• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా?

By BBC News తెలుగు
|
డేటా

ఈ ఇంటర్నెట్ యుగంలో మన సీక్రెట్‌లను కాపాడుకోగలమా? లైక్స్, షేర్స్, వ్యూస్ అంటూ సమాచారాన్ని మనమే నెట్టింట్లో పెట్టేస్తున్నామా? అసలు దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా?

హాలిడే స్పాట్‌ల నుంచి రిలేషన్‌షిప్ స్టేటస్‌ల వరకు ఇప్పుడన్నీ సోషల్ మీడియా వేదికలపైకి ఎక్కిపోతున్నాయి. ముందువెనుక ఆలోచించకుండా చాలా సమాచారాన్ని మనం ఇలానే పోస్ట్‌ చేస్తుంటాం. ఒక్కోసారి ఇవే మన సీక్రెట్‌లను బయటపెట్టేందుకు కారణం అవుతుంటాయి.

''నేడు మన చుట్టూ ఎన్నో డిజిటల్ పరికరాలున్నాయి. వీటిలోని సెన్సర్‌లు ఇదివరకెన్నడూలేని రీతిలో మన సమాచారాన్ని సేకరిస్తున్నాయి''అని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ విక్టర్ మేయర్ షాన్‌బెర్జర్ తెలిపారు.

ఇది ఆందోళన చెందాల్సిన పరిణామం. రిక్రూట్‌మెంట్ సంస్థ కెరియర్ బిల్డర్ సర్వే ప్రకారం, అమెరికాలో 70 శాతం సంస్థలు ఉద్యోగం ఇచ్చేముందు సోషల్ మీడియా పేజీలను చెక్ చేస్తున్నాయి. 48 శాతం సంస్థలు ప్రస్తుత ఉద్యోగుల సోషల్ మీడియా పేజీలనూ పరిశీలిస్తున్నాయి.

మరోవైపు రుణాలు ఇచ్చేముందు ఒక్కోసారి ఫైనాన్షియల్ సంస్థలు కూడా సోషల్ మీడియా పేజీలను చూస్తున్నాయి.

కొన్ని సంస్థలు అయితే సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లోని సమాచారం ఆధారంగా వస్తువులు కొనుగోలుచేసే విధానం, రాజకీయ దృక్పథాలను అంచనా వేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు అయితే ఈ సమాచారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి వ్యక్తుల భవిష్యత్తు అలవాట్లను అంచనా వేస్తున్నాయి.

సోషల్ మీడియా అకౌంట్‌లోని సమాచారాన్ని డిలీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని కొంతవరకు వారికి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. కేంబ్రిడ్జ్ అనలిటికా ఉదంతం వెలుగుచూసిన అనంతరం చాలా మంది ఇదే చేశారు. రాజకీయ అవసరాల కోసం 87 మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని అనలిటికా అక్రమ పద్ధతుల్లో సేకరించిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా అకౌంట్లలోని సమాచారం డిలీట్ చేయడంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే ఇతర సంస్థల్లోని సమాచారాన్ని ఇలా తొలగించడం కుదరదు.

‘‘భవిష్యత్తులో ఎవరైనా సరే 15 నిమిషాల్లో అజ్ఞాత వ్యక్తులు కావొచ్చు’’ అన్న సందేశం చూపిస్తున్న టీవీ

కొన్ని దేశాల్లో వ్యక్తిగత గోప్యతకు పటిష్ఠ భద్రత కల్పించే చట్టాలు చాలా బాగా పనిచేస్తున్నాయి.

యూరోపియన్ యూనియన్‌లోని జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) వీటిలో ఒకటి. దీనిలో ''రైట్ టు బి ఫర్‌గాటెన్'' హక్కుంది. తమ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలని కోరే హక్కును ఇది పరిరక్షిస్తుంది.

బ్రిటన్‌లో ఈ హక్కును ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీస్(ఐసీవో) అమలు చేస్తుంది. గత ఏడాది సెర్చ్ ఇంజిన్ల నుంచి తమ సమాచారం తొలగించేలా చూడాలని 541 అభ్యర్థనలు వచ్చినట్లు బీబీసీకి అధికారులు తెలిపారు. 2017-18లో 425, 2016-17లో 303గా ఈ సంఖ్య ఉన్నట్లు చెప్పారు.

సమాచారాన్ని డిలీట్ చేయడం కుదరదని సంబంధిత సంస్థలు చెప్పిన తర్వాత చేసిన ఫిర్యాదులను మాత్రమే ఐసీవో పరిగణనలోకి తీసుకుంటుంది. దీనిప్రకారం సమాచారం తొలగించాలని కోరుతూ వచ్చే అభ్యర్థనలు ఈ సంఖ్యల కంటే ఎక్కువే ఉంటాయి.

''సంస్థ దగ్గర తమ సమాచారం ఇకపై ఉండాల్సిన అవసరంలేదని వ్యక్తులు భావించినప్పుడు, సమాచారాన్ని తొలగించాలని సంబంధిత సంస్థను కోరే హక్కును జీడీపీఆర్ కల్పిస్తోంది'' అని ఐవోసీలో పనిచేస్తున్న సుజానె గోర్డన్ తెలిపారు.

''అయితే, ఈ హక్కుకు కొన్ని మిహాయింపులున్నాయి. కొన్ని కేసుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి హక్కులతో ఇది విభేదిస్తుంటుంది. అప్పడు సమతూకం పాటిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది''అని సుజానె అన్నారు.

''రైట్ టు బి ఫర్‌గాటెన్'' 2014లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా మంది తమ సమాచారాన్ని తొలగించాలని కోరుతూ సంస్థలకు అభ్యర్థనలు పంపారు. వీటిలో చాలా అభ్యర్థనలకు సంస్థలు అంగీకరించలేదు.

ఈ విషయంలో కాస్త డబ్బులున్న సంస్థలు, వ్యక్తులు నిపుణుల్ని నియమించుకుంటుంటారు.

ఇలా పెద్ద పరిశ్రమే తయారైంది. ఇన్ఫర్మేషన్‌ను తొలగించే అధునాతన టెక్నాలజీల అభివృద్ధి కోసం కొత్త సంస్థలూ ఏర్పడ్డాయి. సెర్చ్ ఇంజిన్లలోని తమ వినియోగదారులకు అపఖ్యాతి కలిగించే సమాచారాన్ని తొలగించడం వీటి కర్తవ్యం.

'రిప్యుటేషన్ డిఫెండర్' సంస్థ 2006లో ఇలానే ఏర్పడింది. ప్రస్తుతం సంస్థకు పది లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ఈ సంస్థ దాదాపు 5,500 డాలర్లను ఫీజుగా వసూలు చేస్తోంది.

ఒక మనిషి ముఖంపై గూగుల్ లోగో

గూగుల్‌ సెర్చ్‌లలో తమ క్లయింట్లకు సంబంధించిన సమాచారంలో మార్పులు చేసేందుకు సంస్థ సొంత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోంది. తమ క్లయింట్లకు అనుకూలమైన కథనాలు ముందు వచ్చేలా చూస్తూ ప్రతికూల కథనాలు పైకి కనబడకుండా చేసేందుకు ఈ సాఫ్ట్‌వేర్ తోడ్పడుతోంది.

''వెబ్‌సైట్లను మొదట చూపెట్టేందుకు గూగుల్ ఏ విధానాలను అనుసరిస్తుందనే అంశంపై మా టెక్నాలజీ ప్రధానంగా దృష్టిసారిస్తుంది''అని సంస్థ ఎండీ టోనీ మెక్‌క్రిస్టల్ తెలిపారు.

''సాధారణంగా విశ్వసనీయత, నిర్వహణ ఆధారంగా వెబ్‌సైట్లను గూగుల్ సెర్చ్ చూపిస్తుంది. సెర్చ్‌లో వచ్చే వెబ్‌సైట్లను యూజర్లు ఎలా చూస్తారనేది ఓ ప్రత్యేక క్రమం ప్రకారం జరుగుతుంటుంది''అని ఆయన చెప్పారు.

''మేం ప్రమోట్ చేయాలనుకునే సైట్లపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని, వాటిపై యాక్టివిటీ ఎక్కువగా ఉంటోందని గూగుల్‌కు తెలిసేలా చేసేందుకు మేం పనిచేస్తాం. మేం సృష్టించే కొత్త వెబ్‌సైట్లు అయినా, పాతవి అయినా అన్నింటికీ ఇవే విధానాలను అనుసరిస్తాం. లక్ష్యాలను కేవలం 12 నెలల్లోనే పూర్తిచేయాలని గడువు విధించుకుంటాం''అని టోనీ వివరించారు.

''గూగుల్ సెర్చ్‌లోని తొలి పేజీ వెబ్‌సైట్లకే 92 శాతం మంది వినియోగదారులు పరిమితం అవుతుంటారు. రెండో పేజీని దాటి వెళ్లేందుకు 99 శాతం మంది ఇష్టపడరు. దీంతో మా విధానాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి''అని ఆయన అన్నారు.

ఇలాంటి సంస్థలు బాగానే పనిచేస్తున్నప్పటికీ, కేవలం ధనిక వర్గాలు మాత్రమే వీటి సేవలు వినియోగించుకోగలుగుతున్నారని విక్టర్ అన్నారు.

నిఘా కళ్లను పూర్తిగా తప్పించుకోగలమా?

కుదరదనే అంటున్నారు ''డిలీట్ మీ'' సంస్థ సీఈవో, కో-ఫౌండర్ రాబ్ షావెల్. ఆన్‌లైన్ డేటాబేస్‌లు, డేటా బ్రోకర్లు, సెర్చ్ వెబ్‌సైట్ల నుంచి నెటిజన్ల వ్యక్తిగత సమాచారం తొలగింపు సేవలను సంస్థ అందిస్తోంది.

''ఇంటర్నెట్ నుంచి వ్యక్తిగత సమాచారాన్నిపూర్తిగా తొలగించడమనేది చాలా కష్టం. అన్ని సంస్థలు, అందరు వ్యక్తులూ ఇంటర్నెట్ సేవల వినియోగంలో మౌలిక మార్పులకు ఉపక్రమిస్తేనే ఇది సాధ్యపడుతుంది''అని రాబ్ అన్నారు.

''ప్రస్తుతం గోప్యతపై వినిపిస్తున్న ఆందోళనకు పరిష్కారం చూపాలంటే, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? ఎవరెవరి చేతుల్లోకి ఇది వెళ్తోంది? లాంటి అంశాలపై ఇంటర్నెట్ వినియోగదారులకు హక్కులు కల్పించేలా పదునైన చట్టాలను తీసుకురావాలి''అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is it possible to withdraw your personal data from social media?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X