనుగుణంగా రూపాంతరం చెందకపోగా.. రుపయోగమైన, పైగా తన మనుగడకే చేటుగలిగించే మ్యుటేషన్లకు లోనయింది. అదిప్పుడు అంతరించిపోయింది.

మనుషులకు తరచుగా సోకే వైరస్‌లు వేగంగా రూపాంతరం చెందే ఈ ప్రక్రియను ఇంకా వేగిరపరచటం ద్వారా.. దానిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్లూ, జలుబు వైరస్‌లను వదిలించుకోవటానికి ఈ పద్ధతిని పాటించవచ్చుననే ఆలోచన కొంత కాలంగా ఉంది. ఇప్పుడు కోవిడ్-19 విషయంలోనూ ఇలాంటి వ్యూహం అమలుచేయవచ్చునని ఇటీవల సూచిస్తున్నారు.

ఈ ప్రణాళికకు కేంద్ర బిందువు 'ఆర్ఎన్ఏ వైరస్‌ల' జీవశాస్త్రం. హెచ్ఐవీ, ఫ్లూ, కరోనావైరస్‌లు, ఎబోలా వంటి చాలా వైరస్‌లు ఈ బృందానికే చెందుతాయి. వీటి జన్యుపదార్థం డీఎన్‌ఏతో కాకుండా ఆర్ఎన్ఏతో తయారయి ఉంటుంది. దానర్థం.. అవి తమ హోస్ట్‌లోని యంత్రాలను హైజాక్ చేసి తమను కాపీ చేయాలని చెప్పినపుడు - ఆ యంత్రాలు పొరపాట్లు లేకుండా 'ప్రూఫ్‌రీడింగ్' చేయాల్సిన పని ఉండదు.

ఇది మనుషులకు చెడ్డ విషయమని సాధారణంగా భావించేవారు. ఎందుకంటే ఇటువంటి మ్యుటేషన్ల వల్ల ఆర్ఎన్ఏ వైరస్‌లలో అసాధారణ సంఖ్యలో జన్యు వైవిధ్యం ఉంటుంది. ఈ వైవిధ్యం అవి చాలా వేగంగా రూపాంతరం చెందేందుకు తోడ్పడుతుంది. దానివల్ల వాటిని లక్ష్యంగా చేసుకుని తయారు చేసే ఏ ఔషధాలైనా, వ్యాక్సీన్లయినా చాలా త్వరగా నిరుపయోగం అవుతాయి.

పోలియో

ఫ్లూ వైరస్ రకాలు ఒకే శ్రేణికి చెందుతాయని మనం భావించినా.. నిజానికవి విభిన్న జన్యుక్రమాలతో కూడిన ఓ పెద్ద సమూహం. దీనివల్ల ఫ్లూను నిర్మూలించటం కష్టవుతుంది. ఎందుకంటే ఈ సమూహంలో.. మన రోగనిరోధక శక్తి గుర్తించలేని కొన్ని వైరస్‌లు ఉండొచ్చు. దీంతో అవి మన శరీరంలోకి చొరబడి దాడి చేయగలుగుతాయి.

అయితే.. ఈ విపరీతమైన మ్యుటేషన్ల రేటు రెండంచుల కత్తి లాంటిది. ఒక నిర్దిష్ట స్థాయిని మించిన మ్యుటేషన్లు హానికరం. దానివల్ల జన్యులోపాలతో కూడిన రకాలు తయారవుతాయి. ఆ లోపాలు వాటి వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఆ వైరస్‌లు అంతరించిపోతాయి.

ఔషధాలను ఉపయోగించి వైరస్‌లు మరింత ఎక్కువ స్థాయిలో మ్యుటేట్ అయ్యేలా కృత్రిమంగా వేగవంతం చేయటం వల్ల కొన్ని ప్రయోజనాలు లభించవచ్చు. మొదటిగా.. రోగిలో వ్యాప్తి తగ్గేంత స్థాయిలో వైరస్‌ను బలహీన పరచవచ్చునేమో. తద్వారా తీవ్రంగా జబ్బుపడిన వారికి చికిత్స చేయటం సులభమవుతుంది.

ఇది పనిచేస్తుందనటానికి ఇప్పటికే కొంత ఆధారం ఉంది. మ్యుటేషన్ కలిగించే 'ఫావిపిరావిర్' ఔషధం హెచ్1ఎన్1 ఫ్లూ మీద సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు అమెరికా, జపాన్‌లలో క్లినికల్ ట్రయల్స్‌లో గుర్తించారు.

ఈ ఔషధ వినియోగంతో ఫ్లూ వైరస్ సోకటం తగ్గినట్లుగా ఉందని టెన్నెసీలోని మెంఫిస్‌లో గల సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌ వైరాలజిస్ట్ ఎలెనా గోవోర్కోవా చూపారు.

ఇప్పటికే ఆరు పాయలున్న కోవిడ్-19 వంటి కొన్ని రకాల వైరస్‌లు.. పెద్ద సంఖ్యలో తమకే హానికరమైన మ్యుటేషన్లకు లోనుకావచ్చు. తద్వారా అవి మొత్తంగా అదృశ్యమైపోవచ్చు.

భారతదేశంలో ఇది సహజంగా జరుగుతున్నట్లుగా చెప్తున్న ఆధారాలు ఇప్పటికే కనిపించాయి. ఈ వైరస్ చాలా తీవ్ర స్థాయిలో మ్యుటేట్ అవుతోంది. దానికదే పరిణామక్రమంలో అంత్య దశ దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశోధకులు సూచిస్తున్నారు.

వైరస్

అయినప్పటికీ, మనం ఎంతగా శ్రమించినా గానీ అసలు ఏదైనా వైరస్ పూర్తిగా అంతరించిపోయిందనటం మీద కొందరు శాస్త్రవేత్తలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

''అంతరించిపోవటం అనే పదం తప్పుదోవ పట్టించే పదం'' అంటారు ఎపిడెమియాలజిస్ట్ ఇయాన్ లిప్కిన్. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.

''వైరస్‌లు చాలా ప్రాంతాల్లో ఉండొచ్చు - మనుషుల్లో దాక్కుని ఉండొచ్చు. ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన పదార్థాల్లో దాక్కుని ఉండొచ్చు. అడవి జంతువుల్లో, పెంపుడు జంతువుల్లో దాక్కుని ఉండొచ్చు - ఏదైనా వైరస్ అంతరించిపోయిందని చెప్పటం నిజంగా అసాధ్యం'' అని ఆయన పేర్కొన్నారు. స్మాల్‌పాక్స్ వయల్స్ ఇంకా కనీసం రెండు చోట్ల ఫ్రీజర్లలో ఉన్నాయన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దానిని మరింత ఖచ్చితంగా అంతరించేలా చేయాలా వద్దా అనే అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది.

స్మాల్ పాక్స్ వాక్సినేషన్ కార్యక్రమాలు చాలా వరకూ 1970లలో ముగిసిపోయాయి కాబట్టి.. రెండు ల్యాబ్‌లలో దాచివుంచిన ఈ వైరస్ మరోసారి ప్రపంచ మహమ్మారిగా విరుచుకుపడే ప్రమాదం ఉందని చాలా మంది ఆందోళన.

ఇక్కడ సింథటిక్ వైరస్‌ల తాజా ముప్పు గురించి మనం ప్రస్తావించలేదు.

2017లో కెనడా శాస్త్రవేత్తల బృందం ఒకటి - స్మాల్‌పాక్స్‌కు సన్నిహిత బంధువైన హార్స్‌పాక్స్ వైరస్‌ను కృత్రిమంగా తయారు చేసింది. అసలు హార్స్‌పాక్స్ అంతరించిపోయి ఉండొచ్చు.. లేకపోనూవచ్చు. చాలా వైరస్‌ల విషయంలో లాగానే ఇది అదృశ్యమైపోయిందా లేదా అనేది ఎవరికీ తెలీదు. కానీ దాని జన్యు సంకేతాల రికార్డులను, ఇంటర్నెట్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్న డీఎన్ఏ తునకలను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఆ వైరస్‌ను పునఃసృష్టించగలిగారు.

అలాగని.. వైరస్ నిర్మూలనకు మనం చేపట్టిన కార్యక్రమాలు నరర్థకమని కాదు. నిజానికి.. మనుషులకు సోకే వైరస్‌లను నిర్మూలించటం మీద మనమిప్పుడు మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలని కోబీ భావిస్తారు. ''మనుషులకు సోకుతున్న వైరస్‌లు చాలా ఉన్నాయి.. అవి ఎన్ని ఉన్నాయో చాలా మందికి అసలు తెలీదు'' అంటారామె.

కోవిడ్-19 ఓ కొత్త సైన్స్ విప్లవానికి దారితీస్తుందేమో.. ప్రతి ఏటా పలుసార్లు ఫ్లూ కానీ, జలుబు కానీ సోకటమనేది.. స్మాల్‌పాక్స్ లాగా మాయమైపోతుందేమో.. ఎవరికి తెలుసు.

Click here to see the BBC interactive

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus becomes naturally extinct
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X