ట్రంప్‌కు ఊరట అలస్కాలో విజయం -ఫలితాలపై పోరు ముమ్మరం -ఎవరూ అడ్డుకోలేరని బైడెన్ గరం
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ కు స్వల్ప ఊరట లభించింది. సుదీర్ఘంగా సాగుతోన్న కౌంటింగ్ ప్రక్రియలో కొద్ది రోజులుగా 214 ఓట్ల దగ్గరే అటకాయించిన ఆయనకు అలస్కా రూపంలో మరో విజయం లభించింది. మూడు ఎలక్టోరల్ ఓట్లున్న అలస్కా ట్రంప్ వశమైపోయిందని ప్రఖ్యాత సర్వే సంస్థ ఎడిసన్ రీసెర్చ్ బుధవారం ప్రకటించింది. అయితే, ఈ గెలుపుపై ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది..
కమల భర్త ఎమోషనల్ పోస్ట్ -50ఏళ్ల వయసులో పెళ్లి -బ్రాహ్మణ-యూదు కాంబో -అభాండాలు

ఇదీ తాజా పరిస్థితి..
మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్న అమెరికాలో అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 270కాగా, రిపబ్లికన్ అభ్యర్థి జోబైడెన్ ఇప్పటికే 290 ఓట్లు సాధించి అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు. ఇంకా 12 రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నది. తుది ఫలితాల వెల్లడికి మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశముంది. కాగా, బైడెన్ గెలుపును అంగీకరించకుండా, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోన్న ట్రంప్.. తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు..
బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..

పేర్లు, వివరాలతో అక్రమాల చిట్టా
ఎన్నికలు పూర్తయి పది రోజులు కావొస్తున్నా ఇప్పటికీ కౌంటింగ్ కొనసాగిస్తూ ఆయా రాష్ట్రాల్లో డెమోక్రాట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లోని అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారు చేస్తోన్న మోసాలు ఇవీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తనకు వ్యతిరేకంగా, డెమోక్రాట్ల అక్రమాలకు కొమ్ముకాస్తోందంటూ మీడియాపైనా ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే ఆయన ప్రతి పోస్టు కింద టిక్ మార్కులు పెడుతూ ‘ఇది తప్పుడు సమాచారం'అని సోషల్ మీడియా సంస్థలు ప్రజల్ని అలెర్ట్ చేస్తున్నాయి. మరోవైపు..

కీలక వ్యక్తులపై వేటు..
వైట్ హౌజ్ లో చివరి రోజులు గడుపుతోన్న ప్రెసిడెంట్ ట్రంప్ తన సహాయకుల్లో కీలక వ్యక్తులపై వేటు వేసి తనదైన సంచలనాలు కొనసాగిస్తున్నారు. డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ను పదవి నుంచి తప్పించిన ట్రంప్.. తన లాయలిస్టులు ముగ్గురికి కొత్తగా లీగల్ టీమ్ లో చోటు కల్పించారు. ఈ టీమ్.. రిపబ్లికన్ పార్టీ న్యాయ బృందాలతో కలిసి ఎన్నికల వివాదాలపై కోర్టుల్లో పోరాటం చేయనుంది. ఇదిలా ఉంటే..

నన్నెవరూ అడ్డుకోలేరన్న బైడెన్
ప్రెసిడెంట్ ట్రంప్ తనదైన తెంపరితనాన్ని ప్రదర్శిస్తుండగా, తాజా ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా ఎన్నికైన జోబైడెన్ కూడా ధీటుగా స్పందిస్తున్నారు. ట్రంప్ చర్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘అధ్యక్ష పగ్గాలు చేపట్టకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరు''అని స్పష్టం చేశారు. అమెరికాలో తాజాగా నిర్వహించిన సర్వేల్లో రిపబ్లికన్లు సహా 80 శాతం మంది బైడెన్ గెలుపును సమర్థించారు. అంతేకాదు, బైడెన్, కమలకు కంగ్రాట్స్ చెబుతోన్న ప్రపంచ దేశాధినేతల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది.