
భారత్ విధానం గొప్పది: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు ఇమ్రాన్ ఖాన్, సొంతదేశంపై విమర్శలు
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. లాహోర్‌లో జరిగిన బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్ అనుసరిస్తున్న విదేశీ విధానం వారి ప్రజల శ్రేయస్సు కోసమేనంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు మాత్రం ఇలాంటి విధానం లేదన్నారు. పాక్‌లో ప్రజల కోసం కాకుండా కొందరి స్వప్రయోజనాల కోసమేనంటూ సొంత దేశ విధానాన్ని విమర్శించారు ఇమ్రాన్ ఖాన్.

ఇమ్రాన్ ఖాన్.. భారత్‌పై ప్రశంసలు.. పాక్‌పై విమర్శలు
అమెరికాతో ఓవైపు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూనే.. మరోవైపు రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. వారి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఆ నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ, మన విదేశీ విధానం మాత్రం ప్రజల ప్రయోజనాలకు చాలా దూరంగా ఉంది అని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సొంత దేశంపైనే విమర్శలు గుప్పించారు. తన రష్యా పర్యటనను ఇమ్రాన్ ఖాన్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

రష్యా పర్యటన, విదేశీ కుట్రలపై ఇమ్రాన్ ఖాన్
పాక్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లోనే తాను రష్యాలో పర్యటించానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ముఖ్యంగా ఆయిల్ పై 30 శాతం రాయితీ రష్యా ఇస్తోన్న విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్థానిక నాయకత్వంతో కలిసి విదేశీ శక్తులు కుట్రలు చేశాయంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్.
కాగా, గతంలో కూడా భారత్ విదేశీ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ను కట్టడి చేసినట్లు, అమెరికా.. భారత్‌ను ఏ విషయంలోనూ ఆదేశించలేదని ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా వ్యాఖ్యానించారు. అలా చేస్తే అమెరికాకు భంగపాటు తప్పదన్నారు.

ప్రపంచానికి భారత వైఖరి స్పష్టం
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్ తన వైఖరిని ప్రపంచానికి స్పష్టం చేస్తూ వస్తోంది. చర్చల ద్వారానే సమస్యను పరిస్కరించుకోవాలని ఇరు దేశాలకు స్పష్టం చేస్తోంది. అయితే, రష్యా నుంచి భారత్.. ఆయిల్ ను దిగుమతి చేసుకోవడంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రష్యా వైఖరిని ఖండించకుండా ఆ దేశం నుంచి దిగుమతులు చేసుకోవడం సరికాదని హెచ్చరించే ప్రయత్నం కూడా చేసింది.
అయితే, భారత్ తమ అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని, అది కూడా రాయితీతో తీసుకుంటుందని స్పష్టం చేసింది. భారత్ కంటే ఐరోపా దేశాలే రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయని, ముందు దానిపైనే మాట్లాడాలని అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరోసారి భారత విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించడం గమనార్హం.