ఎట్టకేలకు కీవ్ ను వీడిన రష్యా-వ్యూహాత్మక వెనకడుగే ? అదను చూసి-అమెరికా అనుమానం !
ఉక్రెయిన్ లో రష్యా పోరు క్రమంగా కొలిక్కి వస్తోంది. ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టి నెలన్నర కావస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ దేశంతో చర్చలు ప్రారంభించిన రష్యా.. ఇప్పుడు క్రమంగా వెనక్కి తగ్గుతోంది. చర్చల్లో పురోగతి మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ చుట్టూ మోహరించిన రష్యా బలగాలు కూడా వెనక్కి తగ్గాయి. దీంతో దాదాపు నెలన్నర తర్వాత కీవ్ ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ఇదంతా తాత్కాలికం కావచ్చని యూఎస్ అంచనా వేస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ పోరు కొలిక్కి
ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన దండయాత్ర క్రమంగా కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ పై దాడి మొదలుపెట్టినప్పుడు ఉన్న పరిస్ధితులతో పోలిస్తే ఆ తర్వాత వేగంగా మారిన పరిణామాలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓవైపు ఆంక్షలు, మరోవైపు అంతర్జాతీయంగా ఏకాకి అవుతుండటంతో రష్యా చర్చలకు మొగ్గు చూపింది. ఒక్కసారిగా ఉక్రెయిన్ నుంచి వెనక్కి తప్పుకుంటే పరువంతా పోయే ప్రమాదం ఉండటంతో చర్చల పేరుతో క్రమంగా ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటోంది. అంతా అనుకున్నట్లు జరిగితే రష్యా-ఉక్రెయిన్ పోరు కొలిక్కి రావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఎట్టకేలకు కీవ్ నుంచి వెనక్కి
ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత రాజధాని కీవ్ ను టార్గెట్ చేసుకుని కిలోమీటర్ల మేర భారీ కాన్వాయ్ తో బయలుదేరిన రష్యా బలగాలకు దాన్ని ఆక్రమించడం అంత సులువు కాదని తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. గెరిల్లా మార్గాల్లో ఉక్రెయిన్ ప్రతిఘటనతో బిత్తరపోయిన రష్యా బలగాలు కీవ్ లో అడుగుపెట్టలేకపోయాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్ లోకి ప్రవేశించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో కీవ్ బయటి నుంచే రష్యా బలగాలు వెనక్కి తగ్గాయి. ఈ విషయాన్ని యూఎస్ ఉన్నతాధికారి ఒకరు తాజాగా నిర్ధారించారు.


వెనకడుగు తాత్కాలికమేనా ?
కీవ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకోవడం పూర్తయిందని యూఎస్ రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి నిర్ధారించారు. అయితే ఉక్రెయిన్లో తిరిగి మోహరించే అంచనా కోసం దాని దళాలను తిరిగి మోహరించడం, తిరిగి సరఫరా చేసే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. రష్యన్లందరూ వెళ్ళిపోయారని తాము అంచనా వేస్తున్నామని, అయితే రష్యా భూ బలగాలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పటికీ, కైవ్ ముప్పులోనే ఉందని సదరు అధికారి తెలిపారు. కీవ్ భూ దండయాత్ర ముప్పు ప్రస్తుతానికి స్పష్టంగా లేదని, కానీ వారి సుదూర లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా తెలియలేదని యూఎస్ రక్షణశాఖ అధికారి వెల్లడించారు.