• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుతిన్‌: రెఫరెండంలో దేశభక్తి అస్త్రం.. 2036 వరకు ఆయనే అధికారంలో ఉండబోతున్నారా

By BBC News తెలుగు
|

పుతిన్

ఈ మధ్యకాలంలో రష్యన్లంతా దేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి తమ అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో వెల్లడించే పనిలో బిజీగా ఉన్నారు. ఓటింగ్‌ కోసం చెట్ల కింద, పార్కుల్లో, ఒక్కోచోట కార్‌ పార్కింగ్‌లలో కూడా ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ బాక్సుల్లో తమ ఓటును వేస్తున్నారు.

ఓటేసినందుకు భారీ ఎత్తున లక్కీడ్రాలు ప్రకటించడంతో ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపడానికి ముందుకు వస్తున్నారు. ఈ బహుమతుల్లో కారు నుంచి ఫ్లాట్ వరకు ఆకర్షణీయమైనవి చాలా ఉన్నాయి.

అయితే ఇదంతా ఒక ప్రహసనమంటూ కొట్టిపారేస్తోంది ప్రతిపక్షం. ఓటింగ్‌కు సరైనా ఏర్పాట్లు చేయలేదని, సక్రమంగా జరుగుతుందో లేదో చూసే స్వతంత్ర వ్యవస్థలు లేవని ఆరోపించింది.

ఈ రాజ్యాంగ సంస్కరణలు చాలా ముఖ్యమని పుతిన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సంస్కరణలకు అనుకూలంగా రష్యన్లు తీర్పిస్తే పుతిన్‌ 2036 వరకు పదవిలో ఉండొచ్చు.

రష్యా

రష్యాపై పుతిన్‌ వ్యూహం

పోలింగ్‌ చివరి రోజు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. "మనం మున్ముందు జీవించే దేశం కోసం ఓటింగ్‌లో పాల్గొంటున్నాం. అదే దేశాన్ని మన పిల్లల చేతిలో పెట్టబోతున్నాం'' అన్నారు పుతిన్‌.

ఈ ప్రసంగం చేసే సమయంలో ఆయన ఒక రష్యా సైనికుడి భారీ స్తూపం ఎదుట నిల్చుని ఉన్నారు. దీన్నిబట్టి ఆయన దేశభక్తి అస్త్రాన్ని వాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

భవిష్యత్తును ఎంచుకుంటున్నాం అనే సందేశం

1993 తర్వాత రష్యా రాజ్యాంగానికి జరుగుతున్న అతిపెద్ద సమీక్ష ఇది. దీని ద్వారా అధ్యక్షుడు పుతిన్‌ గత రెండు దశాబ్దాలుగా రష్యాపై తనకున్న ఆలోచనలను అమలు చేసేందుకు అవకాశం దక్కుతుంది. "నేను ఇంతకాలం పదవిలో ఉండాలనుకుంటున్నాను అని పుతిన్‌ తనంతట తాను చెప్పుకోలేరు కదా'' అన్నారు రాజకీయ విశ్లేషకులు తాతియానా స్టానోవయా.

"కొందరు తాము చేసే తప్పులను కనపడనివ్వకుండా, మంచి పనులను మాత్రం ఘనంగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఆయన రష్యాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాను, అలాగే ఈ పదవిలోనే ఎక్కువకాలం కొనసాగుతా అని చెబుతున్నారు'' అన్నారు తాతియానా స్టానోవయా.

రష్యాలో ఈ ఓటింగ్‌తో ఎలాంటి మార్పులు రావొచ్చు.

దేశభక్తితో కూడిన విద్యావిధానాన్ని అమలు చేయడానికి ఈ రాజ్యాంగ సవరణ ప్రయత్నిస్తుంది. సేమ్ సెక్స్‌ ‌మ్యారేజ్‌లను నిషేధిస్తుంది.

ఇవన్నీ వ్లాదిమిర్‌ పుతిన్‌ పాలనాకాలంలో పెరుగుతున్న సంప్రదాయ సాంస్కృతికవాదానికి బలం చేకూర్చే నిర్ణయాలు.

రాజ్యాంగ సంస్కరణల మీద జరుగుతున్న ఓటింగ్‌ ప్రక్రియ బుధవారంనాడు ముగుస్తుంది.

సైద్ధాంతిక సంస్కరణలతోపాటు సాంఘిక సంస్కరణలకు కూడా ఈ రాజ్యాంగ సవరణలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కనీసం వేతన హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అయితే వీటన్నింటికి భిన్నంగా, 2024తో ముగిసే తన పదవీ కాలాన్ని ఆరేళ్ల చొప్పున మరో రెండుసార్లు అంటే 2036 వరకు కొనసాగించేందుకు వీలుగా రాజ్యంగా సవరణ జరిపే అవకాశం ఉంది.

రష్యాకు కొత్త రాజ్యాంగం

ప్రస్తుతం రష్యా రాజ్యంగంలో పదుల సంఖ్యలో ఆర్టికల్స్‌ను సవరించడంతోపాటు కొన్ని కొత్త ఆర్టికల్స్‌ను కూడా చేరుస్తారు. వీటిని ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరించారు.

1. సంప్రదాయ సిద్ధాంతం

•రష్యా భూభాగాన్ని దుర్వినియోగం చేసే ఏ చర్యనైనా అంగీకరించరు

•1941-1945 మధ్య జరిగిన గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌ను, అందులో పాల్గొన్న యోధులను ఏ రూపంలోనూ అవమానించడానికి వీలు లేదు.

•స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహాలను మాత్రమే చట్టపరంగా అంగీకరించడం

•ఉన్నతాధికారులు విదేశీపాస్‌పోర్టులు, నివాసార్హతలు, విదేశీ బ్యాంకు ఎకౌంట్లు కలిగి ఉండటం నిషేధం

•పూర్వీకుల నుంచి వచ్చిన దేవుడిని విశ్వసించే సంప్రదాయాన్ని కొనసాగించాలి.

2. సాంఘిక సంక్షేమం

•పెన్షన్లను ద్రవ్యోల్బణానికి అనుసంధానించడం

•జీవనాధార ఆదాయంకంటే తక్కువ కాకుండా కనీస వేతనం

•జంతువుల పట్ల బాధ్యాయుతమైన వైఖరి

ఓటింగ్‌కు ముందే రాజ్యాంగ ప్రతిని బుక్‌షాప్‌లలో కొనుక్కోవచ్చు.

3. వ్యవస్థలు

•దేశీయ, విదేశీ విధానాలు రూపకల్పనకు, ఆర్దిక, సాంఘిక ప్రాధాన్యతలను గుర్తించేందుకు స్టేట్‌ కౌన్సిల్ ఏర్పాటు

•ఒక వ్యక్తి కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్షపదవి చేపట్టగలడు ( ఇందులో "వరసగా రెండుసార్లు'' అనే పదాన్ని మారుస్తారు.)

•ఒకవేళ ఆ వ్యక్తి అప్పటికే అధ్యక్షపదవిలో ఉంటే, గతంలో అదే పదవీ నిర్వహణను పరిగణనలోకి తీసుకోరు. అంటే ఇప్పటి వరకు పుతిన్‌ నిర్వహించిన పదవీకాలం సున్నాగా మారిపోతుంది.

ఓటర్లకు రెండే ఆప్షన్లు

ఓటర్లకు రెండే ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి వీటన్నింటికీ 'ఎస్‌' చెప్పడం లేదంటే 'నో' చెప్పడం

మాస్కోలోని ఇళ్ల మీద అంటించిన పోస్టర్‌లో

మాస్కోలోని పలు అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లల్లో సంస్కరణల 'మీద' ఓటేయండి అని కాకుండా సంస్కరణల 'కోసం' ఓటేయండి అన్న నినాదాలు కనిపిస్తున్నాయి.

పుతిన్‌కు'నో' చెప్పాలంటూ వెలుస్తున్న పోస్టర్లు మాస్కోలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

ఓటింగ్‌పై మహమ్మారి ప్రభావం

రాజధాని మాస్కోకు కొద్దిదూరంలో ఉన్న పోడోల్క్స్‌ అనే ప్రాంతంలో ఓ కారు పార్కింగ్‌ స్లాట్‌లో టెంట్‌ వేసి అక్కడ ఒక ఓటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్నికల అధికారులు ఫేస్‌మాస్క్‌లు ధరించి ఉన్నారు. కరోనావైరస్‌ విజృంభణ మధ్యే దేశవ్యాప్తంగా ఓటింగ్‌ జరుగుతోందనడానికి ఇది నిదర్శనంలా కనిపిస్తోంది.

కరోనా

ఏప్రిల్‌ నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికలను వీలయినంత త్వరగా నిర్వహించాలని పుతిన్‌ ప్రభుత్వం భావించింది. మే మొదటి వారంలో లెవడా సెంటర్‌ ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వేలో పుతిన్‌కు అనుకూలంగా 59శాతం మంది ఓటేసినట్లు తేలింది. కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ఈ ఎన్నికల్లో దాదాపు అదే ఫలితాలు రావచ్చని భావిస్తున్నారు. ప్రజలను ఓటింగ్ కేంద్రాలకు రప్పించడానికి అధికారులు తమవంతు కృషి చేశారు.

సైబీరియాకు చెందిన ఒక ఎన్నికల అధికారిణికి ఈ ఓటింగ్‌ కోసం నిర్వహించిన లక్కీడ్రాలో ఒక అపార్ట్‌మెంట్‌ బహుమతిగా దక్కింది. అయితే ఆమెకు బహుమతి రావడంపై అనుమానాలు వ్యక్తం కాగా, తాను ఓ సామాన్య ఓటరునేనని ఆమె స్పష్టం చేశారు.

పోడోల్క్స్‌లో ఎలాంటి లక్కీ ప్రైజ్‌లు లేనప్పటికీ, పెన్షనర్లు ఉత్సాహంగా ఓటేయడం కనిపించింది. "ప్రభుత్వం చెబుతున్న సంస్కరణలు నాకు బాగా ఉపయోగపడతాయి'' అని తన ఓటు హక్కును వినియోగించుకుంటూ గలీనా అనే ఓటరు చెప్పారు. "ద్రవ్యోల్బణానికి పెన్షన్లను అనుసంధానించడం, చదువుకునే హక్కు, ఉపాధి, గృహనిర్మాణంలాంటివన్నీ నాకు ఇష్టమైన సంస్కరణలు'' అని ఆమె చెప్పారు. కాకపోతే ఇందులో కొన్ని కొత్త రాజ్యాంగంలో ఉండక పోవచ్చని ఆమె అన్నారు.

"కేవలం స్త్రీ పురుషుల మధ్యే వివాహాలు అనేది నాకు అత్యంత నచ్చిన సంస్కరణ'' అన్నారు ఎలీనా అనే మహిళా ఓటరు. పుతిన్‌ ఎక్కువకాలం పదవిలో ఉన్నా తమకు అభ్యంతరం లేదని, ఆయన సమర్ధుడైన దేశాధ్యక్షుడని ఆమె వ్యాఖ్యానించారు.

వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉందా ?

మాస్కోలోని టౌన్‌ సెంటర్‌ దగ్గర రష్యా జెండాలు పట్టుకుని గుమిగూడి ఉన్న కొందరు యువకులు ఈ ఓటింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. "ఏముంది, పుతిన్‌ జీవితాంతం అధ్యక్షుడిగా ఉండాలి అంతే కదా'' అని ఈ ఓటింగ్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న యువతి పెదవి విరిచారు.

తన ఫ్రెండ్స్‌ చాలామంది దీనికి వ్యతిరేకంగా ఓటేసినట్లు మాక్సిమ్‌ అనే యువకుడు వెల్లడించారు. "ఇప్పటికే 20ఏళ్లుగా పుతన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంకో 16యేళ్లు కూడా ఆయనేనా? దేశానికి కొత్త వ్యక్తికావాలి'' అన్నారు మాక్సిమ్‌.

టెల్‌ హిమ్‌ నో అంటూ పుతిన్‌ వ్యతిరేక పోస్టర్‌ అంటించి ఉంది.

రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత అలెక్సీ నోవాన్లీ ఈ ఎన్నికల ప్రక్రియపై సోషల్‌ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు. మార్పు అవసరాన్ని సూచిస్తూ, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను బైటపెట్టారు. చాలామంది ఓట్లను వేరేవాళ్లు వేసేశారని, కొందరు ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

"ఈ ఎన్నికలు సిగ్గు చేటు'' అని ప్రముఖ బ్లాగర్‌ యూరి డూడ్‌ విమర్శించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పబ్లిష్‌ చేసిన ఈ పోస్ట్‌ను మిలియన్లమంది లైక్‌ చేశారు. జీవితాంతం పదవిలో ఉండాలనుకోవడం సరికాదంటూ 2008లో పుతిన్‌ చేసిన ప్రకటనను యూరి తన పోస్టులో ప్రస్తావించారు. కానీ తాను ఓటుకు దూరంగా ఉండదలుచుకోలేదని, పుతిన్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా 'నో' బాక్స్‌లో టిక్‌ చేశానని చెప్పారు యూరీ.

వాస్తవానికి ఈ ఓటింగ్‌కు చట్టబద్ధత అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగ సంస్కరణలను మార్చిలోనే పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రజల నుంచి భారీ మద్దతు కూడగట్టాలనుకుంటున్న ప్రభుత్వం, 70శాతం ప్రజామోదాన్ని ఆశిస్తోంది.

ఎన్నికల ముందు సహజంగా ఎగ్జిట్‌ పోల్స్‌ను నిషేధిస్తారు. కానీ తాజాగా జరిపిన ఎగ్జిట్‌ ఫలితాలలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. ఇప్పటికే రాజ్యాంగాన్ని ముద్రిస్తున్నారు. పుస్తకాల షాపుల్లో అమ్ముతున్నారు కూడా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Putin eyes on Presidential post till 2036
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X