• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇండియా, చైనా, అమెరికా: కాఫీ, కారు, కంప్యూటర్ చిప్, టాయిలెట్ పేపర్... అన్నిటికీ కొరత వచ్చింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఓడలు

ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో పాటు వ్యాపారాలూ అనేక రంగాల్లో కొరతను ఎదుర్కొంటున్నాయి. కాఫీ నుంచి బొగ్గు వరకు ప్రతిదీ కొరతే.

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు దీనికి కొంతవరకు కారణమైనప్పటికీ, వేరే అంశాలూ కొరతకు కారణమయ్యాయి.

ప్రస్తుతం ఏ దేశంలో ఏఏ వస్తువులకు కొరత ఉందో చూద్దాం..

చైనా: బొగ్గు, పేపర్

చైనా ఎదుర్కొంటోన్న కొరత కారణంగా దేశీయంగా, విదేశీ కేంద్రంగా నడుస్తోన్న వ్యాపారాలపై, దుకాణాదారులపై ప్రభావం పడనుంది.

ఈ కొరత కారణంగా పేపర్, ఆహారం, టెక్స్‌టైల్స్, ఆటబొమ్మల నుంచి ఐఫోన్ చిప్స్ వరకు అన్నీ ప్రభావితం అవుతున్నాయి అని ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ స్టడీస్‌కు చెందిన డాక్టర్ మైకేల్ మేడాన్ అన్నారు.

''అసలే కొరతగా ఉన్న ఈ వస్తువులన్నీ క్రిస్మస్ సరికి నిండుకోవచ్చు'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

విద్యుత్

ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. చైనాలో 20కి పైగా ప్రావిన్సులు విద్యుత్ కోతలను ఎదుర్కొన్నాయి.

ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు పెరిగాయి. బొగ్గు ఆధారితంగా తయారైన విద్యుత్‌నే చైనాలో సగానికి పైగా వినియోగిస్తున్నారు. 'కఠినమైన ధరల పరిమితి' విధానం కారణంగా... విద్యుత్ సంస్థలు, ఈ పెరిగిన ధరలను వినియోగదారులపై మోపలేవు. అందుకే కంపెనీలన్నీ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి.

కఠినమైన పర్యావరణ నిబంధనలు, వరదలు, గనుల్లో భద్రతాపరమైన తనిఖీల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గిందని డాక్టర్ మేడాన్ వివరించారు.

అందుకే ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, శక్తి వినియోగాన్ని ఆదా చేయాలని కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి. వీలైతే కొన్ని రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయాలని వారిని కోరారు.

ఆట బొమ్మలు

అమెరికా: ఆటబొమ్మలు, టాయిలెట్ పేపర్

'క్రిస్మస్ నాటికి కొన్ని వస్తువులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయి' అని వైట్‌హౌస్ అధికారి ఒకరు హెచ్చరించారు.

ఈ కొరత కారణంగా ఆటబొమ్మలు, టాయ్‌లెట్ పేపర్, వాటర్ బాటిళ్లు, కొత్త బట్టలు, పెంపుడు జంతువుల ఆహార నిల్వలు ప్రభావితం కానున్నాయి.

యూఎస్‌లోని నౌకాశ్రయాలు ఈ సమస్యకు కొంత కారణమవుతున్నాయి. అమెరికాకు వచ్చే 10 షిప్పింగ్ కంటైనర్లలో నాలుగు, కేవలం రెండు పోర్టుల ద్వారానే రవాణా అవుతున్నాయి. లాస్ ఏంజెల్స్ అండ్ లాంగ్ బీచ్, కాలిఫోర్నియా పోర్టుల ద్వారానే ఈ కంటైనర్లన్నీ అమెరికా చేరుతున్నాయి.

సెప్టెంబర్‌లో ఒకరోజు లాస్‌ఏంజెల్స్ పోర్టు బయట, రికార్డు స్థాయిలో 73 ఓడలు క్యూ కట్టాల్సి వచ్చింది. కోవిడ్‌కు ముందు కాలంలోనైతే ఒకటి కంటే ఎక్కువ ఓడలు ఆగి ఉండటం అరుదుగా నమోదయ్యేది.

ప్రస్తుతం ఈ రెండు పోర్టులు... వారంలో ఏడు రోజులూ, రోజులో 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నాయి.

కొన్ని దేశాల్లో కోవిడ్ సంబంధిత కారణాల వల్ల కూడా ఈ కొరత సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

ఉదాహరణకు అమెరికా స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం నైక్, తన ఉత్పత్తుల్ని వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాల్లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తుంది. కానీ కోవిడ్ కారణంగా అక్కడ పరిశ్రమల్ని మూసివేయాల్సి రావడంతో ఉత్పత్తి కొరత ఏర్పడింది.

వస్తువులను ఉత్పత్తి చేసినప్పటికీ, వాటిని రిటైలర్ల వరకు చేరవేయడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టంగా మారిందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ విల్లీ షీ చెప్పారు.

యూఎస్ వినియోగదారుల వ్యయపరిమితి పెరిగింది. కానీ పరిశ్రమలు, నౌకాశ్రయాలు, రోడ్డు, రైల్వే మార్గాల్లో రవాణాకు ఎదురయ్యే సమస్యల వల్ల వారి డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తులు సరఫరా కావట్లేదు అని ఆయన చెప్పారు.

మారుతి సుజుకి

భారత్: కార్లు, కంప్యూటర్ చిప్స్

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన కంప్యూటర్ చిప్స్ కొరత కారణంగా, భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతీ సుజుకి' ఉత్పత్తి కాస్త క్షీణించింది.

కారులోని ఇంజిన్ సప్లై, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వ్యవస్థల్లో కంప్యూటర్ చిప్‌లను ఉపయోగిస్తారు.

జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కరోనా కారణంగా వీటికి కొరత ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ చిప్‌లకు అధిక డిమాండ్ ఉంది. ఫోన్లలో, కంప్యూటర్లలో వీటి వాడకం పెరగడంతో పాటు 5జీ టెక్నాలజీ కారణంగా కరోనా కంటే ముందు నుంచే వీటికి డిమాండ్ పెరిగింది. దీంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ల్యాప్‌ట్యాప్, వెబ్‌క్యామ్‌ల వాడకంతో వీటి డిమాండ్ మరింత ఎక్కువైంది.

భారత్‌లో ఇంధన వనరుల విధ్వంసం కారణంగా ఈ ముడి సరకుల కొరత మరింత తీవ్రమైంది.

బొగ్గు నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. కోవిడ్ రెండో వేవ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. దీంతో శక్తి వనరుల డిమాండ్ పెరిగిపోయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు పెరిగిపోయాయి. భారత్ దిగుమతులు పడిపోయాయి.

దీని ప్రభావం విస్తృతంగా ఉంటుందని కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ చీఫ్ జోహ్రా ఛటర్జీ అన్నారు.

''ఒక్కసారి బొగ్గు కొరత ఏర్పడితే, మొత్తం తయారీ రంగంపై దాని ప్రభావం పడుతుంది. సిమెంట్, స్టీల్, నిర్మాణ రంగాలు ప్రభావితమవుతాయి'' అని ఆమె చెప్పారు.

విద్యుత్ ధరలు పెరగడం వల్ల భారత్‌లోని కుటుంబ వ్యవస్థపై కూడా ఆ భారం పడుతుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాలైన ఆహారం, చమురు ధరలు కూడా పెరుగుతాయి.

కాఫీ

బ్రెజిల్: కాఫీ, వాటర్

దాదాపు ఒక శతాబ్ధ కాలంలో బ్రెజిల్‌లో ఏర్పడిన తీవ్రమైన కరువు, ఈ ఏడాది కాఫీ పంటలో నిరాశజనకమైన ఫలితాలు ఏర్పడటానికి కారణమైంది.

అక్కడ కాఫీ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.

అధిక రవాణా వ్యయాలతో పాటు కంటైనర్ల కొరత కారణంగా కాఫీ తయారీదారులకు మరిన్ని సవాళ్లు ఎదురయ్యాయి.

అతిపెద్ద కాఫీ ఎగుమతిదారు, ఉత్పత్తిదారు అయిన బ్రెజిల్‌లో ధరల పెరుగుదల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని కేఫ్‌లలో ఈ ధరల ప్రభావం కనిపించనుంది.

రిజర్వాయర్ల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్‌నే బ్రెజిల్‌లో అధిక భాగం వినియోగిస్తారు. ప్రస్తుత నీటి కొరత, దేశ ఇంధన సరఫరాపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తోంది.

ధరలు పెరుగుతున్న కొద్దీ, విద్యుత్ వాడకాన్ని తగ్గించాల్సిందిగా ప్రజలను అధికారులు కోరుతున్నారు. తమ విద్యుత్ వినియోగంలో 20 శాతం తగ్గించాల్సిందిగా ప్రభుత్వ సంస్థలను సైతం కోరినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపిందని వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది.

నైజీరియా విక్రయదారులు

నైజీరియా: వంటగ్యాస్

నైజీరియా, ప్రధానంగా వంట కోసం వినియోగించే లిక్విడ్ నాచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) కొరతను ఎదుర్కొంటోంది.

ఆఫ్రికా ఖండంలో అధిక సహజ గ్యాస్ నిక్షేపాలు నైజీరియాలోనే ఉన్నప్పటికీ, దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది.

ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలోనే ఎల్‌ఎన్‌జీ ధరలు 60 శాతం పెరిగాయి. దీంతో వంటగ్యాస్ ధర, చాలా మంది నైజీరియన్ల ఆర్థిక స్థాయికి మించిపోయింది.

ఈ నేపథ్యంలో ఇళ్లల్లో, వ్యాపారాల్లో వంటగ్యాస్‌కు బదులుగా నైజీరియన్లు బొగ్గు, కలపను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు.

ఈ ధరల పెరుగుదలకు ఒక కారణం ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో ఏర్పడిన కొరత. నైజీరియా ఇప్పటికీ ఎల్‌ఎన్‌జీ దిగుమతులపైనే ఆధారపడి ఉంది.

కరెన్సీ విలువ పడిపోవడంతో పాటు ఎల్‌ఎన్‌జీపై పన్నులను ప్రవేశపెట్టడంతో అక్కడ పరిస్థితి మరింత దిగజారింది.

అధిక ధరల వల్ల ప్రజలు చౌకైన, ప్రమాదకరమైన ఇంధన వనరుల వైపు మొగ్గుచూపిస్తే... పర్యావరణంతో పాటు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ కోత

లెబనాన్: వాటర్, ఔషధాలు

లెబనాన్‌ను వాటర్, ఔషధాలు, చమురు కొరత వేధిస్తోంది.

గత 18 నెలలుగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో దేశ జనాభాలో మూడొంతుల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. కరెన్సీ విలువ కూడా పడిపోయింది. లెబనాన్ రాజకీయ వ్యవస్థలో పెను విధ్వంసానికి ఇది కారణమైంది.

కోవిడ్ కంటే ముందే లెబనాన్ ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో ఉండగా... మహమ్మారి తర్వాత పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.

చమురు కొరతల కారణంగా దేశంలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. దీంతో ఆర్థిక స్థోమత కలిగిన వ్యాపారులు, కుటుంబాలు ఖరీదైన ప్రైవేటు విద్యుత్ డీజిల్ జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు.

''లెబనాన్‌లో ఆరోగ్య రంగం, లక్షలాది మందికి నీటిని అందజేసే సరఫరా వ్యవస్థలపై చమురు కొరత కారణంగా పడుతోన్న ప్రభావం ఆందోళన కలిగిస్తుందని'' యూఎన్ హ్యుమానిటేరియన్ కో ఆర్డినేటర్ ఫర్ లెబనాన్ నజత్ రొచ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
India, China, US: Coffee, car, computer chip, toilet paper,everything is in short supply
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X