భారత్‌లో నిలిచిపోయిన జీమెయిల్, యూట్యూబ్ సేవలు, గందరగోళంలో యూజర్లు
న్యూఢిల్లీ: జీమెయిల్ సేవలకు మరోసారి విఘాతం కలిగింది. కొద్ది గంటల నుంచి మెయిల్ పంపుతున్నా, లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించినా, ఫైల్స్ అటాచ్ చేస్తున్నా.. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో జీమెయిల్ యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. గూగుల్ డ్రైవ్‌లో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి
భారత్‌తోపాటు పలు దేశాల్లో నిలిచిన సేవలు
జీమెయిల్ సహాయ సేవలు చేసేవారికి పలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జీమెయిల్ డౌన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. జీమెయిల్ తోపాటు గూగుల్ డ్రైవ్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర దేశాల్లో జీమెయిల్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని గూగుల్ కూడా ధృవీకరించడం గమనార్హం.
యూట్యూబ్ సేవలు కూడా..
మరోవైపు యూట్యూబ్ సేవలు కూడా నిలిచిపోవడం యూజర్లను మరింత గందరగోళంలో పడేసింది. యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోలు అప్లోడ్ కావడం లేదు. ఏమైందో తెలియడం లేదు.. జీమెయిల్, యూట్యూబ్ సర్వీసులు పనిచేయడం లేదంటూ ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాల్లో యూజర్లు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా..
ఈ నేపథ్యంలో గూగుల్ సాంకేతిక బృందాలు యూజర్లకు కలిగిన అంతరాయాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, రెండు నెలల్లో జీమెయిల్ ఇలా డౌన్ అవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. జులై నెలలో కూడా యూజర్లు జీమెయిల్ లాగిన్ సమస్యను ఎదుర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన గూగుల్ సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించింది.
యూజర్ల ఆందోళన..
అయితే, ఈ సమస్య ఎందుకు వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు కూడా అలాంటి సమస్యే ఎదురుకావడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీమెయిల్‌ను ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ సేవలను వినియోగిస్తున్నారు. ఇప్పుడు డౌన్ కావడంతో అనేక పనులు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.