భారత్ కు దగ్గరవుతున్న అమెరికా- మారిన పరిస్ధితుల్లో- మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ వెల్లడి...
దశాబ్దాలుగా తమకు నమ్మకంగా ఉన్న సోవియట్ యూనియన్, రష్యాతో సంబంధాలను పణంగా పెట్టి మరీ భారత్.... అమెరికాకు దగ్గరవుతున్న వైనం రోజూ చూస్తూనే ఉన్నాం. కారణాలు ఏవైనా అంతర్జాతీయంగా పలు అంశాల్లో ట్రంప్, మోదీ ప్రభుత్వాలు ఎలా సహకరించుకుంటున్నాయో కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి గతంలో జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్ సైతం ఇదే అంశంపై తన దృష్టికి వచ్చిన పలు అంశాలను తన తాజా పుస్తకంలో బయటపెట్టారు.
ఇందులో భారత్ ను అమెరికా సమర్ధిస్తున్న తీరు తేటతెల్లమైంది.

భారత్ కు దగ్గరగా అమెరికా...
గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో చాలా మంది భారత్ తో సత్సంబంధాలను కోరుకున్నా ప్రస్తుత డోనాల్డ్ ట్రంప్ హయాంలో మాత్రం అంతర్జాతీయంగా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా అగ్రరాజ్యాల్లో ఒకటైన చైనాకు పొరుగున ఉన్న వ్యూహాత్మక దేశంగా భారత్ కు అమెరికా అనివార్యంగా సహకారం అందించక తప్పని పరిస్ధితి. దీంతో పలు కీలక అంశాల్లో భారత్ నుంచి సహకారం కోరుకుంటున్న అమెరికా.. తన వైపు నుంచి కూడా అదే స్దాయిలో సహకారం అందిస్తోంది. అయితే ఇరాన్ నుంచి చమురు దిగుమతుల విషయంలో మాత్రం అమెరికా కోరికను భారత్ మన్నించలేదు. ఈ అంశంతో పాటు పలు కీలక అంశాలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ తన అభిప్రాయాలను తన తాజా పుస్తకంలో వెల్లడించారు.

బాలా కోట్ దాడులపై....
2019లో భారత్ లోని పుల్వామాలో భద్రతా దళాలపై పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద సంస్ధ జైషే మహ్మద్ జరిపిన దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ లోని బాలాకోట్ పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అత్యంత సాహసోపేతంగా అర్దరాత్రి బాలాకోట్ కు వెళ్లిన మన జవాన్లు వైమానిక దాడులతో తీవ్రవాద స్ధావరాలను నాశనం చేసి వచ్చాయి. ఇది భారత్ తీసుకున్న సరైన చర్యగా అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తన తాజా పుస్తకంలో రాసుకున్నారు. పుల్వామా దాడి తర్వాత భారత్ చాలా సహనంగా వ్యవహరించిందని, బాలా కోట్ దాడి విషయంలోనూ సమర్ధంగా నిర్వహించిందని ప్రశంసించారు. భారత్ ఈ విషయంలో తీసుకున్న చర్యలకు అమెరికా మద్దతు ఉందనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై...
ఇరాన్ నుంచి చమురు దిగుమతుల విషయంలోనూ అమెరికా అంతర్గత వ్యవహారాలశాఖ భారత్ ను వెనకేసుకొచ్చిందని బోల్టన్ గుర్తుచేశారు. ఇరాన్ తో అమెరికా సంబంధాలు దారుణంగా దిగజారిన సందర్భంలో ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలకు ట్రంప్ సర్కారు హెచ్చరికలు చేసింది. చమురు దిగుమతులు తగ్గించుకోవాలని, లేదా రద్దు చేసుకోవాలని కోరింది. అయితే ఇరాన్ తో ఉన్న సత్సంబంధాలను గుర్తుపెట్టుకుని భారత్ దానికి నిరాకరించింది. భారత్ చర్యను అమెరికా ప్రభుత్వం సమర్ధించినా ట్రంప్ మాత్రం ఈ విషయంలో భారత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బోల్టన్ పేర్కొన్నారు.

భారత్ తో సంబంధాలపై...
భారత్ తో అమెరికా సంబంధాలు గతంతో పోలిస్తే ఎంతో మెరుగుపడ్డాయని, ఇందుకు పాకిస్తాన్ వ్యవహారశైలి కూడా కారణమని జాన్ బోల్టన్ తన పుస్తకంలో రాశారు. భారత్ ను ప్రస్తుతం అమెరికా తమకు నమ్మకమైన భాగస్వామిగా భావిస్తోందని, అందుకే ద్వైపాక్షిక సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని బోల్టన్ తెలిపారు. అయితే భారత్ తో సంబంధాలు పెంచుకునే విషయంలో ఇంకా చాలా విషయాల్లో సమస్యలు ఉన్నాయని, వాటిని భవిష్యత్తులో పరిష్కరించుకునేలా ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బోల్టన్ వెల్లడించారు. మొత్తంగా చూస్తే ట్రంప్ సర్కారులో భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ భారత్ విషయంలో అమెరికా సానుకూల వైఖరి, భవిష్యత్ సంబంధాలపై తన పుస్తకంలో వాస్తవాలను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.