ట్రంప్‌కు పర్ఫెక్ట్ లాస్ట్ పంచ్... క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బర్గ్ అదిరిపోయే కౌంటర్...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ లాస్ట్ పంచ్ ఇచ్చారు. గతంలో ఐక్యరాజ్య సమితి వేదికగా తాను చేసిన ప్రసంగంపై ట్రంప్ వేసిన సెటైర్లకు సరైన సమయంలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో ట్రంప్ గ్రెటాపై ఏ కామెంట్స్ చేశారో... ఇప్పుడవే కామెంట్స్‌తో ఆమె ట్రంప్‌కు చురకలంటించారు.
ట్రంప్‌కు గ్రెటా లాస్ట్ పంచ్...
'ఉజ్వలమైన,అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషవంతమైన వృద్దుడిలా ఆయన కనిపిస్తున్నారు. ఆయన్ను ఇలా చూడటం చాలా బాగుంది.' అంటూ గ్రెటా థన్ బర్గ్ ట్విట్టర్లో కామెంట్ చేశారు.ట్రంప్ శ్వేత సౌధాన్ని వీడుతున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన గ్రెటా.. దానికి ఈ కామెంట్‌ను జత చేశారు. నిజానికి ట్రంప్ శ్వేత సౌధాన్ని వీడుతూ మెరైన్ 1 హెలికాప్టర్లో బయలుదేరిన సమయంలో ఆయన ముఖంలో మునుపటి జోష్ కనిపించలేదు. దిగాలుగా,విచార వదనంతోనే వైట్ హౌస్‌కు గుడ్ బై చెప్పేశారు. ట్రంప్‌ను ఎద్దేవా చేసేలా గ్రెటా ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

అప్పట్లో గ్రెటాపై నోరు పారేసుకున్న ట్రంప్..
గతంలో సెప్టెంబర్,2019లో ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రపంచ పర్యావరణ అంశంపై గ్రెటా చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటికీ ఇంకా టీనేజ్‌లో ఉన్న గ్రెటా... ఏమాత్రం బెదురు లేకుండా దేశాధినేతలనే ప్రశ్నించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంత చిన్న వయసులోనే ఆమె పరిణతి చూసి చాలామంది ప్రశంసలు కురిపించారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం గ్రెటాపై కూడా నోరు పారేసుకున్నారు.

సరైన సమయంలో కౌంటర్...
ఐరాస వేదికపై గ్రెటా చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ... 'ఆమె ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చాలా సంతోషవంతమైన యువతిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది.' అంటూ ట్రంప్ అప్పట్లో కామెంట్ చేశారు. అంతేనా... 'టైమ్' మేగజైన్ 2019 సంవత్సరానికి గాను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా గ్రెటా పేరును ప్రకటించినప్పుడు ట్రంప్ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టైమ్ పత్రిక తెలివి తక్కువ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఆపై గ్రెటా తన కోపాన్నినియంత్రించుకోవడంపై ఫోకస్ చేయాలని సూచించాడు. స్నేహితునితో కలిసి ఓ మంచి సినిమాకు వెళ్లాలని ఉచిత సలహా ఇవ్వడమే కాదు... 'చిల్ గ్రెటా చిల్!' అంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తనపై గతంలో చేసిన కామెంట్స్‌తోనే ఆయనకు కౌంటర్ ఇచ్చారు గ్రెటా. ట్రంప్ ట్విట్టర్ నుంచి శాశ్వతంగా నిషేధించబడటంతో గ్రెటాకు తిరిగి కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా ఆయనకు లేదు.