
7.6 తీవ్రతతో పెను భూకంపం: సునామీ భయం..: తీర ప్రాంతాల్లో అలజడి
జకర్తా: ఇండోనేషియాలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సముద్రంలో ఇంత భారీ ఎత్తున భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. సునామీ సంభవించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. రహదారుల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు.
ఇండోనేషియాలోని మౌమెరె వద్ద స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11:20 గంటలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. మౌమురేకు తూర్పు దిశగా 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూసా టెంగ్గారా ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని- భూకంపం సంభవించిన కొద్ది క్షణాల్లోనే ఇండోనేషియా ప్రభుత్వం సునామీ అలర్ట్‌ను జారీ చేసింది.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా రికార్డయినట్లు యూరోపియన్-మిడ్ టెర్రయిన్ సెస్మలాజికల్ సెంటర్ తెలిపింది. నూసా టెంగ్గర్రా ప్రాంతంలో ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది. సముద్రంలో భూమి కంపించడం వల్ల సునామీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేసింది. భూకంప కేంద్రానికి సమీపంలో లెస్సెర్ సుండా ఐలండ్స్ పరిధిలో చిన్న ద్వీపాలు ఉండటం వల్ల ఆందోళన వ్యక్తం చేసింది.
తూర్పు నూసా టెంగ్గారలోని నెబె తీరం వద్ద అలలు ఉవ్వెత్తున ఎగిసి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. సముద్రం అల్లకల్లోలంగా మారిందని తెలిపింది. వీలైనంత వరకు తీర ప్రాంతాలకు వెళ్లడాన్ని మానుకోవాలని స్థానిక ప్రజలకు సూచించింది. స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా వార్తలు అందలేదు.