వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిపా వైరస్: మరణాల రేటు 40-75 శాతం.. వ్యాక్సీన్ లేదు, చికిత్స లేదు.. ఇది మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గబ్బిలాలు పలు రకాల కరోనావైరస్‌లకు ఆలవాలం

నిపా వైరస్ మరణాల రేటు 75 శాతం వరకూ ఉంది. దీనికి టీకా లేదు. ఒక పక్క ప్రపంచం కరోనావైరస్‌తో పోరాడుతూ ఉంటే, మరో పక్క నిపా వైరస్ మహమ్మారిగా మారి, విజృంభించకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

2020 జనవరి 3.. సుపాపోర్న్ వకారాప్లసాదీ తన క్లినిక్‌లో ఉన్నారు. ఒక డెలివరీ జరగబోతోంది. ఆ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. చైనాలోని వూహాన్ నగరంలో శ్వాసకోశ సంబంధ వ్యాధి ఏదో వ్యాపిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనా క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం సమీపిస్తుండండంతో..పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌కు వెళ్లి కొత్త సంవత్సర వేడుకులు జరుపుకోవాలని అనేకమంది చైనీయులు ప్రయాణమవుతున్నారు.

ముందు జాగ్రత్త చర్యగా థాయ్ ప్రభుత్వం విమానాశ్రయంలోనే వూహాన్‌నుంచీ వస్తున్న పర్యటకులకు పరీక్షలు జరపడం మొదలుపెట్టింది. సేకరించిన శాంపిల్స్‌ను కొన్ని ల్యాబ్‌లకు పంపించింది. వాటిల్లో వకారాప్లసాదీ ల్యాబ్ కూడా ఒకటి.

పరీక్షలు జరిపి వైరస్‌ను కనిపెట్టడంలో వకారాప్లసాదీ నిపుణులు. ఆమె బ్యాంకాక్‌లో 'థాయ్ రెడ్ క్రాస్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ హెల్త్ సైన్స్ సెంటర్‌’ నడుపుతున్నారు.

గత పదేళ్లుగా వకారాప్లసాదీ 'ప్రిడిక్ట్’ అనే ప్రోగ్రాంలో భాగస్వాములుగా ఉన్నారు. జంతువులనుంచీ, మానవులకు వ్యాపించే అంటువ్యాధులను గుర్తించడం, నివారించడం వీరి పని.

వకారాప్లసాదీ తన బృందంతో కలిసి అనేక రకాల జీవులను పరీక్షించారు. కానీ వాళ్లు ప్రధానంగా గబ్బిలాల మీద దృష్టి కేంద్రీకరించారు. గబ్బిలాలు పలు రకాల కరోనావైరస్‌లకు ఆలవాలం.

అతి కొద్ది రోజుల్లోనే వకారాప్లసాదీ బృందం కోవిడ్ 19 వైరస్‌ను గుర్తించింది. చైనా వెలుపల నమోదైన మొట్టమొదటి కరోనావైరస్ కేసు అదే.

ఇది, గబ్బిలాల్లో కనుగొన్న కరోనావైరస్‌తో దగ్గర సంబంధం కలిగి ఉందని గుర్తించారు.

ఈ సమాచారం ఆధారంగా థాయ్ ప్రభుత్వం అత్యంత వేగంగా రోగులను క్వారంటీన్‌కు తరలించి, ప్రజలను అప్రమత్తం చేయగలిగింది. ఇందువల్లే థాయ్‌లాండ్ జనాభా 7 కోట్లు అయినప్పటికీ..2021 జనవరి 3నాటికి, ఆ దేశంలో కేవలం 8,955 కోవిడ్ కేసులు, 65 మరణాలు సంభవించాయి.

మార్కెట్‌కు వెళ్లే వాళ్లు గబ్బిలాలు మూత్రవిసర్జన చేసిన ఉపరితలాలను నేరుగా తాకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది

నిపా వైరస్

ఆసియాలో అంటువ్యాధుల సంఖ్య ఎక్కువే. ఉష్ణమండల ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యాధికారకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెరుగుతున్న జనాభా, వన్యమృగాలకు, మనుషులకు సంబంధాలు పెరగడం కూడా ఇందుకు కారణం.

గత కొన్నేళ్లుగా వకారాప్లసాదీ బృందం వేలకొద్దీ గబ్బిలాలను పరీక్షించినప్పుడు, వాటిల్లో అనేక రకాల వైరస్‌లను కనుగొన్నారు. వాటిల్లో అధిక శాతం కరోనావైరస్‌లే ఉన్నా మానవులకు అత్యంత ప్రమాదకరమైన మరికొన్ని వైరస్‌లను కూడా కనుగొన్నారు.

వీటిల్లో నిపా వైరస్ ముఖ్యమైనది. ఫ్రూట్ బ్యాట్స్ అనే గబ్బిలాల జాతిలో ఇది సహజంగా కనిపిస్తుంది.

"ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే దీనికి చికిత్స లేదు. దీనివలన మరణాల రేటు కూడా అధికంగానే ఉంటుంది" అని వకారాప్లసాదీ తెలిపారు.

నిపా వైరస్ మరణాల రేటు 40% నుంచీ 75% వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్కడ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేదానిపై మరణాల రేటు ఆధారపడి ఉంటుంది.

వకారాప్లసాదీ మాత్రమే కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ వైరస్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతీ ఏడాదీ డబ్ల్యూహెచ్ఓ..పెద్ద ఎత్తున అంటువ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను సమీక్షిస్తుంది. అత్యధిక స్థాయిలో ప్రమాదాన్ని కొనితెచ్చే వాటికి, ఇప్పటివరకూ వ్యాక్సీన్ లేనివాటికి ప్రాధాన్యత ఇస్తూ వాటిపై పరిశోధన, నివారణ చర్యలకు నిధులను కేటాయిస్తుంది.

అలా డబ్ల్యూహెచ్ఓ తయారుచేసిన జాబితాలోని మొదటి పది వైరస్‌లలో నిపా వైరస్ కూడా ఉంది.

నిపా వైరస్‌ను ఇంత ప్రమాదకారిగా పరిగణించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ వైరస్ సోకిన తరువాత వ్యాధి లక్షణాలు బయటపడడానికి 4 నుంచీ 14 రోజులు పడుతుంది. ఒక ప్రత్యేక కేసులో 45 రోజులు పట్టిందని సమాచారం. అంటే నిపా వైరస్ సోకినవారు, ఆ విషయం తెలుసుకునేలోపే మరి కొందరికి వ్యాపింపజేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ వైరస్ అనేక రకాల జంతువులకు వ్యాపించే అవకాశం ఉంది. అంటే వాటన్నిటి ద్వారా కూడా మనుషులకు సోకే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా ఒకరినుంచీ ఒకరికి సోకవచ్చు లేదా వైరస్‌తో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా వ్యాపించవచ్చు.

నిపా వైరస్ సోకినవారికి శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, మెదడువాపు రావొచ్చు.

ప్రమాదం అన్నిచోట్లా వ్యాపించి ఉంది

వాయువ్య కంబోడియాలోని బటాంబ్యాంగ్ నగరంలో ఈ వైరస్ తొలిసారిగా బయటపడింది. ఆ నగరంలో సరుకులు, కూరగాయలు, పండ్లు అమ్మే ఒక సాధారణ మార్కెట్ దగ్గర జాగ్రత్తగా పరిశీలించి చూస్తే పైన చెట్లకు, దూలాలకు వేలాడుతూ అనేక గబ్బిలాలు కనిపిస్తాయి. అక్కడ ఉన్న అన్ని వస్తువుల మీద, మనుషుల మీద మల, మూత్ర విసర్జన చేస్తూ కలుషితం చేస్తూ ఉంటాయి.

"ఆ మార్కెట్‌కు వెళ్లే మనుషులు, వీధి కుక్కలు కూడా గబ్బిలాలు మూత్రవిసర్జన చేసిన ఉపరితలాలను నేరుగా తాకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఫ్రూట్ బ్యాట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి మనుషులతో కాంటక్ట్‌లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివలన వైరస్ అధికంగా మ్యూటేట్ అయ్యి మహమ్మారిగా మారే ప్రమాదం ఉంది" అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాస్టర్‌లోని వైరాలజీ యూనిట్ హెడ్ వియాస్నా డూవాంగ్ తెలిపారు. వకారాప్లసాదీతో కలిసి పరిశోధన చేస్తున్న బృందంలో డూవాంగ్ కూడా ఉన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించడంలో గబ్బిలాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి

"థాయ్‌లాండ్‌లో మార్కెట్లలో, ప్రార్థనా స్థలాల్లో, స్కూళ్ల దగ్గర, పర్యటక స్థలాల్లో ఈ ఫ్రూట్ బ్యాట్స్ చెట్లకు వేలాడుతూ ఉండడం గమనించాం. ముఖ్యంగా పర్యటకులను విశేషంగా ఆకర్షించే బౌద్ధ దేవాలయం అంగ్‌కోర్ వాట్ దగ్గర గబ్బిలాల ఆవాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి" అని డూవాంగ్ తెలిపారు.

ప్రతీ ఏడాదీ అంగ్‌కోర్ వాట్‌ను 2.6 మిలియన్ల పర్యటకులు సందర్శిస్తారు. అంటే ఈ ఒక్క ప్రాంతంనుంచే నిపా వైరస్ మనుషులకు వ్యాపించడానికి ఏడాదికి 2.6 మిలియన్ల అవకాశాలు ఉన్నాయన్నమాట.

డూవాంగ్ బృందం 2013నుంచీ 2016 వరకూ ఒక జీపీఎస్ ట్రాకింగ్ ప్రోగ్రాంను నిర్వహించింది. ఫ్రూట్ బ్యాట్స్, నిపా వైరస్‌ను మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి, కంబోడియన్ గబ్బిలాలతో ఇతర నిపా వైరస్ హాట్ స్పాట్ ప్రాంతాల్లోని గబ్బిలాలను పోల్చి చూడడానికి ఈ ట్రాకింగ్ ప్రోగ్రాంను ప్రారంభించారు.

బంగ్లాదేశ్, ఇండియా నిపా వైరస్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో ముఖ్యమైనవి. గతంలో ఈ రెండు దేశాల్లోనూ నిపా వైరస్ వ్యాప్తి చెందింది. ఇక్కడ ఈత కల్లు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇది వ్యాప్తి చెందిందని ఒక అంచనా. రాత్రి పూట గబ్బిలాలు ఈత చెట్లకి ఎక్కువగా వేలాడతాయి. కల్లు సేకరించడానికి కట్టిన ముంతలను అవి తాకుతాయి. గబ్బిలాలు కలుషితం చేసిన కల్లు తాగడం వలన నింపా వైరస్ మనుషులకు సంక్రమిస్తుంది.

బంగ్లాదేశ్‌లో 2001నుంచీ 2011 వరకూ 11 సార్లు వ్యాప్తి చెందిన నిపా వైరస్ వలన 196మందికి వ్యాధిగ్రస్థులయ్యారు. వారిలో 150మంది మరణించారు.

కంబోడియాలో కూడా ఈత కల్లు చాలా పాపులర్. అక్కడ కూడా ఫ్రూట్ బ్యాట్స్ రాత్రిపూట ఈతపళ్లను వెతుక్కుంటూ వెళతాయని డూవాంగ్ బృందం గమనించింది. అంటే ఈ గబ్బిలాలకే కాకుండా వీటివలన కలుషితమైన ఆహారం గురించి కూడా మనం భయపడాలి.

కంబోడియాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గబ్బిలాల మలాన్ని ఎరువుగా వాడతారు. దీన్ని గ్వానో అని పిలుస్తారు. ఈ గ్వానో అమ్మకాలను జీవనోపాధిగా చేసుకున్నవారు చాలామందే ఉన్నారు. గ్వానో సేకరించడం కోసం తమ ఇళ్లకు దగ్గరగా ఫ్రూట్ బ్యాట్స్ సంచరించేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే వీళ్లకి ఈ గబ్బిలాల వల్ల వచ్చే ప్రమాదం గురించి తెలీదు.

"మేము ఇంటర్వ్యూ చేసినవారిలో 60 శాతం మందికి గబ్బిలాల వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని తెలీదు. వాటివల్ల మాకు ఏ ప్రమాదం లేదు...మాకెప్పుడూ అవి హాని కలిగించలేదు అని కూడా కొందరు గ్రామీణ ప్రాంతవాసులు చెప్పారు. గబ్బిలాలు కలిగించే వ్యాధుల గురించి స్థానికులకు అవగాహన కలిగించడం చాలా ముఖ్యం" అని డూవాంగ్ అన్నారు.

మారుతున్న ప్రపంచంతో పాటూ పెరుగుతున్న వ్యాధులు

అటవీ నిర్మూలన, పట్టణీకరణ, వ్యవసాయాన్ని తీవ్రతరం చేయడం మొదలైనవన్నీ కూడా జంతువులనుంచీ మనుషులకు వ్యాపించే వ్యాధులు పెరగడానికి కారణం అని పరిశోధకులు రెబెకా జే వైట్, ఆర్లీ రాజ్గౌర్ తెలిపారు.

గబ్బిలాల ఆవాసాలను నాశనం చేయడం వలనే గతంలో నిపా వైరస్ వ్యాప్తి చెందిందని పరిశోధకులు అంటున్నారు. 1998లో నిపావైరస్ కారణంగా మలేసియాలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అడవుల్లో కార్చిచ్చు అంటుకోవడం, స్థానికంగా కరువు ఏర్పడడం..మొదలైనవాటి కారణంగా గబ్బిలాల సహజ ఆవాసాలు నాశనం కావడంతో అవి పండ్ల చెట్లను వెతుక్కుంటూ మానవులు నివసించే ప్రాంతాల్లో వ్యాపిస్తున్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఒత్తిడి ఎక్కువైతే కూడా గబ్బిలాలు ఎక్కువ వైరస్‌లను వ్యాపింపజేస్తాయని అధ్యయనాల్లో తేలింది.

ఆసియాలో ఉష్ణమండల అడవులు ఎక్కువగా ఉన్నప్పటికీ, అటవీ నిర్మూలన వేగంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం కోల్పోతున్న ప్రాంతాల్లో ఆసియా పై స్థానంలో ఉంది.

ఫ్రూట్ బ్యాట్స్ ప్రధానంగా పండ్లు ఎక్కువగా ఉన్న దట్టమైన అడవుల్లో నివసిస్తూ ఉంటాయి. వాటి ఆవాసాలను నాశనం చేస్తే అవి మనుషులు నివసించే ప్రాంతాల్లోని పండ్ల చెట్లను ఆసరాగా చేసుకుని జీవిస్తాయి.

గబ్బిలాలవల్ల అనేక రకాల వ్యాధులు సంక్రమించవచ్చని మనకు ఇప్పుడు బాగా తెలిసింది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? గబ్బిలాలను అంతం చేయడమే మార్గమా?

"భూమిని మరింత నాశనం చేయాలనుకుంటే ఆ పని చేయవచ్చు" అని ప్రిడిక్ట్ ప్రాజెక్ట్ ల్యాబ్ డైరెక్టర్ ట్రేసీ గోల్డ్‌స్టైన్ అంటున్నారు.

"పర్యావరణాన్ని పరిరక్షించడంలో గబ్బిలాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. 500కన్నా ఎక్కువ జాతి మొక్కలలో పరాగసంపర్కం కావడానికి కారణమవుతాయి. అంతే కాకుండా, అనేక రకాల క్రిమి కీటకాలను నాశనం చేస్తూ మానవులను అనేక రకాల వ్యాధులనుంచీ రక్షిస్తాయి. ఉదాహరణకు దోమలను తింటూ మలేరియానుంచీ మనుషులను రక్షిస్తాయి" అని గోల్డ్‌స్టైన్ తెలిపారు.

"జంతువులను చంపడంవల్ల వైరస్‌లు అధికమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ జంతువులు నివారించే వైరస్‌ల సంఖ్య పెరుగుతుంది" అని ఆమె అన్నారు.

నిపా వైరస్

జవాబులు దొరుకుతున్నకొద్దీ ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి

ఎన్ని జవాబులు కనుక్కుంటూ ఉంటే అన్ని కొత్త ప్రశ్నలు పుడుతున్నాయని డూవాంగ్ బృందం అంటోంది. కంబోడియాలో ప్రమాద సంకేతాలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నప్పటికీ అక్కడ నిపా వైరస్ ఎందుకు వ్యాప్తి చెందలేదు, సమయం ఇంకా ఆసన్నమవ్వలేదా, మలేసియాలో గబ్బిలాలకన్నా, కంబోడియాలో గబ్బిలాలు భిన్నమైనవా, గబ్బిలాలకు, మనుషులకు మధ్య సంబంధం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుందా... ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అని వారు అంటున్నారు.

వీటన్నిటికీ జవాబులు కనుక్కునే దిశగా డూవాంగ్ బృందం కృషి చేస్తోంది. డూవాంగ్ బృందం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిరక్షకులు కూడా కొత్త వైరస్‌ల జాడ కనుక్కుని, నివారించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

డూవాంగ్ సేకరించిన వైరస్ శాంపిల్స్‌ను ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్‌నెస్‌లో పని చేస్తున్న పరిశోధకులు డేవిడ్ విలియంకు పంపిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిపా వైరస్ చాలా ప్రమాదకరమని భావిస్తున్నాయి. అయితే, ఈ వైరస్‌ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ప్రయోగశాలలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిల్లో విలియం ల్యాబ్ కూడా ఒకటి.

విలియం బృందం నిపా వైరస్ పరిశోధనల్లో నిపుణులు. వీరంతా ఈ వైరస్‌ను తమ ల్యాబ్‌లో వృద్ధి చేసి, దీనిపై మరింత లోతుగా అధ్యయనాలు చేస్తున్నారు. డూవాంగ్ బృందం, విలియం బృందం కూడా వారి వారి అధ్యయన ఫలితాలను ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉంటారు.

అయితే, కంబోడియాలాంటి ప్రాంతాల్లో మరిన్ని ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం ద్వారా వీటిపై పరిశోధనకు మరింత వీలు ఏర్పడుతుందని, ఈ వైరస్ గురించి మనం మరింత వేగంగా వివరాలు తెలుసుకోగలుగుతామని...తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

డూవాంగ్, వకారాప్లసాదీ చేస్తున్న పరిశోధనలకు సమకూరుతున్న నిధులు గత కొన్నేళ్లుగా అస్తవ్యస్తంగా మారాయి. 10 ఏళ్లకని ప్రారంభించిన ప్రిడిక్ట్ ప్రోగ్రాంను ముగించబోతున్నట్లు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొత్తగా అధ్యక్ష పదవి స్వీకరించిన జో బైడెన్..ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

వకారాప్లసాదీకు 'థాయ్ విరోం ప్రాజెక్ట్' అనే మరో కొత్త ప్రాజెక్ట్‌కు నిధులు సమకూరాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిపా వైరస్‌పై మరింత ఎక్కువగా పరిశోధనలు చేసే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.

ప్రిడిక్ట్ ప్రోగ్రాంవల్ల వన్యప్రాణులనుంచీ వ్యాపించే వైరస్‌ల గురించి మరింత అవగాహన పెంపొందించుకునే అవకాశం కలిగిందని వకారాప్లసాదీ తెలిపారు.

జంతువుల ద్వారా సంక్రమించే అంటువ్యాధులపై తాము సంయుక్తంగా నిర్వహిస్తున్న పరిశోధనలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని డూవాంగ్, వకారాప్లసాదీ భావిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
40-75% mortality rate with Nipah virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X