అమెరికా ఎన్నికల తుది ఫలితాలివే- బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు-యూఎస్ మీడియా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతున్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ తుది ఫలితాలపై క్లారిటీ కూడా వచ్చేస్తోంది. ఓట్ల లెక్కింపు సాగుతున్న చివరి రెండు రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలినాలో ఇరువురు అధ్యక్ష అభ్యర్ధులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ విజయాలు ఖాయమని తుది అంచనాలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా చూస్తే ఇప్పటికే మెజారిటీ సాధించిన జో బైడెన్‌కు ఎలక్టోరల్ కాలేజ్‌లో మొత్తం 306, ఆయన ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌కు 232 ఓట్లు లభించబోతున్నట్లు సీబీఎస్ న్యూస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే వెలువడినవన్నీ అంచనాలే కాగా.. వీటిని తుది అంచనాలుగా భావించవచ్చు. వీటిని ఆయా రాష్ట్రాల చట్ట సభలు నిర్ధారించి ఎలక్టోరల్ కాలేజ్‌కు పంపాల్సి ఉంటుంది.

అమెరికా ఫలితాలు తేటతెల్లం...
నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసి అప్పుడే 11 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మెజారిటీ దృష్ట్యా చూస్తే కాబోయే అధ్యక్షుడు జో బైడెనే అనే విశ్లేషణలు వినిపిస్తున్నా ఎక్కడో ఓ మూల ట్రంప్‌కూ అవకాశాలూ లేకపోలేదనే అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. దీనికి కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతే. అయితే స్ధూలంగా చూస్తే ఇప్పటికే మెజారిటీ సాధించిన జో బైడెన్‌కు మద్దతుగా వెలువడుతున్న తుది అంచనాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. దీంతో నిన్న మొన్నటి దాకా ఫలితాలపై చిర్రుబుర్రులాడిన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కూడా మెత్తబడుతున్నట్లు కనిపిస్తోంది. సీబీఎస్ న్యూస్ తాజాగా వెలువరించిన తుది అంచనాలను గమనిస్తే ఇవే తుది ఫలితాలుగా చెప్పవచ్చు.

బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232.. ఇదే ఫైనల్..
సీబీఎస్ న్యూస్ తాజా అంచనాల ప్రకారం ప్రస్తుతం ఇంకా పెండింగ్‌లో ఉన్న రెండు రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలినాలో తుది అంచనాలు వచ్చేశాయి. వీటి ప్రకారం జార్జియాలో బైడెన్‌కు, నార్త్ కరోలినాలో ట్రంప్‌కు మెజారిటీ దక్కబోతోంది. వీటితో కలుపుకుంటే ఎలక్టోరల్ కాలేజీలో కాబోయే అధ్యక్షుడు బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు లభించనున్నాయి. అంటే ఎలక్టోరల్ కాలేజ్‌లో బైడెన్ స్పష్టమైన ఆధిక్యం అందుకున్నట్లే. అయితే చివరిగా రాష్ట్రాల చట్టసభలు ఈ ఫలితాలను ధృవీకరించి ఎలక్టోరల్ కాలేజ్‌కు పంపాల్సి ఉంటుంది. అది జరిగిపోతే డిసెంబర్ 14న ఎలక్టోరల్ కాలేజ్ సమావేశమై తుది ఫలితాలను వెల్లడించబోతోంది. దీని ఆధారంగా జనవరి 6న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు.

స్వింగ్ రాష్ట్రాల ధృవీకరణపై అందరి దృష్టి...
కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా, మిచిగాన్, అరిజోనా చట్టసభల్లో రిపబ్లికన్ల ఆధిక్యం ఉంది. వీటి సాయంతో అక్కడ ఎన్నికల విజేతలను ధృవీకరించకుండా అడ్డుకుంటే బైడెన్‌పై పైచేయి సాధించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా సాధించిన ఓట్ల ప్రకారం చూస్తే ఎలక్టోరల్ కాలేజ్‌లో ఇప్పటికే బైడెన్ 306 ఓట్లు సాధించడం, తాను 232కే పరిమితం కావడంతో ట్రంప్ ప్రజాభిప్రాయాన్ని పక్కనబెట్టి ముందుకెళ్లే అవకాశాలు లేకపోవచ్చని తెలుస్తోంది. అయితే చివరి నిమిషం వరకూ ఏదైనా జరగొచ్చని భావిస్తున్న నేపథ్యంలో స్వింగ్ రాష్ట్రాలు ప్రకటించే విజేతల ధృవీకరణే ఇప్పుడు కీలకంగా మారింది.

ట్రంప్ రెండో టర్మ్‌కు ప్లాన్ చేస్తున్న వైట్‌హౌస్..
మిగిలిన రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు పూర్తయి తుది అంచనాలు కూడా వెలువడుతున్నా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో నడుస్తున్న వైట్‌హౌస్ మాత్రం ఇంకా ఆయన రెండోసారి అధికారం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండో టర్మ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయనకు వాణిజ్య సలహాదారుగా ఉన్న పీటర్ నవరో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం విశేషం. దీంతో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు ట్రంప్ తెరవెనుక ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికీ తాను చేస్తున్న ఎన్నికల అక్రమాల ఆరోపణలకు సంబంధించి ట్రంప్ ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయారు.