Asteroid:భూమికి అత్యంత దగ్గరగా భారీ గ్రహశకలం, ఆదివారం రోజు జాగ్రత్త..నాసా ఏం చెబుతోంది?
నాసా: సెప్టెంబర్ 6వ తేదీన భూమికి పెను ప్రమాదం సంభవించనుందా..? నాసా శాస్త్రవేత్తలు ఖగోళంను ఎందుకు అంత నిశితంగా పరిశీలిస్తున్నారు.. సెప్టెంబర్ 6న ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే ఈ స్టోరి చదవాల్సిందే..

భూకక్ష్యలోకి భారీ గ్రహశకలం
2020 సెప్టెంబర్ 6వ తేదీన ఓ పెద్ద గ్రహశకలం భూకక్ష్యకు అతిసమీపంలోకి రానున్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది ఈజిప్టులోని గిజా పిరమిడ్ కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రహశకలం 465824 2010 FR అని పిలుస్తున్న నాసా శాస్త్రవేత్తలు దీనిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. దీన్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (NEO)గా అభివర్ణిస్తున్న శాస్త్రవేత్తలు ఇది అత్యంత ప్రమాదకరమైన గ్రహశకలమని చెబుతన్నారు. సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో ఈ గ్రహశకలాలు భూమికి దగ్గరగా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సమయంలోను భూమికి ఎంత దూరంలో ఉందనేది శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తారు. ఇతర గ్రహాల గురత్వాకర్షణ శక్తివల్ల ఈ శకలాలు భూమి కక్ష్యలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరహా గ్రహశకలాల్లో ఎక్కువగా దుమ్ము, నీరు కలగలిపి ఉంటాయని భావిస్తున్నారు. ఇక గ్రహశకలం 465824 2010 FRను 2010 మార్చి 18న కాలాలినా స్కై సర్వే వారు కనుగొన్నారు.

అసలు గ్రహశకలాలు అంటే ఏమిటి..?
గ్రహశకాలలు అనేవి సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతుంటాయని అవి గ్రహాల కంటే చాలా చిన్నవిగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు తెలిసిన గ్రహశకలాల సంఖ్య 994,383గా ఉంది. వీటిని 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన సౌరకుటుంబం నుంచి లెక్కించడం జరిగిందని చెప్పారు. ఇవి ఎక్కువగా అంగారకుడు గురు గ్రహాల మధ్యనే ఉంటాయని చెప్పారు. చిన్న చిన్న దుమ్ముతో కూడిన వస్తువులు అన్నీ కలిపి ఒక శకలంగా ఏర్పాటు అయ్యాయని శాస్త్రవేత్తలు వివరించారు. గ్రహశకలాలను ట్రోజాన్లుగా విభజించడం జరిగింది. అంటే పెద్ద గ్రహాల కక్ష్యలోనే ఇవి కూడా ఉంటాయి. ఇప్పటికే జూపిటర్, నెప్ట్యూన్ మరియు మార్స్ గ్రహాల ట్రోజాన్లు ఉన్నాయని చెప్పిన నాసా... 2011లో భూమి కూడా ఈ జాబితాలోకి చేరినట్లు వెల్లడించారు.

శాస్త్రవేత్తలు గ్రహశకలాలను ఎందుకు ట్రాక్ చేస్తారు..?
గ్రహశకలాలను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటారు. దీని వెనక కారణం ఉంది. అసలు సూర్యుడు, ఇతర గ్రహాల పుట్టుక, వాటి చరిత్రను తెలుసుకునేందుకే గ్రహశకలాలను ట్రాక్ చేసి నిశితంగా పరిశీలిస్తారు శాస్త్రవేత్తలు. గ్రహాలు ఆవిర్భవించిన సమయంలోనే గ్రహశకలాలు కూడా పుట్టాయి కనుక వాటిపై పరిశోధన చేస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఇవి ఏ స్థాయిలో ప్రమాదకరమైనవో అనే అంశంపై కూడా శాస్త్రవేత్తలు నిర్ధారణకు వస్తారు. ఇక సౌరవ్యవస్థలో ఒక బిలియన్ గ్రహశకలాలు ఉన్నట్లు ప్లానెటరీ సొసైటీ చెబుతోంది. ఇవన్నీ ఒక మీటరు వ్యాసం కలిగి ఉన్నాయని వీటివల్ల ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఇక 30 మీటర్ల వ్యాసం కంటే ఎక్కువగా ఉన్న గ్రహశకలాలే ప్రమాదంగా మారుతాయని స్పష్టం చేశారు. ఏటా 30 చిన్న గ్రహశకలాలు భూమిని ఢీకొంటాయని అయితే ఎలాంటి హానీ తలపెట్టవని చెబుతున్నారు.