టైమ్ లైన్ : ఐసిస్ చీఫ్ బాగ్దాది అమెరికా వలకు ఎలా చిక్కాడు..ఎలా హతమయ్యాడు?
వాష్టింగ్టన్: మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్ ఐసిస్ ఉగ్రవాది అబు బకర్ అల్-బాగ్దాది అమెరికా జరిపిన మిలటరీ ఆపరేషన్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. బాగ్దాది పిరికివాడిలా మృతి చెందాడని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చెబుతూ ఆయన మరణాన్ని ధృవీకరించారు. అయితే బాగ్దాది ఎక్కడున్నాడు అనే విషయం అమెరికాకు ఎలా తెలిసింది..? ఎవరు సమాచారం ఇచ్చారు..? బాగ్దాది మృతికి అమెరికా వేసిన స్కెచ్ ఏంటి అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. వీటన్నిటికీ ట్రంప్ సమాధానం ఇచ్చారు.

పక్కా స్కెచ్ వేసిన అమెరికా సైన్యం
ఐసిస్ ఉగ్రవాది అబు బకర్ బాగ్దాదీ అమెరికా జరిపిన మిలటరీ ఆపరేషన్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బాగ్దాదీని ట్రాప్ చేసేందుకు అమెరికా పలు వ్యూహరచనలు చేసింది. పక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నాకే బాగ్దాదిని వేటాడింది. ముందుగా బాగ్దాది ఉన్న ప్రదేశం గురించి అమెరికా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. ఇది ఒక నెల క్రితం జరిగింది. కుర్దులనుంచి మరింత సమాచారం సేకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇక ఆపరేషన్‌కు రెండు వారాల ముందు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాగ్దాది ఉన్న లొకేషన్‌ను సరిగ్గా ట్రేస్ చేసింది. అయితే మూడురోజుల ముందు మాత్రమే ట్రంప్‌కు ఈ విషయం తెలిసినట్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఇక ఆపరేషన్ నిర్వహించబోయేముందు రష్యా, ఇరాక్, టర్కీలను తమ గగనతలం వినియోగించుకునేందుకు అనుమతి కోరిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఓ బ్రెయిన్ చెప్పారు. అయితే ఎలాంటి ఆపరేషన్ నిర్వహించబోతున్నామనేది రష్యాకు వెల్లడించలేదని ట్రంప్ చెప్పారు.

మినిట్-టూ-మినిట్ పర్యవేక్షించిన ట్రంప్ బృందం
శనివారం రోజున అమెరికా స్థానిక కాలమానప్రకారం ట్రంప్ సాయంత్రం 4:30 గంటలకు వైట్‌హౌజ్‌కు చేరుకున్నారు. 5 గంటలకు వైట్‌హౌజ్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్, జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఓ బ్రెయిన్‌తో పాటు ఇతర ఇంటెలిజెన్స్ అధికారులు కూడా హాజరయ్యారు. ఇక మిలటరీ ఆపరేషన్‌ను లైవ్‌లో చూశారు. ఇక వీరు వీక్షిస్తుండగానే అమెరికా మిలటరీ బలగాలు, మిలటరీ శునకాలతో కూడిన ఎనిమిది హెలికాఫ్టర్లు టేకాఫ్ తీసుకున్నాయి. మధ్యప్రాచ్యంలోని గుర్తుతెలియని ఎయిర్‌బేస్ నుంచి ఈ హెలికాఫ్టర్లు టేకాఫ్ తీసుకున్నాయి. పశ్చిమ ఇరాక్ నుంచి ఆపరేషన్‌ను అమలు చేశారని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక గ్రౌండ్ ఆపరేషన్‌లో భాగంగా ఇడ్లిబ్ ప్రాంతంలో మోహరించిన ఉన్న మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ యుద్ధనౌకలు కూడా పాల్గొన్నాయని ట్రంప్ చెప్పారు. ఇక మిషన్‌లో రోబోలు కూడా ఉన్నప్పటికీ వాటితో అవసరం పడలేదని చెప్పారు ట్రంప్.

గోడను బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన సైన్యం
ఇక బాగ్దాది ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టగానే హెలికాఫ్టర్లపైకి బుల్లెట్ల వర్షం కురిసిందని వాటిని అమెరికా సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టి హెలికాఫ్టర్లు సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ట్రంప్ చెప్పారు. ఇక బాగ్దాది ఉన్న ఇంటి కాంపౌండ్ గేటు బలంగా ఉండటంతో సైన్యం గోడను బాంబులతో పేల్చి కాంపౌండ్ గేటులోకి ప్రవేశించినట్లు చెప్పారు. ఇక ప్రతి నిమిషం అక్కడ ఏంజరుగుతోందో సమాచారం వచ్చేదని ట్రంప్ చెప్పారు. ఇక కాంపౌండ్‌లోకి చొచ్చుకుపోవడంతో కొందరు సరెండర్ అవగా లొంగిపోని కొందరిని సైన్యం హతమార్చిందని చెప్పారు.ఇక 11 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత ఐసిస్ ఉగ్రవాదులను పలువురిని పట్టుకున్నట్లు చెప్పారు.

టనెల్ ద్వారా బాగ్దాది తప్పించుకునే ప్రయత్నం
ఇక లోపల ఉన్న బాగ్దాది విషయం తెలుసుకుని ఓ టనెల్ ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు ట్రంప్. ఓ ముగ్గురు పిల్లలను తనతో పాటు ఈడ్చుకెళ్లినట్లు చెప్పిన ట్రంప్ బాగ్దాది సరెండర్ కావాలని సైన్యం చెప్పిందని.. సైన్యం మాటను బేఖాతరు చేయడంతో టనెల్లోకి మిలటరీ కుక్కలను పంపినట్లు ట్రంప్ చెప్పారు. ఇక టనెల్ చివరిన బాగ్దాది చిక్కుకుపోయాడు. ఎటూ కదలలేని పరిస్థితిలో కుక్కలు అతనిపై దాడి చేసినట్లు చెప్పారు ట్రంప్. ఇక చేసేదేమీ లేక తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని ట్రంప్ వివరించారు. తనతో పాటు ఉన్న ముగ్గురు పిల్లలకు నిప్పు అంటించి మృతి చెందాడని చెప్పారు. మంటలకు ఆ టనెల్ కూడా ధ్వంసమైందని ట్రంప్ చెప్పారు. అయితే ఒక కుక్కకు తీవ్రగాయాలయ్యాయని అంతకుమించి అమెరికా సైన్యంకు ఎలాంటి గాయాలు కాలేదని ట్రంప్ చెప్పారు.

15 నిమిషాల్లో డీఎన్ఏ టెస్టులు పూర్తి
ఇక బాగ్దాది ఆత్మహుతికి పాల్పడటంతో అమెరికా బలగాలు అతని మృతిని ధృవీకరించేందుకు 15 నిమిషాల్లో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి చనిపోయింది బాగ్దాదీనే అని ధృవీకరించింది. తామంతా అత్యవసర గదిలో ఉన్నప్పుడు ఆపరేషన్ కమాండర్ తమకు ఫోన్ చేసి జాక్‌పాట్ కొట్టామని మృతి చెందింది బాగ్దాదీనే అని ధృవీకరించారు. ఇక బాగ్దాదీ మృతి తర్వాత సైన్యం కాంపౌండ్ మొత్తంలో సోదాలు నిర్వహించి కొన్ని సున్నితమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. స్వాధీనం చేసుకున్న కొన్ని డైరీల్లో ఐసిస్ భవిష్యత్ దాడులకు సంబంధించి వివరాలు ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.
మొత్తం మీద అమెరికా సైన్యం రెండుగంటల పాటు కాంపౌండ్‌లో ఉండి ఆ తర్వాత వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోయిందని ట్రంప్ చెప్పారు. ఇక 2011లో ఒసామా బిన్‌లాడెన్ మృతి తర్వాత ఎలాంటి ప్రక్రియ కొనసాగిందో బాగ్దాదీ మృతదేహంకు కూడా అలాంటి ప్రక్రియే జరుగుతుందని ఓబ్రెయిన్ చెప్పారు. ఒసామా బిన్ లాడెన్‌ను సముద్రతీరంలో పూడ్చడం జరిగిందని... బాగ్దాదీని కూడా అలానే పూడ్చడం జరుగుతుందని బ్రెయిన్ చెప్పారు.