వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు కొందరిలో 'రహస్య' రోగ నిరోధక కణాలున్నాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్ పరిశోధనలు

మానవ శరీరంలో కోవిడ్‌ను ఎదుర్కొనే రోగ నిరోధకాలు మూడు నెలల్లో అంతరించిపోయే అవకాశాలున్నాయని తాజా పరిశోధనలు సూచిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటంలో ఒక కొత్త ఆశాకిరణం కనిపిస్తోంది. అది: ఎనిగ్మాటిక్ టి-సెల్ లేదా మార్మిక టి-కణం.

దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శాస్త్రవేత్తలు మొదట కోవిడ్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న కొందరిని పరిశీలించారు. విచిత్రంగా వారిలో ఎలాంటి యాంటీబాడీలు లేవని గుర్తించారు. ఇలా చాలా మందిలో ఉండవచ్చని వారు అంచనా వేశారు. ఆ తరువాత వారికి మరో విషయం తేటతెల్లమైంది. అదేమంటే, శరీరంలో రోగనిరోధకాలను పెంపొదించుకున్న వారిలో చాలా మంది వాటిని కొన్ని నెలల్లోనే కోల్పోయారు.

కుప్తంగా చెప్పాలంటే, కరోనా మహమ్మారి వ్యాప్తిని గుర్తించడంలో యాంటీబాడీలు కీలక పాత్ర పోషిస్తాయన్నది రుజువైన వాస్తవమే. అయితే, ఇప్పటిదాకా అనుకుంటున్నట్లు రోగ నిరోధకతలో వాటి పాత్ర ప్రధానమైనది కాకపోవచ్చు. ఈ వైరస్ నుంచి మానవుడు దీర్ఘకాలిక రక్షణ పొందే అవకాశం ఉన్నట్లయితే, ఆ రక్షణ మరెక్కడి నుంచో లభిస్తుందని అర్థం చేసుకోవాలి.

ఒకవైపు ప్రపంచమంతా యాంటీబాడీల మీదే దృష్టి కేంద్రీకరిస్తుంటే, శాస్త్రవేత్తలు మాత్రం మరొక రోగనిరోధక శక్తి ఏదో ఉన్నట్లు గుర్తిస్తున్నారు. కొందరిలో ఇది చాలా ఏళ్ళుగా పరిశోధనలకు చిక్కకుండా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ రహస్య తెల్ల రక్తకణం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇప్పటివరకూ దీనికి సంబంధించిన అవగాహన పెద్దగా లేనప్పటికీ, కోవిడ్-19తో మానవాళి చేస్తున్న పోరాటంలో ఇది చాలా కీలకం కాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. టి-కణాలకు సంబంధించి ఇదో పెద్ద విప్లవానికి నాంది పలకవచ్చు.

టి-కణం అంటే ఒక రకమైన రోగ నిరోధక కణం. ఈ కణాలు శరీరం మీదకు దాడి చేసే వ్యాధికారక కణాలు లేదా ఇన్ఫెక్షన్‌కు గురైన కణాలను గుర్తించి అంతం చేస్తాయి. టి-కణాలు తమ ఉపరితలం మీద ఉండే ప్రొటీన్లతో ఈ పని చేస్తాయి. ఈ ప్రొటీన్లు హానికారక కణాల మీది ప్రోటీన్లతో తలపడతాయి. అయితే, ప్రతి టీ-సెల్ దానికదే ప్రత్యేకం. వాటి ఉపతల ప్రోటీన్లలో కోట్ల కొలది రకాలుంటాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన ప్రతి టి-కణం ఒక ప్రత్యేక లక్ష్యం మీదకు దాడి చేస్తుంది. ఇన్ఫెక్షన్ నయమైన తరువాత కూడా చాలా ఏళ్లపాటు రక్తంలో తేలుతూ ఉండే ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థ 'దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి'ని పెంపొందిస్తాయి. తద్వారా అవి పాత శత్రువు మళ్లీ వచ్చినప్పుడు మరింత బలంగా తిప్పికొట్టడంలో సహకరిస్తాయి.

కోవిడ్-19 సోకినవారిలో వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా టి-కణాలు వైరస్ మీద దాడి చేస్తుంటాయని ఇటీవలి అధ్యయనాలు నిరూపించాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, వ్యాధి సోకిన వారిలో కొంతమందిలో కోవిడ్-19 మీద పోరాడే యాంటీబాడీలు లేవని, వైరస్‌ను గుర్తించే టి-సెల్స్ మాత్రం ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో, మనిషిలో ఈ వ్యాధి మీద పోరాడే ఒక స్థాయి రోగనిరోధకత ఇప్పటివరకూ భావిస్తున్న దాని కంటె రెట్టింపు ఉండవచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.

టి కణాలు

ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటుంది. అదేమంటే, కరోనావైరస్ మహమ్మారి రావడానికి కొన్నేళ్ల ముందు తీసుకున్న రక్త నమూనాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు వాటిలో కోవిడ్-19 కణాల ఉపరితలం మీది ప్రొటీన్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందిన టి-సెల్స్ ఉన్నట్లు గుర్తించారు. అంటే, కొంతమందిలో రాబోయే కరోనావైరస్ కణాలను ఎదుర్కోగల రోగనిరోధకత అదివరకే సిద్ధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ఫెక్షన్‌ సోకని వారిలో 40-60 శాతం మందిలో ఈ వ్యవస్థ ముందస్తుగానే ఉన్నట్లు తెలుస్తుండడం సహజంగానే విస్మయం కలిగిస్తోంది.

కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు శరీరంలో ఉండే టి- కణాలే రహస్యంగా రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఈ టి-కణాలు శరీరంలో పోషించే పాత్రను గుర్తించడం ద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ వైరస్ బారిన పడే అవకాశాలు పెరగడం , వెన్నెముక బలహీనపడడం వంటి అంశాలను మరింత అర్ధం చేసుకునేందుకు వీలు కలుగుతుంది.

టి-కణాల గుట్టును విప్పడం అన్నది కేవలం అధ్యయన ఆసక్తికి సంబంధించిన ఆంశం కాదు. రోగ నిరోధక వ్యవస్థలో ఏ అంశం అత్యంత ముఖ్యమైనదనే విషయాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించగలిగితే, ఆ ప్రకారంగా వారు వ్యాక్సీన్లు, ఔషధాల మీద తమ పరిశోధనలను మరింత నిశితంగా ముందుకు తీసుకుపోగలుగుతారు.

శరీరంలో రోగ నిరోధక శక్తి ఎలా పెంపొందుతుంది?

చాలా మంది ఈ టి-కణాలు లేదా టి-లింఫోసైట్ల గురించి పెద్దగా అలోచించి ఉండరు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పోషించే పాత్రను తెలుసుకోవాలంటే ఎయిడ్స్ సోకిన వ్యక్తికి ఆఖరి దశలో చోటు చేసుకునే లక్షణాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఆగకుండా వచ్చే జ్వరాలు, గొంతు నొప్పి, అలసట, బరువు తగ్గిపోవడం, అరుదైన క్యాన్సర్లు. ఈ పరిస్థితుల్లో సాధారణంగా శరీరం పై కనిపించే హానికారకం కాని కాండిడా ఆల్బికన్ లాంటి మైక్రోబ్లు నెమ్మదిగా శరీరం పై దాడి చేయడం మొదలుపెడతాయి.

కొన్ని నెలలు లేదా సంవత్సరాలు గడిచేటప్పటికి , ఎచ్ ఐ వి టి -కణం జెనోసైడ్ లాంటి దానిని తయారు చేస్తుంది. దీంతో ఇది నెమ్మదిగా శరీరంలో ఉండే టి కణాలను చనిపోయేలా చేస్తుంది. "ఇది శరీరంలో ఉండే చాలా టి కణాలను తుడిచిపెట్టేస్తుంది" అని కింగ్స్ కాలేజీ లండన్ లో ఇమ్మునాలజీ ప్రొఫెసర్ ఏడ్రియన్ హేడే చెప్పారు. దీనిని బట్టి శరీరంలో యాంటీబాడీలతో పాటు టి-కణాల ప్రాముఖ్యత ఏమిటో అర్ధమవుతుందని ఆయన అన్నారు.

సాధారణ జలుబు లాంటి వైరస్ సోకినప్పుడు , శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి ముందుగా వైరస్‌తో పోరాడుతుంది. ఈ దశలో వైరస్‌తో పోరాడడానికి శరీరంలో‌ కొన్ని యాంటీ బాడీలు తయారవుతాయి.

"దీనితో పాటు ఇన్ఫెక్షన్ మొదలైన మరో నాలుగైదు రోజుల్లో టి-కణాలు ఉత్తేజితమై, వైరస్ సోకిన కణాలను గుర్తించడం మొదలు పెడతాయి." అని హేడే చెప్పారు. “వైరస్ నెమ్మదిగా పెరిగి విజృంభించేలోపు ఈ టి కణాలు కానీ, శరీరంలో ఉన్న ఇతర రోగ నిరోధక శక్తి గాని వాటితో పోరాడటం మొదలు పెడతాయి”.

టి కణాలు

టి-కణాలు, కోవిడ్ 19 గురించి మనకేమి తెలుసు?

కోవిడ్ సోకి హాస్పిటల్లో చేరలేని రోగుల్లో కచ్చితంగా ఈ టి-కణాలు పని చేస్తున్నాయని చెప్పవచ్చని హేడే చెప్పారు.

వైరస్ ని గుర్తించే యాంటీ బాడీలు , టి-కణాలను తయారు చేయగలిగే సామర్ధ్యం ఉండటం వలన ఇది వ్యాక్సీన్ పట్ల ఆసక్తి ఉన్న వారికి ఒక శుభవార్త లా వినిపిస్తున్నాయి.

అయితే, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న వ్యాక్సీన్ లో ఇప్పటికే, యాంటీబాడీలతో పాటు ఇలాంటి కణాలను ఉత్పత్తి చేయడం కనిపించింది. అయితే, ఇవి ఎంత వరకు వైరస్ నుంచి రక్షిస్తాయనేది ఇప్పట్లో చెప్పేందుకు లేదు. అయితే, వ్యాక్సీన్ తయారీ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, వ్యాక్సీన్ పరిశోధనా బృందంలో ఒక సభ్యుడు బీబీసీ కి చెప్పారు.

ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. కోవిడ్ బారిన పడి తీవ్రమైన లక్షణాలతో హాస్పిటల్ బారిన పడిన వారిలో ఈ టి-కణాలు అనుకున్నట్లుగా పని చేయడం లేదు.

"టి కణాలు కూడా వైరస్ బారిన పడుతున్నట్లు, హేడే చెప్పారు. "టి కణాల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగి , అవి రక్తంలోంచి మాయమవుతున్నాయి" అని అన్నారు.

టి కణాలు ఊపిరితిత్తుల లాంటి అవసరమైన చోట్లకు వెళ్లి పని చేస్తూ ఉండవచ్చు. కానీ, చాలా కణాలు చనిపోతూ ఉండి ఉండవచ్చని హేడే బృందం అభిప్రాయ పడుతోంది.

"కోవిడ్ 19 రోగుల పై జరిపిన ఆటాప్సి పరీక్షల్లో ఈ టి-కణాలు కుళ్లిపోతున్నట్లు తెలిసిందని, చెప్పారు. ముఖ్యంగా, టి-కణాలు నివసించే వెన్నెముక, శోష రస గ్రంథుల్లో ఈ పరిణామం కనిపిస్తున్నట్లు తెలిపారు.

వెన్నెముక లో టి-కణాలు కుళ్ళిపోతే టి- కణాలకు రోగం సోకి శరీరంలో ఉండే రోగ నిరోధక కణాల మీద దాడి జరిగినట్లే అర్ధం.

"ఎయిడ్స్ సోకి మరణించిన వ్యక్తుల పోస్ట్ మార్టం ని పరిశీలిస్తే ఇలాంటి సమస్యలు కనిపిస్తాయని హేడే చెప్పారు.

హెచ్ఐవీ వైరస్ నేరుగా టి- కణాలను ఇన్ఫెక్ట్ చేస్తుంది. కానీ, కోవిడ్ నేరుగా టి కణాలను ఇన్ఫెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు.

"ఏమి జరుగుతుందో మాకు తెలియదు. టి-కణాలు కొన్ని సంవత్సరాల వరకు మిమ్మల్ని రక్షిస్తాయనడానికైతే ఆధారాలున్నాయి. కానీ, ప్రజలు రోగాల బారిన పడినప్పుడు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వారికి కవచంగా ఉన్న టి-కణాలను కూడా వైరస్ లు సంహరించవచ్చు. వృద్ధులు కోవిడ్ బారిన పడటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు .

కోవిడ్ పరిశోధనలు

2011 లో సార్స్ వ్యాధిని కలగ చేసే వైరస్ ను ఎలుకకు ఇచ్చి నిర్వహించిన ఒక పరిశోధన గురించి హేడే వివరించారు. కోవిడ్- 19 ని పోలిన సార్స్ వైరస్ కూడా ఇన్ఫెక్షన్ తో పోరాడే టి-కణాల ఉత్పత్తిని పెంచేలా చేసింది.

ఆ తర్వాత చేసిన మరి కొన్ని అధ్యయనాలు కూడా ఇలాంటి ఫలితాలే చూపించాయి. అయితే, ఎలుకలను కొన్ని రోజుల పాటు పెరిగేలా చేసినప్పుడు వాటిలో టి-కణాల పని తీరు బలహీనపడినట్లు గుర్తించారు.

అదే ప్రయోగంలో ఎలుకలను జలుబు కలగ చేసే వైరస్ కి గురి చేశారు. కానీ, ఈ ప్రయోగంలో ఎలుకల వయసు పెద్దదైనప్పటికీ వాటిలో ఉన్న టి-కణాలు ఈ వైరస్ కి వ్యతిరేకంగా పోరాడాయి

"ఇదొక ఆకర్షణీయమైన పరిశీలన. "30 సంవత్సరాలు వచ్చేటప్పటికి , రోగ నిరోధక కణాలు తయారయ్యేందుకు ఉపయోగపడే థైమస్ గ్లాండ్ బలహీన పడటం మొదలై , టి- కణాల ఉత్పత్తి రోజు రోజుకీ తగ్గిపోతుంది.

2002 లో తలెత్తిన సార్స్ వైరస్ రోగులను కొన్ని సంవత్సరాల తర్వాత పరిశీలించినప్పుడు వారి శరీరంలో టి కణాలున్నట్లు ఆధారాలు దొరికినట్లు, హేడే తెలిపారు. వాళ్ళు కోలుకున్న తర్వాత కూడా వారిలో టి- కణాలు ఉన్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

కరోనా వైరస్ వచ్చి కోలుకున్న వారిలో కూడా దీర్ఘ కాలం పని చేసే టి- కణాలుంటాయనే ఆధారంతో శాస్త్రవేత్తలు 2015- 2018 మధ్యలో సేకరించిన రక్త నమూనాల ద్వారా అవి కోవిడ్ వైరస్ ని కనిపెడతాయేమో అని పరిశీలించాలనే ఆసక్తిని కలుగచేసింది. వారి లో ఉండే రోగ నిరోధక శక్తి గతంలో సాధారణ జలుబు వైరస్ తో పోరాడిన జ్ఞాపక శక్తితో వైరస్‌ను గుర్తిస్తున్నట్లు తెలిసింది.

శరీరంలో ఉండే టి- కణాలు ఈ వైరస్ ని గుర్తించలేక పోయినప్పుడు కోవిడ్ వైరస్ సోకిన కొంత మందిలో ఈ ఇన్ఫెక్షన్ స్థాయి ఎక్కువగా ఉంటోంది.

కరోనా వైరస్ కి వ్యతిరేకంగా పోరాడే టి-కణాలను తయారు చేయగలమా లేదా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. "ఈ అధ్యయనం చేయడానికి నిధులు సమకూర్చుకోవడం కూడా చాలా పెద్ద పని” అని హే డే అన్నారు.

వ్యాక్సిన్ తయారీకి ఇది దారి తీస్తుందా ?

గతంలో జలుబు వైరస్‌లకు గురికావడమన్నది నిజంగా స్వల్ప స్థాయి కోవిడ్ వ్యాధికి దారి తీస్తున్నట్లయితే, దీన్ని ఒక రకంగా టి-కణాలు అవి ఎన్నో ఏళ్ల కిందటే తయారైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయనడానికి రుజువుగా భావించవచ్చు. ఇది కచ్చితంగా వ్యాక్సీన్ అభివృద్ధికి దోహతపడుతుంది.

ఒక వేళ, అలా జరగదనుకున్నా, టి-కణాల వల్ల మరో రకమైన ప్రయోజనాలూ కలిగే అవకాశాలున్నాయి. వాటిని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత మేలు జరిగే అవకాశం ఉంది.

శాస్త్రవేత్తలు ఊహించిన విధంగా వస్తున్న రోగ నిరోధక శక్తి పై వ్యాక్సిన్ల తయారీ ఆధార పడి ఉంటుందని హేడే వివరించారు.. కొన్ని వ్యాక్సిన్లు యాంటీ బాడీల ఉత్పత్తికి సహకరిస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ కలగ చేసే వైరస్ తో పోరాడతాయని హేడే చెప్పారు.

శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి వైరస్ తో పోరాడుతున్నట్లు కనిపిస్తున్న ఫలితాలు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

భవిష్యత్తులో ఈ టి-కణాల గురించి మనం మరింత వినే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
some people have 'secret' immune cells to fight the coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X