వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లిపాలకు, ఫార్ములా పాలను మించిన ప్రత్యామ్నాయం తయారవుతోందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తల్లిపాలు తాగుతున్న శిశువు

చన్నుల అవసరం లేకుండా చనుబాలు తయారు చేసే దిశగా రెండు స్టార్టప్‌ కంపెనీలు కృషి చేస్తున్నాయి. ఫార్ములా పాలకన్నా అధిక పోషకల విలువలు కలిగిన సుస్థిర ప్రత్యామ్నాయాలను తల్లులకు అందించడమే లక్ష్యంగా ఈ రెండు కంపెనీలూ పనిచేస్తున్నాయి.

అయితే, ఇదేలా సాధ్యం?

బిడ్డలకు తల్లిపాలకన్నా బలవర్ధకమైనవి ఏవీ లేవనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరు తల్లులూ పిల్లలకు పాలివ్వగలిగే స్థితిలో ఉండకపోవచ్చు. మరి, అలాంటివారి పరిస్థితి ఏంటి?

శిశువులకు, తల్లిపాలే బలవర్థకమని, రోగనిరోధకశక్తిని పెంచేందుకు తోడ్పడతాయని, ఊబకాయం వచ్చే ప్రమాదాలను తగ్గించడమే కాకుండా, పిల్లల్లో గ్రహణశక్తి, ఐక్యూ పెంచుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది.

అయితే, పాలివ్వలేని తల్లులకు లేదా ఇవ్వడానికి ఇష్టపడని తల్లులకు ఫార్ములా పాలొక్కటే ప్రత్యామ్నాయం.

టర్టల్‌ట్రీ ల్యాబ్స్, బయోమిల్క్...ఈ రెండు సంస్థలూ ఫార్ములా పాలకు ప్రత్యమాయాన్ని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా చన్నులనుంచి కాకుండా ప్రయోగశాలల్లో చనుబాలను తయారుచేసే దిశలో ప్రయోగాలు చేస్తున్నాయి.

దీపా కులకర్ణి

'అసలు పాలే పడలేదు'

తన ఇద్దరు బిడ్డలకు పాలివ్వడానికి ఎన్ని అవస్థలు పడ్డారో దీపా కులకర్ణి గుర్తు చేసుకున్నారు.

'మొదట బాబు పుట్టినప్పుడు ముర్రు పాలు (కొలస్ట్రం) కొంచం వచ్చాయి. అవి తాగాడు. తరువాత ఇంక పాలు రాలేదు. రెండో బిడ్డ పుట్టినప్పుడు అసలు పాలే రాలేదు' అని దీప తెలిపారు.

కొలస్ట్రం అంటే బిడ్డ పుట్టిన మొదటి కొన్ని రోజుల్లో వచ్చే పాలు. ఇవి చిక్కగా, పసుప్పచ్చని రంగులో ఉంటాయి. పశువుల్లో వాటిని జున్ను పాలు అంటాం.

"ఒక నెలపాటూ పాలు పిండడానికి ప్రయత్నించాను. రోజుకు కొన్ని చుక్కలొచ్చేవి. తరువాత అవి కూడా రాలేదు. ఇంక ప్రత్యామ్యాయం వెతుక్కోవడం తప్ప వేరే మార్గం కనబడలేదని" దీప తెలిపారు.

మొదటిసారి తల్లి అయిన దీపలాంటివాళ్లకు బిడ్డ పుట్టిన ఆనందంతో పాటూ అలసట, కంగారు అన్నీ ఉంటాయి. దానికితోటు సాంఘిక ఒత్తిడి. సమాజం అంచనాలు అందుకోవడం కష్టమవుతుంది.

అయితే, వాస్తవాన్ని అంగీకరించి "దీన్లో తప్పేం లేదు, ఇది నీ అపజయం కాదు" అని తెలుసుకుని ముందుకు సాగడం ముఖ్యమని దీప అంటున్నారు.

తల్లి చేతుల్లో నవ్వుతున్న బేబీ

ఒక సరికొత్త విధానం

పసిపిల్లలకు ఇచ్చే ఫార్ములా పాలను ఆవు పాలతో తయారుచేస్తారు. పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే పోషకవిలువలన్నీ అందులో ఉండేలా జాగ్రత్తపడతారు.

అయితే, తల్లిపాలు చేకూర్చే ప్రయోజనాలన్నిటినీ ఫార్ములా పాలు నెరవేర్చలేవు. ఈ వ్యత్యాసాన్ని పూడ్చగలిగితే బావుంటుందన్న ఆలోచనే మాకు ప్రేరణ అని ఈ రెండు కంపెనీలు అంటున్నాయి.

కొంతమంది తల్లులు, పాలు అధికంగా ఉంటే, వాటిని పంప్ చేసి అమ్మపాల బ్యాంకులకు దానం చేస్తారు. అలా దానం చేసిన పాలనుంచీ మూల కణాలు (స్టెమ్ సెల్స్) సేకరించి, వాటిని బయోరియాక్టర్‌లో ఉంచి క్షీర గ్రంధి కణాలుగా వృద్ధి చెందేలా చేస్తారని టర్టల్‌ట్రీ ల్యాబ్స్ వివరించింది.

ఇలా తయారైన క్షీరగ్రంధి కణాలను ఒక ప్రత్యేకమైన ద్రావకంలో ఉంచుతారు. అక్కడ జరిగే రసాయన ప్రక్రియ ద్వారా క్షీర గ్రంధులు పాలను ఉత్పత్తి చెయ్యగలుగుతాయి. వాటిని ఫిల్టర్ చేసి వినియోగానికి సిద్ధం చేస్తారు.

సిద్ధాంతపరంగా ఈ పద్ధతిని ఉపయోగించి ఏ క్షీరదంనుంచైనా సరే పాలను ఉత్పత్తి చెయ్యొచ్చు. వాటి మూలకణాలు లభ్యమైతే చాలు.

ఆహార శాస్త్రవేత్త మిషెల్ ఎగ్గర్, కణ జీవశాస్త్రవేత్త లైలా స్ట్రిక్ల్యాండ్ నేతృత్వంలో యూఎస్‌కు చెందిన బయోమిల్క్ కంపెనీ మరో భిన్నమైన పద్ధతి ద్వారా క్షీర గ్రంధి కణాలనుంచీ పాలను ఉత్పత్తి చేస్తోంది.

తల్లిపాలల్లో వేలసంఖ్యలో భిన్నమైన పదార్థాలు ఉంటాయి. ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, హార్మోన్లు, బ్యాక్టీరియా, చక్కెర ఇలా రకరకాల పదార్థాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఇన్ని రకాల పదార్థాలతో సంక్లిష్టంగా ఉండడం వల్లే తల్లిపాలను ప్రతిబింబించేలా మరో పదార్థాన్ని తయారుచెయ్యడం చాలా కష్టం అని నిపుణులు అంటున్నారు.

"తల్లి రక్తం, జీర్ణ వ్యవస్థ, రోగ నిరోధక శక్తి, స్థనాల్లో ఉండే రోగ నిరోధక వ్యవస్థ, తను తీసుకునే ఆహారంలోంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్...ఇలా ఇవన్నీ పాల ఉత్పత్తికి దోహదపడతాయి" అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన డా. నటాలి షెంకెర్ అంటున్నారు.

డా. షెంకెర్ తల్లిపాలపై పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాకుండా యూకేలోని హ్యూమన్ మిల్క్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులుగా అమ్మపాల బ్యాంకులను వృద్ధి చేసే దిశలో కృషి చేస్తున్నారు.

తల్లిపాలు తాగుతున్న శిశువు

ఈ పాలు నిజంగా తల్లి పాలలాగే ఉంటాయా?

ప్రయోగశాలలో తయారైన పాలు అచ్చం తల్లిపాలల్లాగే ఉండే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. తల్లిపాలల్లో ఉండే అన్ని మూల పదార్థాలను ప్రయోగశాలలో సృష్టించడం కష్టం. అలాగే మనిషి నుంచీ మనిషికి చేరే ప్రతిస్పందనలను సృష్టించడం అసాధ్యం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, తల్లిపాలను భర్తీ చెయ్యడం తమ ఉద్దేశం కాదని టర్టల్ బ్యాంక్, బయోమిల్క్ ల్యాబ్స్ అంటున్నాయి. తల్లిపాలకు, ఫార్ముల పాల కన్నా మేలైనా ప్రత్యామ్నాయాన్ని తయారుచెయ్యడమే తమ లక్ష్యమని చెప్తునారు.

"తల్లిపాలల్లో ఉండే మానవ సహజ లక్షణాలను ప్రతిసృషించడం అసాధ్యం. సాంకేతిక ఎంత అభివృద్ధి చెందినాసరే అచ్చం తల్లిపాలల్లా ఉండే పాలను తయారుచెయ్యలేం. అయితే ఫార్ములా పాలల్లో ఆవుపాలనుంచీ సంగ్రహించిన పదార్థాలు, కొన్ని కూరగాయనుంచీ సంగ్రహించినవి, మరికొన్ని ఇతర పదార్థాలు కలుపుతారు. ఇవేమీ తల్లిపాలకు దగ్గరగా కూడా రావు. వీటికంటే మేలైన పాలను, తల్లిపాలకు దగ్గరగా ఉండేలా ఉత్పత్తి చెయ్యడమే మా లక్ష్యం" అని టర్టల్‌ట్రీ సహ వ్యవస్థాపకులు మాక్స్ రై తెలిపారు.

తల్లిపాలల్లో జన్యుపరమైన, రోగనిరోధక వ్యవస్థకు చెందిన అంశాలుంటాయని…"తల్లిపాలు వేలి ముద్రల్లాంటివి. ప్రతీ తల్లికీ ప్రత్యేకమైనవి" అని డా. షెంకెర్ తెలిపారు.

బిడ్డలకు కనీసం ఆరు నెలలపాటు తల్లిపాలు తాగించాలని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా 40% పిల్లలు మాత్రమే ఆరునెలల వరకు తల్లిపాలు తాగుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

దీప దిల్లీలో ఉంటారు. ఫార్ములా పాల వల్ల తన పిల్లలమీద ప్రతికూల ప్రభావలేమీ లేవని ఆమె అంటున్నారు.

"వాళ్లు పుట్టి 18 ఏళ్లయ్యింది. నాకు మా పిల్లలకు ఉన్న అనుబంధంలోగానీ, వాళ్ల ఆరోగ్యం, ఎదుగుదలలోగానీ ఎలాంటి లోటూ లేదు" అని దీప తెలిపారు.

ఈ పాల ఉత్పత్తి ఆచరణసాధ్యమేనా?

తల్లిపాలకు లేదా ఫార్ములా పాలకు ప్రత్యామ్నాయం తయారుచెయ్యాలంటే ఆర్థికపరంగా, వ్యాపారపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది అని డా. షెంకెర్ అభిప్రాయపడుతున్నారు.

''వాస్తవానికి రక్తం, పాలు ఇంచుమించు ఒకే రకమైన ద్రవపదార్థ లక్షణాలను కలిగి ఉంటాయి. కాకపోతే లక్షల సంవత్సరాలుగా, పాలు శిశువులకు పోషకాహార వనరుగా, బిడ్డల రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ, ఎదుగుదలకు తోడ్పడే విధంగా అభివృద్ధి చెందాయి. అందుకే ఇవి రక్తం కన్నా సంక్లిష్టంగా ఉంటాయి.

గత 70 ఏళ్లుగా కృత్రిమ రక్తం తయారుచెయ్యడానికి పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఇప్పటిదాకా రక్తానికి సురక్షితమైన, సమర్థవంతమైన, వాణిజ్యపరంగా ఆచరణసాధ్యమయిన ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టలేకపోయారు.

రక్తానికే ప్రత్యామ్నాయం తయారుచెయ్యలేకపోయాం అంటే అంతకన్నా సంక్లిష్టమైన తల్లిపాలను ప్రతిబింబించేలా ప్రత్యామ్నాయాన్ని తయారుచెయ్యడం అసాధ్యమనే చెప్పాలి. అయితే తల్లిపాలల్లో ఉండే కొన్ని పదార్థాలను కొన్ని కొంతవరకు ప్రయోగశాలలో తయారుచెయ్యవచ్చు" అని డా. షెంకెర్ అభిప్రాయపడ్డారు.

జూన్‌లో బయోమిల్క్‌కు దాదాపు రూ. 25 కోట్లు, టర్టల్‌ట్రీ ల్యాబ్స్‌కు దాదాపు 23 కోట్ల రూపాయల నిధులు లభించాయి.

ఇన్ని కోట్ల రూపాయలను ఇలాంటి ప్రయోగాలమీద ఖర్చు పెట్టేకన్నా పాలివ్వడంల్లో తల్లులకు మద్దతుగా, అమ్మపాల బ్యాంకులు అభివృద్ధిపరచడానికి ఉపయోగిస్తే మేలని బ్రెస్ట్‌ఫీడింగ్ గ్రూపులు, డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

టర్టల్‌ట్రీ ల్యాబ్స్‌కు నిధులు సమకూర్చిన సింగపూర్ ప్రభుత్వం ఈ విమర్శలకు స్పందిస్తూ..."పాలిచ్చే తల్లుల సంరక్షణకు నిధులు అవసరమేకానీ పాలివ్వలేని లేదా పాలు ఇవ్వడానికి ఇష్టపడని తల్లులకు మద్దతుగా నిలబడడం కూడా ముఖ్యమేనని" తెలిపింది.

"రెండు రకాల ప్రయత్నాలూ ఉండాలి. పాలిచ్చే తల్లుల సంరక్షణకు, తల్లిపాల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చెయ్యడం ముఖ్యమే. మరోవైపు ఫార్ములా పాలకన్నా మెరుగైన ప్రత్యామ్నాయాలను తయారుచెయ్యడం ముఖ్యమే" అని మాక్స్ రై అన్నారు.

బయోమిల్క్ కంపెనీ పాలు ఉత్పత్తి చేసి నేరుగా వియోగదారులకే అమ్మే ప్రయత్నాలు చేస్తుంటే, టర్టల్‌ట్రీ మాత్రం ఈ పాల ఉత్పత్తికి అవసరమయ్యే సాంకేతికతను ఫార్ములా పాలు తయారుచేసే కంపెనీలకు అమ్మే ప్రయత్నాలు చేస్తోంది.

''సాంకేతిక చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎంత పెద్ద స్థాయిలో ఈ పాలను ఉత్పత్తి చెయ్యగలం అనేదే ఇప్పుడున్న సవాలు. వచ్చే ఏడాదికల్లా మా ఉత్పత్తులని మార్కెట్లోని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం" అని మాక్స్ రై తెలిపారు.

మొదట్లో ఈ పాల ధర అధికంగానే ఉంటుందని టర్టల్‌ట్రీ ల్యాబ్స్ చెబుతోంది. అయితే, రాను రాను ధర తగ్గించే ప్రయత్నాలు చేస్తామని, మార్కెట్‌లో సరఫరా పెరిగితే ధరలు అవే తగ్గుతాయని మాక్స్ రై తెలిపారు. అయితే, ఎంత సురక్షితంగా వీటిని ఉత్పత్తి చెయ్యగలం అనేదే ప్రస్తుతం మా ముందున్న పెద్ద సవాలు అని ఆయన తెలిపారు.

షిరీన్ ఫ్రైడే తన మొదటి బిడ్డకు 15 నెలలవరకూ పాలిచ్చారు. కానీ రెండో బిడ్డ పుట్టే సమయానికి ఆఫీస్ పనులలో బిజిగా ఉండడం వలన చనుబాలు ఇవ్వలేకపోయారు. చాలా తొందరగా మళ్లీ ఆఫీస్‌లో జాయిన్ అయిపోవాల్సి వచ్చింది. అందుకని రెండోబిడ్డకు మొదటినుంచీ ఫార్ములా పాలే ఇచ్చారు.

"నాకు అప్పట్లో చనుబాలు ఇవ్వడం లేదా ఫార్ములా పాలు...ఈ రెండే పద్ధతులు తెలుసు. పాలు పంప్ చేసి ఇచ్చొవ్వని నాకు తెలీదు. చనుబాలు ఇచ్చే తల్లులకు మద్దతుగా అనేక సంస్థలు, గ్రూపులు ఉన్నాయని నాకు తెలీదు" అని ఆమె అన్నారు.

"రెండోబిడ్డ ఆరునెలలు తిరిగేసరికి ఫార్ములా పాలు తాగడం మానేసింది. చాలా ప్రయత్నాలు చేసానుగానీ చనుబాలు తప్ప ఇంకేమీ తాగడానికి ఇష్టపడలేదు. ఇంక అప్పుడు పంప్ చెయ్యడం తప్ప మరో మార్గం లేకపోయింది. కానీ రోజూ పంప్ చేసి పాలివ్వడం చాలా ఒత్తిడి కలిగించేది. శారీరకంగా, మానసికంగా చాలా అలిసిపోయేదాన్ని. ఒక్కోసారి అరగంటసేపు ప్రయత్నిస్తేగానీ బిడ్డకు కావలసినన్ని పాలు వచ్చేవి కావు. పంప్ చెయ్యడం చాలా బాధతో కూడుకున్న ప్రక్రియ. చాలా నొప్పిగా ఉంటుంది. నేను పూర్తిగా అలిసిపొయేదాన్ని" అని తెలిపారు.

అయితే, తల్లిపాలకు లేదా ఫార్ములా పాలకు ప్రత్యామ్నాయంగా ప్రయోగశాలలో బయోఇంజినీరింగ్ ద్వారా తయారైన పాలను ఇవ్వడానికి సంకోచిస్తానని షిరీన్ తెలిపారు.

"ఇదెంత సురక్షితమో తెలీదు. పసిపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. ఇలా ప్రయోగశాలలో తయారైన పాలు ఇవ్వాలంటే సందేహంగానే ఉంటుంది. 100% సురక్షితం అని చెప్పినా సరే ఈ పాలివ్వడం రిస్క్ అనే అనిపిస్తుంది" అని షిరీన్ అన్నారు.

తాము ఉత్పత్తి చేస్తున్న పాల గురించి అందరికీ అవగాహన కలిగించడం తమ ముందున్న అతి పెద్ద సవాలు అని టర్టల్‌టీ ల్యాబ్స్ అంటోంది. ఈ పద్ధతిలో సింథటిక్ రసాయనాలేవీ వాడట్లేదని ఇవి పూర్తిగా సురక్షితం అని ఈ కంపెనీ చెబుతోంది.

"తల్లి శరీరంలో లేదా ఆవులలో ఏ పద్ధతిలో క్షీర గ్రంధులు పాలు ఉత్పత్తి చేస్తాయో అదే విధంగా మేము సేకరించిన క్షీర గ్రంధుల కణాలు కూడా పాలు ఉత్పత్తి చెయ్యడానికి వీలుగా ఉండే ద్రావకాన్ని వాడుతున్నాం" అని మాక్స్ రై వివరించారు.

అయితే, ఈ ఉత్పత్తుల విషయంలో క్రమబద్ధీకరణ, పారదర్శకతల గురించి విమర్శలు వస్తున్నాయి.

ఈ పాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టకముందే ఈ ఉత్పత్తుల గురించి పూర్తి సమాచారాన్ని పబ్లిష్ చేస్తామని టర్టల్‌ట్రీ ల్యాబ్స్ చెబుతోంది.

విస్తృతంగా ట్రయల్స్ నిర్వహించిన తరువాతే వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని మాక్స్ రై తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Formula milk an alternative to mother milk
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X