వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీ ‘అగ్రరాజ్యం’ కావాలనుకుంటోందా... అమెరికా ఎన్నికలపై ఆ దేశం ఆసక్తి చూపడానికి అదే కారణమా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టర్కీ అమెరికా

అమెరికా ఎన్నికలవైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అయితే, టర్కీ మాత్రం మరింత జాగ్రత్తగా ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది.

ఒకవైపు తమ ప్రాబల్యాన్ని విదేశాల్లో పెంచుకోవాలని టర్కీ భావిస్తోంది. అదే సమయంలో డోనల్డ్ ట్రంప్ హయాంలో తగ్గుతున్న అమెరికా ప్రాబల్యాన్ని ఒక అస్త్రంలా మలచుకోవాలనీ ప్రయత్నిస్తోంది.

ట్రంప్ హయాంలో విదేశాలకు సంబంధించిన చాలా అంశాల్లో అమెరికా వెనకడుగు వేసింది. ఈ లోటు భర్తీ చేసేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో టర్కీ కూడా ఒకటి. ఇరుగు పొరుగున్న దేశాలతోపాటు సుదూర ప్రాంతాలపైనా తమ ప్రాబల్యాన్ని విస్తరించాలని టర్కీ ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం టర్కీ అనుసరిస్తున్న వ్యూహాలపై టర్కీ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదివరకెన్నడూ చూడని శక్తిమంతమైన దేశంగా టర్కీ అవతరిస్తోందని వారు భావిస్తున్నారు.

''టర్కీ నానాటికీ పటిష్టమవుతోంది. అంతర్జాతీయ వేదికలపై తమ హక్కుల కోసం టర్కీ దృఢంగా పోరాడగలదు''అని అక్టోబరు 3న టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దవాన్ వ్యాఖ్యానించారు. తాము మిత్ర దేశాలకు అండగా నిలబడతామని ప్రసంగంలో ఆయన చెప్పారు.

అయితే, ప్రస్తుత అవకాశాలను తమకు అనువుగా మలచుకొనేందుకు ఇంకా చాలా దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి.

టర్కీ అమెరికా

ట్రంప్, ఎర్దవాన్ బంధాలు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంకేతాలు. నాటో భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలను టర్కీ అవకాశాలుగా మలుచుకుంటోంది.

రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను టర్కీ కొనుగోలు చేసినప్పుడు.. టర్కీపై నిషేధం విధించాలని అమెరికా భావించింది. అయితే, ఆ ఇబ్బందుల నుంచి టర్కీని ట్రంప్ గట్టెక్కించారు.

అమెరికా-టర్కీ మధ్య సంబంధాలు దిగజారుతున్న నేపథ్యంలో.. అమెరికాలో ట్రంప్ మాత్రమే టర్కీకి ఏకైక మిత్రుడని అమెరికాలోని ద జెర్మన్ మార్షల్ ఫండ్ సంస్థ టర్కీ విభాగం డైరెక్టర్ ఒజ్గుర్ ఉన్లుహిసార్సిక్లీ వ్యాఖ్యానించారు.

''ఇంత ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడుతున్నామంటే కేవలం అది నా మిత్రుడు ట్రంప్ వల్లే సాధ్యపడుతోంది''అని సెప్టెంబరు 2019లో న్యూయార్క్‌లో పర్యటన సమయంలో ఎర్దవాన్ వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ఇటీవల టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి మాట్లాడారు. టర్కీతో విదేశాంగ విధాన నిబంధనలను కఠినతరం చేస్తానని డెమొక్రటిక్ పార్టీ తరఫున ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలను టర్కీ మీడియా తీవ్రంగా ఖండించింది.

ఎర్డోగన్ వ్యూహాలు, ప్రణాళికలను గత ఆగస్టులో బైడెన్ తప్పుపట్టారు. టర్కీలో ప్రతిపక్షాలకు తను మద్దతు ఇస్తానని ప్రసంగంలో ఆయన స్పష్టంచేశారు.

అప్పటినుంచీ టర్కీకి చెందిన విశ్లేషకులు ట్రంప్‌కు మద్దతు తెలపడం మొదలుపెట్టారు. ''ట్రంప్ బలహీనతల గురించి నాకు తెలుసు. కానీ ఎవరో ఒకర్ని ఎంచుకోవాలంటే.. ట్రంప్ వైపే మొగ్గు చూపుతాం''అని టర్కీ ప్రభుత్వంవైపు మొగ్గుచూపే పత్రిక సబాహ్‌లో కాలమిస్టు మెహమత్ బర్లాస్ వ్యాఖ్యానించారు.

టర్కీ

డోనల్డ్ ట్రంప్‌తో స్నేహపూర్వక సంబంధాలు కేవలం ద్వైపాక్షిక అంశాలకు మాత్రమే పరిమితం కాదు.

అంతర్జాతీయ ఆపరేషన్ల నుంచీ అమెరికాను ట్రంప్ వెనక్కి రప్పిస్తున్నప్పుడు.. తన అంతర్జాతీయ ఇమేజ్‌ను మెరుగుపరచుకునేందుకు టర్కీ ప్రయత్నిస్తోంది.

గత ఏడాది అక్టోబరులో సిరియాలో టర్కీ సైన్యం జోక్యం చేసుకోవడమే దీనికి ఉదాహరణ.

సిరియాలో అక్కడి కుర్దులతో కలిసి ఇస్లామిక్ స్టేట్‌పై అమెరికా పోరాడుతోంది. అయితే, ట్రంప్‌తో ఎర్డోగన్ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం టర్కీ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వచ్చేసింది. దీంతో టర్కీ మద్దతున్న సైన్యం, రష్యా సైన్యం, సిరియా ప్రభుత్వం కలిసి.. ఈశాన్య సిరియాలోని కుర్దుల ఆధీనంలోని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

అమెరికా, టర్కీ ఇలా చాలా అంశాల్లో ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. లిబియాలో ప్రత్యర్థులపై అమెరికా సాయంతో పైచేయి సాధించాలని టర్కీ భావిస్తోంది.

మరోవైపు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైతే.. మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాల నుంచి ఆయన వెనక్కి వచ్చేస్తారని, ఫలితంగా టర్కీకి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

టర్కీ అమెరికా

టర్కీ లక్ష్యం..

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు చాలా అంతర్జాతీయ ఆపరేషన్ల నుంచి వెనక్కి వచ్చేస్తామని ట్రంప్ ప్రకటించారు. దీనిపై టర్కీ అధ్యక్షుడి కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ ఫ్రెంటన్ ఎలెన్ మాట్లాడారు. విస్తరణ కాంక్షకు అమెరికా ముగింపు పలికితే తమకు కొత్త అవకాశాలు దొరుకుతాయని ఆయన అన్నారు.

ప్రాంతీయంగా అత్యంత శక్తిమంతమైన దేశంగా టర్కీ రూపాంతరం చెందుతోందని సాబా పత్రిక కాలమిస్టు హసన్ బాస్రి యస్లీన్ కూడా వ్యాఖ్యానించారు.

''1990ల్లో అంతా అమెరికా చుట్టూ తిరిగేది. ఇప్పుడు ప్రపంచం మారింది. దానికి అనుగుణంగా టర్కీ కూడా మారింది''అని జూన్ 18న బాస్రి రాసుకొచ్చారు. ''ఇప్పుడు అమెరికా కొత్తగా ఏమీ చేయాలని భావించట్లేదు. ఎందుకంటే ఆ దేశం బలహీనపడుతోంది. మరోవైపు టర్కీ శక్తి పుంజుకుంటోంది''

''నేడు ఈ ప్రాంతంలో శక్తిమంతమైన దేశంగా టర్కీ మారుతోంది. 20వ శతాబ్దానికి అనుగుణంగా మార్పు చెందుతోంది''అని యెని షఫాఖ్ పత్రిక ఎడిటర్ ఇబ్రహీం కారాగుల్ వ్యాఖ్యానించారు.

మరోవైపు టర్కీలోని ప్రభుత్వ వ్యతిరేక గళాలు కూడా దేశం మార్పు చెందుతోందని అభిప్రాయపడుతున్నాయి.

ప్రాంతీయ విరోధాలు

అమెరికా సృష్టిస్తున్న అధికార శూన్యాన్ని పూరించేందుకు ప్రయత్నిస్తున్న దేశం టర్కీ మాత్రమే కాదు.

చాలా దేశాల మధ్య అధికారం కోసం పోటీ నడుస్తోంది. పశ్చిమ ఆసియా దేశాల్లో ప్రాబల్యం కోసం ఫ్రాన్స్, రష్యా, ఈజిప్ట్, యూఏఈ కృషి చేస్తున్నాయి.

ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియాలకు చాలా అంశాల్లో టర్కీతో విభేదాలున్నాయి.

పశ్చిమాసియాలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ కూడా భావిస్తున్నారు. ఇటీవల ఆయన లెబనాన్, ఇరాక్ పర్యటనలు గమనిస్తే అది స్పష్టమవుతుంది.

మరోవైపు ఫ్రాన్స్ ప్రయత్నాలను టర్కీ విమర్శిస్తోంది. వారిది వలసవాద, అణచివేత ధోరణి అంటూ ధ్వజమెత్తింది.

ట్రంప్, బైడెన్

అమెరికా ఎన్నికల తర్వాత..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినా, బైడెన్ గెలిచినా.. అంతర్జాతీయంగా దేశాల మధ్య పోటీ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

''అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావడానికి, అంతర్జాతీయ సంస్థల్లో తమ పాత్ర కోసం బైడెన్ కృషి చేయొచ్చు. కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు''అని టర్కీ న్యూస్ వెబ్‌సైట్ మీడియా స్కోప్ కాలమిస్ట్ రూసెన్ వ్యాఖ్యానించారు.

''ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం నెమ్మదిగా తగ్గిపోతోంది. శ్వేతసౌధంలో ఎవరు కూర్చున్నా పెద్దగా పరిస్థితులు మారవు''

టర్కీ ఆకాంక్షలు, లక్షాలు ట్రంప్ ప్రభుత్వ విధానాలకు మాత్రమే పరిమితం కావు.

గత కొన్నేళ్లలో భద్రతపై టర్కీ చాలా నిధులు వెచ్చింది. దేశంలో జాతీయవాద భావనలు చాలా పెరిగాయి. ట్రంప్ హయాంలో టర్కీ కొంత ముందడుగు వేసిన మాట వాస్తవమే.

కానీ, నవంబరులో జరిగే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ లేదా బైడెన్ ఎవరు విజయం సాధించినా.. టర్కీ ఆధిపత్యం పెరుగుతూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
As Turkey wants to become a super power, it eyes on US presidential elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X