డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత భాషే.. భారతీయ అమెరికన్లపై దాడులకు ఆజ్యం: జో బైడెన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణలు, విమర్శలతోపాటు అమెరికాన్లను, ఆ దేశంలో ఉంటున్న ఇతర దేశాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం వలసదారుల పట్ల కొంత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుండటం.. జో బైడెన్‌కు కలిసి వచ్చే అంశంగా మారుతోంది.
ఈ నేపథ్యంలోనే భారతీయ అమెరికన్లను తనవైపునకు తిప్పుకునేందుకు జో బైడెన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియావెస్ట్ అనే పత్రికకు రాసిన లేఖలో భారతీయుల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్య అభ్యర్థి కమలా హ్యారిస్ గురించి ప్రశంస పూర్వక వ్యాఖ్యలు చేశారు.
నేనే అతి తక్కువ జాత్యహంకారిని: డొనాల్డ్ ట్రంప్, మంట పెట్టడంలో నీ తర్వాతే ఎవరైనా: జో బైడెన్

కమలా హ్యారిస్, భారతీయులపై జో బైడెన్ ప్రశంసలు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండే తెలివైన వ్యక్తి అని బైడెన్ కొనియాడారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. చెన్నైకి చెందిన కమల తాత భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన తల్లి చేతులు పట్టుకొని ఉన్న చిన్ననాటి ఫొటోని కమలా హ్యారిస్ తరచూ షేర్ చేస్తుంటారని తెలిపారు. ఈ చిత్రం వారి ధైర్యం, ఆశ, త్యాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు. కమల గురించి మాట్లాడినప్పుడు భారతీయులంతా గర్వపడతారని అన్నారు. కమల అనుభవించిన జీవితమే ఇక్కడి ప్రతి భారతీయ అమెరికన్ అనుభవిస్తున్నారని తెలిపారు.

భారతీయత అంటే ఎంతో ఇష్టం: జో బైడెన్
కుటుంబసభ్యుల పట్ల గౌరవం, పెద్దలు, ప్రతి ఒక్కరినీ గౌరవించడం, స్వీయ క్రమశిక్షణ, సేవా భావం, కష్టపడేతత్వం వంటి లక్షణాలు భారతీయ అమెరికన్లను తనకు దగ్గర చేశాయని జో బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాలో మెరుగైన జీవితం కోసం ఐర్లాండ్ నుంచి వచ్చిన తన పూర్వీకుల నుంచి తనకు ఈ విలువలు అందాయని వెల్లడించారు. ఆ విలువలే తనను ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాయని తెలిపారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన నివాసంలో జరిపిన దీపావళి వేడుకను ఈ సందర్భంగా బైడెన్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడి భారతీయులతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. వారి విలువలు, తన విలువలతో సరిపోలతాయని తెలిపారు.

ట్రంప్ వల్లే భారతీయ అమెరికన్లపై దాడులు
అయితే, విలువలు లేని వ్యక్తి కారణంగానే.. అమెరికా తామందరం కలలుకన్న మారిగా లేకుండా పోయిందని విమర్శించారు. కరోనా మహమ్మారి విషయంలో ట్రంప్ అనాలోచితంగా వ్యవహరించి లక్షలమంది మరణాలకు కారణమయ్యాడని ఆరోపించారు. డాక్టర్ పౌచీ వంటి నిపుణుల సలహాలను ఆయన పట్టించుకోలేదన్నారు. డొనాల్డ్ ట్రంప్ వలసదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై బైడెన్ మండిపడ్డారు. అధ్యక్షుడు వలసదారుల పట్ల ఉపయోగించే భాషే ప్రమాదకరంగా ఉందని.. అవే భారతీయ అమెరికన్లపై ద్వేషపూరిత దాడులకు ఆజ్యం పోశాయని మండిపడ్డారు. శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నవారు, చట్టబద్దంగా అమెరికాలో ఉండాలనుకుంటున్నవారు ట్రంప్ నిర్ణయాలతో బలవుతున్నారని విమర్శించారు.

భారతీయ ఓటర్లే లక్ష్యంగా జో బైడెన్.. భారత్‌కే మద్దతు
ఇక చైనా విషయంలో భారత్‌కు అండగా ఉంటామని జో బైడెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పోరాడతామని అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాగా, నార్త్ కరోలినా, వర్జీనియా, పెన్సిల్వేనియా, మిషిగాన్, జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న సుమారు రెండు మిలియన్ల మంది భారతీయ అమెరికన్ ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు బైడెన్.