సీఏఏపై నోరుపారేసుకున్న మలేసియా ప్రధాని.. ఘాటుగా కౌంటరిచ్చిన ఇండియా
లౌకిక దేశంగా చెప్పుకునే ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ముస్లింలను వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందటూ నోరుపారేసుకున్న మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ కు భారత ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది.
సీఏఏ వల్ల ఏ భారతీయ పౌరుడి హోదాకూ భంగం వాటిల్లదని, ఏ మతానికి చెందినవారూ పౌరసత్వం కోల్పోరని, నిజానిజాలు తెల్సుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మన విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో మహమ్మద్ ను కడిగిపారేసింది.

ఇది మా అంతర్గత విషయం
''సీఏఏ అనేది ఇండియా అంతర్గత విషయం. దానిపై అవగాహన లేకుండా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాల్లో కొంచెం సంయమనం పాటిస్తే మంచిదని మలేసియాకు తెలియజేస్తాం'' అని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.
పౌరసత్వ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశం.. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురైన మైనార్టీలకు వేగంగా ''నేచురలైజేషన్'' ద్వారా పౌరసత్వాన్ని కల్పించడమేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇది బయటివాళ్లకు భారత దేశ పౌరసత్వం ఇచ్చే ప్రక్రియేగానీ దేశపౌరులకు సంబంధించిన వ్యవహారం కాదని వివరించింది.