చైనా కొత్త వైరస్ నియోకోవ్ పై భయాలు-మనుషుల కంటే గబ్బిలాల్లోనే -ఏది నిజం, ఏది ఫేక్?
చైనాలో గుర్తించిన కొత్త రకం సార్స్ వైరస్ నియోకోవ్ పై వేగంగా పరిశోధనలు సాగుతున్నాయి. ప్రతీ ముగ్గురిలో ఒకరి ప్రాణాలు తీయగలిగే తీవ్రత కలిగిన వైరస్ గా కొందరు అభివర్ణించిన దీన్ని కట్టడి చేసేందుకు చైనాతో పాటు ఇతర దేశాలు కూడా దృష్టిసారిస్తున్నాయి. ఇందుకోసం నియోకోవ్ పుట్టుకతో పాటు ఇతర అంశాలపై అధ్యయనాలు ప్రారంభించాయి. ఇందులోనూ పలు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

చైనీస్ నియోకోవ్ వైరస్
నియోకోవ్ అనేది గబ్బిలాలకు చెందిన కరోనావైరస్. 2011లో మొదటిసారిగా దీన్ని గుర్తించారు. నియోరోమిసియా అని పిలిచే గబ్బిలాల జాతిలో తొలిసారిగా దీన్ని గుర్తించారు. దీని నుంచి నియోకోవ్ అనే పేరు వచ్చింది. సాధారణంగా వీటిని కలబంద గబ్బిలాలు అని పిలుస్తారు, ఈ జాతి ఆఫ్రో-మలగసీ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంది. నియోకోవ్ జీనోమ్ సీక్వెన్స్‌లో మెర్స్-సీఓవీకి 85 శాతం పోలికలతో ఉంటుంది. ఇది మెర్స్-కోవ్ జాతికి అత్యంత సన్నిహిత జాతి వైరస్ గా గుర్తింపు పొందింది.

మనుషులకు సోకుతుందా?
గబ్బిలాల్లో ఎక్కువగా కనిపించే నియోకోవ్ రకం వైరస్ మనుషులకు సోకుతుందా లేదా అన్న దానిపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు సాగుతున్నాయి. వీటిలో తేలిన దాని ప్రకారం ఇది మనుషులకు సోకే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇప్పటివరకూ నియోకోవ్ వైరస్ కారణంగా మనుషుల్లో మరణాలు కూడా చోటు చేసుకోలేదని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు ఇది సోకే అవకాశాలు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు.

అధ్యయనాల్లో తేలిందిదే
మెర్స్-సీవోవీతో సారూప్యంగా ఉన్న నియోకోవ్ వైరస్ రకం గబ్బిలాల్లోని గ్రాహకాల ద్వారా వాటి కణాల్లోకి ప్రవేశించే అవకాశముందని అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ మనుషుల్లో అవి ప్రవేశించేందుకు మాత్రం అవకాశాలు లేవని తేలింది. దీంతో ఈ నియోకోవ్ వైరస్ గబ్బిలాలకే పరిమితం అవుతోందని వెల్లడైంది. అయితే భవిష్యత్తులో ఈ నియోకోవ్ కూడా ఇతర కరోనా వైరస్ రకాల తరహాలోనే మనుషులకు సోకే ప్రమాదం కూడా లేకపోలేదని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
జనాభా పెరుగుదల, జంతువులతో మనుషులు దగ్గర కావడం వంటి కారణాలతో ఇది జరుగుతుందని తేలింది. తరచూ మనుషులతో పాటు జంతువుల్లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించడం ద్వారా రాబోయే ఇలాంటి ప్రమాదాల్ని పసిగట్టవచ్చని తేలింది.