వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని మోదీ

కరోనావైరస్ మహమ్మారి తర్వాత 2020లో జరిగిన చరిత్రలో మిగిలిపోయే ఘటనల్లో భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ కూడా ఒకటి.

సరిహద్దుల్లో కాల్పులు జరుపుకోకూడదని భారత్, చైనాల మధ్య అంగీకారం ఉంది. అయితే, బౌగోళికంగా కఠిన పరిస్థితులున్న గల్వాన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణ జరగడం చాలా మరణాలకు కారణమైంది.

ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కొన్ని దశాబ్దాలుగా లేనంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అణ్వాయుధాలున్న భారత్, చైనా కేవలం ఇరుగు పొరుగు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు కూడా.

ఈ శతాబ్దం చివరికి అతిపెద్ద ఆర్థికవ్యవస్థలుగా మారే అవకాశం ఈ రెండు దేశాలకూ ఉంది.

కానీ, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ చాలా ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చింది.

21వ శతాబ్దంలో అతిపెద్ద జగడం భారత్, చైనాల మధ్య జరుగుతున్నదేనా, ఇదే అతిపెద్ద వైరంగా మారనుందా అన్న చర్చ జరుగుతోంది.

ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం బీబీసీ కొంత మంది విశ్లేషకులు, నిపుణులతో మాట్లాడింది.

సరిహద్దుల్లో ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు, అదీ రెండు అణ్వాయుధ దేశాల మధ్య తలెత్తినప్పుడు పెద్ద సంఘర్షణకు దారి తీయొచ్చన్న ఆలోచన రావడం సహజమని సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీస్ డిఫెన్స్ ప్రొగ్రామ్ సీనియర్ ఫెలో క్రిస్ డోహటీ అన్నారు.

హిమాలయ పర్వతాల్లో భారత్, చైనా మధ్య మూడు వేల కి.మీ.లకుపైగా సరిహద్దు ఉంది. గల్వాన్ నది లోయ ప్రాంతంలో ఘర్షణ జూన్‌లో జరిగింది.

ఈ ప్రాంతం తమదంటే తమదని భారత్, చైనా రెండూ వాదిస్తున్నాయి.

''ఆక్సిజన్ తక్కువగా ఉండే ఈ ఎత్తైన కొండ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా కొండచరియలు విరిగిపడొచ్చు. హిమపాతం ముప్పు ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది’’ అని క్రిస్ డోహటీ అన్నారు.

ఘర్షణ జరిగిన ప్రాంతంలో గస్తీ కోసం రెండు దేశాలూ రోడ్లు వేసుకుంటున్నాయి.

''తమ సైనికుల రాకపోకలు త్వరగా జరిగేందుకు వీలుగా టిబెట్, షింజియాంగ్ లాంటి ప్రాంతంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు దశాబ్ద కాలంగా చైనా చాలా ఖర్చు చేస్తోంది. ఇందుకు ప్రతిగా భారత్ కూడా ఇలాంటి పనే చేస్తోంది. సరిహద్దుకు అవతలివైపు మౌలిక వసతులు ఏర్పాటవుతుంటే, ఇటువైపు పక్షంలో అభద్రతా భావం పెరుగుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్దారు.

చైనా సైన్యానికి తగిన గుణపాఠం చెప్పే సామర్థ్యం తమ సైన్యానికి ఉందని భారత్ భావిస్తోంది.

కానీ, చైనా సైన్యానికి కేటాయిస్తున్న బడ్జెట్ భారత్ రక్షణ బడ్జెట్ కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మరోసారి గల్వాన్ లోయ లాంటి ఘటనలు జరిగితే, ఎవరిది పైచేయి అవుతుంది?

ఈ ప్రశ్నకు బదులిస్తూ... ''చైనా కొంత భూభాగాన్ని, వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న కొన్ని స్థలాలను ఆక్రమించుకునే అవకాశం ఉంది. కానీ, చైనా ఆక్రమించుకునే ప్రతి అంగుళం భూమికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. భారత్‌కు కూడా నష్టం జరుగుతుంది. రెండు వైపులా సైనికులు మరణిస్తారు. యుద్ధంలో విజయం మాత్రం ఎవరికీ దక్కదు’’ అని క్రిస్ డోహటీ అభిప్రాయపడ్డారు.

భారత్-చైనా

ఆర్థికపరంగా ప్రభావం

''2000ల ఆరంభంలో భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు చాలా తక్కువ. కానీ, గడిచిన 20 ఏళ్లలో ఇవి వేగంగాపెరిగాయి. చైనాలో తయారైన వస్తువులను భారత్‌ మెచ్చింది. చైనా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయ్యింది. ఏటా రెండు దేశాల మధ్య 94 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. కానీ, ఇందులో 74 బిలియన్ డాలర్ల మేర చైనా నుంచి భారత్‌కు వస్తున్న దిగుమతులే’’ అని పాత్రికేయుడు, 'ఇండియాస్ చైనా ఛాలెంజ్’ పుస్తక రచయిత అనంత్ కృష్ణన్ అన్నారు.

ఆయన చెబుతున్నదాని ప్రకారం చైనా భారత్‌పై ఆధారపడిందాని కన్నా, చైనాపై భారత్ ఆధారపడిందే ఎక్కువ.

గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత చైనా వస్తువులను బహిష్కరించాలన్న పిలుపులు భారత్‌లో వచ్చాయి.

బాగా ఆదరణ పొందిన టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది.

''చైనా వస్తువులను, పెట్టుబడులను పూర్తిగా బహిష్కరించడం సాధ్యమయ్యే పని కాదు. చాలా రంగాల్లో భారత్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడి ఉంది. చైనా అంతటి తక్కువ ధరకు మరే దేశమూ వస్తువులను ఇవ్వదు’’ అని అనంత్ కృష్ణన్ వివరించారు.

ఔషధరంగం కూడా భారత్ చైనాపై ఆధారపడిన రంగాల్లో ఒకటి.

జెనరిక్ ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో చాలా వరకూ భారత్ చైనా నుంచే కొనుగోలు చేస్తోంది.

చైనా నుంచి వచ్చే ఆటోమొబైల్ విడి భాగాలు, ఉక్కు ఉత్పత్తులు, కీటకనాశకాలు కూడా భారతీయ ఆర్థికవ్యవస్థకు అవసరం. భారత్‌లో చైనా పెట్టుబడులను కూడా విస్మరించలేం.

''భారత్‌లో చైనా పెద్ద పెట్టుబడిదారిగా మారింది. భారత్‌లోని స్టార్టప్‌ల్లో దాదాపు 5-6 బిలియన్ డాలర్ల మేర ఆ దేశం పెట్టుబడులు ఉన్నాయి. టెక్ కంపెనీల్లోనూ భారీ పెట్టుబడులు ఉన్నాయి. ఆర్థికపరంగా చూసుకున్నా, చైనాతో యుద్ధం భారత్‌కు అనుకూలం కాదు’’ అని అనంత్ కృష్ణన్ వ్యాఖ్యానించారు.

''చైనా నుంచి వచ్చే పెట్టుబడులను స్వాగతిస్తేనే, భారత్‌కు ప్రయోజనం. చైనా పెట్టుబడులతో ఓ ఫ్యాక్టరీ ఏర్పడితే, ఉద్యోగాలు లభించేది భారతీయులకే కదా. అయితే, ఆ పెట్టుబడులను భారత ప్రభుత్వం లోతుగా పరిశీలించవచ్చు’’ అని అనంత్ కృష్ణన్ అభిప్రాయపడ్డారు.

చైనాలో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలను, భారత్‌కు వచ్చేలా చేసేందుకు భారత్ చాలా ప్రయత్నాలు చేస్తోంది.

కానీ, ఈ వ్యూహం అంతగా సఫలం కాలేదని అనంత్ కృష్ణన్ అంటున్నారు.

''తయారీ రంగంలో భారత్‌ను కేంద్రంగా మార్చాలని భారత్ చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 'మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని మొదలుపెట్టింది. కానీ, గత ఆరేళ్లలో చైనాపై భారత్ ఆధారపడటం పెరిగిందే కానీ, తగ్గలేదు’’ అని అన్నారు.

అయితే, భారత్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. అందుకే చైనా సంస్థలు ఈ దేశం వైపు చూస్తున్నాయి.

ఆసియా భవిష్యతు ఏంటి?

''భారత్, చైనా మధ్య జగడానికి కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఇంకా పెరుగుతున్నాయి. ఆర్థిక సంబంధాలు రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించవనడానికి భారత్-చైనా సంబంధాలే మంచి ఉదాహరణ’’ అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఫారెన్ పాలసీ ప్రొగ్రామ్ సీనియర్ ఫెలో తన్వీ మదాన్ అన్నారు.

గల్వాన్ లోయ ఘర్షణలు భారత్-చైనా సంబంధాల్లో కీలక మలుపు అని, దీని వల్ల భవిష్యతులో తీవ్ర పరిణామాలు ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

''మొత్తం ప్రపంచంపై దీని ప్రభావం ఉన్నా, లేకపోయినా ఆసియా రాజకీయాలు, ఆసియా దేశాల సంబంధాలపై దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది’’ అని తన్వీ మదాన్ అన్నారు.

గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్‌తో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది.

దక్షిణ చైనా సముద్రం, తైవాన్, హాంకాంగ్ విషయాలపైనా ఆ దేశం దృష్టి సారించాలి.

సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతలు ఏర్పడకముందు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, భారత ప్రధాన నరేంద్ర మోదీ చాలా సార్లు భేటీ అయ్యారు. స్నేహపూర్వకంగా కనిపించారు.

ఆసియాకు 'బాస్’ కావాలని చైనా అనుకుంటోంది. కానీ, అలాంటి 'బాస్’ల అవసరంలేదని భారత్ భావిస్తోంది.

గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత దౌత్య భాగస్వామ్యాలపై భారత్ దృష్టి పెట్టింది.

''ఎప్పుడూ మధ్యే మార్గంగా ఉండటం మంచిదని భారత్ విధానకర్తలు అర్థం చేసుకోవాలి. భారత్, చైనా విషయానికి వస్తే, కొన్ని సార్లు అమెరికా వైపు ఉండాలి. ఇంకొన్ని సార్లు రష్యా లాంటి దేశాల వైపు ఉండాలి’’ అని తన్వీ మదాన్ అన్నారు.

రష్యా నుంచి భారత్‌కు ఆయుధాలు వస్తాయి. కానీ, ఆ దేశానికి చైనాతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే, భారత్-చైనా ఉద్రిక్తతల విషయంలో రష్యా సందిగ్ధంలో పడింది. మరోవైపు పాకిస్తాన్ ఎప్పటిలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉంది.

''పాకిస్తాన్‌తో చైనా సహకారాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంటుంది. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతోనూ సంబంధాలు పెంచుకుని, భారత్‌ను అన్నివైపుల నుంచి ఒత్తిడికి గురి చేయొచ్చు. సమతౌల్యం తెచ్చేందుకు భారత్ కూడా దౌత్య భాగస్వామ్యాలు కోరుకుంటుంది. సైన్యం సామర్థ్యాలను, ఆర్థిక సామర్థ్యాలను పెంచుకోవాలనుకుంటుంది. ఇందుకోసం అమెరికా, యూరప్ దేశాలతోపాటు ఆస్ట్రేలియా, జపాన్, వియత్నాం, ఇండోనేసియా లాంటి దేశాలవైపూ భారత్ చూడాల్సి ఉంటుంది’’ అని తన్వీ మదాన్ అన్నారు.

భారత్-చైనా

విస్తృతంగా చూస్తే చైనా ఇప్పుడు కఠిన విధానాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోందని, విదేశాలతో ఒప్పందాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని బ్రిటన్‌కు చెందిన థింక్ టాంక్ చైటమ్ హౌస్‌లో చైనా వ్యవహారాల్లో రీసెర్చ్ ఫెలోగా ఉన్న యూ జియియె అన్నారు.

చైనా రాయబారులు ఆయా ఆతిథ్య దేశాల్లో వివాదాలకు దిగుతూ కనిపిస్తుండటానికి ఇదే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

''కరోనావైరస్ మహమ్మారి సమయంలో నాయకత్వ పాత్రలో కనిపించేందుకు చైనా ప్రయత్నాలు చేసింది. వివిధ దేశాలకు పీపీఈ కిట్లు పంపడానికి, తమ అనుభవాలను పంచుకోవడానికి కారణం అదే. వినడానికి ఇది చాలా నిర్మాణాత్మకంగా అనిపిస్తోంది. కానీ, ప్రాంతీయంగా ప్రభావం పెంచుకునేందుకు కరోనా సంక్షోభాన్ని చైనా వాడుకుంటుందని విమర్శించిన దేశాల్లో భారత్ ఒకటి’’ అని యూ జియియె అన్నారు.

పాశ్చాత్య దేశాలతో చైనాకు దూరం పెరుగుతుండటం భారత్‌కు అనుకూలంగా మారొచ్చని ఆమె అన్నారు.

''సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఏర్పడిన వాతావరణం నుంచి భారత్ ప్రయోజనం పొందడంలో విజయవంతమైంది. జాతీయవాదానికి మద్దతు లభించింది’’ అని వ్యాఖ్యానించారు.

భారత్, చైనా ఆర్థికవ్యవస్థలు, జనాభాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల సంబంధాలకు భవిష్యతులోనూ ప్రాధాన్యత తగ్గదు.

ఈ రెండు దేశాల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు పెరిగితే ఆసియాతోపాటు ప్రపంచ రాజకీయాలపైనా దాని ప్రభావం నేరుగా పడుతుంది.

అయితే, సమీప భవిష్యతులో మోదీ, జిన్‌పింగ్ ఇదివరకటిలా స్నేహపూర్వకంగా కనిపించే అవకాశాలైతే కనపడటం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India-China border conflict: Is this the biggest battle of the 21st century?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X