• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?

By BBC News తెలుగు
|
గోల్డ్‌ఫిష్

మీ అక్వేరియంలోని గోల్డ్‌ఫిష్‌ను పడేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? దగ్గర్లోని చెరువులో దాన్ని వదిలిపెడతారా? లేక బాత్‌రూమ్‌లోని కమోడ్‌లో వేసి నీళ్లు కొట్టేస్తారా?

ఇలా వదిలేయాలని భావిస్తే, ఒక్క నిమిషం ఆగండి. ముందు ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవండి.

ఎందుకంటే చెరువులు, నదుల్లోని ఇతర జలచరాలకు ఈ గోల్డ్‌ఫిష్‌లు పెద్ద ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటిని పరిసరాల్లోని నదులు, చెరువుల్లో వదిలి పెట్టొద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీచేస్తున్నారు.

గోల్డ్‌ఫిష్

చూడటానికి అందంగా...

బంగారు వర్ణంలో మెరిసే ఈ చేపని గోల్డ్‌ఫిష్ అంటారు. దీని శాస్త్రీయ నామం కైరేసియస్ అరాటస్.

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని నదులు, చెరువులు సహా జలాశయాల్లోని జీవులకు ఈ గోల్డ్‌ఫిష్‌లు ముప్పుగా పరిణమిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

అక్వేరియంలో చూడటానికి ఈ చేపలు చిన్నగానే ఉంటాయి. అయితే, బయట వదిలిపెడితే, ఇవి సాకర్ బాల్ అంత పెద్దగా అవుతాయి. దాదాపు రెండు కేజీల వరకు బరువు పెరుగుతాయి.

గోల్డ్‌ఫిష్

మాంసాహార చేపలు

భారీగా అయిన తర్వాత ఈ గోల్డ్‌ఫిష్‌లు జలాశయాల్లోని ఇతర చేపలపై దాడులు చేస్తాయి. అక్కడి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తాయి.

ఈ చేపలను చెరువులు, నదుల్లో వదిలిపెట్టొద్దని అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో అధికారులు ప్రజలకు సూచించారు.

https://twitter.com/BurnsvilleMN/status/1413480303667077121

ఫ్లోరిడాలోని బనానా లేక్‌లో భారీ గోల్డ్‌ఫిష్‌ను అధికారులు మొదట గుర్తించారు. అనంతర పరిశీలనలో అక్కడి చేపలపై ఈ గోల్డ్‌ఫిష్‌లు దాడిచేస్తున్నట్లు తేలింది.

ఈ చేపలు మొదట్లో చైనాలో మాత్రమే ఉండేవని, ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ పాకాయని పరిశోధకులు చెబుతున్నారు. మిగతా చేపలు దోమల లార్వాలు తింటే.. ఈ గోల్డ్‌ఫిష్‌లు చేపల గుడ్లను తినేస్తాయని వివరించారు.

గోల్డ్‌ఫిష్

వ్యాధుల ముప్పు..

ఆహారం కోసం నీటి అడుగు భాగంలో ఈ చేపలు తిరుగుతుంటాయి. ఇది మరొక సమస్య. వీటి కదలికల వల్ల నీటి అడుగు భాగంలో ఉండే బురదతోపాటు అక్కడుంటే పోషకాలు కూడా పైకి తేలుతూ వచ్చేస్తుంటాయి.

దీని వల్ల గోల్డ్‌ఫిష్‌కు ఆహారం దొరుకుతుంది కానీ.. జలాశయాల్లో నాచు పెరుగుతుంది. అంతేకాదు దీని వల్ల జలచరాలతోపాటు మనుషులకూ కొత్త జబ్బులు సోకే ముప్పుంది.

కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో గోల్డ్‌ఫిష్‌లపై అధ్యయనం చేపట్టారు. ఏడాది కాలంపాటు 15 గోల్డ్‌ఫిష్‌ల కదలికలను వారు గమనించారు. దీంతో గోల్డ్‌ఫిష్‌లపై కొత్త సంగతులు వెలుగులోకి వచ్చాయి.

''వీటి యజమానులు వీటిని కాలువల్లో వదిలిపెట్టి ఉండొచ్చు. ఇవి అక్కడి నుంచి నదుల్లోకి వచ్చాయి. అక్కడి నుంచి బురద ప్రాంతాల్లోకి వచ్చాయి. అక్కడ ఇవి గుడ్లు పెట్టాయి’’అని పరిశోధకులు తెలిపారు.

మొత్తంగా ఈ చేపలు సంవత్సర కాలంలో 230 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్లు పరిశోధకులు తేల్చారు.

గోల్డ్‌ఫిష్

గుడ్లు పెడుతూనే ఉంటాయి..

ఈ గోల్డ్‌ఫిష్‌లకు సంబంధించి మరో ఆసక్తికరమైన విశేషం కూడా పరిశోధనలో బయటపడింది. ఇవి కుందేళ్లలానే వెంటవెంటనే పిల్లల్ని కనగలవని తేలింది.

సాధారణంగా చేపలు గుడ్లు పెట్టడానికి ప్రత్యేక సమయం ఉంటుంది. కుందేళ్లు అయితే, ఒకసారి ప్రసవించిన వెంటనే మళ్లీ గర్భం దాలుస్తాయి. అలానే గోల్డ్‌ఫిష్‌లు కూడా ఒకసారి గుడ్లు పెట్టిన వెంటనే, మళ్లీ గుడ్లు పెడతాయి.

బయట జలాశయాల్లో పెరిగినంత వేగంగా అక్వేరియంలలో గోల్డ్‌ఫిష్‌లు పెరగలేవని పరిశోధనలో తేలింది.

ఈ చేపల వల్ల జలాశయాల్లోని కొన్ని జీవులు పూర్తిగా అంతరించే ముప్పుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

వీటిని వదిలించుకోవాలని అనుకుంటే... మిగతా జలచరాలకు ఎలాంటి ముప్పూలేని ప్రాంతాల్లోనే వదిలిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Goldfish: How is this beautiful fish from China turning into a monster?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X