బాటిల్ నీళ్లు తాగుతున్నారా? అందులో ఏమేం ఉన్నాయో తెలుసా
నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి బాటిళ్లు మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అయితే తాజాగా జరిగిన కొన్ని పరిశోధనలలో ఊహించని నిజాలు బయటపడ్డాయి...అవి... మినరల్ వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ రేణువులు.
న్యూయార్క్ స్టేట్ లోని ల్యాబ్ లో భారత్ సహా 9 దేశాల నుంచి సేకరించిన 250కి పైగా నీటి సీసాలపై పరిశోధనలు చేశారు. దీనికోసం ఒక ప్రత్యేక పదార్థాన్ని ఉపయోగించారు. నీటిలోని ఈ ప్లాస్టిక్ కణాలు ఈ పదార్థానికి అంటుకున్నాయి.
సగటున ఒక లీటరుకు 100 మైక్రాన్ల కంటే పెద్ద రేణువులు దాదాపు 10 ఉన్నాయి.
ఇవి మనిషి వెంట్రుక కంటే లావైన ప్లాస్టిక్ అని నిర్ధారించారు. ఇక చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువుల విషయానికొస్తే సగటున లీటరుకు 314 దాకా ఉన్నాయి.
అయితే వాటిని అధికారికంగా నిర్ధారించకపోయినా అవి ప్లాస్టిక్ రేణువులే కావచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం ఈ మైక్రో ప్లాస్టిక్ కు సంబంధించి ఎటువంటి చట్టాలు, నియమ నిబంధనలు లేవు. వాటిని అదుపు చేయడానికి ఎటువంటి ప్రక్రియలు అధికారికంగా లేవుని అంటున్నారు నిపుణులు.
మా ఉత్పత్తులలో ఇప్పటి వరకు అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువుల్ని కనిష్ట స్థాయికి మించి కనుగొనలేదని నెస్లే సంస్థ చెప్పింది.
ఏవియాన్ బాటిల్ వాటర్ ను ఉత్పత్తి చేసే డానోన్ సంస్థ ఈ పరీక్షా విధానం అస్పష్టంగా ఉందని పేర్కొంది.
పైగా మైక్రో ప్లాస్టిక్ విషయంలో ఎలాంటి నియమనిబంధనలు అమలులో లేవని అంటోంది. మరోవైపు డసాని మినరల్ వాటర్ ను ఉత్పత్తి చేసే కోకా కోల అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు కల్గిన ఉత్పత్తులలో కూడా ఇటువంటి రేణువులు కనిష్ట స్థాయిలో కనిపిస్తాయంటోంది.
మైక్రో ప్లాస్టిక్ హానికరం అని కచ్చితంగా చెప్పలేమని బ్రిటిష్ ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ అంటోంది.
అయితే అందుబాటులో ఉన్న సాక్ష్యాలను సమీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మరిన్ని పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మంచి నీటి సరఫరా అధ్వానంగా ఉన్న చోట్ల ఈ మినరల్ వాటర్ బాటిళ్ల వాడటమే మంచిదంటూ ఉంటాం. కానీ తాజా పరిశోధనల ఫలితాలు చూశాక ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయోనన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

భారత్‌లోనూ..
ఈ అధ్యయనంలో భాగంగా చెన్నై, ముంబయి, దిల్లీల నుంచి అక్వాఫినా, బిస్లెరీ బాటిళ్లను సేకరించి పరిశీలించారు.
వీటిలోనూ ప్లాస్టిక్ రేణవులు ఉన్నట్లు వెల్లడైంది.
జర్నలిజం సంస్థ Orb Media ఈ వివరాలను వెల్లడించింది.
వీరు అధ్యయనం చేసిన నీటిలో బిస్లెరీ, అక్వాఫినా, డాసాని, ఏవియాన్, నెస్లె, సాన్ పెల్లెగ్రినో, తదితర బ్రాండ్లకు చెందిన నీరు ఉంది.
ఈ అధ్యయన నివేదికను www.OrbMedia.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి:
- ఎడిటర్స్ కామెంట్: పవన్ కల్యాణ్ దక్షిణాది సెంటిమెంట్‌ను అస్ర్తంగా మార్చుకోబోతున్నారా? జనసేన భవిష్యత్తు ఏంటి?
- అసెంబ్లీల్లో ఆగమాగం.. ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎందుకు?
- హాకింగ్ మాట్లాడటం చూశారా?
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)