వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు.

టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలువ... అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌ను సంపదను అధిగమించి 185 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 13,70,000 కోట్లకు చేరుకుంది.

గురువారం టెస్లా షేర్ల ధరలు పైకి ఎగబాకడంతో ఎలాన్ మస్క్ అగ్రస్థానానికి చేరుకున్నారు.

2017 నుంచీ ఇప్పటివరకూ ఈ స్థానంలో జెఫ్ బెజోస్ కొనసాగారు.

జెఫ్ బెజోస్

మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విలువ ఈ ఏడాది అమాంతం పెరగడంతో, బుధవారం దాని మార్కెట్ ధర తొలిసారిగా 700 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 51,80,000 కోట్లు) చేరింది. దాంతో టెస్లా కార్ కంపెనీ విలువ టొయోటా, ఫోక్స్‌వేగన్, హ్యుండాయ్, జీఎం-ఫోర్డ్‌ల కన్నా పెరిగింది.

ఈ వార్తకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ "ఎంత విచిత్రం!" అని ట్వీట్ చేసారు. వెనువెంటనే "సరే, మళ్లీ పనిలో పడదాం" అంటూ మరో ట్వీట్ చేసారు.

మస్క్ ట్వీట్‌లో పైన పిన్ చేసిన ఒక పాత ట్వీట్ ద్వారా వ్యక్తిగత సంపదపై ఆయన అభిప్రాయం మనకు మరింత బోధపడుతుంది.

"నా ఆస్తిలో సగం భూమి మీద ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడాలని నా ఉద్దేశం. భూమికి ఏదైనా ప్రమాదం జరిగి...పెద్ద ఉల్క పడి డైనోసార్లు అంతరించిపోయినట్లు భూమి మీద మనుగడ అంతరించిపోతే లేదా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చి అంతా నాశనమైపోతే, అంగారక గ్రహం (మార్స్) మీద జీవితం కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి మిగతా సగం ఆస్తి సహాయపడాలని అభిలాష" అని ఆ ట్వీట్‌లో రాసారు.

టెస్లా మోడల్ ఎక్స్ 90డీ

ఎలాన్ మస్క్ వ్యాపార విజయానికి ఆరు రహస్యాలు

స్పేస్ఎక్స్ అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థ, టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీలను సమర్థంగా నడుపుతూ ఎలాన్ మస్క్ వ్యాపార రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంతకీ ఆయన విజయ రహస్యాలేంటి?

గతంలో ఎలాన్ మస్క్‌తో బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలట్ జరిపిన సంభాషణ వివరాలు మీకోసం...

1. ఇది డబ్బు గురించి కాదు

"ఎక్కడో ఒకచోట డబ్బు కుప్ప ఉందని కాదు. టెస్లా, స్పేస్ఎక్స్, సోలార్‌సిటీలో నాకు కొన్ని ఓట్లు ఉన్నాయి. మార్కెట్లో వాటికి విలువ ఉంది" అని మస్క్ అన్నారు.

డబ్బు సంపాదించడంపై తనకేం వ్యతిరేకత లేదని అంటూ, "అది నైతిక విలువలతో, నిజాయితీగా జరగాలి. అయితే నన్ను ముందుకు నడిపించేది డబ్బు సంపాదన కాదు" అని మస్క్ చెప్పారు.

ఎలాన్ మస్క్ ఫిలాసఫీ ఆయనకు లాభాలనే తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. టెస్లా కార్ కంపెనీ షేర్లు గత కొన్ని ఏళ్లుగా ఫోర్డ్, బీఎండబ్ల్యూ, ఫియట్‌లాంటి కంపెనీలన్నిటిన్నీ మెడ్డించి ముందుకు దూసుకుపోతున్నాయి.

ఈ ఏడాదికి 50 ఏళ్లు నిండిన మస్క్ చివరివరకూ ధనవంతుడిగానే మిగిలిపోతానని అనుకోవట్లేదన్నారు. తన ఆస్తిలో చాలావరకూ మార్స్‌పై స్థావరాలను నిర్మించడానికే ఖర్చు చేస్తానని, అందులో భాగంగా తన ఆస్తి అంతా హరించుకుపోయే అవకాశాలున్నాయని మస్క్ అన్నారు.

పెద్ద పెద్ద కలలు కనడానికి భయపడొద్దని ఎలాన్ మస్క్ అంటున్నారు

2. కలలను సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలి

"భవిష్యత్తు బాగుండాలనే కదా అందరూ కోరుకుంటారు. కొత్త కొత్త పరిశోధనలు చేసి..భవిష్యత్తు తరం మరింత సౌకర్యవంతంగా జీవితం గడిపేందుకు కృషి చేయాలి" అని మస్క్ అభిప్రాయపడ్డారు.

అమెరికా స్పేస్ ప్రోగ్రాం అనుకున్నంత ఆశావహంగా లేదని, అందుకే స్పేస్ఎక్స్ స్థాపించానని మస్క్ తెలిపారు.

"భూమిని దాటి మరింత ముందుకి వెళ్లాలని ఆశించాను. మార్స్‌లో మనుషులను పెట్టాలని, చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయాలని, కక్ష్యల్లోకి తరచూ వెళ్లడానికి విమానాలు సిద్ధపరచాలని ఆశిస్తూ వచ్చాను" అని మస్క్ చెప్పారు.

కానీ అవేమీ జరగకపోవడంతో ఎలాన్ మస్క్ "మార్స్ ఒయాసిస్ మిషన్" అనే ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా మార్స్‌కు ఒక చిన్న గ్రీన్‌హౌస్ పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలకు అంతరిక్షంపై ఆసక్తిని పెంచాలన్నదే మస్క్ కోరిక. అమెరికా ప్రభుత్వం నాసా బడ్జెట్ పెంచి అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం చేసే దిశగా కృషి చేయాలన్నదే ఆయన అభిలాష.

అయితే, ఈ దిశలో ప్రయత్నాలు చేస్తుండగా, "కోరిక లేకపోవడం కాదు, నిధులు లేకపోవడమే మనం మరింత ముందుకు వెళ్లలేకపోవడానికి కారణమని తెలిసింది. స్పేస్ టెక్నాలజీ చాలా ఖరీదుతో కూడిన వ్యవహారం" అని మస్క్ తెలిపారు.

అయితే, మస్క్ తను అనుకున్నది సాధించే దిశగా కృషి చేస్తూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత చౌక అయిన రాకెట్ లాంచింగ్ బిజినెస్‌కు బీజం పడింది. “ఇది ప్రారంభించడం వెనుక ఉద్దేశం డబ్బు సంపాదించడం కాదు. మార్స్‌పైకి మనుషులను పంపించాలి..అదే ధ్యేయం” అని ఎలాన్ మస్క్ తెలిపారు.

తను ఒక ఇంజినీర్‌గా ఉండడానికే ఇష్టపడతానని, పొద్దున్న లేచి ఎలాంటి సాంకేతిక సమస్యలు పరిష్కరించాలా అని ఆలోచిస్తానే తప్ప, డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించనని మస్క్ తెలిపారు.

స్పేస్ఎక్స్ తయారుచేసిన స్టార్షిప్ రాకెట్ డిసెంబర్‌లో టెస్ట్ లాంచ్ చేసారు

3. పెద్ద పెద్ద కలలు కనడానికి భయపడొద్దు

మస్క్ మాటలు వింటే...ఎంత పెద్ద పెద్ద ఆలోచనలో అనిపిస్తుంది. కార్ల పరిశ్రమలో విప్లవం, మార్స్‌ మీదకు మనుషులను పంపించడం, శూన్య సొరంగాల్లో ప్రయాణించేలా సూపర్-ఫాస్ట్ రైళ్లను తయారుచేయడం, కృత్రిమ మేధను మానవ మేధస్సుకు జోడించడం, సోలార్ పవర్‌ను పెంచడం... అన్నీ పెద్ద పెద్ద కలలే.

ఇవన్నీ వింటే చిన్నపిల్లల పుస్తకాల్లో కనిపించే ఊహా ప్రపంచంలా తోస్తుంది.

పెద్ద పెద్ద కలలు కనడానికి భయపడొద్దు అని మస్క్ అంటున్నారు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో తను చదివిన పుస్తకాలు, సినిమాలే తన ఊహా ప్రపంచానికి ప్రేరణ అని ఎలాన్ మస్క్ వివరించారు.

అయితే, పెద్ద కలలు కంటూనే, ప్రస్తుతం సౌకర్యవంతంగా జీవితం కొనసాగించడానికి ఏమేమి చెయ్యాలో అవి చేస్తూ ఉండాలని మస్క్ సలహా ఇస్తున్నారు.

“పెద్ద పెద్ద ప్రతిష్ఠాత్మక ప్రోజెక్టులు చేపట్టి అవి విఫలమైతే మీ ఉద్యోగమే పోవచ్చు. రోడ్డున పడొచ్చు. అలా కాకుండా కొంచెం కొంచెం ముందుకు వెళుతూ, కలలను సాకారం చేసుకునే దిశగా సాగాలని” ఎలాన్ మస్క్ అంటున్నారు.

ఈ పద్ధతిలో మస్క్ ముందుగా శిలాజ ఇంధనాల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. భూమి అట్టడుగు పోరల్లో, వెలుతురు చొరబడని లోతుల్లో చమురు, గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయేమో పరిశోధిస్తున్నారు.

తరువాత...మార్స్ మీద మనుగడ సాధించాలని, ఇంటర్ ప్లానెట్ జీవితం కొనసాగాలని మస్క్ ఆశిస్తున్నారు. ఆ దిశలో కృషి చేస్తున్నారు.

"పెద్ద పెద్ద కలలు కనండి" అంటున్నారు.

ప్రపంచంలోని చాలా నగరాల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ పాయింట్లు పెరుగుతున్నాయి

4. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి

కలలను సాకారం చేసుకోవాలంటే రిస్క్ తీసుకోక తప్పదు అంటున్నారు మస్క్.

2002 కల్లా ఎలాన్ మస్క్ తన మొదటి రెండు వెంచర్లైన జిప్2, పేపాల్‌లను అమ్మేసారు. తన ఆస్తిలో సగాన్ని వ్యాపార నిమిత్తం ఖర్చు చేస్తూ మిగతా సగాన్ని దాచుకోవాలనుకున్నారు. కానీ అలా జరగలేదు.

మస్క్ ప్రారంభించిన కొత్త కంపెనీలన్నీ మొదట్లో అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. స్పేస్ఎక్స్ మొదటి మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. టెస్లాలో ఉత్పత్తి సమస్యలు వచ్చాయి.

"అప్పుడు ఇంక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను దాచుకోవాలనుకున్న డబ్బు కూడా వీటిల్లో పెట్టి కంపెనీలను బతికించుకోవడం లేదా కంపెనీలను వదిలేసుకోవడం..ఏదో ఒకటి చేయాలి. దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టడానికే సిద్ధపడ్డాను" అని మస్క్ వివరించారు.

మధ్య చైనాలోని జెంగ్‌జో ప్రాంతంలో ఉన్న షాపింగ్ మాల్ ఎదుట ఐరన్ మాన్ విగ్రహం. ఈ పాత్రకు స్ఫూర్తి మస్క్ అని రాబర్ట్ డౌనీ అంటారు

5. విమర్శలను పట్టించుకోకండి

టెస్లా కంపెనీపై విమర్శలు గుప్పిస్తూ, దాని అంతం కోసం ఎదురు చూస్తున్నవాళ్లు అనేకమంది ఉన్నారని మస్క్ చెప్పారు.

అయితే, స్పేస్ఎక్స్‌గానీ, టెస్లాగానీ తనకు బోల్డంత డబ్బు తెచ్చిపెడుతుందని ఆశించలేదని, విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసానని మస్క్ తెలిపారు.

ఎందుకంటే, మస్క్ ఇంతకుముందే చెప్పినట్లు తన పని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం చూపించగలదా అని మాత్రమే ఆలోచిస్తారుగానీ డబ్బు తెచ్చి పెడుతుందా అని ఆలోచించరు.

తను తెలివితక్కువ వాడిగా కనిపించినా, అనాలోచితమైన పనులు చేస్తాడని అనుకున్నా తనకేమీ ఫరవాలేదని... తన లక్ష్యాన్ని సాధించడమే తనకు ముఖ్యమని మస్క్ చెప్పారు.

విమర్శలను పట్టించుకోకుండా ఉంటే మన లక్ష్యంపై దృష్టి పెట్టగలుగుతామని ఎలాన్ మస్క్ అంటున్నారు.

ఈ విధానమే మస్క్‌ను గగనతలంలో నిలబెట్టింది. మార్కెట్లో స్పేస్ఎక్స్ విలువ 100 బిలియన్ డాలర్లు (7 లక్షల కోట్ల పైనే) ఉంటుందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది.

కిందటి ఏడాది ఎలాన్ మస్క్ కంపెనీ క్రూ డ్రాగన్ రాకెట్స్ ఆరుగురు వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపించింది.

షాంఘైలో 2019లో నిర్మించిన టెస్లా ఫ్యాక్టరీ

6. పనిని ఆస్వాదించండి

మస్క్ సలహాలు పాటిస్తే ధనవంతులు కావడమే కాకుండా కీర్తి ప్రతిష్ఠలు కూడా మూటగట్టుకోవచ్చు అనిపిస్తోంది.

ఎలాన్ మస్క్ పని రాక్షసుడని అంటారు. టెస్లా మోడల్ 3 కోసం వారానికి 120 గంటలు పని చేసానని మస్క్ తెలిపారు. ఏది చేసినా ఆస్వాదిస్తూ చేయాలని మస్క్ అంటున్నారు.

అయితే, మస్క్‌పై కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. పరువు నష్టం దావాలు, డోప్ స్మోకింగ్, సోషల్ మీడియాలో ప్రదర్శించే ప్రకోపాలు వివాదాస్పదమయ్యాయి.

ఇటీవలే కరోనా లాక్‌డౌన్ సందర్భంగా టెస్లా మూసివేయాల్సి వచ్చినప్పుడు లాక్‌డౌన్ ఆంక్షలకు వ్యతిరేకంగా మస్క్ స్పందించడం వివాదాస్పదమైంది. కోవిడ్ వైరస్‌కు భయపడడం బుద్ధిహీనమని, లాక్‌డౌన్ నిబంధనలు బలవంతపు జైలుశిక్షల్లాంటివని, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకమని ట్వీట్ చేసారు.

ఈ వేసవిలో తన భౌతిక ఆస్తులను అమ్మేసి బరువు తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. తరువాత తన కొత్త కంపెనీ పేరు 'ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్’ అని ప్రకటించారు.

వచ్చే మూడేళ్లల్లో టెస్లా 25,000 డాలర్ల కారును (సుమారు 18 లక్షలు) ఉత్పత్తి చేయబోతోందని సెప్టెంబర్‌లో మస్క్ ప్రకటించారు. త్వరలో తన కంపెనీనుంచీ సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు ఉత్పత్తి అవుతాయని కూడా ప్రకటించారు.

మార్స్‌పైకి మనుషులను తీసుకు వెళ్లే ఉద్దేశంతో స్పేస్ఎక్స్ తయారుచేసిన స్టార్షిప్ రాకెట్ డిసెంబర్‌లో టెస్ట్ లాంచ్ చేసిన ఐదు నిముషాలలో పేలిపోయి నేలకూలింది.

అయితే, ఈ టెస్ట్ ఒక "అద్భుతమైన విజయం" అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Elon Musk the richest person speaks about six formulas for his success
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X