వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో క్రూర చర్యలకు ఎలా పాల్పడ్డారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
1945లో రావెన్స్‌బ్రక్

''సైనిక ప్రదేశంలో పనిచేసేందుకు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యవంతులైన మహిళలు కావలెను’’ అంటూ 1944లో జర్మనీలో ఓ దినపత్రికలో ప్రకటన వచ్చింది. ఉద్యోగంలో చేరినవారికి మంచి జీతంతోపాటు ఉచితంగా వసతి సదుపాయం, దుస్తులు కూడా ఇస్తామని ఆ ప్రకటనలో ఉంది.

అయితే, ఆ దుస్తులు 'ఎస్ఎస్’ యూనిఫామ్ అని, ఆ సైనిక ప్రదేశం నాజీలు నిర్వహిస్తున్న 'రావెన్స్‌బ్రక్ కాన్సంట్రేషన్ క్యాంపు’ అని అందులో చెప్పలేదు.

బెర్లిన్‌కు ఉత్తరంగా 80 కి.మీ.ల దూరంలో ఈ రావెన్స్‌బ్రక్ క్యాంపు ఉంది. అయితే, అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు చాలావరకూ తుడిచిపెట్టుకునిపోయి, ఇప్పుడు అది ఖాళీ ప్రదేశంగా మారింది.

1940ల్లో నిర్మించిన ఎనిమిది విల్లాలు మాత్రం ఇంకా అక్కడ అలాగే ఉన్నాయి.

వీటిలోనే ఆ మహిళా గార్డులు ఉండేవారు. కొందరు వాళ్ల పిల్లలతో పాటు నివసించేవారు. వాళ్లు బాల్కనీల్లోకి వచ్చి చూస్తే ఓ అడవి, అందమైన సరస్సు కనిపించేవి.

1945లో రావెన్స్‌బ్రక్

''అక్కడున్న సమయం నా జీవితంలోనే చాలా అందమైన అధ్యాయం’’ అని ఓ మహిళా గార్డు అన్నారు.

అయితే, వాళ్ల పడక గదుల నుంచి చూస్తే... గొడ్డు చాకిరీ చేస్తున్న ఖైదీలు, అక్కడున్న గ్యాస్ ఛాంబర్ చిమ్నీలు కూడా వారికి కనిపించేవి.

''ఇక్కడికి వచ్చే చాలా మంది సందర్శకులు మహిళా గార్డుల గురించి అడుగుతుంటారు. మహిళలు క్రూరంగా వ్యవహరిస్తారన్న ఊహ వారికి పెద్దగా రాదు’’ అని రావెన్స్‌బ్రక్‌లో ఉన్న స్మారక మ్యూజియం డైరెక్టర్ ఆండ్రియా జెనెస్ట్ అన్నారు.

ఇక్కడ మహిళా గార్డులుగా పనిచేసిన చాలా మంది పేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. చదువు త్వరగా మానేసి, పెద్దగా ఉద్యోగావకాశాలు లేక ఇటు వైపు వచ్చారు.

కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ఉద్యోగం అంటే జీతాలు ఎక్కువ వచ్చేవి. సౌకర్యవంతమైన వసతి సదుపాయం కూడా కల్పించేవారు.

''అప్పట్లో ఫ్యాక్టరీల్లో పనిచేయడం కన్నా ఇదే మెరుగైన అవకాశంలా ఉండేది’’ అని జెనెస్ట్ అన్నారు.

ఇక్కడ పనిచేసేవారిలో చాలా మంది హిట్లర్ భావజాలాన్ని నమ్మి నాజీ యువ బృందాల్లో చేరినవారు కూడా ఉండేవారు.

''శత్రువులకు వ్యతిరేకంగా ఏదో చేస్తూ సమాజం కోసం పాటు పడుతున్నామని వాళ్లు అనుకుంటుండేవారు’’ అని జెనెస్ట్ అన్నారు.

రావెన్స్‌బ్రక్

అక్కడున్న ఇళ్లలో ఒకదానిలో ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఖాళీ సమయాల్లో అక్కడి మహిళా గార్డులు ఏం చేశారన్నదానికి సంబంధించిన ఫొటోలు అందులో ఉన్నాయి. వాటిలో కనిపిస్తున్నవారిలో చాలా మంది 20ల్లో ఉన్న అందమైన అమ్మాయిలే.

అమ్మాయిలు నవ్వులు చిందిస్తున్నవి, కాఫీలు తాగుతున్నవి, కేకులు తింటున్నవి, అడవిలోకి కుక్కలను వెంటపెట్టుకుని వెళ్తున్నవి... ఇలా రకరకాల ఫొటోలు ఉన్నాయి.

ఆ ఫొటోలన్నీ సాధారణంగానే అనిపిస్తాయి. కానీ, వారి దుస్తుల మీద ఎస్ఎస్ చిహ్నాలు చూసినప్పుడు, ఆ కుక్కల్లో కొన్నింటితో కాన్సంట్రేషన్ క్యాంపుల్లోని జనాలను వేధించేవారన్న విషయం తెలుసుకున్నప్పుడు మన ఒళ్లు గగుర్పాటుకు గురవ్వడం తప్పదు.

నాజీ క్యాన్సంట్రేషన్ క్యాంపు గార్డులుగా దాదాపు 3,500 మంది మహిళలు పనిచేశారు. వాళ్లంతా రావెన్స్‌బ్రక్‌లో ఉద్యోగాలు ప్రారంభించినవాళ్లే. ఆస్చ్విజ్-బర్కె, బర్గెన్-బెల్సన్ లాంటి డెత్ క్యాంపుల్లో కూడా వాళ్లు పనిచేశారు.

హిట్లర్

ఆ మహిళా గార్డులు చాలా దుర్మార్గులని 98 ఏళ్ల సెల్మా వాన్ డె పెరె గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సెల్మా లండన్‌లో ఉంటున్నారు.

ఒకప్పుడు ఆమె నాజీలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆమెను నాజీలో రావెన్స్‌బ్రక్‌లో రాజకీయ ఖైదీగా బంధించి పెట్టారు.

''ఖైదీల మీద ఆ మహిళా గార్డులు అధికారం చెలాయించేవారు. చాలా దారుణంగా వ్యవహరించేవారు. కొట్టేవారు. అధికారం చెలాయించడం వారికి బాగా నచ్చేది అనుకుంటా’’ అని సెల్మా అన్నారు.

నాజీ ఆక్రమిత నెదర్లాండ్స్‌లో యూదు కుటుంబాలను కాపాడేందుకు సెల్మా రహస్యంగా పనిచేసేవారు. తన అనుభవాలను వివరిస్తూ 'మై నేమ్ ఈస్ సెల్మా’ అన్న పేరుతో ఆమె ఓ పుస్తకం కూడా రాశారు.

సెల్మాది కూడా యూదు కుటుంబమే. ఆమె తల్లిదండ్రులను, చెల్లెళ్లను నాజీలు క్యాంపుల్లో పెట్టి చంపారు. దాదాపు ప్రతి ఏడాది సెల్మా రావెన్స్‌బర్క్‌కు వచ్చి, అక్కడ జరిగిన దారుణాలను ఎప్పటికీ మరిచిపోకూడదన్న ఉద్దేశంతో ఏర్పాుటు చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంటారు.

నాజీ జర్మనీలో మహిళల కోసమే ఏర్పాటు చేసిన అతిపెద్ద క్యాంపు రావెన్స్‌బర్కే. యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన 1.2 లక్షల మందిని ఇక్కడ బంధించి ఉంచారు.

ఖైదీల్లో చాలావరకూ నాజీల దారుణాలను వ్యతిరేకించినవారు, వారి రాజకీయ ప్రత్యర్థులు... నాజీల భావజాలం ప్రకారం సమాజంలో బతికేందుకు 'అర్హత లేని’ యూదులు, స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్లు, నిరాశ్రయ మహిళలు ఉండేవారు.

రావెన్స్‌బర్క్‌లో దాదాపు 30 వేల మంది చనిపోయారు. విషప్రయోగం, ఉరితీయడం, తిండి పెట్టకుండా చంపడం, చనిపోయేదాకా పనిచేయించడం... ఇలా రకరకాల పద్ధతుల్లో నాజీలు వారి ప్రాణాలను తీశారు.

చాలా మంది మహిళా గార్డులు బంధీలతో దారుణంగా వ్యవహరించేవారు. 'బ్లడీ బ్రిగ్రీడా’, 'రివాల్వర్ అన్నా’... ఇలాంటి పేర్లతో బంధీలు వారిని పిలుచుకునేవారు.

1945లో నాజీల యుద్ధ నేరాలపై విచారణ జరిగినప్పుడు రావెన్స్‌బ్రక్‌లో గార్డుగా పనిచేసిన ఇర్మా గ్రెస్‌ను మీడియా 'బ్యూటిఫుల్ బీస్ట్’ (అందమైన మృగం)గా వర్ణించింది. చేసిన నేరాలకు అప్పట్లో ఆమెకు ఉరి శిక్ష పడింది.

అయితే, ఈ వేల మంది మహిళా గార్డుల్లో న్యాయ విచారణ ఎదుర్కొంది 77 మంది మాత్రమే. వారిలో కొద్ది మందే దోషులుగా తేలారు.

నాజీ జర్మనీ

ఆ గార్డులు చాలా మంది తాము తప్పని పరిస్థితుల్లోనే ఆ పని చేశామని చెప్పుకున్నారు.

చాలా మంది తమ గతం గురించి మాట్లాడటం మానేశారు. పేర్లు మార్చుకుని, వివాహాలు చేసుకున్నారు. సమాజంలో కలిశారు.

మహిళా గార్డుగా పనిచేసి జైలు శిక్ష అనుభవించిన హెర్తా బోత్ అనే మహిళ ఈ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడారు.

''నేను తప్పు చేశానా? లేదు. అది కాన్సంట్రేషన్ క్యాంపు అవడం తప్పు. నేను అక్కడికి వెళ్లక తప్పలేదు. లేకపోతే నన్ను కూడా అందులో పెట్టేవారు’’ అని ఆమె అన్నారు.

అయితే, అందులో పనిచేయక తప్పని పరిస్థితి ఉందన్నది నిజం కాదు.

చాలా మంది గార్డులు రావెన్స్‌బర్క్‌కి వచ్చిన తర్వాత, అక్కడ జరుగుతున్నవి నచ్చక పని మానేశారు. వారిని నాజీలు వెళ్లేందుకు అనుమతించారు.

ఈ గార్డుల గురించి అనేక నవలలు, చిత్రాలు వచ్చాయి. కొన్ని వీరిని వంచనకు గురైనవారిగా చూపిస్తే, మరికొన్ని రాక్షసులుగా చూపించాయి.

అయితే, నిజం ఇంకా భయంకరమైనది. అదే సాధారణ మహిళలు అయ్యుండి, రాక్షస చర్యలకు పాల్పడే పరిస్థితికి వీళ్లు చేరడం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
most ordinary women commit atrocities in Nazi camps
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X