India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెరాయిన్‌: ఒకనాటి ఈ దగ్గు మందు మత్తు మందుగా ఎలా మారింది... చరిత్రలో ఏం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

హెరాయిన్ పేరు వినగానే అంతా ఉలిక్కిపడతారు. ఇదొక నిషిద్ధ పదార్ధం కాబట్టి దాని జోలికి పోతే చట్టపరంగా ఇబ్బందులు వస్తాయని చాలామంది భయపడతారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ తరలిస్తూ పట్టుబడ్డాడన్న వార్త సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఏపీతోపాటు దేశవ్యాప్తంగా హెరాయిన్, ఇతర మాదక ద్రవ్యాల వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం సృష్టిస్తోంది.

నేడు మత్తు పదార్ధంగా, నిషేధిత మాదక ద్రవ్యంగా పేరున్న హెరాయిన్‌ను 19వ శతాబ్ధి చివర్లో అధికారికంగా, లేబరేటరీలలో తయారు చేసేవారంటే నమ్మాల్సిందే. కొన్ని సంవత్సరాల తరువాత దగ్గు, గొంతు నొప్పికి మందును తయారు చేయడంలో దీనిని ఉపయోగించారు.

ఈ పరిణామాలు జరిగిన వందేళ్ల తర్వాత హెరాయిన్ నిషేధిత డ్రగ్‌ గా మారింది. ఇప్పుడు దానిని వినియోగించడం చట్ట విరుద్ధం. ఈ మత్తు పదార్ధాన్ని అధికంగా తీసుకోవడం వల్ల గత 20 ఏళ్లలో ఒక్క అమెరికాలోనే 130,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

మరి ఒకప్పుడు ఔషధంగా ఉపయోగపడిన హెరాయిన్ అప్పట్లో ఎలా తయారు చేసేవారు, తరువాత ఎందుకు నిషేధించారు?

డ్రగ్స్

హెరాయిన్ ఎలా తయారైంది?

హెరాయిన్ రసాయన నామం డయాసిటైల్మార్ఫిన్. దీని తయారీకి సంబంధించి 1874 సంవత్సరంలో తయారైన ఓ రిపోర్ట్‌లో మొదటిసారిగా ప్రస్తావన కనిపిస్తుంది.

లండన్‌లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పని చేస్తున్న సి.ఆర్.ఎ.రైట్ అనే ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త దీనిని మార్ఫీన్ నుంచి సేకరించారు.

''ఓపియం, మార్ఫీన్ అప్పటికే ఔషధంగా ఉపయోగించారు. ఓపియాయిడ్లను ఔషధాలలో ఉపయోగిస్తున్న విషయం ప్రజలకు కూడా తెలుసు'' అని వైద్యశాస్త్ర నిపుణుడు, బఫెలో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డేవిడ్ హెర్జ్‌బర్గ్ బీబీసీతో అన్నారు.

''ఈ పదార్ధాల వాడకం వ్యసనంగా మారుతుంది. ఇప్పటికే అలా జరుగుతోంది. కాబట్టి, ఫార్మా కంపెనీలు వ్యవసనానికి కారణం కాని నొప్పి నివారణ మందుల తయారీకి ఉపయోగించాలని భావించారు'' అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని సైకియాట్రీ ప్రొఫెసర్ కీత్ హంఫ్రీస్ అన్నారు.

హెరాయిన్‌ కు ప్రజలు బానిసలు కావడం నిజం కాదని, దానివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తక్కువగా ఉంటాయని ప్రారంభంలో కొందరు భావించేవారు.

''టీబీ వ్యాధిగ్రస్తులలో హెరాయిన్ వల్ల అనే సత్ఫలితాలు కనిపించాయి. ఇది దగ్గును నయం చేయడంలో సహాయపడుతుంది. రోగి నిద్ర పోయేందుకు సహకరిస్తుంది'' అని 2020 జూన్‌లో 'ది కన్వర్సేషన్’ జర్నల్‌లో కామిలో జోస్‌సెలా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో లోపెజ్-మునోజ్, అల్కలా యూనివర్సిటీ ప్రొఫెసర్ సిసిలియో అలమో గొంజాలెజ్ లు రాశారు.

కానీ, హెరాయిన్‌ ను కనుగొన్న మొదటి రోజుల్లో దానికి వైద్యపరంగా పెద్దగా ప్రాధాన్యత లభించ లేదు. 1897 వరకు ఇలాగే సాగింది.

అదే సమయంలో జర్మన్ ఫార్మా సంస్థ బేయర్ కంపెనీ తరఫున మార్ఫీన్, కోడైన్ స్థానంలో మరో డ్రగ్ కోసం ప్రొఫెసర్ హెన్రిచ్ డ్రెస్సర్ నేతృత్వంలోని బృందం పరిశోధన జరుపుతోంది. ఈ మార్పు ద్వారా శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుందన్నది వారి ఆలోచన.

ఈ సమాచారం బేయర్ లెవర్కుసెన్ ఆర్కైవ్ పత్రాల ద్వారా బైటపడింది.

పరిశోధనా బృందంలోని ఓ సభ్యుడు మార్ఫీన్, కోడైన్‌లకు బదులుగా డయాసిటైల్‌ మార్ఫీన్‌ను ఉపయోగించాలనే ఆలోచనను ప్రతిపాదించారు. దానిని మొదట జంతువులపై, తరువాత బేయర్‌లో పని చేసే వ్యక్తులపై, ఆ పై బెర్లిన్‌లోని వ్యక్తులపై పరీక్షించారు.

టీబీ, న్యుమోనియాలాంటి జబ్బులు వచ్చినప్పుడు దగ్గును తగ్గించేందుకు హెరాయిన్ ను మెడిసిన్‌ గా వాడేవారు

దగ్గు నివారిణి

డయాసిటైల్‌ మార్ఫీన్ దగ్గుపై ప్రభావవంతంగా పనిచేస్తుందని , దాని నుండి ఉపశమనం కలిగిస్తుందని పరీక్షల్లో తేలింది. అప్పట్లో దీనిని "హెరాయిక్ డ్రగ్" అని పిలిచేవారు.

1898లో బేయర్ కంపెనీ డయాసిటైల్‌ మార్ఫీన్‌ను ప్రధాన పదార్ధంగా ఉపయోగించి, దగ్గును తగ్గించే మందును తయారు చేయడం ప్రారంభించింది. ఈ మందుకు "హెరాయిన్" అని పేరు పెట్టింది.

పొడి రూపంలో 1 గ్రాము, 5 గ్రాములు, 10 గ్రాములు, 25 గ్రాముల డోసులు అందుబాటులో ఉండేవి. తర్వాత అది సిరప్, ఆపై మాత్రలు, చప్పరించే బిళ్లలు తదితర రూపాలలో కూడా రావడం మొదలైంది.

క్షయ, న్యుమోనియా, బ్రాంకైటిస్ తదితర వ్యాధుల వల్ల వచ్చే దగ్గును తగ్గించడానికి ఈ డ్రగ్ పని చేసింది.

బేయర్స్ లెవర్‌కుసెన్ ఆర్కైవ్ నుండి వచ్చిన పత్రాల ప్రకారం, 1899 నాటికి కంపెనీ 20 కంటే ఎక్కువ దేశాలలో హెరాయిన్‌ను విక్రయిస్తోంది. హెర్జ్‌బర్గ్, హంఫ్రీస్ అభిప్రాయం ప్రకారం, అమెరికాలో హెరాయిన్‌ను కౌంటర్‌లలో అమ్మేవారు. పిల్లలు కూడా కొనుక్కునే అవకాశం ఉండేది.

1914 సంవత్సరం వరకు కూడా హెరాయిన్ కొనడానికి రోగులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. అప్పటికి అమెరికా హారిసన్ నార్కోటిక్స్ చట్టాన్ని అమలు చేయలేదు.

హెరాయిన్ దగ్గును తగ్గించడానికే కాకుండా, మార్ఫీన్, ఆల్కహాల్ వ్యసనాల చికిత్సకు కూడా ఉపయోగపడిందని హంఫ్రీస్ అన్నారు. అయితే, కొన్నాళ్లకే ఈ మందు వాడకాన్ని తగ్గించాలని వైద్యులు నిర్ణయించారు.

దగ్గు మందుగా హెరాయిన్

వ్యసనంగా మారే ప్రమాదం

హెరాయిన్‌ను మార్కెట్ విక్రయాలకు అనుమతించే ముందు, ఇది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపించాయి.

''1900-1906 మధ్య ప్రచురించిన మెడికల్ లిటరేచర్ ఈ ఔషధానికి వ్యసనపరులుగా అవకాశం ఉంది అని పేర్కొన్నాయి'' అని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడాలో హిస్టరీ అండ్ మెడిసిన్ ప్రొఫెసర్ డేవిడ్ కోర్ట్‌రైట్ వెల్లడించారు.

"రోగులు అధిక మోతాదు తీసుకోవడం ద్వారా దానికి బానిసలవుతారని వైద్యులు, ఫార్మసిస్ట్‌లు త్వరలోనే గ్రహించారు'' అని యేల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది.

''వ్యసనం కలిగించే ప్రభావాలు ఉన్నప్పటికీ, దగ్గు కోసం మాత్రమే ఈ మందును ఉపయోగించిన వారిని ఇది వ్యసనపరులుగా మార్చలేదు'' అని కోర్ట్‌రైట్ చెప్పారు.

''20వ శతాబ్దం ప్రారంభంలో అనారోగ్యం కోసం మార్ఫీన్, ఓపియం లేదా హెరాయిన్‌ని ఉపయోగించిన 350 మందిలో, కేవలం ఆరుగురు మాత్రమే హెరాయిన్‌కు బానిసలుగా మారినట్లు గుర్తించారు. మొత్తం రోగులలో ఇది 1.7% మాత్రమే" అని ఆయన అన్నారు.

దగ్గు మందులో దీని డోసేజ్ చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కొందరు నిపుణులు చెప్పారు. '' కొందరు రోగులు హెరాయిన్‌కు బానిసలయ్యారు. కానీ, మార్పీన్‌కు కాదు'' అని కోర్ట్ రైట్ అన్నారు.

ప్రస్తుత తరుణంలో హెరాయిన్ మత్తు పదార్ధంగా ఆంక్షలు ఎదుర్కొంటోంది.

హెరాయిన్ ను ఎందుకు నిషేధించారు?

20వ శతాబ్ధి ఆరంభంలో నేరస్తులు చాలామంది హెరాయిన్‌ను ఉపయోగించడం మొదలు పెట్టారు. దీనివల్లే ఈ డ్రగ్‌పై ఆంక్షలు విధించాల్సి వచ్చింది.

''1910 నాటికి వైద్యేతర ఉపయోగం కోసం హెరాయిన్‌ ను వాడుతున్నట్లు తేలింది. అప్పటి నుంచే దీనిపై వివాదం మొదలైంది'' అని కోర్ట్ రైట్ అన్నారు.

నేర ప్రపంచంలోకి ఎలా ప్రవేశించింది?

''వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ హెరాయిన్'' అనే సంచికలో దీనికి సంబంధించిన ఒక ప్రచారాన్ని కోర్ట్‌రైట్ వెల్లడించారు.

"దేశంలోని జైళ్లలో కొంతమంది ఖైదీలు దగ్గు కోసం హెరాయిన్‌ ను ఉపయోగించారని, తర్వాత మిగిలిన ఖైదీలకు కూడా హెరాయిన్ పరిచితంగా మారిందని అంటారు. ఆ తర్వాత అది జైలు బయట కూడా ఉపయోగించడం మొదలైంది'' అని కోర్టురైట్ వెల్లడించారు.

అయితే, హెరాయిన్ గురించి ఈ రూమర్ చాలాచోట్ల నుంచి వినిపించింది

దీనికి తోడు కొకైన్ కంటే హెరాయిన్ బ్లాక్ మార్కెట్‌లో చౌకగా మారింది. నల్లమందు కంటే దీనిని సంపాదించడం సులభం. యేల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, 1912 నాటికి, న్యూయార్క్‌లోని యువకులు దీనిని రిక్రియేషన్ డ్రగ్ ( వినోద ఔషధం)గా ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Heroin‌: How did this one-time cough medicine become an intoxicating drug
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X