• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇరాన్ ఎన్నికలు: ఇబ్రహీం రైసీ ఎన్నిక ప్రమాదకరమని హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్

By BBC News తెలుగు
|

ఇరాన్ ఎన్నికలు

ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ గెలుపుపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరముందని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది.

ఇప్పటివరకు ఇరాన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన అత్యంత సంప్రదాయ అతివాది రైసీనే అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లియోర్ హయత్ అన్నారు.

కొత్త అధ్యక్షుడు ఇరాన్ అణు కార్యక్రమాలను మరింత పెంచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ఇరాన్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ గెలుపొందినట్లు శనివారం ప్రకటించారు.

అయితే, ఆయనకే మెజారిటీ ఓట్లు వచ్చే విధంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించారని అనేకమంది భావిస్తున్నారు.

ఆగస్టులో రైసీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన ఇరాన్ న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయమూర్తిగా వ్యవహరించారు.

రైసీ సంప్రదాయ అతివాద భావాలు కలిగిన వ్యక్తి. ఆయనపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. గతంలో రాజకీయ ఖైదీల మరణశిక్షల విషయంలో ఆయన హస్తం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఎన్నికల్లో గెలిచిన తరువాత, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతానని, ఒక నాయకుడిగా దేశాన్ని ముందుకు నడిపిస్తానని రైసీ ఓ ప్రకటనలో తెలిపారు.

"కష్టించి పని చేసే, అవినీతి నిరోధక, విప్లవాత్మక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను" అని రైసీ అన్నట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది.

అయితే, "ఆయన ఒక అతివాది. ఇరాన్ అణు కార్యక్రమాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా ఉన్న వ్యక్తి" అని లియోర్ హయత్ ట్విట్టర్‌లో తెలిపారు.

ఇబ్రహీం రైసీ గెలుపుపై ట్విట్టర్‌లో ఓ విమర్శనాత్మక థ్రెడ్ నడుస్తోంది.

ఇబ్రహీం రైసీ

ఇరాన్-ఇజ్రాయెల్ విరోధం

చాలా కాలంగా ఇరాన్, ఇజ్రాయెల్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. టిట్-ఫర్-టాట్‌లాగ ఒకరు చేసినదానికి మరొకరు ప్రతిస్పందిస్తూ ఉంటారు.

అయితే, ఇరు దేశలూ ఇప్పటివరకూ పూర్తి స్థాయి వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చాయి. ఇటీవలే, ఈ రెండు దేశాల మధ్య విరోధం మళ్లీ పుంజుకుంది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి చాలా క్లిష్టమైనది. అయితే, వీటి మధ్య ఉద్రిక్తతలకు ఒక పెద్ద కారణం ఇరాన్ రూపొందిస్తున్న అణు కార్యక్రమాలు.

కిందటి ఏడాది, తమ దేశ ఉన్నత స్థాయి అణు శాస్త్రవేత్త హత్యకు, ఈ ఏప్రిల్‌లో తమ యురేనియం ప్లాంట్‌పై దాడికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది.

మరో పక్క, ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాలు శాంతికి దోహదపడేవి కావని, అణ్వాయుధాన్ని తయారుచేసే ప్రయత్నాలు చేస్తోందని ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది.

2015లో, ఇరాన్ తమ అణు కార్యక్రమాలను నిలిపివేస్తుందని, అందుకు ఫలితంగా ఆ దేశంపై ఉన్న తీవ్ర ఆంక్షలను ఎత్తివేస్తారనే ఒప్పందం కుదిరింది.

అయితే, మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2018లో ఈ ఒప్పందం నుంచి విరమించుకుకుని, మళ్లీ ఇరాన్‌పై తీవ్ర ఆర్థిక ఆంక్షలను విధించారు.

ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు జో బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

తమ దేశంపై ఆంక్షలను కఠినతరం చేయడంతో, ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాలను విస్తరించడమే కాక యునేరియం నిల్వలను సమృద్ధి పరచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అణ్యాయుధం తయారుచేయడానికి తగినంత యురేనియం నిల్వలు ఇప్పటికి లేవు.

ఇబ్రహీం రైసీ

అమెరికా ఏమంటోంది?

"స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా ఇరానియన్లు తమ అధ్యక్షుడిని ఎన్నుకునే హక్కును కోల్పోవడం బాధాకరం" అంటూ ఇరాన్ ఎన్నికల ఫలితాలపై అమెరికా వ్యాఖ్యానించింది.

ఈసారి ఇరాన్ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. 2017లో 70 శాతం కన్నా ఎక్కువమంది ఓట్లు వేయగా ఈసారి 50 శాతం కన్నా తక్కువమందే ఓట్లు వేశారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సన్నిహితుడైన ఇబ్రహీం రైసీ గెలుపొందేందుకు అనువుగా ఎన్నికల ప్రక్రియను రూపొందించారని భావిస్తూ అనేకమంది ఈ ఎన్నికలకు దూరం జరిగారు.

ఇజ్రాయెల్ రాజ్యాన్ని నిర్మూలించాలని అయతొల్లా ఖమేనీ అనేకమార్లు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ "క్యాన్సర్ కణితి"లాంటిదని, దాన్ని ఈ ప్రాంతం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని 2018లో ఖమేనీ వ్యాఖ్యానించారు.

ఇరాన్ ఎన్నికలు

అణు ఒప్పందంపై చర్చలు

వియన్నాలో ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధించే దిశగా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్‌లో రైసీ ఎన్నికల్లో గెలిచారు.

ఈ ఒప్పందంలో పాలుపంచుకుంటున్న ఆరు ప్రపంచ దేశాలకు, ఇరాన్‌కు మధ్య ఆదివారం మళ్లీ అధికారిక సమావేశం జరగనుందని యూరోపియన్ యూనియన్ తెలిపింది.

అమెరికా, ఇరాన్‌ల మధ్య పరోక్ష చర్చలు జరగడం ఇది ఆరోసారి. ఈ వారం జరిగిన చర్చల్లో కొన్ని అంశాల్లో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

రైసీ పదవిలోకి వచ్చిన తరువాత కూడా ఈ పరోక్ష చర్చలు కొనసాగుతాయని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు.

అయతొల్లా ఖమైనీ

'టెహ్రాన్ కసాయి'

ట్విటర్‌లో నడుస్తున్న కీలకమైన థ్రెడ్‌లో రైసీని 'టెహ్రాన్ కసాయి' అని లియోర్ హయత్ పిలిచారు. 1988లో జరిగిన రాజకీయ ఖైదీల సామూహిక మరణశిక్షలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

1988లో సుమారు 5 వేల మంది పురుషులు, స్త్రీలకు మరణశిక్ష విధించిన నలుగురు జడ్జిలలో రైసీ కూడా ఒకరనే ఆరోపణలు ఉన్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. తరువాత కాలంలో ఈ కమిటీ 'డెత్ కమిటీ'గా పేరు పొందింది.

అయితే, 30,000 కన్నా ఎక్కువమందిని చంపేశారని హయత్ ట్వీట్లలో తెలిపారు. ఇదే సంఖ్యను ఇరాన్ మానవ హక్కుల బృందాలు కూడా నిర్థారిస్తున్నాయి.

ఇరాన్ ఎన్నికలు

మిగతా దేశాల స్పందన ఏమిటి?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇబ్రహీం రైసీకి వెంటనే శుభాభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య "సంప్రదాయంగా కొనసాగుతున్న స్నేహం, ఇరుగు పొరుగు ఆత్మీయ సంబంధాలు" ఉన్నాయని అన్నారు.

సిరియా, ఇరాక్, టర్కీ, యూఏఈ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రైసీకి సందేశాలు పంపారు.

గాజాలో పాలస్తీనియన్ మిలిటెంట్ బృందం 'హమాస్' ప్రతినిధి, ఇరాన్ "పురోగతిని, శ్రేయస్సును" కోరుతున్నానని తెలిపారు.

కాగా, అత్యాచారాలకు సంబంధించి రైసీని విచారించాలని మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి.

"ఇరాన్ చరిత్రలో అత్యంత ఘోరమైన నేరాలను ఆ దేశ న్యాయవ్యవస్థ అధిపతిగా రైసీ పర్యవేక్షించారు. ఎన్నికలు నిర్వహించడానికి బదులు ఈ సంఘటనపై దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. దీనికి జవాబుదారీతనం కావాలి" అని హ్యూమన్ రైట్స్ వాచ్‌కు చెందిన మైఖేల్ పేజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Iran elections: Israel warns that Ibrahim Raisi's election is dangerous
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X