Kim jong Un ఫోటోలన్నీ ఫేక్ :కోమాలో కిమ్..? చైనా నుంచే సమాచారం..అందుకే సోదరికి కీలక బాధ్యతలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఏమైంది..? గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యారని జాతీయ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక కిమ్ అదృశ్యమైన నేపథ్యంలో సోదరి కిమ్ యో జాంగ్ ఎక్కువగా యాక్టివ్‌గా కనిపించడంతో ఆమెనే తదుపరి అధ్యక్షురాలని అప్పట్లో వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం కిమ్ యో జాంగ్‌కు పాలనా పరంగా కీలక అధికారాలు కిమ్ బదిలీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దక్షిణ కొరియా నిఘా వర్గాలు కూడా ఇదే చెప్పాయి. అయితే దీనికి నియంత కిమ్ ఆరోగ్యంకు ఎలాంటి సంబంధం లేదని కొన్ని రిపోర్టులు స్పష్టం చేశాయి. తాజాగా మరో వార్త ప్రచారంలో ఉంది. ఉత్తరకొరియా నియంత కిమ్ కోమాలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అందువల్లే కిమ్ యో జాంగ్‌ను డిఫాక్టో కమాండ్‌గా నియమించారనే ప్రచారం జరుగుతోంది.

కోమాలో కిమ్ జాంగ్ ఉన్?
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని అందువల్లే కీలక బాధ్యతలు సోదరికి బదిలీ చేయడం జరిగిందన్న వార్తలపై దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్-డే- జంగ్కు రాజకీయ వ్యవహారాల సలహాదారుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ స్పందించారు. ఉత్తరకొరియా పాలనా వ్యవహారాల్లో ఏ ఒక్క ఉత్తరకొరియా నాయకుడు జోక్యం చేసుకోలేరని... కిమ్ ప్రాణాలతో ఉండగా అది సాధ్యపడే విషయం కాదని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. అంతేకాదు కిమ్ కూడా తన అధికారాలను మరొకరికి బదిలీ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదని చెప్పారు. ఆరోగ్యం మరీ క్షీణించి పరిపాలన చేయలేను అనుకుంటే తప్ప పగ్గాలు మరొకరికి బదిలీ చేయరని లేదా ఆయనను గద్దె దింపేందుకు కుట్ర జరగితే తప్ప మరొకరి చేతికి పాలనా పగ్గాలు బదిలీ కావని ఆ పోస్టులో రాసుకొచ్చారు చాంగ్ సాంగ్ మిన్.

చాంగ్ సాంగ్ మిన్ చెబుతున్నదేంటి..?
ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు మాత్రమే తను భావిస్తున్నాని ప్రాణాలతో అయితే ఉన్నారని చాంగ్ సాంగ్ మిన్ ది కొరియా హెరాల్డ్ అనే పత్రికతో చెప్పారు. అయితే పూర్తిస్థాయిలో అధికారాలు భర్తీ చేయడం జరగలేదని ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నందున ఆ లోటును భర్తీ చేసేందుకు తాత్కాలికంగా మాత్రమే ఆయన సోదరి కిమ్ యో జాంగ్ తెరపైకి వచ్చారని చాంగ్ సాంగ్ మిన్ చెప్పారు. పాలనా పరమైన విషయాలను చాలా కాలంగా గాలికొదిలేయరాదన్న ఒకే ఒక్క కారణంతో కిమ్ యో జాంగ్ కొన్ని జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలను చూసుకునేందుకు ముందుకొచ్చి ఉంటారని చాంగ్ సాంగ్ మిన్ చెప్పారు. అయితే ఈ కిమ్ అపస్మారక స్థితిలో ఉన్నారని చైనాకు మాత్రమే తెలుసని తనకు ఆ సమాచారం డ్రాగన్ కంట్రీ నుంచే వచ్చిందని స్పష్టం చేశారు.

ఆ ఫోటోలన్నీ బూటకమే
ఇదిలా ఉంటే దక్షిణ కొరియా నిఘా వర్గాలు మాత్రం కిమ్ జాంగ్ ఉన్న పాలనాపరమైన కొన్ని కీలక బాధ్యతలు తాను నమ్మిన తన సోదరికి బదిలీ చేశారని దక్షిణ కొరియా ప్రభుత్వంకు సమాచారం ఇచ్చింది. అయితే కిమ్ అనారోగ్యంగా ఉన్న కారణంగానే అధికారాలు బదిలీ చేసి ఉంటారనే వార్తలను నిఘా వర్గాలు ఖండించాయి. అధికారాలు బదిలీ చేయడానికి కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే కిమ్ కొన్ని నెలలుగా కనిపించకపోవడంతో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చాంగ్ సాంగ్ మిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొన్ని రోజులుగా అదృశ్యమైన కిమ్ చివరిసారిగా ఏప్రిల్ 11వ తేదీన వర్కర్స్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కనిపించారు. ఆ తర్వాత మే 2వ తేదీన ఓ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రిబ్బన్ కటింగ్ కార్యక్రమంకు హాజరైనట్లు కేసీఎన్ఏ వార్తా ఛానెల్ వార్తను ప్రసారం చేసింది. అయితే ఈ మధ్యకాలంలో కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించి విడుదలైన ఫోటోలన్నీ బూటకపు ఫోటోలే అని చాంగ్ సాంగ్ మిన్ స్పష్టం చేశారు.