అమెరికా దెబ్బ: గ్రే లిస్టులో చేరిన పాక్, ఆర్ధిక ఇబ్బందులేనా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు మిత్ర దేశాలు కూడా దూరమవుతున్నాయి. టర్కీ మినహా చైనా వంటి దేశాలు పాకిస్థాన్ వైఖరిని సమర్థించడం లేదు. పారిస్‌లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టేందుకు 36 దేశాలు మద్దతిచ్చాయి. కేవలం టర్కీ మాత్రమే పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించింది.
పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టాలన్న తీర్మానాన్ని అమెరికా ప్రతిపాదించగా, భారతదేశం, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు పలికాయి. దీనికి అనుకూలంగా 36 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక (టర్కీ) ఓటు వచ్చింది. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ చర్య తీసుకుంది. ఫలితంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహించడం కష్టమవుతుంది. అంతేకాకుండా పాకిస్థానీ వ్యాపార సంస్థలు విదేశాల్లో రుణాలను సేకరించడం కూడా కష్టమవుతుంది.

పాకిస్థాన్‌కు సుమారు రూ.19 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి. జూన్‌లోగా ఈ రుణాలకు సంబంధించిన బాధ్యతలను నెరవేర్చకపోతే అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఆ దేశానికి రేటింగ్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని, ఉగ్రవాద నిర్మూలనకు పాక్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ ఇటీవల అమెరికా.. పాక్‌కు సాయాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడితేనే నిధులిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ ప్రవర్తన ఏమాత్రం సంతృప్తికరంగా లేదని తెలిపారు. అమెరికా లేవనెత్తిన అంశాలపై పాక్‌లో పెద్దగా పురోగతి కనిపించడంలేదని అమెరికా అధికారి రాజ్ షా గుర్తు చేశారు.