చర్చల్లో చైనా బెట్టు.. ఆ రెండిటిపై పట్టు.. మోదీ, దోవల్‌కు ఆర్మీ బ్రీఫింగ్.. తర్వాత ఏంటంటే..
చరిత్రలో తొలిసారి లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చల జరిగిన తర్వాత కూడా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ చివరినాటి స్టేటస్ కో పునరుద్ధరించాల్సిందేనని భారత్ పట్టుపట్టగా.. చైనా మాత్రం 'సరిహద్దుల్లో భారత్ చేపట్టిన రోడ్లు, ఇతర నిర్మాణాలను ఆపేయాల్సిందే'అని బెట్టు చేసింది. దీంతో పరిష్కారం కోసం మరో దఫా చర్చలు తప్పవనే సంకేతాలు వెలువడినట్లయింది.
ఇంకొన్నిగంటల్లో చైనా ఖేల్ ఖతం.. అజెండా.. యుద్ధవిమానాలు, శతఘ్నుల హోరు.. అసలు కారణాలు ఇవే..

అసలేం జరిగిందంటే..
సరిహద్దులో నెలకొన్ని ఉద్రిక్తతలు తొలిగిపోయేలా రెండు దేశాల మధ్య కమాండర్లు, మేజర్ల స్థాయిలో జరిగిన చర్చలు విఫలంకాగా, శనివారం నాడు లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ) స్థాయిలో భేటీ జరిగింది. తూర్పు లద్దాఖ్‌లోని నియంత్రణ రేఖకు చైనా వైపున ఉన్న మాల్డా ప్రాంతంలో.. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్ మిలిటరీ జిల్లా కమాండర్ లియూ లిన్ చర్చలు జరిపారు. మనవైపు నుంచి ఎల్జీ వెళితే.. అటు నుంచి కమాండర్ రావడంపై మీడియాలో చర్చ జరిగినా.. చైనీస్ ఆర్మీ ర్యాంకుల ప్రకారం అతను సమాన స్థాయి వ్యక్తేనని వెల్లడైంది. ముందుగా భారత్ తన వాదన వినిపించగా, చైనా మాత్రం తాను వెనక్కి తగ్గాలంటే ఇలా చేయాలంటూ భారత్ ముందు కొన్ని డిమాండ్లు పెట్టింది.
చైనా సరిహద్దుపై సంచలన రిపోర్ట్.. డ్రాగన్ పైచేయి సాధించిందా?.. అసలేం జరుగుతోందంటే..

ఆ రెండిటిపై రచ్చ..
భారత్-చైనా కీలక చర్చల్లో ప్రధానంగా రెండు అంశాలపై డెడ్ లాక్ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. అందులో మొదటింది.. దేప్పాంగ్ - గల్వాన్ లోయకు మధ్య భారత్ నిర్మించిన 255 కిలోమీటర్ల రోడ్డు. ఏడాది కిందటే నిర్మించిన సింగిల్ లైన్ రోడ్డును డబుల్ లైన్ గా విస్తరించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాను చైనా వ్యతిరేకిస్తున్నది. నిర్మాణాలను ఆపేసే దాకా వెనక్కి తగ్గబోమని చైనీస్ పేర్కొన్నట్లు తెలిసింది. నిజానికి.. మా భూభాగంలో రోడ్ల నిర్మాణానికి మీ అనుమతేంటని భారత్ ముందునుంచే చైనా వాదనను వ్యతిరేకిస్తున్నది.

ఫింగర్4ను ఖాళీ చేయాలి..
చర్చల్లోరెండో ప్రధానాంశంగా పాంగాంగ్ సరస్సు చుట్టూ వాడీవేడీ వాదనలు సాగినట్లు సమాచారం. అక్కడి పర్వతాల్లో ఫింగర్ 8 వరకూ భూభాగం భారత్ దికాగా, చైనా మాత్రం ఏకంగా ఫింగర్ 2 కూడా తనదేనని వాదిస్తుంది. మే రెండో వారం నాటికే కీలకమైన ఫింగర్ 4పై చైనా పట్టుబిగించడంతో వాళ్లను వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భారత్ డిమాండ్ చేసింది. ఫింగర్ 4 ప్రాంతం నుంచి చూస్తే భారత్ వైపు ఏం జరుగుతుందో, సైన్యం కదలికలు అన్నీ తెలుసుకునే వీలుండటంతో ఆ పాయింట్ ఇద్దరికీ కీలకమైంది. కాగా, పాంగాంగ్ కు దేప్పాంగ్ - గల్వాన్ రోడ్డుకు లింకు పెట్టిన చైనా.. నిర్మాణాలు ఆపితే తప్ప వెనక్కిపోమని మొండికేసినట్లు తెలిసింది.

మళ్లీ చర్చలు తప్పవా?
లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో జరిగిన తొలి దశ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. దీనిపై రెండు దేశాలూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చైనా వాదనను, చర్చల సారాన్ని ఆర్మీ అధికారుల బృందం.. భారత ప్రధాని మోదీకి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోపాటు విదేశాంగ శాఖకు కూడా బ్రీఫింగ్ ఇవ్వనుంది. పలు స్థాయిల్లో మేధోమధనం తర్వాతగానీ చర్చలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశంలేదు. లదాక్, ఢిల్లీలో నెలకొన్ని వాతావరణాన్ని బట్టి మరో దఫా చర్చలు తప్పవని డిఫెన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిన్న దూషణలు.. నేడు మౌనం..
కీలకమైన చర్చల సందర్భంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్'లో భారత్ ను ఉద్దేశించి సంచలన ప్రకటనలు చేశారు. ఇండియాతో తాము శతృత్వం కోరుకోవట్లేదని, రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా జోక్యం చేసుకున్న ప్రతిసారి సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని, అమెరికాకు మరింత దగ్గరవుతూ ఆ దేశం చేతిలో భారత్ కీలుబొమ్మగా మారుతోందని పార్టీ విమర్శించింది. అంతేకాదు, ఇండియానే చైనా భూభాగాన్ని ఆక్రమించిందని, ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గబోమని రాసుకొచ్చింది. కానీ చర్చలు ముగిసిన తర్వాత మాత్రం అక్కడి మెజార్టీ పేపర్లు, చానెళ్లు వ్యూహాత్మ మౌనం పాటించాయి. భారత్ తో చర్చల్లో చైనా ఏం వాదించిందన్న వార్తల్ని కూడా అండర్ ప్లే చేయడం గమనార్హం.