• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇరాన్ ఎన్నికలు: కొత్త అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ ఎన్నిక దాదాపు ఖరారు

By BBC News తెలుగు
|
ఇబ్రహీం రైసీ

ఇరాన్ తదుపరి అధ్యక్షుడిగా అతివాద భావజాలమున్న ఇబ్రహీం రైసీ ఎన్నిక దాదాపు ఖరారైంది. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో ఆయనకు తిరుగులేని ఆధిక్యం వచ్చింది.

ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను ఓడించి రైసీ మొదటి స్థానంలోకి వచ్చారు. కొందరు అభ్యర్థులను అయితే, పోటీ చేయడానికి అనుమతించలేదు.

సంప్రదాయ అతివాద భావజాలమున్న రైసీ ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయమూర్తి పదవిలో కొనసాగుతున్నారు. రాజకీయ ఖైదీలకు గతంలో ఉరిశిక్షలు విధించినందుకు రైసీపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది.

ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత రెండో శక్తిమంతమైన నాయకుడు అధ్యక్షుడే.

దేశీయ విధానాలతోపాటు విదేశీ వ్యహరాలనూ అధ్యక్షుడు ప్రభావితం చేయగలడు. అయితే, దేశానికి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లో అయినా, తుది నిర్ణయం మాత్రం ఖమేనీదే.

ఇరాన్ ఎన్నికలు

ఇబ్రహీం రైసీ ఎవరు?

60ఏళ్ల రైసీ తన కెరియర్‌ మొత్తం దాదాపుగా ప్రాసిక్యూటర్‌గానే పనిచేశారు. అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా 2019లో ఆయన నియమితులయ్యారు. అయితే, గత ఎన్నికల్లో హసన్ రౌహానీ చేతిలో రైసీ పరాజయాన్ని చవిచూశారు.

తాను అవినీతిపై పోరాడగలనని, ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం చూపగలనని ఎన్నికల సమయంలో రైసీ చెప్పారు.

అయితే, 1980ల్లో పెద్దయెత్తున రాజకీయ ఖైదీలను ఉరితీయడంలో రైసీ పాత్రపై మానవ హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తంచేశారు.

రాజకీయ ఖైదీలను ఉరితీయడంపై ఇరాన్ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అలానే రైసీ కూడా తనపై వచ్చిన ఆరోపణల విషయంలో పెదవి విప్పలేదు.

ఇబ్రహీం రైసీ

ఎలాంటి మార్పులు వస్తాయి?

రైసీ విజయంపై బీబీసీ పర్షియన్ ప్రతినిధి కాస్రా నాజీ మాట్లాడారు. ‌‌''రైసీ విజయం అనంతరం ఇరాన్‌లోని అతివాదులు ప్రభుత్వంపై తమ ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సామాజిక కార్యకర్తలపై నియంత్రణ, మహిళలకు ఉద్యోగాల విషయంలో ఆంక్షలు, సోషల్ మీడియా, ప్రెస్‌పై పట్టు కోసం ప్రయత్నిస్తారు’’.

ఇక్కడి అతివాదులు మొదట్నుంచీ పశ్చిమ దేశాలను వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఖమేనీతోపాటు అందరూ మళ్లీ అంతర్జాతీయ అణు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.

ద జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పేరుతో 2015లో పీ5 దేశాలతో ఓ అణు ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఇరాన్ తమ అణు కార్యకలాపాలను కట్టడికి చేసేందుకు అంగీకరించింది. దీంతో అమెరికా ఆంక్షలను సడలించింది.

కానీ 2018లో అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. మళ్లీ ఇరాన్‌పై ఆంక్షలు విధించింది.

ఈ అంక్షల వల్ల ఇరాన్‌లో సామాన్యులపై తీవ్రమైన ప్రభావం పడింది. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి పెరిగింది.

ఆంక్షల అనంతరం మళ్లీ అణు కార్యక్రమాలను ఇరాన్ మొదలుపెట్టింది.

ప్రస్తుతం మళ్లీ ఒప్పందం కోసం వియన్నాలో చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఒప్పందం కుదుర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇరాన్ ఎన్నికలు

ఎన్నికలు నిష్పాక్షికంగానే జరిగాయా?

ఇరాన్‌లో 5.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. అయితే, వీరిలో 2.8 కోట్ల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1.8 కోట్ల మంది ఓట్లను లెక్కించారు. 62 శాతం ఓట్లు రైసీకి పడినట్లు ప్రభుత్వ టీవీ వార్తా సంస్థ తెలిపింది.

ఈ ఎన్నికల కోసం దాదాపు 600 మంది అభ్యర్థులుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 40 మంది మహిళలు కూడా ఉన్నారు.

ఈ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను 12 మంది జ్యూరి సభ్యుల బృందం జల్లెడపట్టింది. కేవలం ఏడుగురికి మాత్రమే పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, వీరిలో ముగ్గురు ఓటింగ్‌కు ముందే తమ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకున్నారు.

చాలా మంది అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై హక్కుల ఉద్యమకర్తలు ఎన్నికలను బహిష్కరించారు.

మొత్తంగా ఇక్కడ పోలింగ్ 50 శాతంలోపే నమోదైంది. 2017 ఎన్నికల్లో 73 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

''నిష్పాక్షిక ఎన్నికల్లో అయితే, ఎప్పటికీ గెలవలేమని భావించిన అదివాదులు ఇలా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చాలా మంది ఇరాన్‌వాసులు భావిస్తున్నారు’’అని నాజీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Iran election: The election of Ibrahim Raisi as the new president is almost finalized
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X