వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘సన్నజాజి మొగ్గ లాంటి పిల్ల.. పెళ్లయ్యింది, ఫస్ట్ నైట్.. అతను కొంచం రఫ్‌గా.." - సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఏడుస్తున్న వధువు

తెల్లగా సన్నగా ఉంది ఆ అమ్మాయి.

చేతుల మీదా, కాళ్లమీదా అందమైన మెహెందీ డిజైన్. లతలూ, పూలు.

ఆమె నిద్రపోతున్నట్లు లేదు. ఎవరినీ చూడడానికిష్టం లేనట్టు కళ్ళు మూసుకుని ఉంది.

ముఖం మీద, చెక్కిళ్ల మీద కమిలిన గాయాలు.

పెదవి అంచు పగిలి రక్తం గడ్డ కట్టింది.

బ్లీడింగ్ అని తీసుకుని వచ్చారట.

"ఏం బ్లీడింగ్"

"అదే మేడమ్, పెళ్లయ్యింది.. ఫస్ట్ నైట్.. అతను కొంచం రఫ్‌గా.."

గుండె ఝల్లుమని, ఒళ్ళు చల్లబడింది. కొన్ని విషయాలు వినగానే కంగారొస్తుంది.

బరువు చూస్తే నలభై ఏడు కేజీలు. ఆమె ఒక హాస్పిటల్లో ఐటి సెక్షన్లో ఉద్యోగం చేస్తోంది. మంచి సంబంధం వచ్చిందని తల్లి దండ్రులు పెళ్ళి కుదిర్చారు. పది రోజుల క్రితం పెళ్లయింది.

ఈ పిల్లకు పెళ్ళేంటి అనేంత అర్భకంగా ఉంది.

రెండు జడలు వేసి యూనిఫామ్ తొడిగితే సెవెంత్ క్లాసు పిల్ల అనుకుంటారు. సన్నజాజి మొగ్గ లాంటి పిల్ల, తొలిరాత్రి భర్త చేతిలో తన్నులు తిని బెడ్ మీద పడుకుని ఉంది.

"చూస్తానమ్మా, ముట్టుకోను" అంటే పరీక్షకు ఒప్పుకుంది.

మోకాళ్ల కిందా, పైనా ఎర్రగా కమిలిన గుర్తులు.

జననాంగాలు వాచిపోయి వున్నాయి. ఓ పక్కన రక్తం గడ్డ కట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రదేశమంతా రక్తమయం.

ఇద్దరు అసిస్టెంట్లు, ఒక నర్స్.

అందరం దాదాపు ప్రతి రోజూ రక్తం చూసే వాళ్లమే అయినా, ఉలిక్కి పడ్డాము.

రోడ్డు మీద గాయపడిన చిన్న పిచ్చుకని చూస్తే ఒళ్లు జల జలలాడుతుంది. మనసుకి ముల్లుగుచ్చుకున్నట్టు మూలుగుతుంది.

గాయాలకు చికిత్స చేయడానికి ఆమెను థియేటర్‌కి తీసుకెళ్లాము.

ఆమెను కొట్టి దాడి చేసి గాయపరచినందుకు వరుడిపై కేసు నమోదయింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకిలా చేశావని అడిగితే "తొలిరాత్రి ఎరుపు కళ్ల జూడవలసిందే కదా" అన్నాడని తెలిసింది.

అతనికి శిక్ష పడుతుంది. బయటికి వచ్చాక, మరొక స్త్రీతో గౌరవంగా ప్రవర్తిస్తాడన్న నమ్మకం లేదు. ఈమె మరొక పురుషుడిని నమ్మి దగ్గరవుతుందా అన్నదీ అనుమానమే. అతను ప్రయత్నించిన తీరు తప్పని అతనికెవరు చెప్తారు?

మహిళ

లైంగిక హింసకు పర్యవసానం

ఆమె డిప్రెషన్‌కు గురైంది. మగవాళ్లని చూడడానికిష్టపడేది కాదు. తండ్రి, అన్నదమ్ములతో మాట్లాడడం మానేసింది. కుట్లు వేసిన గాయాలు మానడానికి ఓ వారం పట్టింది కానీ, కుట్లు పడని గాయం మానడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

ఉద్యోగానికి వెళ్లడానికిష్టపడేది కాదు. తోటివారు ఎటువంటి ప్రశ్నలడుగుతారోనన్న భయంతో.

జీవితం మీద ఆసక్తి లేదు. ఎన్నాళ్లు బతకాలి. బోరు కొట్టేస్తుందనేది. తల్లిదండ్రుల పట్ల ఇదివరకున్న ప్రేమాభిమానాలు పోయాయి. వారు చేసిన పెళ్లి వల్లే తనకిలా జరిగిందని, వారితో మాట్లాడేది కాదు.

రెండు సార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. తల్లిదండ్రులు పసి గట్టి కాపాడుకున్నారు. ఎన్నో పర్యాయాల కౌన్సెలింగ్ తర్వాత కుదుట పడి, ఉద్యోగంలో చేరింది.

లైంగిక హింసకు కారణాలేమిటి?

లైంగిక వాంఛలున్న స్త్రీ గౌరవనీయురాలు కాదనీ, అటువంటి ఆసక్తి కనబరచిన స్త్రీలపై లైంగికమైన దాడి తప్పులేదన్న భావన.

స్త్రీలను నియంత్రించడానికి, అధికారం చెలాయించడానికి లైంగికమైన హింస ఒక మార్గమని నమ్మడం.

స్త్రీ వద్ద తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం తప్పని సరి అన్న దృక్పథం.

లైంగికావసరాలు సహజమని తెలియకపోవడం. అవి తప్పు అన్న భావనతో పెరగడం.

స్త్రీ పై కోపాన్ని ప్రదర్శించడానికి లైంగిక దాడి ఒక మార్గమని నమ్మడం.

పరిష్కారమేమిటి?

విద్య అవసరం.

పరీక్షలు వ్రాయడానికి చదివే విద్య కాదు.

భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మొదలైనవి బోధించేందుకు ఆయా శాస్త్రాలలో నిపుణులని, పట్టభద్రుల్ని నియమిస్తారు.

పిల్లలు సంస్కారవంతంగా మెలగడానికి మరో విద్య అవసరం.. ప్రవర్తనకు సంబంధించిన విద్య.

కానీ ఎవరు ఆ విద్య బోధించేదెవరు?

లైంగిక నేరాలు చేసిన పిల్లల తల్లిదండ్రులను 'పిల్లలను పెంచే పద్ధతి ఇదేనా?' అని సమాజం నిలదీస్తుంది.

పిల్లలకు నేర్పడానికి, ఆ విద్య వారికి మాత్రం తెలిస్తే కదా.

ప్రవర్తన నేర్పడానికి సంస్కార శాస్త్రంలో పట్టభద్రులెవరు.

నాయకులు, విద్యావంతులు, పట్ట భద్రులు, అందరూ అసభ్య పదజాలంతో లైంగిక ప్రక్రియను కించ బరిచేవారే.

మహిళ

భౌతిక దాడితో మొదలై.. లైంగిక దాడితో ముగిసింది..

రాత్రి ఎనిమిదవుతోంది. ఆఫీసులో గొడవ జరిగింది. మనసేమీ బాగోలేదు.

బాటిల్ తీశాడు.

"ఇప్పుడెందుకూ?" నెమ్మదిగా గొణుక్కుంటూ లోపలికెళ్లింది.

"ఏం లేదే, టీవీ చూస్తా! కొద్దిగానే."

"మాట్టాడకుండా కూర్చోవాలి" అంది బతిమాలినట్టు.

"ఛ, ఛ, సైలెంట్ గా ఉంటానంతే."

రేవతిలో గుబులు రేగింది. తాగడం మొదలు పెట్టాడంటే ఇవాళ ఏమవుతుందో, ఏమిటోనని భయపడింది.

మళ్లీ వచ్చి చూస్తే అప్పటికే తాగుతున్నాడు.

టీవీలో ఎవరినో చూపిస్తూ కొడుకునడిగాడు.

"ఏరా? ఇది ప్రభాస్‌తో ఏసింది కదా, అదేదో సినిమాలో. ఈడితో కూడా ఏస్తందే. దీని పేరేంట్రా?"

నేల మీద కూర్చుని హోం వర్క్ చేసే కొడుకు తల పైకెత్తి జవాబు చెప్పాడు.

"హు! ఏంటా మాటలు?" అసహనంగా అంది.

"ఏంటే, నువ్వేదో పేద్ద పత్తిత్తులాగా?"

గొడవేదో మొదలవబోతోందని లోపలి కెళ్లిపోయింది.

వంటింట్లోకొచ్చి వాదన మొదలెట్టాడు.

"నిజం చెప్పవే. నీకు పెళ్లికి ముందే అంతా తెలుసు కదా. ఏదో వ్యవహారం ఉండే ఉంటుంది. ఎంగేజ్మెంట్ రోజునే నా మీద చెయ్యేశావే, ఎంత బరితెగించకపోతే.."

ఆమెకు కోరికలెక్కువన్నాడు.

పెళ్లయే నాటికి కన్యవని నమ్మలేనన్నాడు.

తొలిరాత్రి రక్తం కూడా రాలేదని గుర్తు తెచ్చుకున్నాడు.

వంటింట్లో చేతికందిన దానితో కొట్టడడం ప్రారంభించాడు.

భౌతికమైన దాడితో మొదలైన హింస లైంగికమైన దాడితో ముగిసింది.

నేటి తరం స్త్రీ, పెళ్లి కన్నా ముందు, సాధించవలసిన లక్ష్యాలు.. విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం. ఆర్థిక సామర్థ్యమున్న స్త్రీలలో ఈ హింస తక్కువగా నమోదైంది. దౌర్జన్య పూరిత సంబధాలలో కొనసాగాల్సిన అవసరం లేదని స్త్రీలు తెలుసుకోవాలి.

పువ్వు

చేయాల్సింది ఏంటి?

స్తీలలో లైంగికాసక్తిని, విద్యావంతులు సైతం ఏవగించుకుంటారన్నది పరిశోధనలలో తేలిన సత్యం.

స్త్రీ పురుషులకిద్దరికీ ఆకలి ఎంత సహజమో, లైంగికావసరాలు కూడా అంతే సహజంగా, సమానంగానే వుంటాయి.

సృష్టి కార్యం పట్ల సమాజానికి గౌరవం ఉందా? లేదనే చెప్పాలి.

పుట్టుకకు మూలమైన సృష్టికార్యాన్ని అసభ్యమైన తిట్ల రూపంలో మార్చి సంభాషణలో నిత్యమూ వాడుతోంది, సభ్య సమాజం. దానితో ముడిపడిన నాజూకు భావాలనన్నింటినీ వదుల్చుకుంది.

ఎదుటి వారిని గాయపరచడానికి, మరింత నొచ్చుకునేలా చేయడానికి మురికి మాటల వాడకం తప్పనిసరి అవుతోంది.

ఇలా చేయడం వల్ల పెరిగే పిల్లల మనసులో దానిపట్ల లోకువ భావన పెంపొందిస్తున్నాం.

సృష్టి కార్యం పట్ల మనుషులకున్న నీచమైన భావన, సెక్స్ నేరాలకు తోడ్పడుతోంది. దాన్ని తప్పుగా అపవిత్రంగా పరిగణించడం కూడదని, ప్రేమని వ్యక్తీకరించడానికి అదొక మార్గమని పెరిగే పిల్లలకు తెలియజెప్పాలి. పిల్లల పెరుగుదలకు బాధ్యత వహిస్తున్న పెద్దలకు కూడా ఆరోగ్యవంతమైన ఆలోచనలుండాలి.

పిల్లల శారీరిక పెరుగుదల కోసం బలమైన ఆహారం సమకూర్చినట్లే, లైంగికత పట్ల ఆరోగ్యకరమైన ఆలోచనలనివ్వాలి. వెకిలి భావాలు, చౌకబారు అభిప్రాయం ఏర్పడకుండా శ్రద్ధ తీసుకోవాలి.

ఆకలి వేసినపుడు శుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తీసుకుంటామో, లైంగిక ప్రక్రియలో కూడా క్రమశిక్షణ అవసరమని తెలియజేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Does society have respect for sex?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X