• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గర్భ నిరోధక మాత్రలు కనిపెట్టి 60 ఏళ్లు దాటినా మగవాళ్లకు పిల్స్ ఎందుకు లేవు?

By BBC News తెలుగు
|
వంధ్యత్వ సమస్య

1960వ దశకంలో మొట్ట మొదటిసారిగా గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి.

గర్భ నిరోధక మాత్రలు కనిపెట్టి ఆరు దశాబ్దాలు దాటింది.

ప్రస్తుతం 20 రకాల గర్భ నిరోధక పద్ధతులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది.

అయితే, ఈ పద్ధతుల్లో పురుషులకు సంబంధించినవి మాత్రం కేవలం రెండు మాత్రమే.

అవే కండోమ్స్, స్టెరిలైజేషన్‌ లేదా వాసెక్టమీ.

ఆడవాళ్లకు ఉన్నట్లుగా మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు?

గర్భనిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

పురుషులకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు?

“మహిళలకు గర్భ నిరోధక మాత్రలను తయారు చేయాలనే ఆలోచన ఊపిరి పోసుకున్న నాటి నుంచి పురుషులకూ సంతాన నిరోధక మాత్రలను కనిపెట్టాలనే ఆలోచన ఉంది” అని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో పునరుత్పత్తి జీవశాస్త్ర ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆడమ్ వాట్కిన్స్ అన్నారు.

ఒక మహిళ నెలకు ఒక అండాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. కానీ ఒక పురుషుడిలో రోజుకు కొన్ని లక్షల వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి. పురుషుడు పునరుత్పత్తి శక్తిని 90శాతం కోల్పోయినా, సంతానం కలుగుతుంది.

మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు తయారు చేయడంలో ఇదొక సవాలుగా మారిందని వాట్కిన్స్ వెల్లడించారు.

అయితే పురుషులకు సంతాన నిరోధక మాత్రలు అభివృద్ధి చెందకపోవడానికి ఇదే ప్రధాన కారణం కాదు.

“స్త్రీలకు కనిపెట్టిన గర్భ నిరోధక మాత్రలు విజయవంతం కావడమే పురుషులకు సంతాన నిరోధక మాత్రలను అభివృద్ధి చేయలేకపోవడానికి కారణమని నేను భావిస్తున్నాను. మహిళల మాత్రలు సమర్థవంతంగా పని చేస్తున్నాయి.

ఆర్థిక కోణంలో చూస్తే, ఔషధ కంపెనీలకు కొత్త రకం మందుపై పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. వేర్వేరు కారణాల వల్ల గర్భ నిరోధక భారం మహిళల మీద పడింది. వారు దాదాపు ఆ బాధ్యతను పూర్తిగా స్వీకరించారు. ఇది కొంచెం అన్యాయమైన విషయం” అని వాట్కిన్స్​ వివరించారు.

వంధ్యత్వ సమస్య

గర్భ నిరోధక పద్ధతుల చరిత్ర

బహుషా అతి పురాతన గర్భ నిరోధకం కండోమే కావొచ్చు. క్రీస్తు పూర్వం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే పురుషులు సంతాన నిరోధక పద్ధతిని అవలంభించినట్లు ఆధారాలున్నాయి.

ఆ కాలంలో వీర్య కణాలు అండం దరి చేరకుండా భౌతిక అవరోధాన్ని వాడేవారు.

ఆ తర్వాత 18వ శతాబ్ధంలో పురుషులకు కొత్త రకం శస్త్ర చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టారు. అదే వాసెక్టమీ.

20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో ఆడవారికి గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. పురుషుల పిల్స్‌పై కూడా పరిశోధనలు ప్రారంభమయ్యాయి.

“సిద్ధాంతపరంగా, వీర్య కణాల ఉత్పత్తిని నియంత్రించడానికి సులువైన ప్రక్రియ కావాలి. వీర్య కణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి? అవి అండాన్ని ఎలా చేరుకుంటాయనేది బాగా తెలిసిన విషయమే” అని వాట్కిన్స్ చెప్పారు.

రెండు రకాల పరిశోధనలు

ఈ అంశంపై ప్రస్తుతం రెండు రకాల పరిశోధనలు జరుగుతున్నాయి.

మొదటిది, ఆరోగ్యకరమైన వీర్య కణాల అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడానికి సింథటిక్ (కృత్రిమ) హార్మోన్లను ఉపయోగించడం.

రెండోది, కృత్రిమ హార్మోన్లు వాడకుండా, ఆరోగ్యకరమైన వీర్య కణాలు లోనికి ప్రవేశించకుండా, ఫలదీకరణం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం.

కండోమ్స్, వాసెక్టమీ మాత్రమే ఇప్పటివరకు పురుషులకు ఉన్న సంతాన నిరోధక పద్ధతులు

అయితే, పురుషులకు సంతాన నిరోధక మాత్రలు కనిపెట్టే అధ్యయనాలకు మరో సమస్య ఎదురైంది. వాటిలో వాడే రసాయనాలు దుష్ప్రభావాలను చూపించడం మొదలుపెట్టాయి.

ఉదాహరణకు 2016లో మహిళల పిల్స్‌లో ఉండే హార్మోన్లను పోలిన టెస్టోస్టిరాన్, ప్రొజెస్టోజెన్‌లతో కూడిన మందును పురుషులపై ప్రయోగించారు. కానీ ఆ పరిశోధనను ఆదిలోనే నిలిపేయాల్సి వచ్చింది.

“చర్మంపై మొటిమలు, మూడ్ డిజార్డర్స్, శృంగార కోరికలు పెరగడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. ఇవి చాలా తీవ్రమైనవని, భరించలేనివని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న పురుషులు భావించారు. దాంతో ఈ పరిశోధనలకు బ్రేకులు పడ్డాయి” అని వాట్కిన్స్ వివరించారు.

https://www.youtube.com/watch?v=lrA7JaxSPsw

పిల్స్‌తో మహిళల్లోనూ సైడ్ ఎఫెక్టులు

మహిళల్లో కూడా పిల్స్ వాడకం వల్ల ఆందోళన, బరువు పెరగడం, వికారం, తలనొప్పి, కోరికలు తగ్గడం, రక్తం గడ్డ కట్టడం లాంటి దుష్ఫ్రభావాలు ఉంటాయి.

ఇవి పురుషులు ఎదుర్కొన్న వాటితో పోల్చితే చాలా ఎక్కువ. అందుకే ఎలాంటి దుష్ప్రభావాలు లేని, చౌకైన కండోమ్ వాడకం ముందు వరసలో ఉంటోందని నిపుణులు అంటున్నారు.

“కండోమ్ సంతాన నియంత్రణకు మాత్రమే కాకుండా, సుఖవ్యాధులు సోకకుండా కాపాడుతుంది. పునరుత్పత్తికి సంబంధించిన అనారోగ్య సమస్యలు పురుషుల్లో రాకుండా నిరోధిస్తుంది” అని వాట్కిన్స్ చెప్పారు.

అతి పురాతన గర్భ నిరోధక పద్ధతి కండోమ్ వాడడమే

దిగ్గజ ఫార్మా కంపెనీల అనాసక్తిని, పురుష సంతానోత్పత్తిలోని జీవ సంక్లిష్టతనూ దాటుకుని సమర్థవంతమైన సంతాన నిరోధక మాత్రలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

“పురుషులకు సంతాన నిరోధక మాత్రలు ఇప్పటివరకూ లేవు. అంటే ఇది సైన్స్​కు అసాధ్యమని అర్థం కాదు” అని టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయో ఎథిక్స్ అండ్ హెల్త్ హ్యుమానిటీస్ డైరెక్టర్ డా. లీజా కాంపో-ఇంజెల్​స్టైన్​ అన్నారు.

“పురుషుల సంతాన నిరోధక మాత్రలు ఉనికిలో లేకపోవడం వెనుక లింగ సమస్య, సామాజిక నిబంధనలు ఉన్నాయే తప్ప, అది శాస్త్రీయపరమైన సమస్య కానే కాదు” అని కాంపో-ఇంజెల్​స్టైన్ అన్నారు.

“నేడు గర్భనిరోధకానికి సంబంధించిన ఆర్థిక, ఆరోగ్య భారాలను మహిళలే ఎక్కువగా మోస్తున్నారు. సాధారణంగా స్త్రీ గర్భ నిరోధక పద్ధతులు, మగ వారి సంతాన నిరోధక పద్ధతుల కంటే ఖరీదైనవి. ఎందుకంటే మహిళలు ఒక్కసారైనా డాక్టర్​ని సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు” అని కాంపో-ఇంజెల్​స్టైన్ వివరించారు.

https://www.youtube.com/watch?v=dqbRGRdhxMo

“మగ వారికి పిల్స్ ఎందుకుండాలి” అనే విషయంపై తన అకడమిక్‌ వ్యాసంలో కాంపో-ఇంజెల్​స్టైన్ వివరించారు. అమెరికాలో అనేక ఆరోగ్య బీమా పథకాలు గర్భ నిరోధక ఆపరేషన్లను కవర్​ చేయవు. ఈ రకమైన బీమా అవసరమయ్యే రాష్ట్రాలు మతపరమైన లేదా నైతిక కారణాల వల్ల వాటిని ప్రవేశపెట్టడం లేదని అన్నారు.

అందుకే పురుషులకు అతి త్వరలోనే సంతాన నిరోధక మాత్రలు అభివృద్ధి చేయాలని కాంపో-ఇంజెల్​స్టైన్ పిలుపునిచ్చారు.

“చాలా మంది మహిళలు సైడ్ ఎఫెక్టుల వల్ల గర్భ నిరోధక మాత్రలు మానేయాలని అనుకుంటారు. కానీ చాలా సార్లు అలా చేయలేరు. ఎందుకంటే పురుషులు కండోమ్ మాత్రమే ఉపయోగించగలరు. ఇది నూటికి నూరు శాతం ప్రభావవంతం కాదు” అని తెలిపారు.

“గర్భ నిరోధక సమస్య ఇద్దరిదీ కావాలి. పురుషులు ఇప్పుడిప్పుడే ఆ బాధ్యతను తీసుకుంటున్నా, మరింత బాధ్యతతో మెలగాలన్న మాట వాస్తవం” అని కాంపో-ఇంజెల్​స్టైన్ అన్నారు.

గర్భనిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

భవిష్యత్తు ఏంటి?

భవిష్యత్తులో పురుషుల సంతాన నిరోధక మాత్రలు వచ్చి తీరుతాయని వాట్కిన్స్, కాంపో – ఇంజెల్​స్టైన్ విశ్వసిస్తున్నారు.

“ఔషధ తయారీ కంపెనీలు ఈ మాత్రల అభివృద్ధిపై దృష్టి సారిస్తాయని నేను భావిస్తున్నాను. చాలా మంది మగవాళ్లు ఈ పిల్స్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు” అని వాట్కిన్స్ అన్నారు.

'క్లీన్​ షీట్​ పిల్​’, 'వాసల్​జెల్​’ అనే రెండు రకాల సురక్షితమైన సంతాన నిరోధక పద్ధతుల గురించి వాట్కిన్స్​ ప్రధానంగా ప్రస్తావించారు.

క్లీన్​ షీట్​ పిల్​ వాడకం వల్ల వీర్య కణాల విడుదలను తగ్గించొచ్చు. ఫలితంగా గర్భం ధరించే అవకాశాలు తగ్గుతాయి. మరోవైపు ఈ పద్ధతిలో లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా నిరోధించవచ్చు.

ప్రస్తుతానికి ఈ మాత్రను కేవలం జంతువుల మీద మాత్రమే ప్రయోగించారు. మనుషులకు సరిపడే మాత్రను సిద్ధం చేసేందుకు మరో పదేళ్లు పట్టొచ్చు.

“వాసల్​జెల్​ శుక్ర కణాలను నిలువరిస్తుంది” అని వాట్కిన్స్​ వివరించారు.

గర్భనిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

ప్రయోగశాలలో వాడుతున్న సాంకేతికత, ఫలితాలు సామాజిక మార్పును తీసుకొచ్చేటంత స్థాయిలో లేవని కాంపో–ఇంజెలిస్టైన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

“సామాజిక న్యాయం కింద గర్భ నిరోధకత అనేది అందరి బాధ్యత కావాలి. ఇలా జరగాలంటే, పురుషులకు సంతాన నిరోధక మాత్రలను ఔషధ కంపెనీలు తయారు చేసి తీరాలి" అని కాంపో–ఇంజెలిస్టైన్ నొక్కి చెప్పారు.

సామాజిక కట్టుబాట్లు, పురుషుడిదే పైచేయి అనే భావన తొలగకపోతే పిల్స్ కనిపెట్టినా, దాని వాడకం మాత్రం మహిళలతో సమాన స్థాయికి చేరుకోలేదని కాంపో–ఇంజెలిస్టైన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

https://www.youtube.com/watch?v=gCNR0GGR2Hw

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why are there no pills for men 60 years after the invention of birth control pills
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X