వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లిస్బన్‌లో కోవిడ్ ప్రోత్సాహకాలు ఉదారంగా అందిస్తున్నారు

కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ బారిన పడినవారు తమంతట తామే ఐసొలేషన్‌లోకి వెళ్లేందుకు ప్రోత్సహించినట్టు అవుతుందని ఆ దేశ వైద్యాధికారులు సూచించారు.

కరోనావైరస్ లక్షణాలు ఉన్నవారు లేదా పాజిటివ్ అని నిర్థరణ అయినవారు క్వారంటీన్ పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లైతే కోవిడ్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు.

అయితే, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు, ఇంటినుంచి పని చేసే సదుపాయం లేనివారికి, ఐసొలేషన్‌లో ఉన్నవారికి ఇప్పటికే 500 పౌండ్లను చెల్లిస్తున్నామని తెలుపుతూ బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కొట్టివేసింది.

కానీ, ఇలాంటి ప్రోత్సాహకాలు అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ సోకినవారు అనేకమంది క్వారంటీన్ పాటించట్లేదని, కేవలం 18% మాత్రమే పూర్తిగా పది రోజులు ఐసొలేషన్‌లో ఉంటున్నారని నిపుణులు అంటున్నారు.

ఇంతకీ మిగతా దేశాల్లో ఏం చేస్తున్నారు? కోవిడ్ సోకినవారు తమంతట తాముగా క్వారంటీన్ పాటించడానికి ఆ దేశాల ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి? లేదా ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటారని విశ్వసిస్తున్నారా?

వివిధ దేశాలనుంచీ బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి.

పోర్చుగల్

పోర్చుగల్‌లో కోవిడ్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి సైతం..అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చినవారిని ఒకసారి నేరుగా కలిసినా కూడా వారికి 14 రోజుల మూలవేతనాన్ని 100% అందిస్తున్నారని లిస్బన్‌ నుంచీ బీబీసీ ప్రతినిధి అలిసన్ రాబర్ట్స్ తెలిపారు.

కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి లేదా పాజిటివ్ అని నిర్థరణ అయినవారికి 28 రోజుల పూర్తి జీతాన్ని అందిస్తున్నారు. ఐసొలేషన్‌లోకి వెళ్లిన మొదటిరోజునుంచే ఈ ప్రోత్సహాకాలను అందిస్తున్నారు.

పర్మనెంట్ ఉద్యోగాలు లేనివారికి, స్వయం ఉపాధి ఉన్నవారికి..వారు చూపించిన ఆదాయాల ఆధారంగా ప్రోత్సాహకాలను అందిస్తున్నారు.

అయితే, చాలామంది వలసకూలీలకు, చూపించడానికి సరైన అధికారిక పత్రాలు లేనివాళ్లకు మాత్రం ఈ ప్రోత్సాహకాలు అందట్లేదు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాల కారణంగా అక్కడి ప్రజలు ఐసొలేషన్ పాటించట్లేదనే సమస్య లేదు.

ఒకవేళ ఎవరైనా టెస్టులు చేయించుకోకపోయినా లేదా ఐసొలేషన్ పాటించకపోయినా దాన్ని అహగాహనా లోపంగానే పరిగణిస్తున్నారు. ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే.

స్లొవేనియా

గత మార్చినుంచీ కూడా స్లొవేనియా కరోనా సోకినవారికి కొంత నష్ట పరిహారం చెల్లిస్తోందని లూబియానానుంచీ బీబీసీ ప్రతినిధి గై డే లౌనే తెలిపారు.

పరిస్థితులనుబట్టీ, 100 నుంచీ 80 శాతం జీతాలను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ఈ చెల్లింపులను నేరుగా క్వారంటీన్‌లో ఉన్నవారికే అందిస్తున్నారు.

పరిహారం అందించకుండా కరోనావైరస్‌ను కట్టడి చేయడం అసాధ్యమని, సోషలిస్ట్ చరిత్ర కలిగిన స్లొవేనియాకు ఇలాంటి బాధ్యత తీసుకోవడం కొత్త కాదని ఒక ప్రభుత్వ అధికారి బీబీసీకి తెలిపారు.

ఈ విధానాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజలనుంచీ స్లొవేనియా ప్రభుత్వానికి పూర్తి మద్దతు లభించింది. కానీ సెకండ్ వేవ్‌లో కోవిడ్ కేసులు అమాంతం పెరిగిపోవడంతో...ప్రపంచవ్యాప్తంగా తలసరి మరణాల రేటులో స్లొవేనియా మూడో స్థానంలో ఉంది. దాంతో ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లింది.

2020 చివరినాటికి కేవలం 12% స్లొవేనియా ప్రజలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైనవేనని, తగినంతగా ఉన్నాయని భావిస్తున్నట్లు మార్కెట్ రిసెర్చ్ కంపెనీ వాలికాన్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల పట్ల అధికశాతం ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, పరిహారం సర్వరోగనివారిణి కాబోదని, మరిన్ని ఇతర రకాల చర్యలు చేపట్టాలని సూచించింది.

అమెరికా

కోవిడ్ సోకిన ఉద్యోగులు క్వారంటీన్ పాటించేందుకు వీలుగా నగదు పరిహారం అందజేయాలని అమెరికా గత ఏడాది మార్చిలో నిర్ణయించింది. అమెరికా విధానాల విషయంలో ఇది పెద్ద మార్పే. ఎందుకంటే అమెరికాలో అనారోగ్యం కారణంగా తీసుకునే సెలవులకు జీతాలు ఇవ్వరు అని న్యూయార్క్‌నుంచీ బీబీసీ ప్రతినిధి నటాలీ షెర్మన్ తెలిపారు.

కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్ వచ్చినవారికి లేదా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైనవారికి 14 రోజుల జీతాన్ని అందించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

అంతే కాకుండా, వైరస్ సోకినవారికి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు రెండు వారాలకుగానూ మూడింట రెండొంతుల జీతం అందించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానాల వలన వందలకొద్దీ కొత్త కేసులు రాకుండా నివారించగలిగిందని ఒక అధ్యయనం తెలిపింది.

అయితే, ఈ ఉపశమన ప్యాకేజీ 2020 డిసెంబర్ 31తో ముగిసింది. కానీ, వ్యవస్థలో ఉన్న లొసుగుల వలన కిరాణా వ్యాపారాలు నడుపుతున్నవారు, కొంతమంది వైద్య సిబ్బంది కూడా ఈ ప్రోత్సాహకాలను పొందలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఉద్యోగులకు పరిహారం అందించే చట్టాన్ని పునరుద్ధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, ఇందులో ఉన్న మినహాయింపులను తొలగించి, మరో 106 మిలియన్ల అమెరికన్లకు ప్రోత్సాహకాలు అందించాలని ఆశిస్తున్నారు. కానీ ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్ సభ్యులు, వ్యాపార లాబీలు కూడా అనుకూలంగా లేరు.

జర్మనీ

జర్మనీలో ఐసొలేషన్‌ను ప్రోత్సహించే విధంగా ఉదార ఆర్థిక సహాయం అందిస్తున్నారని బెర్లిన్‌నుంచి బీబీసీ ప్రతినిధి డామిన్ మెక్‌గిన్నీస్ తెలిపారు.

అంతే కాకుండా, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వీటన్నిటినీ కచ్చితంగా అమలు పరుస్తుండడంతో ఆ దేశంలో నిబంధనల ఉల్లంఘనలకు అవకాశం తక్కువ. దీనిపై పెద్దగా చర్చలు, వాదోపవాదాలు కూడా జరిగిన దాఖలాలు లేవు.

జర్మనీ అందిస్తున్న ఆర్థిక ప్యాకేజీకి ఆ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా మద్దతు తెలిపారు.

ఇంటివద్దనుంచి పని చేయలేని ఉద్యోగులకు ఆరు వారాలకుగానూ పూర్తి జీతాన్ని అందిస్తున్నారు. ఈ సొమ్మును ఎవరి ఆఫీసు యాజమాన్యం వారికి అందిస్తుంది. ప్రభుత్వం, ఆఫీసు యాజమాన్యాలకు రీఇంబర్స్ చేస్తుంది.

స్వయం ఉపాధి ఉన్నవారికి, ఫ్రీలాన్సర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి కూడా ఆరువారాల ఆదాయాన్ని అందిస్తున్నారు. వీరిక స్థానిక ప్రభుత్వం ఈ సొమ్మును అందిస్తుంది.

అయితే పాలసీ విధానాలు, సామర్థ్యాలు ప్రాతాన్నిబట్టీ మారుతుంటాయి. గిగ్ ఎకానమీ...అంటే తాత్కాలిక ఉద్యోగాలు అధికంగా ఉన్న వ్యవస్థలో ఉద్యోగుల ఆదాయ పన్ను రాబడి ప్రకారం రాష్ట్రాలు సహాయాన్ని అందిస్తున్నాయి. దీనికి కావలసిన నిధులను ప్రాంతీయ ప్రభుత్వాలు సమకూర్చుతున్నాయి.

చెక్ రిపబ్లిక్

కోవిడ్ పాజిటివ్ వచ్చినవారికి ఐసొలేషన్‌లో ఉండేందుకు వీలుగా పరిహారం అందించాలన్న విషయంపై చెక్ రిపబ్లిక్ దేశంలో కొంత చర్చ జరిగింది అని ప్రాగ్‌నుంచీ బీబీసీ ప్రతినిధి రాబ్ కామెరాన్ అంటున్నారు.

క్వారంటీన్‌లో ఉన్నవారికి ప్రోత్సాహకాలు అందించాలని కొన్ని స్వతంత్ర సంస్థలు సూచించినప్పటికీ చెక్ రిపబ్లిక్ ప్రభుత్వ ఖజానాపై అది అదనపు భారాన్ని మోపుతుంది. ఇప్పటికే చెక్ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో భాగంగా అనేకమంది ఉద్యోగులకు సెలవులు ఇచ్చి, పరిహారాన్ని కూడా చెల్లిస్తోంది.

జీతాలొచ్చే ఉద్యోగాలు ఉన్నవారికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. కోవిడ్ పాకిటివ్ నిర్థరణ అయితే వర్క్ ఫ్రం హోం చెయ్యడం, ఆ అవకాశం లేకపోతే సిక్ లీవ్ తీసుకుని జీతంలో 60% పొందడం.

కానీ స్వయం ఉపాధి ఉన్నవారికి ఇది కష్టమవుతుంది. ప్రభుత్వ ఆరోగ్య బీమా ఉన్నవారికి కొంత పరిహారం దక్కుతుంది కానీ మిగిలినవారికి కష్టమే.

ఆ దేశంలో అనేకమందికి కోవిడ్ పాజిటివ్ వస్తే జేబులకు చిల్లులు పడినట్లే. అందుకే ఫ్రీలాన్సర్స్, స్వయం ఉపాధి ఉన్నవారు...తమ స్నేహితులకు, సన్నిహితులకు కోవిడ్ సోకితే, కాంటాక్ట్ ట్రేసింగ్‌లో తమ పేర్లు చెప్పవద్దని బతిమాలుకుంటారు. ఇది ఆ దేశంలో ఒక బహిరంగ రహస్యం. అక్కడ కొంతమందికి ఆదాయం లేకపోవడం అనేది సామాజిక బాధ్యతకన్నా పెద్ద విషయం.

స్వీడన్

కోవిడ్ సోకినవారికి క్వారంటీన్ పాటించేందుకు వీలుగా పరిహారం అందిస్తూ స్వీడన్ పాటిస్తున్న పాలసీ విధానాలకు మంచి ఆదరణ లభించిందని స్టాక్‌హోంనుంచీ బీబీసీ ప్రతినిధి మ్యాడీ సావేజ్ తెలిపారు.

కోవిడ్ లక్షణాలు కనిపించిన మొదటి రోజునుంచే ఇంటివద్ద ఉంటూ క్వారంటీన్ పాటించేందుకు వీలుగా ఉద్యోగులకు, స్వయం ఉపాధి ఉన్నవారికి కూడా పరిహారం చెల్లించే విధంగా స్వీడన్ తన విధానాల్లో సవరణలు తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా ఉద్యోగులకు దాదాపు 80% జీతం అందిస్తోంది. స్వయం ఉపాధి ఉన్నవారికి కూడా రోజుకు అత్యధికంగా 7 వేల రూపాయల నగదును అందిస్తోంది.

కరోనావైరస్ సోకినవారితో కలిసి ఉండేవారికి కూడా కొంత భత్యాన్ని అందిస్తోంది.

మహమ్మారి సమయంలో చాలావరకు స్వీడన్‌లో ప్రాథమిక పాఠశాలలను తెరిచే ఉంచారు. స్కూలుకు వెళ్లే పిల్లలు అనారోగ్యం పాలైతే వారి తల్లిదండ్రులు సెలవు తీసుకుని వారి బాగోగులు చూసుకోవచ్చు. ఆ సమయంలో వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. లాక్‌డౌన్‌లో స్కూళ్లు మూసివేసినప్పుడు తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటూ పిల్లలని చూసుకోడానికి కూడా సెలవులు తీసుకోవచ్చు. అందుకు కూడా వారికి ప్రభుత్వం నగదు సహాయాన్ని అందిస్తుంది.

అయితే, తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇదే స్థాయిలో ప్రయోజనాలు చేకూరడం లేదని కొందరు భావిస్తున్నారు. అలాంటి వారు కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ పని చేయవలసిన పరిస్థితి వస్తోందని కొన్ని రిపోర్టులు తెలిపాయి. దీనిపై ఆ దేశంలో కొంత చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
countries offering incentives for coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X