• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IndvsPak-T20 World Cup: ‘బ్లాంక్ చెక్‌లో నచ్చిన అంకె రాసుకోండి, కానీ భారత్‌ను ఓడించండి’

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews
భారత్-పాక్

"లాహోర్‌లో మంచు కురిసే అవకాశమే ఎక్కువ. కానీ, భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ మాత్రం జరగదు. అవును, ఈ రెండూ ఐసీసీ టోర్నమెంటులో తలపడుతున్నాయి"

గత ఏడాది కోవిడ్-19 వల్ల లాక్‌డౌన్ విధించిన సమయంలో వీడియో చాట్ చేసినప్పుడు పాక్ మాజీ కెప్టెన్ ప్రస్తుత పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా అడిగిన ప్రశ్నకు భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఇచ్చిన సమాధానం ఇది.

2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. అందులో భారత్ డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం పాకిస్తాన్‌ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఏ ఫార్మాట్‌ అయినా ప్రపంచకప్‌లో ప్రతిసారీ భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి రికార్డ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రెండూ మరోసారి ఐసీసీ టోర్నమెంట్ వరల్డ్ టీ20లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.

2021లో ఐసీసీ వరల్డ్ టీ20 అక్టోబర్ 17 నుంచే ప్రారంభమైంది. అధికారికంగా భారత్ దీనికి ఆతిథ్యం ఇవ్వాలి. కానీ, ఈ టోర్నీని ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో నిర్వహిస్తున్నారు. కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేలా మెరుగైన ఏర్పాట్లు, బీసీసీఐ ఇటీవలే తమ అతిపెద్ద టోర్నీ ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించడమే దీనికి కారణం.

భారత్-పాక్

టీవీ సెట్లు పగలగొట్టే మ్యాచ్

చెప్పాలంటే ఈ వరల్డ్ కప్‌లో ముఖ్యమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ, ప్రపంచం కళ్లన్నీ ఎప్పటిలాగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మీదే ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ రెండూ గ్రూప్ 2లో ఉన్నాయి. అక్టోబర్ 24న దుబయిలో జరిగే మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ, క్రికెట్ మైదానంలో రెండూ పరస్పరం తలపడుతున్నప్పుడు దానిని చూడాలని ప్రతి క్రికెట్ అభిమానీ అనుకుంటాడు.

మ్యాచ్ తర్వాత గెలిచిన దేశం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటే, ఓడిన జట్టు దేశం విషాదంలో మునిగిపోతుంది. ఆ కోపమంతా టీవీల మీద కూడా చూపిస్తారు. వాటిని బద్దలు కొట్టి ఓటమి భారం దించుకుంటారు. మ్యాచ్ గెలిపించిన ఆటగాడు రాత్రికి రాత్రే హీరో అయిపోతాడు. మ్యాచ్ ఫలితం చివరి ఓవర్లో వస్తే, ఏ బౌలర్ బంతి వల్ల ఓటమి ఎదురైందో అతడు ప్రత్యర్థి దేశంలో అందరికీ విలన్ అయిపోతాడు.

షార్జాలో చేతన్ శర్మ బౌలింగ్‌లో చివరి బంతికి సిక్స్ కొట్టి జావేద్ మియాందాద్ పాకిస్తాన్‌కు అందించిన అద్భుత విజయాన్ని ఆ దేశంలోని వారు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అలాగే 2007లో జరిగిన మొదటి వరల్డ్ టీ20 కప్‌లో కెప్టెన్ ధోనీ చివరి ఓవర్‌ను పెద్దగా తెలీని జోగిందర్ శర్మతో వేయించడం, అతడి బౌలింగ్‌లో మిస్బా కొట్టిన షాట్‌కు బంతి శ్రీశాంత్ చేతుల్లో పడడం, భారత్ తొలి టీ20 చాంపియన్‌గా అవతరించిన క్షణాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదు.

ఆ ఒక్క ఓవర్ వల్ల జోగిందర్ శర్మ ఇప్పటికీ భారత్‌లో ప్రతి క్రికెట్ అభిమానికీ గుర్తుండిపోయాడు. అదేవిధంగా మిస్బా ఆ షాట్‌ను పాక్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.

ఆ మ్యాచ్‌తో మొదలైన మహేంద్ర సింగ్ ధోనీ చరిష్మా తర్వాత కూడా కొనసాగింది. 2011లో మిస్టర్ కూల్ భారత్‌ను ప్రపంచ చాంపియన్‌గా నిలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. అయితే, క్రికెట్ వీరాభిమానులు మాత్రం ఇప్పటికీ 2007 వరల్డ్ టీ20 కప్ విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు.

భారత్-పాక్

జ్ఞాపకాలు, భావోద్వేగాల మ్యాచ్

భారత్, పాకిస్తాన్ ఇప్పుడు మరోసారి టీ20 ప్రపంచ కప్‌లో తలపడుతుంటే, రెండు దేశాల ఆటగాళ్లకు కూడా ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాలూ ఐసీసీ టోర్నీలో తలపడిన ఆ క్షణాలు మనసులో నిలుస్తాయి.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆటగాళ్లకు ఎలా ఉంటుందో పాక్ మాజీ బ్యాట్స్‌మెన్ మిస్బా ఉల్ హక్ చెప్పాడు.

"ఈ రెండు దేశాలు ఎప్పుడు తలపడినా ఏ టీమ్ ఏ ర్యాంకింగ్‌లో ఉంది. వీటిలో ఏది బలమైనది, ఏది బలహీనమైనది అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. అది హాకీ అయినా క్రికెట్ అయినా.. ఆ మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠగానే ఉంటుంది. దాని ముగింపు కూడా అద్భుతం అవుతుంది" అన్నారు.

అక్టోబర్ 24న జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా తన మనసులోని మాట చెప్పాడు.

"ఒక పెద్ద మ్యాచ్ ఆడే ముందు ఒక జట్టుగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండడం అనేది చాలా ముఖ్యం. మా టీమ్‌లో ఆటగాళ్ల మనోబలం అత్యున్నతంగా ఉంది. గతంలో జరిగినవి వదిలేసిన మేం ఆడబోయే దాని గురించి ఆలోచిస్తున్నాం, రాబోవు మ్యాచ్ కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఆ రోజు మేం మంచి క్రికెట్ ఆడుతాం" అన్నాడు.

భారత్-పాక్

మీరు ఓడిపోతే మా ఇంటికి రాకండి

ఒకప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడిన పాకిస్తాన్‌ ప్రముఖ బౌలర్ సికిందర్ బఖ్త్ కూడా టీ20 వరల్డ్ కప్‌లో జరగబోయే భారత్-పాక్ మ్యాచ్ గురించి మాట్లాడారు.

"ఈమధ్య రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రపంచకప్ మ్యాచుల్లో భారత్‌ను మేం ఎప్పుడూ ఓడించలేదనే విషయం తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు భారత్‌ను సులభంగా ఓడించేది. కానీ, ఆ సమయంలో కూడా ప్రపంచకప్‌లో మేం వాళ్లను ఓడించలేకపోయాం. అది చాలా వింతగా అనిపిస్తుంది. అదే, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మేం భారత్‌ను ఫైనల్లో ఓడించి అద్భుత విజయం అదుకున్నాం. కానీ, ఐసీసీ వరల్డ్ కప్‌లో ఎందుకు ఇలా అవుతోందో, మాకు అసలు అర్థం కావడం లేదు" అన్నారు.

భారత్‌లో ఒంటరిగా తిరిగేవాడిని

భారత్, పాకిస్తాన్ రెండూ పొరుగు దేశాలు. వాటి మధ్య సంబంధాలు రాజకీయాల వల్ల దారుణంగా మారాయి అంటారు సికిందర్ బఖ్త్ అన్నారు.

"నేను భయపడేలా, అవమానానికి గురయ్యేలా ఎప్పుడూ ఎక్కడా నేను భారత్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా మాట్లాడే తీరును బట్టి నేను పాకిస్తానీ అని వారికి సులభంగా తెలిసేది. కానీ, ఎప్పుడూ ఎక్కడా నాకు భయం వేయలేదు. అదే విషయాన్ని మేం భారత క్రికెటర్లు, నటుల నుంచి కూడా వింటున్నాం. ధోనీపై తీసిన సినిమాలో కూడా అదే చూపించారు" అని చెప్పారు.

భారత్

ఈ ప్రపంచకప్‌లో ఆ రికార్డు బద్దలవుతుందేమో

"ఒకసారి సునీల్ గావస్కర్ ఏషియన్ చాంపియన్‌షిప్‌లో కామెంటరీ చేయడానికి పాకిస్తాన్ వచ్చారు. ఆయన స్వయంగా ఏవో కొనడానికి మార్కెట్‌కు వెళ్లారు. ఏ షాపు వాళ్లూ ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేదు. అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా ఆటగాళ్లకు సామాన్యులకు మధ్య ఆ బంధం అసాధారణంగా ఉంటుంది. అది ఒక అందమైన బంధం అని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను" అన్నారు.

"నేను రాజకీయ పరిస్థితులు, కారణాలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయను. అది నా పరిధి కాదు. నేను ఆట, జనం గురించి మాట్లాడతా. మన క్రికెట్ బంధం చాలా బాగుంటుంది. పాకిస్తాన్ గురించి మాట్లాడితే, నాకు భారత కళాకారులు, క్రికెటర్లు చాలా బాగా అనిపిస్తారు. నేనెప్పుడు భారత్ వెళ్లినా నా స్పందన కూడా అలాగే ఉంటుంది" అన్నారు సికిందర్ బఖ్త్.

"ఇప్పుడు మైదానంలో జరిగేది ఒక వింతలా ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మినహా ఈ రికార్డ్ బ్రేక్ కావడం లేదు. అవును మేం దాన్ని చాలా సులభంగా గెలిచాం. మేం భారత్‌ను ఢాకాలో కూడా ఓడించాం. అప్పుడు షాహిద్ అఫ్రిదీ సిక్సర్లు కొట్టాడు. షార్జాలో జావేద్ చివరి బంతికి సిక్సర్ కొట్టాడు. కానీ, ఇక్కడ ఐసీసీ ప్రపంచకప్‌లో ఇలా ఎందుకు జరుగుతోందో మాకు అర్థం కావడం లేదు"

"ఇప్పుడు దీనికి నేను ఒకే జవాబు చెప్పగలను. రికార్డులు ఎప్పుడూ బద్దలవుతూనే ఉంటాయి. ఏమో ఈ ప్రపంచకప్‌లో ఈ రికార్డు బద్దలవుతుందేమో" అన్నారు సికిందర్ బఖ్త్.

పాక్ జట్టు

'బ్లాంక్ చెక్ తీసుకోండి నచ్చిన అమౌంట్ వేసుకోండి'

"ప్రధానంగా చూస్తే, మన జీవనవిధానం, ఆహార అలవాట్లు, బట్టలు వాతావరణం అంతా ఒకేలా ఉంటుంది. మేం వాళ్ల సినిమాలు కూడా చూస్తాం. సంస్కృతి కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. మా మతం మాత్రం భిన్నంగా ఉంటుంది. మా పూర్వీకులు స్వయంగా దిల్లీలో ఉండేవారు. వాళ్లు అక్కడే పుట్టి పెరిగారు"

"మా బంధువులు మద్రాస్‌కు చెందినవారు. నేను భారత్‌లో పర్యటించినపుడు వారి ఇళ్లు చూడ్డానికి కూడా వెళ్లాను. అంటే నాకు భారత్‌తో అనుబంధం ఉంది. మాకు భారత్‌లో ఎంత ప్రేమ లభిస్తుందో.. లేదా వారంటే మా దేశంలో ఎంత ప్రేమ ఉంటుందో మాటల్లో చెప్పలేను. కానీ, రాజకీయాల వల్ల మేం భయపడుతూ జీవిస్తున్నాం. కానీ, రెండు వైపులా కొందరు ఒకేలా ఉంటారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటారు. ఒకరినొకరు తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తారు"

"అలా నాక్కూడా జరిగింది. 1979లో నేను భారత పర్యటనకు వెళ్లబోతున్నాను. దానికి ముందు ఒక స్నేహుతుడి ఇంటికి వెళ్లాను. అప్పుడు స్నేహితుడి అమ్మగారు వచ్చారు. "నువ్వు భారత్ వెళ్తున్నావా.. కానీ, ఓడిపోయి రాకు, ఓడిపోయి వస్తే మా ఇంట్లోకి రావద్దు" అన్నారు. అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. మేం ఆ సిరీస్ ఓడిపోయాం కూడా" అన్నారు సికిందర్ బఖ్త్.

"మేం తిరిగి పాకిస్తాన్ వచ్చినపుడు, కస్టమ్స్ చెకింగ్ దగ్గర జరిగింది ఇప్పటికీ గుర్తుంది. అక్కడ వాళ్లు మా రికార్డులు, అన్ని వస్తువులు తీసుకుని తమ దగ్గరే పెట్టుకున్నారు. తిరిగి ఇవ్వలేదు. అంటే మేం భారత్ నుంచి ఓడిపోయి వస్తే అలాంటి రియాక్షన్లు ఉంటాయి"

"ఇప్పుడు మాజీ కెప్టెన్, పీసీబీ చైర్మన్ అయిన రమీజ్ రాజా కరాచీ వచ్చినపుడు అక్కడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆయన్ను కలిసింది. ఒక పెద్ద వ్యాపారి ఆయనతో 'మీరు బ్లాంక్ చెక్ తీసుకోండి. భారత్‌ను ఓడించి దానిపై మీకు నచ్చిన అమౌంట్ రాసుకోండి' అన్నారు.

అంటే అలాంటి ఒత్తిళ్లు ఉంటాయి. అలా జరిగినప్పుడు, ఆ ప్రభావం ఆటగాళ్లపై కూడా పడుతుంది. మ్యాచ్‌కు ముందు పడుకున్నా వారికి కలల్లో, ఆలోచనల్లో కూడా అవే వస్తుంటాయి. ఇప్పుడు కూడా మొదటి మ్యాచ్ భారత్‌తోనే జరుగుతోంది కాబట్టి పాకిస్తానీలు, మనం గెలవాలి అనే అనుకుంటూ ఉంటారు" అని సికిందర్ బఖ్త్ చెప్పారు.

"మేం భారత్‌తో మొదటి మ్యాచ్ గెలిస్తే తర్వాత ప్రపంచకప్ గెలవడం సులభం అవుతుంది. ఏదేమైనా భారత్, పాకిస్తాన్ మధ్య ఒక వింత, ఆసక్తికరమైన పోటీ ఉంటుంది. అది అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. అయినా రెండు జట్ల ఆటగాళ్లలో మా కాలంలో ఉన్నట్టే స్నేహం కూడా ఉంది. అయితే ఇప్పుడు వారు కలవడం తగ్గిపోతోంది. కానీ ఎప్పుడు కలిసినా పాతవి గుర్తొస్తాయి. విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను మహమ్మద్ అమీర్‌ లాంటి వాళ్లకు గిఫ్ట్ ఇవ్వడం లాంటివి చూసినపుడు చాలా బాగుంటుంది. కానీ, ఇది ఈ పోటీ మాత్రం ఇలాగే ఉంటుంది" అన్నారు.

పాక్ జట్టు

అప్పటి ఆటగాళ్లలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండేది

భారత్-పాక్ మ్యాచ్ గురించి పాకిస్తాన్‌ మాజీ ఆఫ్ స్పిన్నర్ తౌసీఫ్ అహ్మద్ కూడా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

"ఏ ఆట అయినా అందులో ఒక జట్టు గెలుస్తుందని, మరొకటి ఓడుతుందని మనకు తెలుసు. ఆస్ట్రేలియాతో ఓడిపోతే ఏం పర్వాలేదు అనుకుంటాం. కానీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి ఎంత టెన్షన్ ఉంటుందో, భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు కూడా అలాగే ఉంటుంది. దానికి కారణం శతాబ్దాల నుంచి ఉన్న భారత్, పాకిస్తాన్‌కు సంబంధాలే" అన్నారు.

"భారత్‌తో నేను కూడా చాలా మ్యాచ్‌లు ఆడాను. అక్కడ మరో రకం ఒత్తిడి ఉంటుంది. అది ఆటగాళ్లపై తక్కువ, జనంపై ఎక్కువగా ఉంటుంది. వాళ్లు టీమ్ ఓడిపోవడాన్ని అసలు చూడకూడదని అనుకుంటారు. అదే ఒత్తిడి ఆటగాళ్లపై కూడా పడుతుంది. అది వారిని ఇబ్బందిపెడుతుంది. దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం" అంటారు తౌసీఫ్.

"అది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. దానిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో జావేద్ మియాందాద్ లాంటి ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉండేవాళ్లు. ఇమ్రాన్ ఖాన్‌లో కూడా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండేది. భారత్‌తో మ్యాచ్‌ అంటే గతంలో కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు అది కనపడకుండా చేసేవారు" అని చెప్పారు.

"మేం భారత్‌తో టెస్టులు, వన్డేలు కూడా గెలిచాం. అప్పటి ఆటగాళ్లకు ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండేది. ఇప్పటి ఆటగాళ్లలో అదిలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు భారత్ ఆధిపత్యం కనిపిస్తోంది. ఒత్తిడి భారత్ మీద కూడా ఉంటుంది"

"భారత్ జట్టులో గతంలో కూడా గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ జావేద్ మియాందాద్ లాంటి ఒక్కరు వాళ్లందరినీ ఇబ్బంది పెట్టేవాడు. ఆయనొక మంచి ఆటగాడు, కానీ, కవ్విస్తాడని భారత ఆటగాళ్లు కూడా ఒప్పుకుంటారు. అది ఆటలో భాగం. స్లెడ్జింగ్ ఇంతకు ముందూ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ అప్పట్లో ఉన్నంత లేదు" అన్నారు తౌసీఫ్.

ఒత్తిడిని ఎలా చిత్తు చేయాలో తెలిసిన జావేద్ మియాందాద్, ఇమ్రాన్ ఖాన్, ముదస్సర్ నజర్, రమీజ్ రాజా లాంటి ఆటగాళ్లతో ఆడడం తన అదృష్టం అంటారు తౌసీఫ్ అహ్మద్.

కొంతకాలం ముందేమో గానీ ఇప్పుడు ప్రకటించిన పాక్ జట్టుకు కూడా ఆ ఒత్తిడిని భరించడం తెలుసు అంటారు ఆయన

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు-ఫలితం

  • 2007లో మొదటి టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ గ్రూప్ డీలో ఉన్నాయి.

రెండింటి మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌ టై కావడంతో బాలవుట్‌లో భారత్ 3-0తో గెలిచింది.

ఆ తర్వాత ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను 5 పరుగులు తేడాతో ఓడించింది.

  • 2009లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది.

ఆ తర్వాత రెండు టీములూ తలపడలేదు. కానీ, అదే టోర్నీ ఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

  • 2010లో జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్తాన్ తలపడలేదు.
  • 2012లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ సూపర్-8లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
  • 2014లో జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ సూపర్-10లో గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
  • 2016లో జరిగిన ప్రపంచ కప్ సూపర్-10లో భారత్ గ్రూప్ 2 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
IndvsPak-T20 World Cup: ‘Write your favorite number on a blank check, but beat India’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X