యూఏఈలో నైట్ హాల్ట్‌లో ఉన్న రాఫేల్ను ఇరాన్ టార్గెట్ చేసిందా.. ఆ రాత్రి ఏం జరిగింది..?
భారత వాయుసేనలో చేరేందుకు మరికొద్ది గంటల్లో ఫ్రాన్స్ నుంచి హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు రాఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. సుదీర్ఘంగా ఏడు గంటల ప్రయాణం తర్వాత యూఏఈలో ఈ యుద్ధ విమానాలు ఆగిన సమయంలో ఓ వార్త ఆందోళన కలిగించింది. ఈ యుద్ధ విమానాలకు ప్రమాదం ఉండొచ్చన్న సంకేతాలు అందాయి. యూఏఈలోని అల్డఫ్రా ఎయిర్‌బేస్‌లో ఇరాన్ మిలటరీ విన్యాసాలను నిర్వహించింది. ఈ బేస్ వద్దే అమెరికా ఫ్రెంచ్ బలగాలు మరియు యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయి.

యూఏఈ బేస్‌లో రాఫేల్ జెట్లు నైట్ హాల్ట్
సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత అల్డఫ్రా ఎయిర్‌బేస్‌లో ఫ్రెంచ్ యుద్ధ విమానాలు మోహరించిన చోటే ఈ రాఫేల్ యుద్ధ విమానాలు కూడా ల్యాండ్ అయ్యాయి. ఇక్కడే ఆ రాత్రంతా పార్క్ చేయబడ్డాయి. ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్ ఎయిర్‌బేస్ నుంచి భారత్‌కు బయలు దేరిన రాఫేల్ యుద్ధ విమానాల్లో మూడు సింగిల్ సీటర్ జెట్లు ఉండగా రెండు డబుల్ సీటర్ జెట్లు ఉన్నాయి. ఈ ఐదు యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 17వ స్క్వాడ్రాన్‌లో చేరుతాయి. దీన్నే గోల్డెన్ యారోస్ అని కూడా పిలుస్తారు.
ఇరాన్ మిలటరీ
అమెరికా లక్ష్యంగా ఇరాన్ మిలటరీ విన్యాసాలు..?
ఇదిలా ఉంటే అల్ ఢఫ్రా ఎయిర్‌బేస్ వైపునకు ఇరాన్ క్షిపణులను ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసిందంటూ అమెరికా వార్తా ఛానెల్ సీఎన్ఎన్ కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో అక్కడ అమెరికా బలగాలు అప్రమత్తతతో ఉండాలని హెచ్చరికలు వెళ్లాయని కథనం టెలికాస్ట్ చేసింది. అయితే ఇరాన్ నుంచి ఎలాంటి క్షిపణి అటువైపుగా వచ్చిన దాఖలాలు కనిపించలేదు. సమాచారం అందడంతో తమ జాగ్రత్తల్లో తాము ఉన్నట్లు అమెరికా బలగాలు తెలిపాయి.

ఇరాన్ క్షిపణికి సంబంధించిన ఫోటోలు విడుదల
ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన మరో న్యూస్ ఛానెల్ ఫాక్స్ న్యూస్ కూడా ఇదే తరహా కథనంను టెలికాస్ట్ చేసింది. అమెరికా బలగాలు మరియు యుద్ధ విమానాలు మోహరించిన బేస్‌లో ఇరాన్‌కు చెందిన మూడు క్షిపణులు సముద్ర జలాల్లో పడ్డాయని ఇది ఇరాన్ మిలటరీ విన్యాసాల్లో భాగమేనంటూ ఆ సంస్థ ప్రతినిధి లూకాస్ టామ్లిన్సన్ ట్వీట్ చేశారు. మరోవైపు సెఫాన్యూస్ అనే మరో న్యూస్ ఛానెల్ మిలటరీ విన్యాసాల్లో భాగంగా ఇరాన్ పరీక్షించిన క్షిపణి ఫోటోను విడుదల చేసింది. అంతేకాదు హెలికాఫ్టర్ నుంచి కిందకు దిగుతున్న ఇరాన్ కమాండోల ఫోటోలను కూడా విడుదల చేసింది. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా బలగాలు మోహరించి ఉన్న స్థావరంకు సమీపంలో ఇరాన్ మిలటరీ విన్యాసాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.