భూమికి అతి సమీపంలో భారీ ఉల్క: ఢీ కొట్టిందా.. ఓ ఖండమే నాశనం
విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో అంతరిక్షంలోని అద్భుతాలను మనం వీక్షించగలుగుతున్నాం. కొన్ని గ్రహాలు భూమికి దగ్గరగా రావడం, పాలపుంతలో చోటు చేసుకునే పరిణామాలు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వంటివి చాలా ఘటనలు చూశాం. తాజాగా ఓ భారీ ఉల్క శనివారం రోజున భూమికి దగ్గరగా ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైందని హెచ్చరిస్తున్నారు.

భూమికి అతిసమీపంలో భారీ ఉల్క
శనివారం రోజున భూమికి అతి సమీపం నుంచి ఓ భారీ ఉల్క ప్రయాణిస్తుందని నాసా అనుబంధ సంస్థగా పనిచేస్తున్న నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ తెలిపింది. ఈ భారీ ఉల్కపై అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు దీని తీవ్రతను గురించి కూడా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇది భూమిని ఢీకొంటే మాత్రం ఒక సెకనులో కొన్ని మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతారని ఆ స్థాయిలో ఈ భారీ ఉల్క తీవ్రత ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీని దిశ, కక్ష్య గురించి అవగాహన ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

గంటకు 54,717 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
దీని వెడల్పు ఒక కిలోమీటరు వరకు ఉంటుందని అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక దీని వేగం గురించి కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఉల్క గంటకు 54,717 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని చెప్పారు. ఈ స్థాయి వేగంతో ప్రయాణించే ఉల్కలు ప్రమాదకర జాబితాలో చేర్చడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఒకవేళ ఈ ఉల్క భూమిని ఢీకొంటే ఒక అణ్వయుధాలతో వచ్చే చేటు ఏదైతే ఉంటుందో దీని ద్వారా కూడా అలాంటి చేటే సంభవిస్తుందని మరో శాస్త్రవేత్త చెప్పారు. అంతేకాదు భూమిపై కొన్ని జీవరాశులు అంతరించి పోతాయని కూడా హెచ్చరించారు.

ఒక ఖండాన్నే నాశనం చేయగల సామర్థ్యం
ప్రమాదకరంగా మారిన ఈ భారీ ఉల్క పేరు 2002 PZ39 అని శాస్త్రవేత్తలు చెప్పారు. పొరపాటున ఇది భూమిని ఢీకొంటే ఒక ఖండం మొత్తం నాశనం చేసే సామర్థ్యం ఈ ఉల్కకు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక బుర్జ్ ఖలీఫా టవర్ కంటే పొడవుగా ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్తలు అత్యంత వేగంతో భూమివైపు ఇది దూసుకొస్తుందని చెప్పారు. ఈ భారీ ఉల్క అపోలో ఆస్టరాయిడ్కు చెందినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఉల్క సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో తరుచూ భూమికి సమీపంలోకి వస్తుంటుందని చెప్పారు. అదే సమయంలో భూకక్ష్యను దాటుకుంటూ వెళుతుందని చెప్పారు. ఆ సమయంలోనే భూమిని ఢీకొట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ కార్యాలయం మాత్రం ఈ భారీ ఉల్క భూమి దగ్గర నుంచి సురక్షితంగా వెళ్లిపోతుందని చెప్పారు. 5.77 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచే వెళుతుందంటూ ట్వీట్ చేశారు. అంటే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 15 రెట్ల దూరం నుంచి వెళుతుందని చెబుతున్నారు.