ప్రపంచదేశాలకు పొంచి ఉన్న ముప్పు-విద్యుత్ కోతలు, చమురు ధరలకు రెక్కలు-షాకింగ్ కారణాలు
ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల ప్రభావం తగ్గించడానికి, తద్వారా వాతావరణ మార్పులు లేకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు వివిధ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే వీటి ప్రభావంతో ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న చైనా విద్యుత్ కోతలతో సతమతం అవుతుండగా.. బ్రిటన్ సహా యూరప్ దేశాలన్నీ చమురు ధరల మంటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా తర్వాత సంప్రదాయ శిలాజ ఇంధనాలపై తగ్గిన పెట్టుబడులు కూడా ఇందుకు మరో కారణంగా కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా శక్తి సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ఇప్పుడు వాతావరణ మార్పులపై దృష్టిపెడుతున్నాయి. వీటిని సాధ్యమైనంతగా తగ్గించేందుకు సంప్రదాయ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించేస్తున్నాయి. అదే సమయంలో పునరుత్పాదక వనరులపై దృష్టిపెడుతున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు అవి అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడం, మరికొన్నాళ్లు సంప్రదాయ వనరులనే వాడుకోవాల్సిన పరిస్ధితులు నెలకొనడంతో ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో శక్తి సంక్షోభం తలెత్తుతోంది.

చైనాలో విద్యుత్ కోతలు
ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న చైనా.. ప్రస్తుతం విద్యుత్ కోతలతో సతమతం అవుతోంది. ముఖ్యంగా ఉత్తర చైనాలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలు తలెత్తుతున్నాయి. దీంతో మిలియన్ల మందిపై ఈ ప్రభావం పడుతోంది. విద్యుత్ కోతలతో ఉత్తర చైనాలో చాలా ఫ్యాక్టరీలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఆస్పత్రుల పాలయ్యారు. అక్కడా వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో వీరంతా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

బ్రిటన్ లో చమురు ధరలకు రెక్కలు
ఈ వారం బ్రిటన్ లోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ స్టేషన్లలో "క్షమించండి, ఉపయోగం లేదు" అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా చమురు స్టేషన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఈ బంకులు మూతపడినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా భారీ ఎత్తున డ్రైవర్ల కొరత ఏర్పడటంతో చమురు ట్యాంకర్లు భారీ ఎత్తున పెట్రోల్ స్టేషన్లకు ఇంధనాన్ని తరలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
అలాగే బ్రెగ్జిట్ ప్రభావంతో యూరప్ దేశాల డ్రైవర్లు బ్రిటన్ లోకి వచ్చేందుకు అనుమతి లేకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. విమర్శల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్... తాజాగా 10 వేల మంది విదేశీ డ్రైవర్లను తమ దేశంలోకి వచ్చేందుకు వీసాలు ఇచ్చారు.

సంప్రదాయ ఇంధన వనరులపై తగ్గుతున్న పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా వాతావారణ మార్పుల నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై పలు దేశాలు దృష్టిపెడుతున్నాయి. దీంతో సహంజంగానే ప్రభుత్వాల కోరిక మేరకు పెట్టుబడిదారులు కూడా వీటిపైనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సంప్రదాయ ఇంధన వనరులైన చమురు, గ్యాస్ వంటి వాటిపై పెట్టుబడుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వీటి డిమాండ్ ను తట్టుకోలేక రేట్లు పెంచాల్సిన పరిస్దితులు తలెత్తుతున్నాయి. భారత్ లోనూ తగినన్ని పెట్రోలియం వనరులు అందుబాటులో లేక భారీ రేట్లు పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది.

పెను సంక్షోభం అంచున ప్రపంచ దేశాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులు ప్రపంచ దేశాల్ని పట్టి కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాలకు ఓవైపు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ పలు దేశాలు పునరుత్పాక శక్తి వనరులపై దృష్టిపెడుతున్నా.యి.పెట్టుబడుల ప్రవాహం కూడా అటే ఉంది. దీంతో సంప్రదాయ ఇంధన వనరుల లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. అయినా ప్రపంచ దేశాలు మాత్రం వాస్తవాల్ని పక్కనబెట్టి గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టే క్రమంలో పునరుత్పాదక వనరులపై పూర్తిగా ఆధారపడే పరిస్ధితికి చేరుకుంటున్నాయి.
దీంతో రాబోయే రోజుల్లో ఇవి పూర్తిగా అందుబాటులోకి రాకముందే సంప్రదాయ ఇంధన వనరుల లభ్యత తగ్గిపోతే భారీ ఎత్తున రేట్లు పెరగడంతో పాటు విద్యుత్, చమురు సంక్షోభాలు తప్పవన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి.