india sri lanka china un probe civil war narendra modi శ్రీలంక చైనా ఐక్యరాజ్యసమితి విచారణ నరేంద్రమోడీ సంబంధాలు
భారత్‌కు శ్రీలంక సవాళ్లు- చైనాను బూచిగా చూపుతూ- అంతర్యుద్ధ నేరాల్ని తప్పించుకునే ప్లాన్
భారత్ పొరుగున ఉన్న శ్రీలంకతో మనకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన తమిళుల్ని కాదని అక్కడి సింహళ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు భారత్ తమ ప్రధాని రాజీవ్‌గాంధీని తీవ్రవాదుల చేతుల్లో కోల్పోయింది. అయినా ఇప్పటికీ అక్కడి ప్రభుత్వాధినేతలకు భారత్ మద్దతు ఇస్తూనే ఉంది. కానీ శ్రీలంక మాత్రం మనల్ని కాదని పొరుగున ఉన్న శత్రుదేశం చైనావైపు మొగ్గు చూపుతోంది. ఓవైపు తమ దేశంలో సాగిన అంతర్యుద్దంపై ఐరాసలో జరుగుతున్న విచారణ విషయంలో మన మద్దతు కోరుతూనే .. మరోవైపు తమ దేశంలో భారత్ చేపట్టే ప్రాజెక్టును రద్దు చేసుకుని సవాళ్లు విసురుతోంది.

భారత్‌కు శ్రీలంక సవాళ్లు
ఒకప్పుడు భారత్‌కు అత్యంత మిత్ర దేశంగా ఉంటూ వచ్చిన శ్రీలంక ఇప్పుడు కత్తులు దూసే పరిస్ధితికి వస్తోంది. ఉపఖండంలో బలీయమైన శక్తిగా ఉన్న భారత్‌ను కాదని చైనావైపు మొగ్గు చూపుతోంది. తమ దేశంలో భారత్, జపాన్ సహకారంతో 500 మిలియన్ డాలర్ల ఖర్చుతో చేపడుతున్న కీలకమైన ఈస్ట్ కంటెయినర్ టెర్మినల్ ప్రాజెక్టును ఏకపక్షంగా రద్దు చేసేసింది. అంతే కాదు తమిళనాడు తీరానికి సమీపంలో 12 బిలియన్ డాలర్లతో చేపట్టే ఓ పవర్ ప్రాజెక్టును చైనాకు అప్పగించింది. తద్వారా భారత్ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్ధితి తీసుకొచ్చింది. దీనిపై భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తమిళ టైగర్స్‌పై అకృత్యాల విచారణలో భారత్ మద్దతు
దశాబ్దాల పాటు తమ దేశంలో మైనారిటీలుగా ఉన్న తమిళులను తుడిచిపెట్టేందుకు అక్కడ సింహళ ప్రభుత్వం సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ యుద్ధనేరాలుగా పరిగణించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం విచారణకు సిద్దమవుతోంది. మార్చిలో దీనిపై ఐరాస విచారణ నిర్వహించనుంది. అయితే ఇందులో తమకు మద్దతివ్వాలంటూ భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్‌ను శ్రీలంక కోరుతోంది. కానీ భారత్ మాత్రం దీనిపై ఎటూ తేల్చుకోలేని పరిస్ధితి. మన దేశంలో తమిళులతో మంచి సంబంధాలు ఉన్న శ్రీలంక తమిళ టైగర్స్‌ను అమానవీయంగా మట్టుబెట్టిన వ్యవహారంలో శ్రీలంకకు మద్దతివ్వడం మనకు ఆత్మహత్యా సదృశ్యమే.

అంతర్యుద్ధ నేరాలపై మద్దతుకు భారత్ షరతులివే
తమిళ టైగర్స్‌పై అమానవీయంగా సాగించిన అంతర్యుద్ధంపై ఐరాస మానవ హక్కుల విభాగం జరుపుతున్న విచారణలో భారత్ మద్దతు కోవాలని శ్రీలంక కోరుతున్న నేపథ్యంలో కేంద్రం కొన్ని షరతులు పెడుతోంది. ఇందులో ప్రధానమైనది శ్రీలంక రాజ్యాంగాన్ని సవరించి తమిళులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే శ్రీలంక దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అంతర్యుద్ధంపై భారత్ మద్దతు కోరుతున్న శ్రీలంకకు ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చేసి తమిళులను అక్కున చేర్చుకోవడం అస్సలు ఇష్టం లేదు. దీంతో ఈ వ్యవహారాన్ని దాటవేసేందుకు కొత్త అంశాలను తెరపైకి తెస్తోంది.

భారత్‌ను ఇరుకునపెట్టేందుకు చైనాకు మద్దతు
అంతర్యుద్ధ నేరాలపై ఐరాస విచారణకు భారత్ మద్దతు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న శ్రీలంక మనం కోరినట్లుగా రాజ్యాంగాన్ని సవరించి తమిళులకు అవకాశాలు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందుకే కొత్త అంశాలను తెరపైకి తెచ్చి భారత్‌ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చైనాకు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు తీరంలో చైనాకు పవర్ ప్లాంట్ అప్పగించడం వెనుక కూడా భారత్‌పై ఒత్తిడి పెంచే కుట్రలు ఉన్నట్లు అర్దమవుతోంది. అయితే బారత్ వీటిని ఎలా తిప్పికొడుతుందో చూడాల్సి ఉంది.