4అంతస్తులు స్పైడర్ మ్యాన్‌లా ఎక్కేసి బాలుడ్ని కాపాడాడు: అధ్యక్షుడి ప్రశంస, పౌరసత్వం(వీడియో)

ప్యారిస్: నాలుగో అంతస్తు బాల్కనీని పట్టుకుని ప్రమాదకరంగా వేలాడుతున్న నాలుగేళ్ల బాలుడ్ని కాపాడిన మాలీకి చెందిన గసామాపై ప్రపంచం నలువైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అంతేగాక, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రోన్ స్వయంగా అతడ్ని పిలుపించుకుని అభినందించారు.
ప్రశంసలు, అభినందనలతోనే ఆగిపోకుండా అతనికి ఫ్రాన్స్ సభ్యత్వం కూడా ఇస్తామని ప్రకటించారు మాక్రోన్. ప్రస్తుతం గసామాకు ఫ్రాన్స్ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ అంటూ ప్రశంసలు లభిస్తున్నాయి.

స్పైడర్ మ్యాన్‌లా ఎక్కేశాడు
కాగా, భవనం నాలుగో అంతస్తులో ప్రమాదకరంగా వేలాడుతున్న బాలుడ్ని చూసిన గసామా.. వెంటనే స్పందించాడు. చకచకా ఆ భవంతిపైకి ఎగబాకాడు. లాంటి తాళ్లు కూడా లేవు, ఒట్టి చేతులతోనే అచ్చం స్పైడర్‌మ్యాన్‌లా బాల్కనీ నుంచి బాల్కనీకి ఎగబాకుతూ నాలుగో అంతస్తుకు చేరుకున్నాడు. ఒక కాలు బాల్కనీ గోడకు పెనవేస్తూనే ఒక చేత్తో బాబును పట్టుకుని బాల్కనీపైకి చేర్చేశాడు. పక్క బాల్కనీలో కొద్ది క్షణాల ముందే వచ్చిన వ్యక్తి ఒకరు తన వంతు సాయమూ చేశాడు.

గసామాపై ప్రశంసల వర్షం
దీంతో అగ్నిమాపక దళం వారు వచ్చేసరికే కథ సుఖాంతమయింది. ప్యారిస్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన తాలూకూ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సాహసికుడికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తల్లి వేరే నగరంలో ఉండగా, తండ్రి మాత్రం పోకేమాన్ ఆటలో మునిగితేలుతుండటం గమనార్హం. దీంతో ఈ ఘటనపై అధికారులు బాబు తండ్రిని ప్రశ్నిస్తున్నారు.

బాలుడిని కాపాడాలని మాత్రమే నిర్ణయించుకున్నా..
నాలుగేళ్ల బాబును తన సాహసచర్యతో రక్షించిన మాలికి చెందిన మమోడు గసామాను అందరూ అభినందనలతో ముంచెత్తారు. 2017 సెప్టెంబరులో ప్యారిస్‌కు వలస వచ్చాడు గసామా. వలసదారుల వసతి గృహంలోనే ఉంటున్నాడు. బాబును ఆ స్థితిలో చూశాక ఇంకా తానేమీ ఆలోచించలేదని, వెంటనే భవంతి ఎక్కేశానని గసామా చెప్పాడు. అతని మానవత్వానికి, సాహసచర్యకు మెచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రోన్.. మమోడు గసామాను సోమవారం అధ్యక్ష భవనంలో సత్కరించారు.
గసామాకు పౌరసత్వంతోపాటు ఉద్యోగం
సాహస పతకాన్ని బహూకరించారు. అంతేగాక, ఫ్రాన్స్ పౌరసత్వాన్ని ప్రకటించారు. ఫ్రెంచి అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి అవకాశం కల్పించారు. గతంలోనూ ఒక మాలి దేశస్థుడు తన సాహసచర్యతో అందరి మెప్పూ పొందాడు. 2015, జనవరిలో యూదుల సూపర్‌మార్కెట్‌పై ఉగ్రదాడి జరిగినప్పుడు అతను కొద్ది మంది పౌరులను ఫ్రీజర్‌లో దాచి వారి ప్రాణాలను కాపాడాడు. అతనికి కూడా ఇలాగే ఫ్రాన్స్ పౌరసత్వం లభించింది.