హమ్మయ్యా.. భారత్ చేరిన ఇండియన్ ఎంబసీ స్టాఫ్, ఇతరులు.. దోవల్ డిస్కషన్స్
ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల అరాచక పాలన మొదలైందో లేదో.. అక్కడి నుంచి జనం వచ్చేందుకు పరుగులు తీస్తున్నారు. ప్లైట్ కూడా బస్సు మాదిరిగా అనుకొని ఎక్కేస్తున్నారు. కదిలే బస్సు ఎక్కడం చూశాం.. కానీ కదిలే ప్లైట్ ఎక్కే ప్రయత్నం చేయడం.. విమానం ముందు వందలాది జనం ఉండటం వీడియో/ ఫోటోలు చూశాం. అయితే ఆప్ఘనిస్తాన్ నుంచి భారత రాయబార కార్యాలయ సిబ్బంది క్షేమంగా భారత్ చేరుకున్నారు. అందరినీ ఎయిర్ ఫోర్స్ సీ-17 ఎయిర్ క్రాప్ట్ తీసుకొచ్చింది. వారిలో ఐటీబీపీ సిబ్బంది, జర్నలిస్టులు కూడా ఉన్నారు.

రుద్రేంద్ర టాండన్ అండ్ స్టాప్
విమానంలో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్, సిబ్బంది ఉన్నారు. వారితో వచ్చిన విమానం గుజరాత్ జామ్‌నగర్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంది. ఆప్ఘన్లో ఉన్నవారిని తరలించేందుకే కాబూల్ విమానాశ్రయం తెరిచారు. సోమవారం నుంచి ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అమెరికా ప్రతినిధి జాక్ సులివన్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడారు. ఆప్ఘన్ నుంచి భారతీయుల తరలింపు గురించి మాత్రమే వారిద్దరూ మాట్లాడుతున్నారు. ఆప్ఘన్లో ఉన్నవారిని తరలించే విషయమై డిస్కషన్ జరిగింది. అక్కడున్న వారికి ఈ ఎమర్జెన్సీ ఎక్స్ మిక్స్ వీసా, ఇతర వీసాలను ఇచ్చే అంశం ప్రస్తావన వచ్చింది.

కెప్టెన్ రిక్వెస్ట్..
అంతకుముందు ఆప్ఘనిస్థాన్‌లో దిక్కుతోచని పరిస్థితిలో భారతీయులు కూడా ఉన్నారు. వారిని తక్షణమే వెనక్కి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. అమెరికన్ మిలటరీ విమానంలోకి భయంతో చొచ్చుకుపోయిన అక్కడి ప్రజానీకాన్ని నిలువరించేందుకు అమెరికా బలగాలు కాల్పులు జరిపాయనే వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రికి కెప్టెన్ అమరీందర్ విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్థాన్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుని క్యూలు కట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే స్పందించిన అమరీందర్ సింగ్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయడంతోపాటు అక్కడి సిక్కులతో పాటు, భారతీయులను ఖాళీ చేయించి స్వదేశానికి రప్పించే విషయంలో చేతనైన సహాయాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పరిణామాలు ఎంతమాత్రం మంచివి కావన్నారు. సరిహద్దుల్లో అదనపు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

500 మంది..?
మరోవైపు భారత వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి కాబూల్‌లో ల్యాండయ్యింది. ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానం నిన్న సాయంత్రం దిగింది. అక్కడ గల భారతీయులు, ఎంబసీ స్టాప్‌ను తీసుకొస్తారు. ఇవాళ ఉదయం తజకిస్తాన్‌లో విమానం ఆగాల్సి వచ్చింది. కాబూల్‌లో గందరగోళ పరిస్థితుల దృష్ట్యా.. అక్కడే ఆగింది. అమెరికా దళాలు ఎయిర్ ఫీల్డ్ నియంత్రణ పొందిన తర్వాత.. దిగింది. అయితే కాబూల్‌లో 500 మంది వరకు భారతీయులు ఉన్నట్టు సమాచారం. వారిలో రాయబార కార్యాలయ సిబ్బంది, ఐటీబీపీ స్టాఫ్ ఉన్నట్టు తెలుస్తోంది.

పవార్ రిక్వెస్ట్
ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకొన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై భారత్ ఆలోచించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. పాకిస్తాన్, చైనా తప్ప.. మిగతా దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇతర దేశాలతో విదేశాంగ విధానంపై సమీక్ష చేయాలని ఆయన సూచించారు. ఈ ఆపత్కాలంలో తాము ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పారు. ఇదీ జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అని ఆయన చెప్పారు. పవార్.. ఇతర నేతల వినతితో కేంద్రం అలర్టయ్యింది. ఆప్ఘన్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చింది.