వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అయూబ్ ఖాన్

భారత్-పాకిస్తాన్ 1965 యుద్ధం జరిగి 55 ఏళ్లకు పైనే అయ్యింది. ఈ యుద్ధాన్ని పాకిస్తాన్‌కు ఒక సువర్ణావకాశంగా చెప్పుకుంటారు. కానీ, అప్పట్లో ఆ దేశం అలాంటి పరిస్థితిలో లేదని కొన్ని ఆధారాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

భారత్ అంతర్జాతీయ సరిహద్దు దాటి, పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు ఈ యుద్ధం అధికారికంగా 1965 సెప్టెంబర్ 6న మొదలైంది.

కానీ, పాకిస్తాన్ సైన్యం కచ్ ప్రాంతంలోని కంజర్‌కోట్ ప్రాంతాన్ని ఆక్రమించిన 1965 ఏప్రిల్ 26న ఈ యుద్ధం ప్రారంభమైందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ విల్సన్ భారత్-పాకిస్తాన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రతిపాదన తెచ్చారు. దాంతో 1965 జూన్ 30న భారత్, పాకిస్తాన్ యుద్ధ విరమణ పత్రంపై సంతకాలు చేశాయి. ఈ అంశాన్ని ఒక అంతర్జాతీయ ట్రైబ్యునల్‌కు అప్పగించాయి.

1965 జులైలో పాకిస్తాన్ సైన్యం, భారత పాలిత కశ్మీర్‌ను భారత్ నుంచి దూరం చేయడానికి ఒక గొరిల్లా ఆపరేషన్ ప్రారంభించింది. దానికి 'జిబ్రాల్టర్’ అనే పేరు పెట్టారు.

అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సూచనలతో 12 డివిజినల్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ జనరల్ అఖ్తర్ హుసేన్ మలిక్ ఆ ఆపరేషన్‌ ప్లాన్ చేశారు. అప్పటి విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో, విదేశాంగ మంత్రి అజీజ్ అహ్మద్‌కు కూడా దీని గురించి తెలుసు. వారు దానికి అంగీకారం కూడా తెలిపారు.

ఆపరేషన్ 'జిబ్రాల్టర్’ బాధ్యతను పాక్ సైన్యంలోని తారిక్, కాసిమ్, ఖాలిద్, సలాహుద్దీన్, గజ్నవీ అనే ఐదు బృందాలకు అప్పగించారు.

ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేయడానికి 'సుస్రత్’ అనే మరో ఆపరేషన్ మొదలైంది. జులై 24న బయల్దేరిన సైనిక బృందాలు, జులై 28న తమ గమ్యాలకు చేరుకున్నాయి.

కానీ, ఆ తర్వాత జరిగినవి పాకిస్తాన్, ముఖ్యంగా కశ్మీర్ చరిత్రలోనే విషాదకరమైన అధ్యాయంగా నిలిచిపోయింది. సైనిక బృందాలు తమ మిషన్‌లో దారుణంగా విఫలమయ్యాయి. ఒక్క గజ్నవీ బృందం మాత్రం కచ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించగలిగింది. కానీ ఆపరేషన్ 'జిబ్రాల్టర్’ పూర్తిగా ముక్కలైంది.

అయూబ్ ఖాన్

ఘోరంగా విఫలమైన ఆపరేషన్

ఈ ఆపరేషన్ విఫలం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటి కారణం, అందులో పాల్గొన్న సైనికులకు సరైన శిక్షణ లేదు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ, నిఘా ఏజెన్సీల కంటే భారత్ చాలా మెరుగైన ఏర్పాట్లు చేసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో తలెత్తిన గందరగోళాలను అణచివేసేందుకు సమర్థవంతమైన, కఠిన చర్యలను చేపట్టింది.

పాకిస్తాన్ సైన్యం నేతృత్వంలో ఆపరేషన్ 'జిబ్రాల్టర్’ విఫలమవడంతో, తర్వాత ఆపరేషన్ 'గ్రాండ్ శ్లామ్’ మొదలయ్యింది. భారత పాలిత కశ్మీర్‌లో మోహరించిన సైనికులకు సరుకుల సరఫరాను అడ్డుకోవాలని పాక్ సైన్యం ఎత్తు వేసింది. అక్కడి వరకూ ఉన్న ఒకే ఒక రైల్వే లైన్‌ కట్ చేయడానికి అఖ్నూర్ సెక్టార్‌ను ఆక్రమించింది. కానీ ఆ ఆపరేషన్ కూడా పూర్తిగా విఫలమైంది.

ఆపరేషన్ 'గ్రాండ శ్లామ్’, ఆపరేషన్ 'జిబ్రాల్టర్’ కంటే ముందు జరిగుండాల్సిందని సైనిక నిపుణులు చెబుతున్నారు. “ఆపరేషన్ జిబ్రాల్టర్ విఫలమైన తర్వాత ఆ ఆపరేషన్‌ను లాంచ్ చేయడం ఆత్మహత్యకు పాల్పడడం లాంటిదేని” అన్నారు.

1965 ఆగస్టు 25న భారత సైన్యం దానా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది, ముజఫరాబాద్‌కు దగ్గరగా వెళ్లింది. తర్వాత ఆగస్టు 28న హాజీపీర్ పాస్‌ను కూడా ఆక్రమించింది.

దాంతో, అప్పటి పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్ మూసా ధైర్యం కోల్పోయారు. బాధగా విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో దగ్గరకు వెళ్లి “నా జవాన్ల దగ్గర పోరాడ్డానికి రాళ్లు తప్ప, ఏం లేవు” అన్నారు.

భారత్-పాక్ 1965 యుద్ధం

ఇరు దేశాల యుద్ధ ప్రకటన

1965 సెప్టెంబర్ 6న భారత్ అంతర్జాతీయ సరిహద్దు దాటింది. ఈ విషయం అయూబ్ ఖాన్‌కు ఉదయం 4 గంటలకు తెలిసింది.

ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు భారత్ అధీనంలో ఉంటే, భారత్‌లోని కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ స్వాధీనంలో ఉన్నాయి.

కొన్ని దేశాలు పాకిస్తాన్‌కు ఆయుధాలు ఇవ్వడానికి నిరాకరించాయని సెప్టెంబర్ 11న పాక్ రక్షణ మంత్రి నజీర్ అహ్మద్, జనరల్ అయూబ్ ఖాన్‌కు చెప్పారు.

శాంతి పునరుద్ధరించాలని సెప్టెంబర్ 15న అమెరికా అధ్యక్షుడు జాన్సన్ రెండు దేశాలకు అపీల్ చేశారు.

యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ భారత్ అదే రోజు ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి చెప్పింది. కానీ యుద్ధం కొనసాగించింది.

కశ్మీరీల కోరిక మేరకు భారత్ కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని సెప్టెంబర్ 17న చైనా ఒక ప్రకటన జారీ చేసింది.

చైనా ఆ ప్రకటనను పాకిస్తాన్ స్వాగతించింది. అదే సమయంలో యుద్ధ విరమణ ఒప్పందానికి అంగీకరించాలని పశ్చిమ దేశాలు పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తున్నాయి.

స్వయంగా పాకిస్తాన్ కూడా కశ్మీర్ సమస్యను సైనిక చర్యలకు బదులు దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంది.

అదే సమయంలో దీనిపై, తన పాత స్నేహితుడు, చైనా ప్రధాని చౌ ఎన్ లైను నేరుగా కలిసి, చర్చించడం మంచిదని పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ భావించారు.

సెప్టెంబర్ 19-20 రాత్రి పెషావర్ నుంచి ఒక విమానంలో బీజింగ్ వెళ్లిన అయూబ్ ఖాన్, ఆ తర్వాత రోజే తిరిగి పాక్ చేరుకున్నారు.

అయూబ్ ఖాన్

అయూబ్ ఖాన్ రహస్య పర్యటన

అయూబ్ ఖాన్ చైనా పర్యటనను పూర్తిగా రహస్యంగా ఉంచారు. పాకిస్తాన్‌లో దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అధ్యక్షుడి భవనంలో రోజూ జరిగే పనులు అలాగే కొనసాగాయి. అయూబ్ ఖాన్ కోసం ఆయన గదిలోకి ఉదయం టీ తీసుకెళ్లారు. ఆయన లోపలే ఉన్నారు అనిపించేలా ఖాళీ ట్రేతో బయటకు వచ్చారు.

అయూబ్ ఖాన్ లోపల లేడని అధ్యక్ష భవనం చుట్టూ ఉన్న భద్రతాదళాలకు ఎలాంటి సందేహం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆ పర్యటన సమయంలో విదేశాంగ మంత్రి భుట్టో కూడా అయూబ్ ఖాన్‌తోనే ఉన్నారు. చౌ ఎన్ లై, మార్షల్ చిన్ షీతో ఇద్దరూ రెండు సార్లు సుదీర్ఘ చర్చలు జరిపారు.

అయూబ్ ఖాన్ చైనా నేతలకు తమ పరిస్థితి చెప్పుకున్నారు. భారత్ సైనిక బలగాల సంఖ్యను పెంచుకోవడం ప్రారంభించిందని, భారత్‌కు మద్దతుగా నిలిచిన పశ్చిమ దేశాలు, తమ మధ్య రాజీ కుదిర్చేందుకు సోవియట్ యూనియన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాయని తెలిపారు.

భారత్ సైనిక బలగాల సంఖ్య, పాకిస్తాన్ ప్రజల ఆశయాన్ని ముక్కలు చేయలేదని చౌ ఎన్ లై వారితో అన్నారు.

పంజాబ్ మైదాన ప్రాంతాలు, ముందుకు చొచ్చుకొస్తున్న శత్రు సేనలపై గొరిల్లా యుద్ధం చేయడానికి అనువుగా లేవని అయూబ్ ఖాన్ చైనా ప్రధానికి చెప్పారు.

మధ్యలో జోక్యం చేసుకున్న మార్షల్ చిన్ షీ, మైదానాల్లో చిన్న పెద్దా కాలువలు, దిబ్బలు అన్నింటినీ దాడులకు ఉపయోగించుకోవచ్చని అయూబ్ ఖాన్‌కు చెప్పారు.

భారత్-పాక్ 1965 యుద్ధం

చర్చలు వద్దు, యుద్ధమే ముద్దు

చర్చలకు వెళ్లడానికి బదులు, ఒక సుదీర్ఘ యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని చైనా స్నేహితులు పాకిస్తాన్‌కు చెప్పారు. అయితే, మీరు మాకు ఎప్పటివరకూ సాయం అందించగలరని అయూబ్ ఖాన్ వారిని అడిగారు.

అయూబ్ ఖాన్ కళ్లలోకి చూసిన చౌ ఎన్ లై “మీకు ఎప్పటివరకూ అవసరం ఉంటుందో అప్పటివరకూ, మిమ్మల్ని శిఖరాలపైకి ఎక్కించేవరకూ” అన్నారు.

అమెరికా, రష్యాలను అసలు నమ్మవద్దని పాకిస్తాన్‌కు చైనా నీతులు చెప్పింది. పాకిస్తాన్ వాటి మోకరిల్లకూడదని, వాటిని ఏమాత్రం నమ్మకూడదని చెప్పింది.

ఆ బేషరతు ప్రతిపాదనకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలీని అయూబ్ ఖాన్ ఆశ్చర్యపోయారు. ఆయన “మీరు ఏదో తొందరలో ఇలా చెబుతున్నారేమో” అన్నారు.

దాంతో, చౌ ఎన్ లై నవ్వుతూ అమెరికా ఒత్తిడికి లొంగిపోవద్దని అయూబ్ ఖాన్‌కు సలహా ఇచ్చారు.

“పాకిస్తాన్ రష్యా వలలో కూడా చిక్కుకోకూడదు. దానిని అసలు నమ్మలేం. అది చివరకు మీకే అర్థమవుతుంది” అన్నారు.

చైనా నుంచి పూర్తి మద్దతు పొందాలంటే, ఒక సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధం కావాల్సి ఉంటుందని పాకిస్తాన్‌కు ఆ చర్చలు ముగియక ముందే స్పష్టంగా అర్థమైంది. అలా చేస్తే లాహోర్, మరికొన్ని నగరాలు కూడా శత్రువు చేతికి చిక్కవచ్చు.

అయూబ్ ఖాన్

ఇరకాటంలో పాకిస్తాన్

పాకిస్తాన్‌కు జరిగే ప్రతి నష్టం ఆ దేశ ప్రజల్లో ఐక్యతను పెంచుతుందని, చివరికి ప్రజా వ్యతిరేకత ముందు భారత సైన్యం తలవంచుతుందని చైనా నేతలు భావించారు. కానీ భుట్టో, అయూబ్ ఖాన్ ఇద్దరిలో ఎవరూ దానికి సిద్ధంగా లేరు.

భారత్‌తో సుదీర్ఘ యుద్ధం చేయడానికి పాకిస్తాన్ నాయకత్వం సిద్ధంగా లేదు. పాక్ ఆర్మీ పదాతి, వైమానిక దళాల చీఫ్‌లు కూడా యుద్ధం ముగించాలనే కోరుకున్నారు. ఎందుకంటే, వారి బలగాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఆయుధాలు, మందుగుండు కొరత తీవ్రంగా ఉండడంతో జనరల్ మూసా కూడా నీరుగారిపోయారు. విమానాల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండడంతో వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ ఆందోళనలో పడిపోయారు.

వైమానిక దళం యుద్ధంలోకి వెళ్లిన ప్రతిసారీ పాకిస్తాన్ ఒకటి రెండు యుద్ధ విమానాలు కోల్పోయేది. దాంతో, అది చైనా సలహాను పక్కనపెట్టింది. చివరికి అమెరికా, రష్యా కోరుకున్నదే జరిగింది.

తర్వాత 1965, సెప్టెంబర్ 20న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక తీర్మానం ఆమోదించింది. సెప్టెంబర్ 22-23 రాత్రి యుద్ధ ఖైదీల వివరాలు ప్రకటించాలని భారత్-పాక్‌ను ఆదేశించింది.

కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కనుగొనకుండా యుద్ధం ఆపేది లేదంటూ పాక్ భద్రతా మండలికి తన వాదన వినిపించాలనుకుంది. విదేశాంగ మంత్రి భుట్టోను ఐక్యరాజ్యసమితికి పంపించింది.

సెప్టెంబర్ 23న భుట్టో న్యూయార్క్ చేరుకున్నారు. నేరుగా భద్రతామండలి సమావేశం జరుగుతున్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి వెళ్లి తన వాదన వినిపించారు.

అయూబ్ ఖాన్

ఐరాసలో భుట్టో ప్రసంగం

భుట్టో తన ప్రసంగంలో “పాకిస్తాన్‌ మీద ఒక పెద్ద దేశం దాడి చేసింది. ప్రస్తుతం మేం మా ఉనికి కోసం కోసం పోరాటం చేస్తున్నామ”ని చెప్పారు.

“మా అస్తిత్వం కోసం మేం భారత్‌తో వెయ్యేళ్లు యుద్ధం చేయాల్సి వచ్చినా పోరాడతామ”ని ఆయన చెబుతున్న సమయంలో అయూబ్ ఖాన్ నుంచి వచ్చిన ఒక సందేశం భుట్టోకు అందింది.

అందులో, ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం యుద్ధం ముగించడానికి అయూబ్ ఖాన్ అంగీకరించారు. దాంతో భుట్టో ఆ సందేశాన్ని భద్రతామండలి సభ్యులకు చదివి వినిపించారు. పాకిస్తాన్ యుద్ధ విరమణకు అంగీకరించిందని చెప్పారు.

అయితే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాలని, లేదంటే పాక్ ఐక్యరాజ్యసమితి నుంచి విడిపోతుందని భుట్టో స్పష్టం చేశారు..

యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్, పాకిస్తాన్ రెండూ ఒక శాంతిపూర్వక ఒప్పందానికి రావడానికి సాయం చేస్తామని సోవియట్ యూనియన్ ప్రతిపాదించింది.

1965లో భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా పాకిస్తాన్‌తో చర్చలకు తాను సోవియట్ యూనియన్ వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ, “కశ్మీర్ మినహా, భారత్, పాక్ మధ్య ఉన్న అన్ని సమస్యలపై చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని” చెప్పారు.

అటు పాకిస్తాన్ విదేశాగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో కూడా మాస్కో చేరుకున్నారు. భారత ప్రధాని ప్రకటన అంత సానుకూలంగా లేదని, కానీ అందులో ఆయన చర్చలు ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేశారని చెప్పారు.

1965 డిసెంబర్‌లో అయూబ్ ఖాన్ అమెరికా వెళ్లారు. అక్కడ అధ్యక్షుడు జాన్సన్‌ను కలిసిన ఆయన, ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో కూడా పాల్గొన్నారు.

అయూబ్ ఖాన్

సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం

భారత ఉపఖండంలో నిర్ణయాత్మక పాత్ర పోషించేలా సోవియట్ యూనియన్‌కు అనుమతి ఇవ్వడం తెలివైన నిర్ణయం కాదని అయూబ్ ఖాన్ అమెరికా అధ్యక్షుడికి చెప్పడానికి ప్రయత్నించారు.

కానీ, చైనా-పాకిస్తాన్ ఒకవైపు, సోవియట్ యూనియన్-భారత్ మరోవైపు ఉన్న ఒక కూటమిని అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకోవాలంటే అది సోవియట్ యూనియన్‌కు మాత్రమే సాధ్యమని అమెరికా దాని మిత్ర దేశాలు భావించాయి.

తాము ప్రస్తుతం వియత్నాం యుద్ధంలో చిక్కుకుపోయామని పాకిస్తాన్‌కు స్పష్టం చేసిన అమెరికా, భారత ఉపఖండానికి సంబంధించిన విషయాల్లో చైనాను చేర్చడం ప్రమాదకరంగా భావిస్తున్నట్లు చెప్పింది.

సోవియట్ యూనియన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చైనాతో ఏ గొడవా కోరుకోవడం లేదు.

దాంతో, సోవియట్ యూనియన్‌ను భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిగా చేశారు.

దాంతో, అయూబ్ ఖాన్ అమెరికా నుంచి నిరాశగా వెనుదిరిగారు. 1966 జనవరి మొదటివారంలో 16 సభ్యుల ప్రతినిధి మండలితో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఏడు రోజులపాటు చారిత్రక చర్చలు జరిగాయి. ఆ సమయంలో చాలాసార్లు అవి వాయిదా కూడా పడ్డాయి. భారత ప్రధాని శాస్త్రి ఆ చర్చల్లో కశ్మీర్ ప్రస్తావనను చేర్చడానికి నిరాకరించడమే దానికి కారణం.

భారత్-పాక్ యుద్ధం వల్ల ఉత్పన్నమైన సమస్యలకు పరిష్కారాలపై మాత్రమే తాష్కెంట్‌లో చర్చలు జరిగాయి.

అలాంటి పరిస్థితుల్లో ఈ చర్చల వల్ల ఏ ప్రయోజం లేదని, ఏ ఒప్పందం చేసుకోకుండా వెళ్లిపోవడమే మంచిదని పాకిస్తాన్ ప్రతినిధి మండలి భావించింది.

అయూబ్ ఖాన్

తాష్కెంట్ ఒప్పందం

కానీ చర్చల చివరి రోజుల్లో సోవియట్ యూనియన్ ప్రధాని, అయూబ్ ఖాన్‌ను చాలాసార్లు కలిశారు. భారత్‌తో ఒప్పందానికి ఎలాగోలా రాజీ చేశారు.

దాంతో 1966 జనవరి 10న అధ్యక్షుడు అయూబ్ ఖాన్, భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల సైన్యం. తర్వాత నెలన్నరలో 1965 ఆగస్టు 5 నాటి స్థితిని పునరుద్ధరించేందుకు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు కట్టుబడి చర్చల ఆధారంగా కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కూడా నిర్ణయించాయి.

కానీ, తాష్కెంట్ ఒప్పందం అయూబ్ ఖాన్ రాజకీయ జీవితంలో అత్యంత తప్పుడు నిర్ణయంగా నిరూపితమైంది. ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రజలకు ఆయనపై ఆగ్రహం వచ్చింది. చివరికి అయూబ్ ఖాన్ తన పదవినే కోల్పోవాల్సి వచ్చింది

పాకిస్తాన్ లేవనెత్తిన కశ్మీర్ సమస్యను తాష్కెంట్ భూమిలో శాశ్వతంగా పాతిపెట్టేశారని, ప్రభుత్వ వాదనల ప్రకారం మైదానంలో గెలిచినట్లు చెబుతున్న యుద్ధాన్ని, చర్చల బల్లపై ఓడించారని పాక్ ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
General Ayub Khan visits Beijing secretly during 1965 India China war
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X