• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తరకొరియా ఆయుధ వ్యాపారం కోసం ఆంక్షలను ఉల్లంఘించిందా? ఆ సీక్రెట్ డాక్యుమెంటరీలో ఏముంది?

By BBC News తెలుగు
|

ది మోల్‌లో ఒక దృశ్యం

అంతర్జాతీయంగా ఉన్న అనేక ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఉత్తరకొరియా చేస్తున్న ప్రయత్నాలను ముందెన్నడూ లేనట్లుగా వెలుగులోకి తెచ్చామంటూ ఓ డాక్యుమెంటరీ చెబుతోంది.

ఐరోపాకు చెందిన నలుగురు బ్రాడ్‌కాస్టర్లు, కొందరు ఔత్సాహిక పరిశోధకులు కలిసి కిమ్ జోంగ్ ఉన్ రహస్య పాలనలోని సభ్యులు కొందరిని మాయచేసి వారితో నకిలీ ఆయుధ ఒప్పందాలపై సంతకాలు పెట్టించినట్లుగా ఈ చిత్రం చూపిస్తోంది.

ఈ సందర్భంగా డెన్మార్క్, యుగాండా, ఉత్తరకొరియాల్లో తమ రహస్య ఆపరేషన్ సాగిందని.. కొన్ని చోట్ల బహిరంగంగా, మరికొన్ని చోట్ల రహస్యంగా తీసిన వీడియోలు ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయని చెబుతున్నారు.

ఆంక్షలున్నా అత్యంత రహస్యంగా ఆయుధాలు ఎగుమతి చేయడమెలా అని ఉత్తరకొరియా అధికారులు చర్చించడం ఈ వీడియోల్లో కనిపిస్తుంది.

కావో డి బెనెస్, ఉల్రిచ్ లార్సన్

వామపక్ష నియంతృత్వ పాలనలపై ఆసక్తి ఉన్న డెన్మార్క్‌కు చెందిన ఒక మాజీ చెఫ్, మిలటరీ యూనిఫాం అంటే మోజున్న స్పెయిన్‌కు చెందిన ఓ పెద్దమనిషి, ఫ్రాన్స్‌కు చెందిన మాజీ దళాధిపతి, కొకైన్ కేసులో దోషి ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు.

అయితే, ఇదంతా నిజమేనా? ఐరాసకు చెందిన ఒక మాజీ అధికారి దీనిపై బీబీసీతో మాట్లాడుతూ ఇందులో ఉన్నదంతా అత్యంత నమ్మశక్యంగానే ఉందన్నారు.

'ది మోల్' అనే ఈ చిత్రాన్ని డెన్మార్మ్‌కు చెందిన ఫిలిం మేకర్ మేడ్స్ బ్రగర్ తీశారు. అంతర్జాతీయ చట్టాలను ఉత్తరకొరియా ఎలా ఉల్లంఘిస్తుందో బయటపెట్టడానికి తాను మూడేళ్ల పాటు రహస్య ఆపరేషన్ చేపట్టానని బ్రగర్ చెప్పారు.

వామపక్ష నియంతృత్వంపై ఆసక్తి ఉన్న డెన్మార్క్‌కు చెందిన ఒక మాజీ చెఫ్ ఉల్రిచ్ లార్సన్.. బ్రగర్ సహాయంతో స్పెయిన్ కేంద్రంగా ఉన్న ఉత్తరకొరియా పాలకవర్గ అనుకూల సంస్థ 'కొరియన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్'(కేఎఫ్‌ఏ)లో మెల్లగా చేరారు. అందులో మెల్లమెల్లగా పట్టు సాధించి చివరికు ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారుల నమ్మకాన్ని సాధిస్తారు.

ఆ తరువాత కేఎఫ్ఏ సభ్యులు లార్సన్‌ను ఆ సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అలెజాండ్రో కావో డి బెనెస్‌‌ను కలిసేలా చేస్తారు. 'ఉత్తరకొరియా కాపలాదారు'గా ప్రపంచమంతా చెప్పుకొనే స్పెయిన్ పెద్దమనిషి ఆయన.

ఈ చిత్రంలో కొన్నిసార్లు ఆయన ఉత్తరకొరియా సైనిక యూనిఫాంలో కనిపిస్తారు. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని పాలక పెద్దల వద్ద తనకు ఉన్న పట్టు, ప్రాబల్యం గురించి కావో డి బెనోస్ గొప్పలు చెబుతుంటారు.

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం

మరో వ్యక్తి జెమ్ లాట్రాచీ కోవర్టప్... ఫ్రాన్స్‌కు చెందిన మాజీ దళాధిపతి ఈయన. దోషిగా నిరూపణ అయిన కొకైన్ డీలర్ కూడా. అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి 'మిస్టర్ జేమ్స్' పాత్ర పోషించారీయన. మాంచి ఖరీదైన సూట్లలో కనిపిస్తారీయన.

ఈ సినిమా కోసం పదేళ్లు పనిచేశానని బ్రగర్ చెబుతారు. బీబీసీ, మరికొందరు స్కాండినేవిన్ బ్రాడ్‌కాస్టర్ల నిర్మాణంలో ఈ చిత్రం వచ్చింది.

''నేను సంచలనాలు కోరుకునే ఫిలింమేకర్‌ని'' అని బ్రగర్ ఇందులో చెబుతారు. ఒక్కోసారి ఇందులోని సన్నివేశాలు నమ్మశక్యంగా ఉండవు. విచిత్రంగా అనిపిస్తాయి.

అయితే, 2014-19 మధ్య ఉత్తరకొరియా విషయంలో ఐరాస నిపుణుల బృందంలో పనిచేసిన హఫ్ గ్రిఫిత్స్ మాత్రం ఇందులో అత్యంత నమ్మదగ్గ అంశాలున్నాయని చెబుతున్నారు.

''ఇప్పటివరకు మేం చూసినవాటిలో ఈ చిత్రమే కిమ్ జోంగ్ ఉన్‌కు అత్యంత ఇబ్బందికరమైనది'' అన్నారు గ్రిఫిత్స్. ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఇప్పటికే మనకు తెలిసినవని గ్రిఫిత్స్ అన్నారు.

మిస్టర్ డేనీ, లాట్రెచ్ కోవర్టప్

ఆ దేశ అణు ఆకాంక్షల కారణంగా ఉత్తరకొరియాపై 2006 నుంచి ఆంక్షలున్నాయి. 2010 నుంచి నిపుణుల బృందం అక్కడి అణ్వస్త్ర అభివృద్ధి కార్యక్రమాలు, పరీక్షలపై నిత్యం నివేదికలలో నమోదు చేసింది.

అయితే, ఆంక్షలను తప్పించుకుంటూ ఆయుధ ఎగుమతులు ఎలా చేయాలనే విషయంపై ఉత్తరకొరియా అధికారులు చర్చిస్తూ కనిపించడమనేది ఇంతకుముందు ఏ చిత్రంలోనూ లేదు.

ఈ చిత్రంలో ఒక చోట మిస్టర్ జేమ్స్(లాట్రెచ్ కోవర్టప్) ఉత్తరకొరియా ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఆ దేశ ఆయుధ కర్మాగారం ప్రతినిధులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు.

ప్యాంగ్యాంగ్ శివారులోని ఒక ఆడంబరమైన బేస్‌మెంట్ రెస్టారెంటులో వీరి భేటీ జరుగుతుంది.

ఆ సన్నివేశంలో అక్కడున్న కొరియన్లంతా కొరియన్లలా కనిపించలేదు. దానిపై లాట్రెచ్ కోవర్టప్ తరువాత మాట్లాడుతూ కొరియన్ అధికారులు ఒకరు గుచ్చిగుచ్చి అడిగినప్పుడు అప్పటికప్పుడు ఒక కంపెనీ పేరు చెప్పాల్సివచ్చిందని నవ్వుతూ చెప్పారు.

అయితే, అలా పత్రాలపై సంతకాలు చేసిన, పత్రాలు మార్చుకున్న సందర్భాన్ని చిత్రీకరించడానికి అసలైన కొరియా అధికారులు అనుమతిస్తారనుకోవడం నమ్మశక్యంగా లేదు.

ఆ పత్రంపై నారే ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కిమ్ ర్యాంగ్ చోల్ సంతకం ఉంటుంది. కొరియా ద్వీపకల్పంలో నారే అనేది ఒక సాధారణ పేరు. అయితే, కొరియాలోని నారే ట్రేడింగ్ కార్పొరేషన్ అనే సంస్థ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఆదాయం ఆర్జించే కార్యకలాపాలకు పాల్పడిందని 2020 ఆగస్టు 28 నాటి యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ నివేదికలో ఉంది.

ఐరాస మాజీ అధికారి గ్రిఫిత్స్ మాట్లాడుతూ.. తమకు ఏమాత్రం తెలియని ఒక వ్యాపారితో ఒప్పందం చేసుకోవడానికి అక్కడున్న కొరియన్లు సిద్ధమైపోయారని ఆ సన్నివేశం చెబుతోందన్నారు.

''ఐరాస ఆంక్షలు ఫలితమిస్తున్నట్లుగా చెబుతోంది ఆ సన్నివేశం.. తమ ఆయుధాలు అమ్ముకోలేని స్థితిలో ఉత్తరకొరియా చాలా ఆత్రుత పడినట్లు కనిపించింది'' అన్నారాయన.

దర్శకుడు బ్రగర్

2017లో యుగాండాలోని కంపాలాలో జరిగినట్లుగా చూపించిన దృశ్యంలో ఉత్తరకొరియా ఆయుధ వ్యాపారి 'మిస్టర్ డేనీ' తమ(ఉత్తరకొరియా) ఆయుధాలు సిరియాకు సరఫరా చేయగలవా అని లాట్రెచ్ కోవర్టప్‌ను అడుగుతారు.

ఉత్తరకొరియా ఇలాంటి అక్రమ వ్యవహారాలు సొంతంగా చేసుకోలేకపోతుందనడానికి ఇది ఉదాహరణ అని గ్రిఫిత్స్ అన్నారు.

ప్యాంగ్యాంగ్‌ భేటీలో కనిపించిన వారిలో కొందరు అధికారులతో కలిసి మిస్టర్ జేమ్స్ యుగాండోలో కనిపిస్తారు. లేక్ విక్టోరియాలోని ఒక ద్వీపం కొనుగోలు గురించి చర్చిస్తారు.

లగ్జరీ రిసార్ట్ నిర్మాణం కోసం ఆ ద్వీపం కొనుగోలు చేస్తున్నట్లు యుగాండా అధికారులకు చెప్పినప్పటికీ అక్కడ మిస్టర్ జేమ్స్, మరికొందరు కొరియన్లు రహస్యంగా భూగర్భంలో ఆయుధ కర్మాగారం ఏర్పాటుచేయాలని ప్రణాళిక రచిస్తారు.

నిజానికి గతంలో ఉత్తరకొరియా నమీబియాలో ఇలాంటి పనే చేసింది. విగ్రహాలు, స్మారకాల పనికోసం ఆ దేశంలో ఉన్నట్లుగా నటించి అక్కడి లెపర్డ్ దీవిలోని ఒక వాడకంలో లేని రాగి గనిలో ఉత్తరకొరియన్లు ఆయుధ కర్మాగారం ఏర్పాటుచేశారు.

''నమీబియాలో ఉత్తర కొరియా ప్రాజెక్టులు మూసివేయించాం'' అని ఐరాస మాజీ అధికారి గ్రిఫిత్స్ చెప్పారు. ''అయితే, 2018 నాటికి ఉత్తరకొరియా ఆయుధ దళారులు చేరడానికి అవకాశం ఉన్న ఆఫ్రికా దేశాల్లో యుగాండా కూడా ఒకటి'' అన్నారు గ్రిఫిత్స్.

ఈ సినిమాలో అంతర్జాతీయ పరిశీలకులకు ఆసక్తి కలిగించే అంశం ఇంకోటి ఉంది. అది.. ఐరాస ఆంక్షలను ఉల్లంఘించడంతో ఉత్తరకొరియా సహాయసహకారాలు అందించడానికి వివిధ దేశాల్లోని ఉత్తరకొరియా దౌత్యవేత్తల ప్రమేయం.

ఉల్రిచ్ లార్సన్ స్టాక్‌హోమ్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఒక దౌత్యవేత్త నుంచి ఆయన యుగాండాలోని ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలకు సంబంధించిన కవరును అందుకున్నట్లుగా ఒక సన్నివేశం ఉంది.

అయితే, ఈ చిత్రంలో చర్చించిన ఒప్పందాలేవీ వాస్తవంలో ఫలించినవి కాదు. చివరికి భాగస్వాములు డబ్బు డిమాండ్ చేయడంతో ''మిస్టర్ జేమ్స్'' పాత్రను మాయం చేస్తారు బ్రగర్స్.

ఈ చిత్ర నిర్మాతలు తమ వద్ద ఉన్న సాక్షాధారాలను స్టాక్‌హోమ్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయానికి సమర్పించినా వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.

కేఎఫ్ఏ వ్యవస్థాపకుడు కావో డి బెనెస్ మాట్లాడుతూ ఊరికే అలా నటించానని.. ఈ చిత్రంలో అంతా పక్షపాతంగా, లేనివి ఉన్నట్లు కల్పించి చూపించారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
North Korea violated sanctions over weapons trade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X