• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాజా: అక్కడ బతుకు నిత్య నరకం

By BBC News తెలుగు
|
గాజా ప్రజలు

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గాజా స్ట్రిప్ వద్ద ఇజ్రాయెల్ భారీగా సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరిస్తోంది.

ఇప్పటికే చోటుచేసుకున్న కాల్పులు, రాకెట్ దాడులతో రెండువైపులా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లింది.

దశాబ్దాలుగా ఎడతెగని ఈ పోరులో గాజా స్ట్రిప్ వణుకుతోంది.

ఇంతకీ ఈ గాజా స్ట్రిప్ ఏమిటి? అక్కడ జీవనం ఎంత ప్రమాదకరం?

అడుగడుగునా ఆంక్షలే

తిండి కావాలంటే పంట పండించాలి.. కానీ, అక్కడ వ్యవసాయంపై ఆంక్షలు.

పోనీ చేపలను వేటాడి కడుపు నింపుకొందామంటే దానిపైనా నిషేధాజ్ఞలు. హద్దు దాటితే కురిసే తూటాల జడివాన నుంచి తప్పించుకోవడం అసాధ్యం.

నీళ్లకు కష్టం, తిండికి కష్టం, జబ్బు పడితే మరీ కష్టం... అక్కడ బతుకే నిత్య ప్రమాదం.

అందుకే.. మధ్యధరా సముద్రంలోని ఆ సన్నని ఆ భూభాగంలోని ప్రజల ప్రాణాలు ఎప్పుడూ అరచేతుల్లోనే ఉంటాయి.

గాజా మ్యాప్

ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఈజిప్టు.. మధ్యధరా సముద్రంలో ఉన్నఈ గాజాస్ట్రిప్‌ 41 కి.మీ. పొడవు, 10 కి.మీ. వెడల్పున విస్తరించి ఉంది. 19 లక్షల మంది అక్కడ నివసిస్తున్నారు.

వాస్తవానికి ఇది ఈజిప్టు ఆక్రమణలో ఉండేది. 1967 మధ్య ప్రాచ్య యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ గాజా దక్షిణ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుంది.

2005లో ఇజ్రాయెల్ అక్కడి నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది.

అనంతరం ఆ ప్రాంతం పాలస్తీనా అధీనంలోకి వచ్చింది. మళ్లీ 2007 నుంచి 2014 వరకు ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలోకి వెళ్లింది.

2006లో వారు పాలస్తీనా ఎన్నికల్లో విజయం సాధించారు, కానీ, ఫతా అనే మరో గ్రూపుతో విభేదాల కారణంగా పరిస్థితి హింసాత్మకంగా మారింది.

ఈజిప్టు సరిహద్దుల్లో సొరంగాల ద్వారా అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తారు. అన్ని రకాల సరకులు సొరంగాల్లోంచి రహస్యంగా తరలిస్తారు

దిగ్బంధంతో దీనావస్థ

హమాస్ గాజాను తమ అధీనంలోకి తీసుకున్న తరువాత ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని దిగ్బంధించింది. గాజాకు సరకు రవాణా జరక్కుండా.. అక్కడికి ఎవరూ రాకపోకలు సాగించకుండా అదుపు చేసింది. మరోవైపు ఈజిప్టు కూడా గాజా దక్షిణ సరిహద్దును మూసివేసింది. దీంతో గాజాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లయింది.

గాజాలోని హమాస్ తీవ్రవాదులను, వారు ప్రయోగించే రాకెట్ లాంఛర్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో 2014లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది.

అదే సమయంలో ఈజిప్టు 2014 అక్టోబరు నుంచి గాజాతో సరిహద్దును పూర్తిగా మూసేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సరిహద్దు నుంచి రాకపోకలకు అనుమతించింది.

ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం(ఓసీహెచ్ఏ) వివరాల ప్రకారం సరిహద్దు మూసేసినప్పటి నుంచి 2018 ఏప్రిల్ వరకు కేవలం 17 రోజులు మాత్రమే దాన్ని తెరిచారు. అదికూడా ఐరాస వద్ద నమోదైన 23 వేల మంది శరణార్దుల కోసం తెరిచారు.

ఇక ఉత్తరాన చూసుకుంటే ఎరెజ్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద 2017 కంటే ఈ ఏడాది కొంత సడలించారు. 2017 ప్రథమార్థంలో గాజా నుంచి సుమారు 240 మంది పాలస్తీనీయులు గాజాను వీడి ఇజ్రాయెల్ మీదుగా వలస వెళ్లిపోయారు. 2000 సంవత్సరం సెప్టెంబరులో రోజుకు సగటున 26 వేల మంది ఇలా వెళ్లిపోయేవారు.

అన్ని రకాలుగా క్షీణించింది..

1990తో పోల్చినప్పుడు గాజా ఇప్పుడు పేదరికంలో చిక్కుకుంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 2017లో ఈ ప్రాంత ఆర్థిక వృద్ధి కేవలం 0.5 శాతం మాత్రమే. 1994 ఇక్కడ ప్రజల వార్షిక తలసరి ఆదాయం 2,659 అమెరికన్ డాలర్లు ఉండగా 2018లో అది 1826 డాలర్లకు తగ్గిపోయింది.

2017లో ప్రపంచ బ్యాంకు అభివృద్ధి సూచీల్లో గాజా ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రాంతంగా నమోదైంది. అక్కడ 60 శాతానికి పైగా నిరుద్యోగులే.

పేదరికం రేటు అక్కడ 39 శాతం ఉంది. వెస్ట్‌బ్యాంకుతో పోల్చితే ఇది రెట్టింపు.

చాలీచాలని స్కూళ్లు

గాజాలో విద్యావ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి పాఠశాలల్లో 94 శాతం రెండు షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తున్నాయని ఐరాస నివేదికలు చెప్తున్నాయి.

ఐరాస సహాయ చర్యల సంస్థ(యూఎన్ఆర్‌డబ్ల్యూఏ) ఇక్కడ 250 పాఠశాలలను నిర్వహిస్తోంది. యూఎన్ఆర్‌డబ్ల్యూఏ ప్రయత్నాలు ఫలించి ఇక్కడ అక్షరాస్యత శాతం 97కి చేరింది.

ఐరాసకు చెందని పాఠశాలలు మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. 2014 నాటి యుద్ధంలో 547 స్కూళ్లు, కాలేజీలు ధ్వంసమయ్యాయి. అందులో చాలావరకు ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు.

గాజాలో విద్యార్థుల సంఖ్య 2030 నాటికి 12 లక్షలకు చేరుతుందని ఐరాస అంచనా వేసింది. అలా అయితే గాజాలో మరో 900 స్కూళ్లు, 23 వేల మంది ఉపాధ్యాయులు అవసరం.

జనసాంద్రత మ్యాప్

జనాభా

ప్రపంచంలోనే జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకు సగటున 5,479 మంది నివసిస్తున్నారు.

2030 నాటికి గాజా జనాభా 31 లక్షలకు చేరుతుందని అంచనా.

రాకెట్ లాంఛర్ దాడులు, సొరంగ మార్గాల ద్వారా ప్రవేశించడాన్ని నివారించడానికి గాను ఇజ్రాయెల్ 2014లో కొంత ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించింది. ఈ ఆంక్షల కారణంగా అక్కడ నివాస, వ్యవసాయ భూములు తగ్గిపోయాయి.

ఐరాస లెక్క ప్రకారం గాజాలో ఇప్పుడు 1,20,000 ఇళ్ల కొరత ఉంది.

2014 యుద్ధం ముగిసిన తరువాత కూడా ఇక్కడ గత మూడేళ్లలో 29 వేల మంది నిరాశ్రయులయ్యారు.

మరోవైపు ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో యువత ఉన్న ప్రాంతాల్లో గాజా కూడా ఒకటి. ఇక్కడి జనాభాలో 40 శాతం మంది పదిహేనేళ్లలోపువారే.

యువత జనాభా తెలిపే గ్రాఫ్

వైద్యసేవలు అందని ద్రాక్షే

సరిహద్దులు మూసివేయడం, తీవ్రమైన ఆంక్షల కారణంగా ప్రజారోగ్య సేవలు సక్రమంగా అందుబాటులో లేవు.

రఫా సరిహద్దు మూసివేయడం వల్ల వైద్యం కోసం ఈజిప్టు వెళ్లే రోగుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.

2014కి ముందు రోజుకు సగటున 4 వేల మంది గాజా ప్రజలు కేవలం వైద్యం కోసమే ఈజిప్టు వెళ్లేవారు.

వైద్య కారణాలతో ఇజ్రాయెల్ వెళ్లే అవకాశాలు కూడా ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయింది.

దిగ్బంధం కారణంగా డయాలసిస్ యంత్రాలు, హృద్రోగ చికిత్స పరికరాలు సహా ఇతర వైద్య పరికాలు, మందుల సరఫరాలోనూ తీవ్ర ఇబ్బందులున్నాయి.

యుద్ధ సమయంలో ఆసుపత్రులూ ధ్వంసమయ్యాయి. మరోవైపు ఆంక్షలు, దిగ్బంధం.. దీంతో జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా వైద్య సేవలు అందుబాటులో లేవు.

ఇటీవల ఇంధన కొరత సైతం ప్రభావం చూపింది. ఇంధనం లేకపోవడంతో జనరేటర్లు పనిచేయక మూడు ఆసుపత్రులు, పది వైద్యకేంద్రాల్లో సేవలు రద్దు చేశారు.

ఆహారానికి ఇక్కట్లు

గాజాలో 10 లక్షల మందికిపైగా తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు ఐరాస చెబుతోంది. ఇజ్రాయెల్ అక్కడ వ్యవసాయంపై ఆంక్షలు విధించడం, చేపల వేటనూ నియంత్రించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఇజ్రాయెల్ ప్రకటించిన బఫర్ జోన్లో గాజా ప్రజలు వ్యవసాయం చేయడానికి వీల్లేదు. ఈ బఫర్ జోన్ ఇజ్రాయెల్ సరిహద్దు పొడవునా గాజాలోపలికి 1.5 కి.మీ వెడల్పున ఉంటుంది. ఈ ఆంక్షల వల్ల ఏటా 75 వేల టన్నుల మేర ఆహార ఉత్పత్తులు తగ్గుతున్నాయి.

మరోవైపు గాజా ప్రజలు సముద్రంలో చేపలు వేట సాగించడంపైనా ఇజ్రాయెల్ నిషేధాజ్ఞలు విధించింది. తీరం నుంచి కొద్ది దూరం వరకు మాత్రమే వారు వేటాడడానికి వీలుంది. ఈ నిషేధాన్ని సడలిస్తే తక్కువ ఖర్చుతో వారికి మాంసకృత్తులు సమృద్ధంగా ఉండే ఆహారం దొరుకుతుందని.. అలాగే చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుందని ఐరాస అంటోంది.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2012 నవంబరులో కుదిరిన ఒప్పందం తరువాత ఈ చేపల వేట పరిధి 3 నాటికల్ మైళ్ల నుంచి 6 నాటికల్ మైళ్లకు పెంచారు. కానీ.. గాజా వైపు నుంచి దాడులు పెరుగుతున్నాయన్న కారణంతో దాన్ని మళ్లీ 3 నాటికల్ మైళ్లకు కుదించారు.

ఆ హద్దు దాటి వచ్చే పాలస్తీనా ఫిషింగ్ బోట్లపై ఇజ్రాయెల్ నౌకాదళం తరచూ కాల్పుల వర్షం కురిపిస్తోంది.

విద్యుత్, నీటి సమస్యలు

గాజాలో విద్యుత్ కోత చాలా సాధారణం. రోజుకు అక్కడ 3 నుంచి 6 గంటలు మాత్రమే కరెంటు ఉంటుంది. గాజాలో ఒకే ఒక్క విద్యుత్కేంద్రం ఉంది. ఇజ్రాయెల్, ఈజిప్టుల నుంచి కొంత విద్యుత్ సరఫరా ఉంది. అన్నీ కలిపినా ఇక్కడ విద్యుత్ అవసరాలలో మూడో వంతు కూడా తీరడం లేదు.

గాజాలో వర్షం పడడం చాలా అరుదు. మంచినీటి వనరులూ, భూగర్భజలాలూ తక్కువే. దీంతో నీటి కొరత అక్కడ తీవ్రంగా ఉంది.

97 శాతం మంది ప్రజలు ట్యాంకర్లతో సరఫరా అయ్యే నీటిపైనే ఆధారపడుతున్నారు.

మురుగునీటి పారుదల కూడా ఇక్కడ పెద్ద సమస్యే. రోజుకు సుమారు 9 కోట్ల లీటర్ల మురుగునీరు స్థానికంగా ఉన్న జలవనరులు, మధ్య సముద్రంలో కలుస్తోంది. దీంతో 95 శాతం భూగర్భజలాలు కలుషితమయ్యాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Gaza: Eternal hell for those who live there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X