వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గర్భిణుల మద్యపానం

సుభద్ర ఈ తరం అత్తగారు. కొడుకు, కోడలికీ ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుందని నమ్ముతుంది. ఆ ప్రపంచంలోనికి అడుగుపెట్టకూడదనీ, వారి ఆనందాలకు తాను అడ్డు కాకూడదని కొడుకు పెళ్లి కాక మునుపే నిర్ణయించుకుంది.

నెల క్రితం కోడలు తాను తల్లిని కాబోతున్నానని చెప్పింది. అప్పటినుండి సుభద్రకెన్నో ఊహలు.

'వచ్చే ఏడాదికి చిన్ని గజ్జెలతో బిడ్డ తమ ఇంట్లో తిరుగుతుంది. తన ఒళ్లో వుంటుంది. పాపైనా , బాబైనా బంగారు మొలతాడు చేయిస్తాను.' అనుకుంది.

చేత వెన్న ముద్ద పద్యం కూడా పాడుకుంది.

ఆరోజు ఆదివారం. సెలవు రోజు కొడుకు కోడలు ఏ మధ్యాహ్నమో లేస్తారు. బ్రంచ్ పేరుతో, పొద్దున చేసిన పూరీలు, లంచ్ కు చేసిన అన్నం కూరలూ తింటారు.

'ఇదివరకులా కాదు కదా. కడుపుతో ఉన్న అమ్మాయి , లేచి ఏదైనా తింటేనే కదా, బిడ్డ సరిగా పెరిగేది' అనుకుని, మెట్లెక్కి పైకి వెళ్లింది సుభద్ర.

"ప్రవీ, లేమ్మా! పన్నెండవుతోంది. ఏదో ఒకటి తినొద్దూ " అత్తగారు భుజం తట్టిలేపుతుంటే గాఢ నిద్రలో వున్న ప్రవీణ బద్ధకంగా లేచి కూర్చుంది.

"త్వరగా కిందకు రండి." అని చెప్పి వెళ్తుంటే, మంచం పక్కనే పడి వున్న సీసాలు కనిపించాయి సుభద్రకు.

తెలియని భయంతో ఆమె కాళ్లు వణికాయి. అంతకు ముందు వాటిని చూడకపోయినా అవి మద్యం సీసాలన్న విషయం అర్థమై కంగారు పడింది. వాళ్ల గదుల్లో తరచూ ఆ సీసాలు కనిపిస్తుంటే, ఓ రోజు ఇద్దరినీ నిలదీసింది.

ప్రెగ్నంట్‌గా ఉన్న స్త్రీ ఆల్కహాల్ తీసుకుంటే మంచిది కాదని కోడలికి గట్టిగానే చెప్పింది.

గర్భిణి

కొంతకాలంగా, అత్తగారు తన పరిధి దాటుతున్నారని భావించిన ప్రవీణకు కోపం ముంచుకొచ్చింది.

"చూడండి. నా స్పేస్‌లోకి ఎవరు వచ్చినా నాకిష్టముండదు. చివరికి రామ్ అయినా సరే."

"అదేంటి, పుట్టబోయే బిడ్డకు మేమేమీ కామా? మాకే సంబంధమూ లేదా? నువ్వు మాట్టాడవేరా?" కొడుకుని నిలదీసింది సుభద్ర.

"ఊరుకోమ్మా, నేను తనతో మాట్లాడతాగా!" తల్లికి నచ్చజెప్పబోయాడు రామ్.

"రామ్, నా లైఫ్, నా ఇష్టం. అయినా, వీకెండ్‌కు ఒక్క డ్రింక్. అది కూడా సేఫ్ బ్రాండ్. ఎందుకిలా రభస చేస్తున్నారు."

"కొద్ది మోతాదులో తీసుకున్నా, బిడ్డ మీద చెడు ప్రభావముంటుందట. కంప్యూటర్లో చదివాను" చెప్పింది సుభద్ర.

"ఓహో, గూగుల్ చేశారా? మీకు కంప్యూటరిచ్చింది ఫేస్ బుక్కులో పేరంటాలు పెట్టుకుంటారని. నా లైఫ్ స్టైల్ మీద నిఘా పెట్టడానికి కాదు. "

ఆల్కహాల్ తీసుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది

గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశ మహిళలలో ఆల్కహాల్ వినియోగం గణనీయంగా పెరిగింది.

2010 నుండి 2017 వరకు జరిపిన సర్వే తాలూకు వివరాల ప్రకారం, ఆల్కహాల్ తీసుకునే మహిళల శాతం 38% వరకూ పెరిగింది.

రాబోయే అయిదు సంవత్సరాలలో మరొక 25% పెరుగుతుందని అంచనా.

సర్వే లో తేలిన ప్రధాన అంశమేమిటంటే, "ఎక్కువ మంది మహిళలు మద్యం తీసుకుంటున్నారు"

గర్భిణి మద్యం తాగితే కడుపులోని బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఆల్కహాల్ ప్రమాదకరమైనది. మహిళ మద్యం తాగిన వెంటనే, గర్భం లో బిడ్డ రక్తం లోనికి ఆల్కహాల్ చేరుతుంది.

1. సురక్షితమైన బ్రాండ్ ఆల్కహాల్ అంటూ ఏమీ వుండదు.

2. ఎప్పుడో ఒక డ్రింక్! ఈ కొంచం తీసుకున్నంతలో బిడ్డకు వచ్చే ప్రమాదమేమీ లేదు అనుకోవడం అపాయకరం.

3. గర్భంతో ఉండగా, తల్లి ఆల్కహాల్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు శారీరిక లోపాలు, బుద్ధిమాంద్యం తో బాటు విపరీతమైన ప్రవర్తన కలిగే అవకాశాలున్నాయి.

4. ఎంత ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే, బిడ్డకు అంత ఎక్కువ హాని కలుగుతుంది.

మద్యం తక్కువ మోతాదులో తీసుకున్నా సరే, ఆ ప్రభావం, గర్భంలో పెరిగే పిండం పైన ఉంటుంది.

అలాంటివారిలో అబార్షన్ అయే అవకాశాలు ఎక్కువ.

నెలలు నిండక ముందే కాన్పు అయే ప్రమాదముంది.

ఆల్కహాల్ తీసుకునే మహిళలకు పుట్టే బిడ్డలు బరువు తక్కువగా ఉంటారు.

మద్యపానం

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్

గర్భంతో ఉన్నవారు ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే, దాని పర్యవసానంగా 'ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోం' అనే ఒక తీవ్రమైన పరిస్థితి ఎదురవుతుంది.

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోం లక్షణాలు

1. శిశువు తల సాధారణ పరిమాణం కన్నా చిన్నగా ఉంటుంది.

2. పెరుగుదల సరిగా ఉండదు. ఆరోగ్యవంతమైన బిడ్డలతో పోలిస్తే చిన్నగా వుంటారు. పెరిగాక తోటి వారితో పోలిస్తే వయసు మీరినట్లు కనిపిస్తారు. పొట్టిగా ఉంటారు.

3. వీరి ముఖంలో స్పష్టమైన తేడాలుంటాయి. కళ్లు చిన్నగా ఉంటాయి. పై పెదవి సన్నగా ఉంటుంది . ముక్కు కింద, పై పెదవి మధ్యలో చర్మం చాలా నునుపుగా ఉంటుంది. సాధారణం ఉండవలసిన గాడి కనిపించదు.

శరీరపు కదలికలోనూ, బాలన్స్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు..

4. లివర్, కిడ్నీలు, గుండె, కాలేయం, మూత్ర పిండాలలో కూడా సమస్యలు వస్తాయి.

5. పుట్టిన బిడ్డలకు చూపు , వినికిడి సామర్థ్యం తక్కువగా వుంటుంది.

6. ఆల్కహాల్ ప్రభావం బిడ్డల శరీరం పైనే కాదు , మెదడు మీద కూడా వుంటుంది. వీరి ఐక్యూ తక్కువగా వుంటుంది. చదువు , కొత్త విషయాలు నేర్చుకోవడంలో చురుకుదనముండదు. ఆలోచనా శక్తి తక్కువగా వుంటుంది. సమయపాలన, గణితం, మరియు జ్ఞాపక శక్తిలో వెనుకబడి వుంటారు.

ఏ విషయం పట్లా శ్రద్ధ వుండదు. ఏకాగ్రత లోపిస్తుంది.

ప్రవర్తన సైతం సమస్యాత్మకంగా ఉంటుంది. అదుపు చేయలేని తీవ్రమైన ప్రవర్తన, త్వరగా స్పందించే గుణం కలిగి వుంటారు. ఎవరితోనూ కలవ లేరు.

ఈ వ్యాధికి చికిత్స ఏమిటి?

ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు. ఆల్కహాల్ ప్రభావం వల్ల గర్భంలో ఉన్న బిడ్డ శరీరావయవాలకు, మెదడుకు జరిగే హాని శాశ్వతమైనది. చికిత్సతో మామూలు స్థితికి తేవడం సాధ్యం కానే కాదు.

ఆ నష్టం ఎంత మేరకు జరిగిందో, వైద్య నిపుణుల సహాయంతో అంచనా వేసి, వారి తెలివి తేటలను, ప్రవర్తనలోని లోపాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శిక్షణనివ్వవలసి ఉంటుంది.

మద్యం తాగుతున్న మహిళ

బిడ్డ పుట్టాక ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితమేనా?

ఏమాత్రం కాదు. వేర్వేరు సర్వేల ఆధారంగా తేలినదేమిటంటే.. బిడ్డ పుట్టాక కొందరు మహిళలు మద్యం ఎక్కువగా తాగుతారు. గర్భం చివరి నెలలలో ఆల్కహాల్ తీసుకోవడం 6.2% ఉంటే, బిడ్డ కలిగాక అది 31% పెరిగిందని కొన్ని సర్వేలు తేల్చాయి.

తల్లి తీసుకునే ఆహారపానీయాల ప్రభావం తల్లి పాలలో కనిపిస్తుంది. తల్లి ఆల్కహాల్ తీసుకుంటే, అది తల్లి పాలలో చేరుతుంది.

ఆల్కహాల్ తీసుకున్న 30- 90 నిముషాలకు తల్లిపాలలో గరిష్ఠ సాంద్రతలో వుంటుంది. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత 2 - 3 గంటలవరకూ పాలలో ఆ ప్రభావముంటుంది.

ఆల్కహాల్ ప్రభావం వల్ల శిశువు అవసరాలను తెలుసుకునే సామర్థ్యం తగ్గుతుంది. వారి సంరక్షణలో అవసరమైన చురుకుదనం లోపిస్తుంది.

ఆల్కహాల్ తీసుకున్నపుడు తల్లీ, బిడ్డా ఒకే బెడ్ మీద నిద్రించడం మంచిది కాదు. నిద్రలో బిడ్డ మీద, తల్లి ఒరిగిపడే అవకాశముంది .

పాలిచ్చే తల్లి సోషల్ డ్రింక్ తీసుకోవలసిన పరిస్థితి ఎదురైతే ఎలా?

వీలైతే, ముందే తల్లిపాలను బ్రెస్ట్ పంప్ ద్వారా తీసి భద్రపరచుకోవాలి. బిడ్డకు పాలిచ్చిన తర్వాతే డ్రింక్ తీసుకోవాలి.

మద్యం తీసుకున్న 2-3 గంటల వరకూ బిడ్డకు పాలివ్వకపోవడం మంచిది. పాలిచ్చే సమయంలో , తల్లి ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా, బిడ్డకు శారీరిక పెరుగుదల సరిగా జరగదు. మనోవికాసం లోపిస్తుంది. తల్లులు పిల్లలను తరచూ దండించడం, పిల్లల పట్ల హింస కూడా ఎక్కువగా నమోదయింది. పాలిచ్చే తల్లులు ఆల్కహాల్ తీసుకునే అలవాటు మానేయడమే సరైన నిర్ణయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Fetal alcohol syndrome: How dangerous is the risk to the unborn child if pregnant women drink alcohol
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X