అమెరికాకు మరో ఝలక్.. ఈసారి ఇరాన్ క్షిపణి ప్రయోగం!
టెహ్రాన్: అసలే ఉత్తరకొరియా చేత క్షిపణి పరీక్షలు ఎలా మాన్పించాలా అని మల్లగుల్లాలు పడుతున్న అమెరికాకు ఇరాన్ ఝలక్ ఇచ్చింది. అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ఇరాన్ మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది.
తాజాగా మధ్యంతరశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షిచినట్టు ఇరాన్ ప్రకటించింది. క్షిపణి పరీక్షలు చేపడితే.. ఇరాన్ తో చేసుకున్న చారిత్రక అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామని అమెరికా హెచ్చరించినా.. ఇరాన్ ఏమాత్రం లెక్కచేయలేదు.

శుక్రవారం నిర్వహించిన భారీ ఆయుధ కవాతులో ఖోరామ్ షాహ్ర్ క్షిపణిని కూడా ఇరాన్ ప్రదర్శించింది. త్వరలోనే ఆ క్షిపణిని పరీక్షిస్తామని కూడా పేర్కొంది. అంతలోనే శనివారం క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యాలను కూడా ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది.
అయితే, ఈ క్షిపణిని ఇరాన్ ఎప్పుడు, ఎక్కడ పరీక్షించిందనే వివరాలను మాత్రం టీవీ వెల్లడించలేదు. ఇప్పటికే ఉత్తర కొరియా అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటం అమెరికాకు ఒక గుదిబండగా మారగా, తాజాగా ఇరాన్ వ్యవహారం సవాల్ గా మారింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!