• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా వాళ్లకు పాలను అరిగించుకునే శక్తి ఎలా వచ్చింది?

By BBC News తెలుగు
|
పాలు, చైనా

గత కొన్నేళ్లుగా పాల మీద చైనా ప్రజలకు మక్కువ పెరుగుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఇప్పుడు డెయిరీ ఉత్పత్తులకు రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారింది. న్యూజీలాండ్, జర్మనీ లాంటి దేశాల నుంచి పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తులు ఆ దేశానికి వస్తున్నాయి.

అయితే, చాలా ఆసియా దేశాల్లోలాగానే చైనాలో కూడా లాక్టోస్ ఇంటాలరెంట్ అంటే పాలను సరిగ్గా అరిగించుకోలేని వారు ఎక్కువ. మనుషుల్లో చిన్నతనంలో అందరికీ పాలను అరిగించుకునే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. కానీ, పెద్ద అవుతున్న కొద్దీ మనుషుల్లో ఈ ఎంజైమ్ తగ్గిపోతుంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల వారికి ఇలాగే జరుగుతుంది.

యురోపియన్ సంతతి వారిలో మాత్రం పెద్దవారు కూడా చాలా వరకూ పాల ఉత్పత్తులను అరిగించుకోగలరు.

గతంలో చైనాలో పెద్దల్లో పాలను అరిగించుకోలేనివారు 92 శాతం మంది దాకా ఉండేవారు. ఇక తాజాగా చైనాకు చెందిన ప్రీవెంటివ్ మెడిసిన్ ఏజెన్సీ నిర్వహించిన అధ్యయనం 11 నుంచి 13 ఏళ్లు వచ్చేసరికి పిల్లల్లో 40 శాతం మందికి పాలను అరిగించుకోలేని లక్షణం వస్తున్నట్లు పేర్కొంది.

చైనాలో 20వ శతాబ్దంలో చాలా వరకూ పాలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదని బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ డుబోయిస్ చెప్పారు.

ఈశాన్య చైనాలో సగటున నాలుగు ఆవులుండే పాడిశాలలు ఉండేవి. వాటి నుంచి హార్బిన్ నగరానికి వెన్న, చీజ్ లాంటి పాల ఉత్పత్తులు వెళ్లేవి. ఆ తర్వాత తీర ప్రాంతాల్లోని నగరాల్లో కాస్త పెద్ద డెయిరీలు మొదలయ్యాయి.

1980ల్లో చైనాలో పాల పొడి ఓ ఆరోగ్యకరమైన ఉత్పత్తిగా అవతరించింది. పిల్లలు, వృద్ధుల కోసం దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. 1980ల ఆరంభంలో బీజింగ్‌లో పాలకు బాగా డిమాండ్ ఉండేది. జనం పాల కోసం రాత్రిళ్లు లైన్‌లు కట్టేవారు.

''ఓ కుటుంబానికి ఎంత పాలు ఇవ్వాలన్నదానిపై కఠినమైన రేషన్ విధానం అమలయ్యేది. పిల్లల కన్నా వృద్ధులకు ఇది ఎక్కువ అవసరమని అనుకునేవారు. చాలా మంది ఇంట్లో పాప కోసమో, ముసలివాళ్ల కోసమో ఉంచిన పాలను దొంగతనంగా రుచి చూసేవారు. అంత తక్కువగా పాల లభ్యత ఉండేది'' అని డుబోయిస్ చెప్పారు.

అక్కడ వైట్ ర్యాబిట్ అనే పెప్పర్మెంట్ విపరీతంగా అమ్ముడయ్యేది. దీన్ని పాలతో చేసేవారు. ఏడు వైట్ ర్యాబిట్ పెప్పర్మెంట్ బిళ్లలు కలిస్తే, ఒక గ్లాసు పాలకు సమానమని అప్పుడు అంటుండేవారు.

అమెరికా అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ చైనాకు వచ్చినప్పుడు, ఆయనకు ఈ పెప్పర్మెంట్‌ను బహుమతిగా ఇచ్చారు.

పాలు, చైనా

1990ల్లో, 2000ల ఆరంభంలో చైనాలో పాల లభ్యత బాగా పెరిగింది. దేశంలో పెద్ద పెద్ద డెయిరీలు వచ్చాయి.

2008లో ఓ వివాదం కూడా వచ్చింది. చిన్నపిల్లల కోసం ఉద్దేశించిన పాలలో ప్రొటీన్‌ను పెంచేందుకోసం ఓ డెయిరీ మెలమైన్ కలపడంతో కనీసం ఆరుగురు పిల్లలు మరణించారు. వేల మంది అనారోగ్యం పాలయ్యారు.

చైనాలోని రెండు అతిపెద్ద డెయిరీ సంస్థల అమ్మకాలు ఆ సమయంలో ఓ పది రోజుల పాటు 80 శాతం మేర పడిపోయాయని, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ కుదుటపడిందని డుబోయిస్ చెప్పారు.

పాలు, డెయిరీ ఉత్పత్తులు ఇప్పుడు చైనాలో చవగ్గా దొరికేస్తున్నాయి. చీజ్ విరివిగా ఉండే ఆహార పదార్థాలను ఉపయోగించే పిజ్జా హట్ లాంటి రెస్టారెంట్లు పిల్లలతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. పెద్ద వాళ్లు మాత్రం వాటికి దూరంగానే ఉంటుంటారు.

పాలను సరిగ్గా అరిగించుకోలేని చైనా, ఇలా పాల ఉత్పత్తులను విరివిగా వినియోగించే పరిస్థితికి ఎలా చేరింది?

డుబోయిస్‌ను కూడా కొన్నేళ్లుగా ఈ ప్రశ్న వెంటాడుతోంది.

''మొదట్లో నాకు పరిచయం కూడా లేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి, జీర్ణ సమస్యలు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించేవాడిని. సమస్యగా అనిపించేవి, తీసుకోవడం మానేస్తామని వాళ్లు అనేవారు'' అని ఆయన అన్నారు.

పాలు, చైనా

చైనాలో పాల ఉత్పత్తులను చాలా వరకూ యోగర్ట్ రూపంలోనే తీసుకుంటుంటారు. పెరుగు లాగా పులియబెట్టిన పదార్థం ఇది. పులియబెడితే, లాక్టోస్ విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి సులభంగానే అరుగుతుంది.

జీర్ణపరంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఎంత లాక్టోస్ తీసుకుంటున్నామన్నదానిపై ఆధారపడి ఉంటుంది. రోజులో ఒక కప్ కన్నా తక్కువ పాలు తీసుకుంటే, పెద్దగా సమస్య రాకపోవచ్చు.

చైనాలో పాల ఉత్పత్తులు తినడం ఎక్కువైనా, ఇప్పుడు పెద్దగా జీర్ణ సమస్యలు వారిలో రావట్లేదు. చైనాలోని పిల్లలపై భవిష్యతులో దీని ప్రభావం కనిపిస్తుందా? వాళ్లలో లాక్టోస్‌ను అరిగించే ఎంజైమ్‌లు ఎక్కువ కాలం ఉంటాయా?

''చిన్నప్పటి నుంచీ పాల ఉత్పత్తులను తింటూ ఉండటం వల్ల లాక్టోస్‌ను అరిగించుకునే శక్తి కూడా వస్తూ ఉండొచ్చు. లాక్టోస్ లేకుండా, లేదా తక్కువగా ఉండే ఉత్పత్తులకు పెద్దగా డిమాండ్ ఉండట్లేదు. దీన్ని బట్టి సమస్య ఇదివరకు ఊహించనంత పెద్దది కాదని అర్థమవుతోంది'' అని డుబోయిస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China people can digest milk products
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X